ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్

- రచయిత, వి శంకర్
- హోదా, బీబీసీ కోసం
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. గవర్నర్ నోటిఫికేషన్ మేరకే తాను బాధ్యతలు చేపట్టినట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
తాను ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన విషయాన్ని ఎన్నికల సంఘం కార్యదర్శి వాణీమోహన్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులకు సమాచారమిచ్చినట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అని, రాగద్వేషాలకు అతీతంగా బాధ్యతలు నిర్వహిస్తుందని ఆయనన్నారు.
గతంలోలాగే ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు తగిన సహకారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు రమేశ్ కుమార్ అన్నారు.
గవర్నర్ లేఖతో..
ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను కొనసాగించాలన్న హైకోర్టు తీర్పు ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ జులై 22న లేఖ రాశారు.
అంతకుముందు, నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తొలగిస్తూ గతంలో తాము జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసి.. నిమ్మగడ్డనే కొనసాగించాలని చెప్పిన తరువాత ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.
హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరగా అందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
అయితే, సుప్రీంకోర్టు స్టే నిరాకరించినా ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడిందంటూ నిమ్మగడ్డ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం.. హైకోర్టు తీర్పు ప్రకారం తననే మళ్లీ నియమించాలని గవర్నరును కోరాలంటూ సూచించింది.
కోర్టు సూచన ప్రకారం నిమ్మగడ్డ గవర్నరు బిశ్వ భూషణ్ హరిచందన్‌ను కలిసిన నేపథ్యంలో ఆయన కార్యాలయం నుంచి ప్రభుత్వానికి లేఖ వెళ్లింది.
ఏమిటీ వివాదం?.. ‘నిమ్మగడ్డ’ను ఎలా తొలగించారు?
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య సాగుతున్న ఈ వివాదం అనేక మలుపులు తిరుగుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో వివాదం మొదలయ్యి, చివరకు తాజా ఆర్డినెన్స్ తో ఎస్ఈసీ పదవీకాలం కుదించడం, అర్హతలు మార్చడం, దానిపై కోర్టులకు వెళ్లడం వరకూ చర్చనీయంగా మారింది.
గవర్నర్ ఆమోదంతో ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. దీని ప్రకారం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించేందుకు తగ్గట్టుగా చట్టంలో మార్పులు చేసింది.
మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజును ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి జీవో 619ని విడుదల చేసింది. ఇది కూడా ఓ రహస్య జీవోనే. జస్టిస్ కనగరాజు తొమ్మిదేళ్ల పాటు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఈ నియామకాన్ని, ఆయన బాధ్యతలు స్వీకరించే విషయాన్ని చివరి నిమిషం వరకూ ప్రభుత్వం రహస్యంగా ఉంచింది.

అయితే, ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చెల్లదని విపక్షాలు వాదించాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్డినెన్స్ నంబర్ 5/2020 విడుదల అయ్యింది. ఈ ఆర్డినెన్స్‌ను రాష్ట్ర గెజిట్‌లో పొందుపరుస్తున్నట్లుగా న్యాయ శాఖ జీఓ 31 జారీ చేసింది.

ఈ మేరకు న్యాయ శాఖ జీఓ31, పంచాయితీరాజ్ శాఖ జీఓ 617, 618లను విడుదల చేశాయి.


జీఓ 617లో ఏముంది?
రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్ కృష్ణ ద్వివేదీ శుక్రవారం జీఓ 617ను విడుదల చేశారు. వాస్తవానికి శుక్రవారం రాత్రి 9.25 గంటల వరకూ ఈ జీఓను కాన్ఫిడెన్షియల్ అని ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఆ తర్వాత వీటిని బహిర్గతం చేశారు.
ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ చట్టం 1994 సెక్షన్ 200 ప్రకారం గతంలో జారీ చేసిన అన్ని ఆదేశాలను, నియమాలను రద్దు చేస్తూ.. కొత్త నియమాలను పొందుపరుస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ నియమాల ప్రకారం.. హైకోర్టు జడ్జిగా పనిచేసిన వ్యక్తి మాత్రమే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియామకానికి అర్హులు. ఈ అర్హత లేనివాళ్లు ఎవరైనా ఆ పదవిలో నియమించబడినట్లైతే వారు ఈ ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి ఆ పదవిలో కొనసాగేందుకు అనర్హులు.
స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆ పదవిలో మూడేళ్లు మాత్రమే కొనసాగుతారు. అయితే, కమిషనర్‌ను మరో మూడేళ్ల కాలానికి పునఃనియమించొచ్చు.
అయితే, ఏ ఒక్కరూ ఆరేళ్లకు మించి ఈ పదవిలో కొనసాగేందుకు ఆస్కారం లేదు.

