కరోనావైరస్: చేతులు కడుక్కోవడం, దాని వెనుక చరిత్ర

- రచయిత, డాక్టర్ రొంపిచర్ల భార్గవి
- హోదా, బీబీసీ కోసం
ఈ రోజు ఒక పక్క ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకున్నాం,ఇంకో పక్క కరోనా భయంతో వణికి పోతున్నాం. కరోనాను తప్పించుకోవడానికి పదే పదే చేతులు శుభ్రంగా కడుక్కోవడమే మార్గమని ప్రపంచ దేశాలన్నీ ఘోషిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు చేతులెలా పరిశుభ్రం చేసుకోవాలి? దానివలన ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి? ఇలా చేతులు పరిశుభ్రంగా కడుక్కుంటే వ్యాధులు దరి చేరకుండా వుంటాయని మొదటగా చెప్పింది ఎవరు? చివరికాయన జీవితమెలా పరిణమించిందీ? ఒకసారి తెలుసుకుందామా..
ప్రతి వ్యక్తీ తన చేతులను సబ్బు తోగానీ, ఇతర డిసిన్ఫెక్టంట్ ద్రావణంతో గానీ రుద్ది, తోమి.. తేటగా వుండే చన్నీళ్లతో గానీ, వేడినీటితో గానీ కడుక్కుని.. పొడి బట్టతో తుడుచుకున్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి చేతులు పరిశుభ్రంగా వున్నాయని అర్థం. మామూలుగా నీళ్లతో మాత్రమే కడుక్కుంటే అవి పరిశుభ్రం కావు, ఏ ప్రయోజనమూ ఉండదు.

చేతులు శుభ్రం చేసుకోవడం వలన కలిగే ఉపయోగాలు...
- చేతులపై వుండే దుమ్మూ, ధూళితో పాటు జిడ్డూ, కంటికి కనపడని అనేక వ్యాధి కారక క్రిములు కూడా తొలగిపోతాయి, ఆ విధంగా అనేక వ్యాధులు రాకుండా నివారించవచ్చు.
ఏఏ వ్యాధుల్ని అరికట్టొచ్చు?
- జలుబు (సాధారణంగా వచ్చేది)
- ఫ్లూ జ్వరం, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లూ
- విరోచనాలు
- కలరా
- ఫీకో ఓరల్ కంటామినేషన్ వల్ల వచ్చే వ్యాధులు. అంటే మలంలో వుండే సూక్ష్మ జీవులు నోటికి తగలడం వలన వచ్చే వ్యాధులు. ఉదాహరణకు హెపటైటిస్ ఎ, నులి పురుగులు వంటి ఇతర పురుగులు కడుపులో చేరడం.
ఇంకా అనేక బాక్టీరియాల ద్వారా సంక్రమించే అంటు వ్యాధులను కూడా నివారించ వచ్చు. అందుకే వైద్య శాస్త్రంలో ప్రతి చిన్న ప్రొసీజర్‌కీ ముందూ, వెనకా చేతులు కడుక్కోవడం తప్పనిసరి.
ప్రతి రోజూ తప్పనిసరిగా చేతులు కడుక్కోవలసిన సమయాలు
- వంట వండే ముందూ, వండిన తర్వాతా
- ఆహారం తీసుకునే ముందూ, తీసుకున్న తర్వాతా
- మాంసమూ, చేపలూ మొదలయిన నాన్ వెజ్ పదార్థాలు శుభ్రం చేసేముందూ, చేసిన తర్వాతా
- మల విసర్జన తర్వాత
- పిల్లల డైపర్స్ మార్చే ముందూ, తర్వాతా
- పిల్లలకు ఆహారం పెట్టే ముందూ, తర్వాతా
సబ్బుతోనూ, నీళ్లతోనూ చేతులు శుభ్ర పరుచుకోవాలి.
మామూలుగా సబ్బు అందుబాటులో లేకపోతే కొన్ని ప్రదేశాలలో, మసి గానీ, ఇసుక గానీ సబ్బుకి ప్రత్యామ్నాయంగా వాడవచ్చునని చెబుతున్నారు. మసిని చేతులకు రుద్దుకుని, నీళ్లతో కడుక్కున్నపుడు ఒక ఆల్కలైన్ మీడియమ్ యేర్పడి మలినాలని శుభ్రపరుస్తుంది.
