కరోనావైరస్: తుర్క్‌మెనిస్తాన్‌లో కోవిడ్-19 కేసులు ఎందుకు నమోదు కావటం లేదు?

తుర్క్‌మెనిస్తాన్ సైక్లింగ్

ఫొటో సోర్స్, MIGRATION.GOV.TM

ఫొటో క్యాప్షన్, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 7న ఆరోగ్య సూచికగా నిర్వహించిన మాస్ సైకిల్ ర్యాలీ
    • రచయిత, అబ్దుల్ జలీల్ అబ్దురాసులోవ్
    • హోదా, బీబీసీ న్యూస్

ప్రపంచ దేశాలు కరోనావైరస్ మీద పోరాటాలు చేస్తూ.. ప్రజలను దాదాపుగా లాక్‌డౌన్‌లలో ఉంచుతూ కష్టాలు పడుతోంటే.. తుర్క్‌మెనిస్తాన్ మంగళవారం నాడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సామూహిక సైక్లింగ్ ర్యాలీలు నిర్వహిస్తోంది.

మధ్య ఆసియాలోని ఈ దేశం.. ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చెప్తోంది. అయితే.. సమాచారాన్ని వడపోసి వెల్లడిస్తుందనే పేరున్న ఆ దేశ ప్రభుత్వం చెప్తున్ గణాంకాలను మనం విశ్వసించవచ్చా?

‘‘తుర్క్‌మెనిస్తాన్ నుంచి వచ్చే అధికారిక ఆరోగ్య గణాంకాలు ఏమాత్రం ఆధారపడ్డదగ్గవి కాదన్న అపకీర్తి ఉంది’’ అని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ప్రొఫెసర్ మార్టిన్ మెక్‌కీ పేర్కొన్నారు. ఆయన తర్క్‌మెనిస్తాన్ ఆరోగ్యరక్షణ వ్యవస్థను అధ్యయనం చేశారు.

‘‘తమ దేశంలో ఎవరికీ హెచ్‌ఐవీ-ఎయిడ్స్ లేదని వాళ్లు గత దశాబ్ద కాలంగా చెప్తూ వచ్చారు. అది సాధ్యం కానిది. వాళ్లు 2000 దశకంలో ప్లేగు సహా అనేక వ్యాధుల విజృంభణలకు సంబంధించిన ఆధారాలను దాచేశారని కూడా మాకు తెలుసు’’ అని ఆయన చెప్పారు.

దేశంలోకి కోవిడ్-19 విస్తరించి ఉండొచ్చుననే సూచన చేయటానికి కూడా తుర్క్‌మెనిస్తాన్‌లో చాలా మంది భయపడుతున్నారు.

రాజధాని నగరం అష్గాబాట్‌లో నివాసి ఒకరు బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసిన ఒక వ్యక్తి ప్రభుత్వ సంస్థలో పనిచేస్తుంటారు. ఆయనతో మాట్లాడినపుడు.. ‘ఇక్కడికి వైరస్ వ్యాపించింది అని కానీ, దాని గురించి నేను విన్నాను అని కానీ చెప్పకూడదు.. అలా చెప్పానంటే నేను ఇబ్బందుల్లో పడొచ్చు’ అని వ్యాఖ్యానించారు’’ అని తెలిపారు. ఆ నివాసి తన పేరు వెల్లడించవద్దని కోరారు.

అయితే.. కరోనావైరస్ విజృంభణ అవకాశాలను ఎదుర్కోవటానికి ప్రభుత్వ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. దేశంలోని ఐక్యరాజ్యసమితి విభాగాలతో కలిసి కార్యాచరణ ప్రణాళిక గురించి చర్చిస్తున్నారు.

జాతీయ స్థాయిలో సహకారం, సమాచార వ్యవస్థ, కేసుల దర్యాప్తు, లాబొరేటరీ డయాగ్నొస్టిక్స్ తదితర చర్యల గురించి చర్చిస్తున్నట్లు ఐరాస రెసిడెంట్ కోఆర్డినేటర్ ఎలెనా పనోవా బీబీసీకి తెలిపారు.

దేశంలో కోవిడ్-19 నిర్ధారణ కేసులేవీ లేవని చెప్తున్న తుర్క్‌మెనిస్తాన్ ప్రభుత్వ గణాంకాలను ప్రస్తావించినపుడు.. ఆమె నేరుగా సమాధానం ఇవ్వలేదు.

‘‘మేం అధికారిక సమాచారం మీద ఆధారపడుతున్నాం. ఎందుకంటే అన్ని దేశాలూ అలాగే చేస్తున్నాయి. నమ్మకం అనే సమస్య ఉండదు’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

నిర్ధారిత కేసులు లేకపోవటానికి.. ప్రయాణాల మీద ఆంక్షలు విధిస్తూ సత్వరం చర్యలు తీసుకోవటం దోహదపడి ఉండొచ్చునని ఆమె అభిప్రాయపడ్డారు.

