కరోనావైరస్: ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ముంబయి-ధారావిలో వైరస్ వ్యాప్తిని అరికట్టేదెలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సాత్విక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మార్చి23, 2020... ముంబయిలోని అత్యంత ఇరుకైన మురికివాడ ధారావిలో నివసిస్తున్న56 ఏళ్ల బట్టల వ్యాపారి జ్వరం, విపరీతమైన దగ్గుతో బాధపడుతూ స్థానికంగా ఉండే ఓ వైద్యుని వద్దకు వెళ్లారు.
ఆయనను పరీక్షించిన డాక్టర్.. దగ్గుకు ఓ టానిక్, పారాసిట్మాల్ మాత్రలను వాడమని సూచించారు. మూడు రోజుల తర్వాత ఆయనకు జ్వరం, దగ్గు మరింత తీవ్రం కావడంతో దగ్గర్లో ఉన్న సియాన్ హాస్పటల్ అనే ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని చెప్పడంతో అక్కడ వైద్యులు కూడా దగ్గు, జ్వరం తగ్గేందుకే మందులు ఇచ్చి ఇంటికి పంపించారు.
మార్చి 29న తనకు శ్వాస పీల్చుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదురవుతోందంటూ ఆయన మళ్లీ అదే ఆస్పత్రికి వచ్చారు. వెంటనే ఆస్పత్రిలో చేర్చుకున్న వైద్యులు ఆయన కఫాన్ని సేకరించి కోవిడ్-19 పరీక్షకు పంపారు.
ఆయనకు కరోనావైరస్ సంక్రమించిందని మూడు రోజుల తర్వాత వచ్చిన ఫలితాల్లో తేలింది. అప్పటికే ఆయన పరిస్థితి విషమిస్తుండటంతో వెంటనే వైద్యులు కోవిడ్-19 సోకిన వ్యక్తులకు చికిత్సనందించే పెద్దాసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. ఆరోజు సాయంత్రం ఆయన ప్రాణాలు కోల్పోయారు.
ముంబయిలోని ధారావి ప్రాంతంలో మొట్టమొదటి కోవిడ్-19 రోగి ఆయనే. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఇరుకైన ప్రాంతాల్లో ఒకటైన ధారావిలో మలేరియా, డయేరియా లాంటి వ్యాధులు నిత్యం రాజ్యమేలుతుండటం సర్వ సాధారణమైన విషయం.
కానీ కరోనావైరస్ వంటి మహమ్మారి.. సామాజిక దూరం పాటించడం ఏమాత్రం సాధ్యం కానీ ఇలాంటి ఇరుకైన ప్రాంతంలోకి అడుగుపెడితే పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. నగర ప్రజారోగ్య వ్యవస్థను అతలాకుతలం చేస్తుంది. కోవిడ్-19ను అరికట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న అధికారులకు ఈ సంగతి చాలా బాగా తెలుసు.

ఫొటో సోర్స్, GETTY IMAGES

- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?