సబ్బుల్లో సాలిడ్ సోప్ కంటే లిక్విడ్ సోప్ వాడటం ఉత్తమం. ఎందుకంటే సాలిడ్ సోప్ పైన మన చేతుల నుండీ చేరిన బాక్టీరియా నిల్వ ఉండే అవకాశముంది.

మెడికల్ ఫీల్డ్ లో చేతులు కడుక్కునే విధానం
వ్యాధులు కలిగించే బాక్టీరియానీ, వైరస్ లనీ, ఇంకా ఇతర ఫంగస్ లనీ తొలగించడానికి.. మెడికల్ ఫీల్డ్ లో యే చిన్న ప్రొసీజర్ ముందయినా పద్ధతిగా చేతులు కడుక్కోవడం తప్పనిసరి.
ఉదాహరణకి ప్రతి పేషెంట్ నీ పరీక్ష చేసేముందూ, తర్వాతా, డెలివరీ చేసేముందూ, ఆపరేషన్లకి ముందూ చేతులుకడుక్కొన్న తర్వాతే ఏ పనైనా మొదలు పెట్టాలి.
- ధారగా నీళ్లు వచ్చే టాప్ కింద చేతులు తడుపుకుని, సబ్బుతో నురగ వచ్చేట్టు రుద్దు కోవాలి
- చేతి ముందు భాగమూ, వెనక భాగమూ, వేళ్లూ, బొటన వేలూ, మణికట్టు వద్దా సాధారణంగా కడుక్కుంటారు.
- ఆపరేషన్లకు ముందయితే మోచేతి వరకూ బాగా రుద్ది కడుక్కోవాలి, ఒకో వేలూ ముందూ,వెనకా, రెండు పక్కలా అంటే ఒకవేలికి నాలుగు పక్కలా శుభ్ర పరుచుకోవాలి
- గోళ్లను రుద్ది రుద్ది కడగాలి, చేతులు ఒక దానితో ఒకటి కత్తెర వేసినట్టుగా పట్టుకుని కడగాలి
- ఆ విధంగా మొదటి దశలో చల్లని సబ్బు నీటితో ఇరవై సెకండ్లు కడిగాక, బీటాడిన్ తో కానీ ఇతర డిసిన్‌ఫెక్టెంట్లతో కానీ ఒక నిముషం పాటు రుద్ది రుద్ది ,ఆ తర్వాత వేడి నీటితో కడగాలి
మూడవ దశలో చేతిని స్టెరిలైజ్డ్ టవల్ తో తుడుచుకుంటారు. పొడి చేతులు మంచివి. తడిచేతులతో ఇన్ ఫెక్షన్ కి ఛాన్స్ ఎక్కువ. ఆ తర్వాత స్పిరిట్ కానీ శానిటైజర్ కానీ వేసుకుని తుడుచుకున్నాక సర్జికల్ గ్లవ్స్ వేసుకుని సర్జరీకి ప్రొసీడ్ అవుతారు.
సాధారణ హ్యాండ్ వాష్ లో సబ్బు నీళ్లతో మణికట్టు వరకూ, పైన చెప్పిన విధానంలో చేతినీ, వేళ్లనీ శుభ్ర పరుచుకుంటే చాలు సరిపోతుంది. అయితే కామన్ గా బొటన వేలినీ, మణికట్టునీ సరిగ్గా శుభ్ర పరుచుకోరు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చేతులు కడుక్కున్నాక టిష్యూ పేపర్ తో తుడుచు కోవడం ముఖ్యం, మరువరాదు.
ఈ కరోనా వైరస్ ప్రబలుతున్న కష్ట కాలంలో మనని వ్యాధి బారిన పడకుండా కాపాడే విధానాలలో హ్యండ్ వాష్ పాత్ర చాలా ప్రధానమైనది. హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించడం కంటే కూడా హ్యాండ్ వాషే మంచిది. చేతులు సబ్బుతో కడుక్కునే వీల్లేనప్పుడే శానిటైజర్ వాడాలి. అదికూడా 70% ఆల్కహాల్ కలిగి ఉన్నదే సమర్థవంతంగా పనిచేస్తుంది.