ఎన్నికల వాయిదాతో మొదలయిన వివాదం
ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు తీర్పు కారణంగా రిజర్వేషన్ల అంశంలో మార్పులతో స్థానిక ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. వేగంగా పూర్తి చేసే ఉద్దేశంతో మార్చి నెలలో స్వల్ప వ్యవధిలోనే జిల్లా, మండల పరిషత్ ఎన్నికలతో పాటుగా మునిసిపల్, పంచాయితీ ఎన్నికలకు కూడా రంగం సిద్ధం చేశారు.
జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా, మునిసిపల్ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడం పూర్తి అయ్యింది. పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారని అంతా భావించిన సమావేశంలో అనూహ్యంగా మొత్తం ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలుపివేస్తున్నట్టు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు.
సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం
ఎస్ఈసీ నిర్ణయాన్ని ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేరుగా, వ్యక్తిగత విమర్శలకు దిగారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కులాన్ని కూడా ప్రస్తావించారు. విచక్షణాధికారం అందరికీ అలవాటుగా మారిందంటూ మండిపడ్డారు.
ప్రతిపక్ష నేత ఆదేశాలకు అనుగుణంగా, రాసి ఇచ్చిన ఉత్తర్వులు చదివారంటూ విమర్శలు కూడా గుప్పించారు. అంతటితో సరిపెట్టకుండా ఎన్నికలు వాయిదా వేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్లారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్టు ఎస్ఈసీ ప్రకటించగా, వైద్య ఆరోగ్య శాఖతో గానీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో గానీ కనీసం సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడాన్ని ప్రభుత్వం తరుపున సవాల్ చేశారు.
సుప్రీంకోర్టు మాత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారాల్లో జోక్యం చేసుకోలేమని చెబుతూనే వాయిదా వేసేముందు సంబంధిత అధికారులతో సంప్రదించి ఉండాల్సిందంటూ వ్యాఖ్యానించింది.
వివాదాస్పద లేఖతో మరింత వేడి
సుప్రీంకోర్టు తీర్పు, అదే సమయంలో ఏపీలో కూడా కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో వివాదం సద్దుమణిగే అవకాశం ఉందని అంతా భావిస్తుండగా అనూహ్యగా ఓ వివాదాస్పద లేఖ తెరమీదకు వచ్చింది.
తనకు రక్షణ కల్పించాలని కోరుతూనే, స్థానిక ఎన్నికల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ బలగాలు పంపించాలంటూ ఎస్ఈసీ రమేష్ కుమార్ రాసినట్టు ఆ లేఖలో ఉంది.
దానిని కేంద్ర హోం శాఖకు రాసినట్టు ఆ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. కానీ ఎస్ఈసీ రమేష్ కుమార్ మాత్రం దానిని నిర్ధరించలేదు. ఈ పరిణామాలతో వ్యవహారం మరింత వేడెక్కినట్టు కనిపించింది.

ఫొటో సోర్స్, facebook/AndhraPradeshCM/tdp.ncbn.official
పదవీకాలం కుదింపు ద్వారా ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్రాల స్థాయిలో ఎన్నికల సంఘాలను 1994లో నియమించారు. ఆర్టికల్ 243కే ప్రకారం ఎస్ఈసీ ఆవిర్భవించింది.
దానికి అనుగుణంగా ప్రస్తుతం బాధ్యతల్లో ఉన్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని 2016 జనవరి 30న నాటి చంద్రబాబు ప్రభుత్వం నియమించింది.
నాటి చట్టం ప్రకారం ఎస్ఈసీ పదవికి రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఐఏఎస్ అధికారికి అర్హత ఉండేది. ఐదేళ్ల పదవీకాలం ఉంటుంది.
తాజాగా చట్టంలో మార్పులు చేస్తూ ఎస్ఈసీ పదవీకాలం మూడేళ్లకు కుదించారు.
అలాగే, హైకోర్టు జడ్జిగా పనిచేసిన వాళ్లే ఈ పదవికి అర్హులని, ఒకవేళ హైకోర్టు జడ్జి కానివాళ్లు ఎవరైనా ఈ పదవిలో నియమించబడి ఉంటే.. శుక్రవారం నుంచి వారు ఆ పదవిలో కొనసాగేందుకు అనర్హులని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ బాధ్యతలు స్వీకరించి నాలుగేళ్లు దాటింది. ఆయన ఇప్పటి వరకూ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేయలేదు.
ఈ నేపథ్యంలో జీఓ 618ను ప్రభుత్వం విడుదల చేసింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది.