దిల్లీకి సంబంధం ఉందా?
కరోనావైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన మొదటి వ్యక్తి తన 8 మంది కుటుంబసభ్యులతో కలిసి 420 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే ఓ చిన్న ఇంట్లో ఉండేవారు.
“ఆయన ట్రావెల్ హిస్టరీ గురించి ఆయన కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించినప్పుడు అలాంటిదేమీ లేదని చెప్పారు. దగ్గర్లో ఉన్న చిన్న మసీదుకు మాత్రమే వెళ్లారని అన్నారు” అని ఆ ప్రాంత మున్సిపల్ అసిస్టెంట్ ఇన్‌చార్జ్ కమిషనర్ కిరణ్ దిఘ్వాకర్ చెప్పారు.
అయితే ఇక్కడే ఈ కథలో ఒక ట్విస్ట్ ఉంది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ఆ వ్యక్తికి అదే కాంప్లెక్స్‌లో మరో అపార్ట్‌మెంట్ ఉంది. అందులో ఓ ఐదుగురు వ్యక్తులకు ఇటీవలే ఆయన విడిది ఇచ్చారు. వాళ్లంతా మార్చి నెల మొదట్లో దిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ నిర్వహించిన మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వచ్చినవాళ్లు.
ఆ ఐదుగురూ కేరళ వెళ్లేముందు అంటే మార్చి 19-21 తేదీల మధ్యలో రెండు రోజుల పాటు ఆ అపార్ట్‌మెంట్లో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆచూకీ కనుగొనే ప్రయత్నంలో ఉన్నామని కిరణ్ దిఘ్వాకర్ తెలిపారు.
“మరణించిన వ్యక్తికి ఈ ఇన్ఫెక్షన్ ఎలా సోకింది? ఎవరి నుంచి సోకింది? ఈ విషయాలను మేం తెలుసుకోవాలి. తక్షణం తగిన చర్యలు తీసుకొని ఈ మహమ్మారిని అదుపు చేయాలి” అని ఆయన అన్నారు.
మరణించిన వ్యక్తికి పాస్‌పోర్ట్ లేదని ఆయన కుటుంబ సభ్యులు చెబుతుండటం పోలీసుల్లో అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఆయన మొబైల్ ఫోన్ రికార్డులను పరిశీలించడం ద్వారా కదలికల గురించి మరింత లోతుగా విచారిస్తున్నారు పోలీసులు.

దీంతో ఆయన నివసించిన ప్రాంతం మొత్తాన్ని అధికారులు సీజ్ చేశారు. సుమారు 2,500 మందిని హోమ్ క్వారంటైన్ చేశారు. వారికి అవసరమయ్యే ఆహార పదార్థాలను అందిస్తున్నారు.
వారుండే ప్రాంతాన్ని, వారి ఇళ్లను క్రిమి సంహారక మందులను చల్లి శుభ్రపరుస్తున్నారు. అలాగే ఆయన కుటుంబ సభ్యుల నమూనాలను సేకరించి కోవిడ్-19 పరీక్షకు పంపారు.
ప్రస్తుతం ఆ ప్రాంతంలోనే 60 ఏళ్లు పైబడిన సుమారు 130 మందిలో శ్వాస కోశ ఇబ్బందులున్నాయి. అలాగే అక్కడే ఉంటున్న మరో 35 మంది వ్యక్తులది కూడా అదే పరిస్థితి.
దీంతో వాళ్లలో కరోనావైరస్ లక్షణాలు కనిపించే అవకాశం ఉందని అనుమానిస్తున్న వైద్య శాఖ, వారి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు గమనిస్తూ వస్తోంది.
ఆ మురికివాడలో పరిస్థితి మరింత తీవ్రం అయ్యే ప్రమాదం ఉందన్న భయంతో అధికారులు అక్కడున్న 50 పడకల సియాన్ ఆస్పత్రిని పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్నారు.
అలాగే అక్కడకు దగ్గర్లో ఉన్న క్రీడా ప్రాంగణాన్ని 300 పడకల క్వారంటైన్ కేంద్రంగా మార్చేశారు. సియాన్ ఆస్పత్రిలో పని చేసే వైద్యులకు, నర్సులకు తగిన రక్షణ కిట్లు అందజేశారు. ఇంత చేసినప్పటికీ ఆ మహమ్మారిని అడ్డుకోగలమా అంటే సమాధానం చెప్పే పరిస్థితి లేదు.