ఇగ్నాజ్ సెమ్మెల్‌వెయిస్.. ఫాదర్ ఆఫ్ హ్యాండ్ వాషింగ్
అసలు ఇలా హ్యాండ్ వాష్ వలన వ్యాధులను నివారించ వచ్చునని కనుక్కుని, వైద్య విధానంలో పెను మార్పు తీసుకు వచ్చి, మానవజాతికి మహోపకారం చేసిన వ్యక్తి హంగరీకి చెందిన ఇగ్నాజ్ సెమ్మెల్‌వెయిస్ (Ignaz semmelweis) అనే స్త్రీ వైద్య నిపుణుడు.
ఇది జరిగింది సుమారు 170యేళ్ల క్రితం. అతను వియన్నాలోని వైద్య శాలలో 1846 ప్రాంతాల్లో గైనకాలజిస్ట్‌గా పనిచేస్తూ ఉండేవాడు. ఆ కాలంలో ప్రసవసమయంలో వచ్చే "బాలింత జ్వరం"తో చాలా మంది స్త్రీలు మరణిస్తూ వుండే వారు. దీనినే "చైల్డ్ బెడ్ ఫీవర్ "అని పిలిచే వారు. కారణమేమిటో సరిగా తెలియదు, అప్పటికి సూక్ష్మజీవులు ఇన్ ఫెక్షన్ కలగ జేస్తాయనే సిద్ధాంతం కూడా ఇంకా తెలియదు.
సెమ్మెల్‌వెయిస్ పనిచేసే హాస్పిటల్ లో ప్రసవం జరిపే క్లినిక్ లు రెండుండేవి. ఒక దానిని డాక్టర్లు నడిపే వారు, ఇంకొకటి మిడ్ వైఫ్ ల టీచింగ్ కోసం మిడ్ వైఫ్‌లు నడిపేవారు.
ఈ డాక్టర్లు నడిపే క్లినిక్ లో పని చేస్తున్న సెమ్మెల్‌వెయిస్‌ను ఈ బాలింత జ్వరాలు కలవర పరిచాయి. వాటి గురించి స్టడీ చేయడం మొదలెట్టాడు. అతను ఒక సంగతి కని పెట్టాడు. తమ డాక్టర్లు నడిపే క్లినిక్ లో బాలింత మరణాల సంఖ్య, మిడ్ వైఫులు నడిపే దానికంటే ఎక్కువ ఉందని. ఎంత ఎక్కువంటే 10% డాక్టర్స్ క్లినిక్ లో మరణాల సంఖ్య అయితే మిడ్ వైఫ్స్ క్లినిక్ లో 4% ఉండేది.
ప్రజలు సహజంగానే మంత్ర సానులతోనే కానుపు చేయించుకుంటామని కాళ్లు పట్టుకునే వారట. డాక్టర్స్ క్లినిక్ లో కాన్పయ్యే కంటే రోడ్డు మీద కాన్పవ్వడమే మేలనుకునే వారట.
ఎలా కనిపెట్టాడు? కనిపెట్టాక ఏం జరిగింది?
అయితే దీనికి కారణమేంటో కనిపెట్టడానికి చాలా కష్టపడ్డాడు సెమ్మెల్‌వెయిస్. ఎన్నో కారణాలు అన్వేషించి వేసారి పోయిన సమయంలో అతని స్నేహితుడైన ఒక డాక్టర్ జబ్బుతో చనిపోతాడు. అతనిని అటాప్సి చేసినపుడు అతని అంతర్గత అవయవాలలో కనపడిన లక్షణాలూ, బాలింత జ్వరంలో కనపడిన లక్షణాలూ ఒకే రకంగా ఉండటం గమనించాడు. డాక్టర్ల క్లినిక్ లో పనిచేసే డాక్టర్లందరూ అటాప్సీ రూము నుంచి, డైరెక్ట్ గా కాన్పు రూముకి రావడం కూడా గమనించి, అటాప్సీ రూము నుంచి మోసుకొచ్చిన "కడావరిక్ మెటీరియల్"ఈ జబ్బుకి కారణమనుకుని దానికి విరుగుడుగా ఆ శవాల వాసనని తగ్గించడానికి వాడే "క్లోరినేటెడ్ లైమ్"తో చేతులు కడుక్కోవాలని నిర్దేశించాడు.