ఆర్డినెన్స్ చెల్లదు అంటున్న విపక్షం
ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఆర్డినెన్స్ చట్టవిరుద్ధమని ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు పేర్కొన్నారు. ఈమేరకు ఆయన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కి లేఖ రాశారు.
ప్రస్తుత ఎస్ఈసీ పదవీకాలం ముగిసిన తర్వాత మాత్రమే చట్టంలో మార్పులు వర్తిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ)ని తొలగించాలనే కుట్రతోనే ఎపీపీఆర్ చట్టం 1994లోని సెక్షన్ 200కు సవరణ తీసుకువచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉంది. ఈ నేపథ్యంలో పదవికి అర్హత, పదవీకాలానికి సంబంధించిన సవరణలు చేయడం చట్టవిరుద్ధం. ప్రస్తుత కమిషనర్ పదవీకాలం పూర్తయిన తర్వాత ఈ సవరణ వర్తిస్తుంది. కాబట్టి మీరు జోక్యం చేసుకుని ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని కోరుతున్నాం’’ అని చంద్రబాబు గవర్నర్ ని కోరారు.
ఎన్నికల సంఘం కమిషనర్ ని తొలగించడానికి ఇది తగిన సమయం కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యమైన విషయాల్లో జగన్ ప్రభుత్వ తీరు అప్రజాస్వామికం అని విమర్శించారు. కరోనా నేపథ్యంలో ప్రజల ప్రాణాలు రక్షించేదానికి దృష్టి పెట్టడకుండా కక్ష సాదింపు కోసం ప్రయత్నించడం తగదన్నారు.
ప్రస్తుతం పదవిలో ఉన్న వారికి వర్తించదు
ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఆర్డినెన్స్ వివరాలు , జీవోలో పేర్కొన్న అంశాలు పూర్తిగా వెల్లడి అయితే తప్ప నిర్ధారణకు రాలేమని రాజ్యాంగ నిపుణులు మాడభూషి శ్రీధర్ అంటున్నారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం పదవిలో ఉన్న కమిషనర్ కి మరో తొమ్మిది నెలలకు పైగా పదవీ కాలం ఉంది. రాజ్యాంగ సూత్రాల ప్రకారం చట్టంలో తీసుకొచ్చే మార్పులు ఇప్పటికే పదవిలో ఉన్న వారికి వర్తించవు. పదవీకాలం కుదింపు నిబంధన అనేది కొత్తగా నియమించే వారి నుంచే మొదలుకావాల్సి ఉంటుంది. ఈ విషయంలో న్యాయస్థానాల ముందు కూడా ప్రభుత్వ వాదన నిలబడకపోవచ్చు’’ అని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

కొత్త కమిషనర్‌గా నియామకం అన్న వార్తను ఖండించిన రామ సుందర రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి ఎస్ రామ సుందరరెడ్డిని నియమించినట్లు వైసీపీ వర్గాలు విలేకరులకు సమాచారం ఇచ్చాయి. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపాయి.
కాగా, తనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించినట్లు వస్తున్న వార్తలు నిరాధారమని ప్రస్తుతం తుడా ఛైర్మన్‌గా ఉన్న రామ సుందరరెడ్డి తెలిపారు. ఈ వార్తలు వందకు వంద శాతం పుకార్లేనని ఆయన వీటిని ఖండించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం చూసినా కూడా ఈ వార్త చెల్లదని స్పష్టమవుతోంది.
మార్చిన నిబంధనల ప్రకారం.. కేవలం హైకోర్టు జడ్జిగా పనిచేసిన వారిని మాత్రమే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ సాకుతో ఎన్నికలు వాయిదా వేయడమేంటి: ఏపీ సీఎం జగన్
- కరోనావైరస్-నిరుద్యోగం: ఉద్యోగం పోతే ఎలా? ఈ ఆందోళనను ఎలా ఎదుర్కోవాలి?
- కరోనావైరస్: చేతులు కడుక్కోవడం, దాని వెనుక చరిత్ర
- కరోనావైరస్ లాక్డౌన్: సంక్షోభం దిశగా చిన్న-మధ్య తరహా పరిశ్రమలు... దిక్కుతోచని స్థితిలో లక్షలాది కార్మికులు
- కరోనా లాక్డౌన్: విపరీతంగా బయటపడుతున్న ఎలుకలు.. వీటిని నివారించడం ఎలా?
- కరోనావైరస్తో కరువు బారిన పడనున్న 50 కోట్ల ప్రజలు - ఐక్య రాజ్య సమితి నివేదిక
- రువాండా మారణకాండకు 26 ఏళ్లు: వంద రోజుల్లో ఎనిమిది లక్షల మందిని ఊచకోత కోశారు.. బయటపడ్డ వారు ఇప్పుడు ఎలా ఉన్నారు?
- కరోనావైరస్:నిరుపేద ముస్లింల పాలిట ఫేక్ న్యూస్ ఎలా శాపమవుతోంది
- కరోనావైరస్: తుర్క్మెనిస్తాన్లో కోవిడ్-19 కేసులు ఎందుకు నమోదు కావటం లేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