అదే జరిగితే అధికారులకు తలకు మించిన పనే
ఈ నెల 2న అదే మురికివాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తున్న 35 ఏళ్ల వైద్యునికి పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే ఆయన నివసిస్తున్న ప్రాంతాన్ని సీజ్ చేసి అక్కడ ఉంటున్న 300 మందిని ఐసొలేషన్‌కి తరలించారు.
అదే భవనంలో నివసిస్తున్న 13 మందిని హైరిస్క్ పేషెంట్లుగా గుర్తించి వారి నమూనాలను కోవిడ్-19 పరీక్షలకు పంపించారు. తను పనిచేస్తున్న ఆస్పత్రిలో మరో ఇద్దరు నర్సులకు కూడా పాజిటివ్ అని తేలిందని ఆ వైద్యుడు అధికారులకు చెప్పారు.
మరోవైపు కరోనావైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి నివసిస్తున్న భవనంలో ఉంటున్న 60 ఏళ్ల వృద్ధునికి కూడా పాజిటివ్ మార్చి చివర్లో తేలింది.
“మురికివాడల్లోని కాలనీల్లో ఇన్ఫెక్షన్‌ను నిరోధించేందుకు మేం ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. అయితే బయట కూడా కొన్ని మురికివాడలున్నాయి. అక్కడ పాజిటివ్ కేసులు వస్తే మాత్రం వాళ్లను ఇంటి వద్ద ఐసోలేషన్ చేసే పరిస్థితి లేదు. హైరిస్క్ పేషెంట్లతో సహా వాళ్లను కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించడమే మార్గం” అని దిఘ్వాకర్ చెప్పారు.
ఒకవేళ ఆ పరిస్థితి వస్తే ఇన్ఫెక్షన్‌ను అదుపు చెయ్యడం అధికారులకు తలకు మించిన పనవుతుంది. అప్పుడు స్థానిక ఆస్పత్రి సహా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రం కరోనా రోగులతో కిటకిటలాడే పరిస్థితి తలెత్తుతుంది.
ఆ ప్రాంతంలో మొదటి రెండు కేసుల తర్వాత మరో 21 మంది శాంపిళ్లను అధికారులు సేకరించి పరీక్షలకు పంపారు. రాష్ట్రంలో రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రికి పరీక్షల కోసం వచ్చే శాంపిళ్ల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతోంది.
విలువైన సమయం కోల్పోతున్నాం - వైద్యులు
“ఫలితాలు ఆలస్యం అవుతుండటంతో అత్యంత విలువైన సమయాన్ని మేం కోల్పోతున్నాం. పాజిటివ్ అని తేలిన వారిని ఐసోలేషన్‌కు తీసుకెళ్లడంలో కూడా ఆలస్యమవుతోంది” అంటూ ప్రస్తుతం అక్కడ కోవిడ్-19 సేవలందిస్తున్న వైద్య బృందాలకు నాయకత్వం వహిస్తున్న డాక్టర్ వీరేంద్ర మొహితే ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్నాచితకా పనులు చేసుకునే వారి నుంచి అన్ని రకాల వృత్తుల వారితో కిటకిటలాడే ధారావి మురికివాడలో కరోనావైరస్‌ను ఎదుర్కొనే విషయంలో నెలకొన్న సమస్యలు ఇవి.
ప్రస్తుతం ఈ భయంకరమైన వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా చూడటమే అధికారులు, ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాల్.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్-నిరుద్యోగం: ఉద్యోగం పోతే ఎలా? ఈ ఆందోళనను ఎలా ఎదుర్కోవాలి?
- కరోనావైరస్: చేతులు కడుక్కోవడం, దాని వెనుక చరిత్ర
- కరోనావైరస్ లాక్డౌన్: సంక్షోభం దిశగా చిన్న-మధ్య తరహా పరిశ్రమలు... దిక్కుతోచని స్థితిలో లక్షలాది కార్మికులు
- కరోనా లాక్డౌన్: విపరీతంగా బయటపడుతున్న ఎలుకలు.. వీటిని నివారించడం ఎలా?
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తొలగించిన ప్రభుత్వం
- కరోనావైరస్తో కరువు బారిన పడనున్న 50 కోట్ల ప్రజలు - ఐక్య రాజ్య సమితి నివేదిక
- రువాండా మారణకాండకు 26 ఏళ్లు: వంద రోజుల్లో ఎనిమిది లక్షల మందిని ఊచకోత కోశారు.. బయటపడ్డ వారు ఇప్పుడు ఎలా ఉన్నారు?
- కరోనావైరస్:నిరుపేద ముస్లింల పాలిట ఫేక్ న్యూస్ ఎలా శాపమవుతోంది
- కరోనావైరస్: లాక్డౌన్ సమయంలో మద్యం ప్రియులు ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