ఆశ్చర్యంగా అలా చేయడం మొదలెట్టాక మరణాల రేటు గణనీయంగా తగ్గింది. (ఇంతకీ ఆశ్చర్య కరమైన విషయం ఆ క్లోరినేటెడ్ లైమ్ లో ఉండే కాల్షియమ్ హైపో క్లోరైట్ నే ఇప్పుడు కరోనా వ్యాధి రాకుండా నివారించే స్ప్రేలలో వాడుతున్నారు). అయితే డాక్టర్ల బృందం ఈ విషయాన్ని విశ్వసించలేక పోయింది. అప్పట్లో నీటి వలన జబ్బులొస్తాయనుకునే వారు. అందువలన ఇతను నీటితో చేతులు కడుక్కోమనడం వారికి అంగీకారంగా అనిపించలేదు. అంతే కాకుండా బాలింత జబ్బుకి కారణం ఆ రోగి కడుపులో ఉండే కల్మషమని భావించి, అదిపోవడానికని బాలింతరాళ్లకి విపరీతంగా ఎనీమాలు ఇస్తుండేవారు. అందుకని వారు ఈ "కడావరిక్ మెటీరియల్" జబ్బుకలగ జేస్తుందనే థియరీని నమ్మలేదు.
ఇంకా కొంతమంది పెద్ద పెద్ద డాక్టర్లకి తామంత పెద్దమనుషులు చేతులు కడుక్కు రావాలా? తమ వల్ల జబ్బు వస్తుందా? అని అహం అడ్డు వచ్చింది. బాలింత జబ్బుల వల్ల మరణించే వారి సంఖ్య తగ్గినా సరే తోటి వైద్యలోకం సెమ్మెల్‌వెయిస్ కృషిని గుర్తించక పోగా, అతనిని హేళన చేసింది, అవమానించింది. చివరకు అతను 1849లో వియన్నా హాస్పిటల్ నుండి బయటకు వెళ్లాల్సి వచ్చింది.

పిచ్చాసుపత్రిలో మృతి
దీనిని సెమ్మెల్‌వెయిస్ తట్టుకోలేక పోయాడు. బుడాపెస్ట్ వెళ్లి అక్కడ హాస్పిటల్ లో చేరి, అక్కడ కూడా బాలింత మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించాడు. అయినా అక్కడ కూడా ఇలాగే అవమానాలు ఎదుర్కొన్నాడు. 1857 ప్రాంతాల్లో పెళ్లి చేసుకున్నాడు. అయిదుగురు పిల్లలు పుట్టారు. అతని కృషినెవ్వరూ గుర్తించలేదనే నిర్వేదానికీ, డిప్రెషన్ కీ గురయ్యాడు.
చాలామంది పెద్ద పెద్ద ప్రొఫెసర్లకి హ్యాండ్ వాషింగ్ ప్రాముఖ్యతని గుర్తించకుండా, ఫాలో అవ్వకుండా "బాలింత మరణాలకి" కారణమైన హంతకులు మీరు అని ఉత్తరాలు రాస్తుండే వాడు. కొంతమందితో గట్టిగా వాదిస్తూ ఉండేవాడు.
1865 సంవత్సరంలో అతని స్నేహితులూ, అతని భార్యా కూడా అతని ప్రవర్తనలో వచ్చిన అనూహ్య, అననుకూల మార్పులను గమనించి, అతనికి మతి స్థిమితం లేదని భావించి, అతనిని ఒక మానసిక చికిత్సా కేంద్రంలో చేర్చారు. అక్కడ నుండి బయట పడాలని ప్రయత్నించిన అతనిని అక్కడి గార్డులు గొడ్డుని బాదినట్టు బాది, గొలుసులతో కట్టేశారు. అతని చేతికి గాయమయ్యింది. చివరకు ఆ అసైలమ్ లో చేరిన 14రోజులకి సెమ్మల్‌వెయిస్ చేతికి అయిన గాయం కుళ్లి(గాంగ్రీన్ తో) అనాథగా మరణించాడు. అతను జీవితాంతం బాలింతలను కాపాడటానికి యే సెప్సిస్ తో పోరాడాడో అదే సెప్సిస్ తో మరణించడం అతని జీవితంలో ఐరనీ.
సెమ్మల్‌వెయిస్ చనిపోయిన ఇరవై సంవత్సరాల తర్వాత లీవెన్ హాకూ, లూయీ పాశ్చర్ వచ్చి సూక్ష్మ జీవుల ఉనికిని నిర్థరించాక వైద్య లోకం సెమ్మల్‌వెయిస్ కృషిని గుర్తించింది. హ్యాండ్ వాష్ వలన సూక్ష్మజీవులను తొలగించవచ్చని అంగీకరించింది. ఆయనని "ఫాదర్ ఆఫ్ హ్యాండ్ వాషింగ్" అని గౌరవిస్తున్నారు. ఇప్పుడు వెనిస్‌లోను, బుడాపెస్ట్‌లోనూ అతని పేరిట యూనివర్సిటీలున్నాయి, ఆసుపత్రులున్నాయి. అతను నివసించిన ఇంటిని మ్యూజియం చేశారు.
చివరికి అతను మరణించిన 155 యేళ్ల తర్వాత కూడా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని తట్టుకోవడానికి ఆయన సూచించిన హ్యాండ్ వాషే శరణ్యమయ్యింది. ఎందరో మహానుభావులు వారి జీవితాలనే ధారపోయడం, వారు చేసిన కృషీ, త్యాగాల వలనే వైద్య శాస్త్రంలో ఇన్ని ఆవిష్కరణలు జరిగి ఇంత అభివృద్ధి సాధించింది.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు.

- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- ఆల్కహాల్‌తో చేతులు కడుక్కునే నిరంకుశ నియంత.. నికొలస్ చాచెస్కూ
- కరోనావైరస్: వీరికి చేతులు కడుక్కోవడం చాలా కష్టం, ఎందుకంటే...
- గర్భిణికి వైరస్ సోకితే ఎలా? : కరోనా కల్లోలంలో ఓ డాక్టర్ అనుభవం
- హ్యాండ్‌షేక్ చరిత్ర.. ఎప్పుడు, ఎందుకు, ఎలా పుట్టింది?
- కరోనావైరస్-నిరుద్యోగం: ఉద్యోగం పోతే ఎలా? ఈ ఆందోళనను ఎలా ఎదుర్కోవాలి?
- కరోనావైరస్ లాక్డౌన్: సంక్షోభం దిశగా చిన్న-మధ్య తరహా పరిశ్రమలు... దిక్కుతోచని స్థితిలో లక్షలాది కార్మికులు
- కరోనా లాక్డౌన్: విపరీతంగా బయటపడుతున్న ఎలుకలు.. వీటిని నివారించడం ఎలా?
- కరోనావైరస్తో కరువు బారిన పడనున్న 50 కోట్ల ప్రజలు - ఐక్య రాజ్య సమితి నివేదిక
- కరోనావైరస్:నిరుపేద ముస్లింల పాలిట ఫేక్ న్యూస్ ఎలా శాపమవుతోంది
- కరోనావైరస్: లాక్డౌన్ సమయంలో మద్యం ప్రియులు ఏం చేయాలి?
- కరోనావైరస్: తుర్క్మెనిస్తాన్లో కోవిడ్-19 కేసులు ఎందుకు నమోదు కావటం లేదు?
- రువాండా మారణకాండకు 26 ఏళ్లు: వంద రోజుల్లో ఎనిమిది లక్షల మందిని ఊచకోత కోశారు.. బయటపడ్డ వారు ఇప్పుడు ఎలా ఉన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