తుర్క్‌మెనిస్తాన్ తన భూమార్గాల సరిహద్దులన్నిటినీ నెల రోజుల కిందటే మూసివేసింది.

చైనా సహా కొన్ని దేశాలకు ఫిబ్రవరి ఆరంభంలోనే విమాన సర్వీసులను రద్దు చేసింది. రాజధానికి వచ్చే విమానాలన్నిటినీ తుర్క్‌మెనాబాట్ నగరానికి తరలించి అక్కడ క్వారంటైన్ జోన్‌ను ఏర్పాటు చేశారు.

విదేశాల నుంచి వచ్చిన వారు అక్కడ రెండు వారాల పాటు టెంట్‌లో ఐసొలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. అయితే.. కొంతమంది ముడుపులు చెల్లించి ఆ ఐసొలేషన్‌ గడపకుండానే బయటకు వస్తున్నారని కొందరు స్థానికులు చెప్తున్నారు.

దేశంలోకి వస్తున్న వారందరితో పాటు, లక్షణాలు కనిపిస్తున్న వారందరికీ కోవిడ్-19 పరీక్షలు చేస్తున్నారని పనోవా పేర్కొన్నారు. అయితే.. రోజుకు ఎన్ని టెస్టులు చేస్తున్నారనే ఖచ్చితమైన సంఖ్య కానీ, తర్క్‌మెనిస్తాన్ దగ్గర మొత్తం ఎన్ని టెస్ట్ కిట్లు ఉన్నాయనే సంఖ్య కానీ ఆమె నిర్దిష్టంగా చెప్పలేకపోయారు.

‘‘ప్రభుత్వ అధికారులతో మాట్లాడినపుడు.. వాళ్లు తగినన్ని పరీక్షలు చేస్తున్నారని మాకు అర్థమవుతోంది’’ అని ఆమె చెప్పారు.

అయితే.. కరోనావైరస్ విజృంభిస్తే ఎదుర్కోవటానికి దేశం ఎంత సన్నద్ధంగా ఉంది?

‘‘మాకు తెలియదు. ఒక స్థాయి సన్నద్ధత ఉందని వాళ్లు చెప్పారు. దాని మీద మాకు సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆస్పత్రుల్లో మంచి సదుపాయాలు ఉన్నాయి’’ అని పనోవా పేర్కొన్నారు.

‘‘అయినాకానీ.. వైరస్ విజృంభిస్తే అన్ని దేశాల్లో లాగానే ఆరోగ్య వ్యవస్థ మీద భారీ ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఎంత సన్నద్ధంగా ఉన్నా కూడా అది సరిపోదు. అందుకే.. వెంటిలేటర్లు తదితర పరికరాలను సమకూర్చుకోవటం గురించి మేం వారితో చర్చిస్తున్నాం’’ అని తెలిపారు.

ప్రజల్లో కరోనావైరస్ వ్యాప్తి గురించి కొంత అవగాహన ఉన్నట్లు కనిపిస్తోంది. నగరాల మధ్య రాకపోకల మీద పరిమితులు విధించారు. అష్గాబాట్‌లోకి ఎవరైనా రావాలంటే వారికి డాక్టర్ల ధృవీకరణ తప్పనిసరి.

మార్కెట్లు, కార్యాలయాలలో.. మూలికా వైద్యాల్లో వాడే యుజార్లిక్ అనే ఒక రకం గడ్డితో పొగ వేస్తున్నారు. ఈ గడ్డి పొగతో వైరస్‌ను దూరం పెట్టవచ్చని దేశాధ్యక్షుడు గుర్బాంగులీ బెర్దీముఖామెదోవ్ చెప్పటంతో ఈ పని చేస్తున్నారు. అయితే దాని వల్ల ప్రయోజనం ఉంటుందనే ఆధారాలేమీ లేవు.

కానీ.. ప్రపంచంలో చాలా దేశాలలో కాకుండా ఇక్కడ జనజీవనం మామూలుగానే కొనసాగుతోంది.

కేఫ్‌లు, రెస్టారెంట్లు తెరిచే ఉన్నాయి. పెళ్లిళ్లకు జనం గుమిగూడుతున్నారు. ఎవరూ మాస్కులు ధరించటం లేదు. సామూహిక కార్యక్రమాలు యథావిధిగా సాగుతున్నాయి.

తుర్కెమినిస్తాన్
ఫొటో క్యాప్షన్, తుర్కెమిన్ ఆస్పత్రుల్లో ఫిబ్రవరి నెలలో కరోనావైరస్‌కు సంబంధించిన పోస్టర్లను ప్రదర్శించారు, తరువాత తీసేశారు

కరోనావైరస్‌తో చాలా పెద్ద ముప్పు ఉందని అంగీకరించటానికి ప్రభుత్వ సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది.

ఎందుకలా? ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సామూహిక సైకిల్ ర్యాలీ ద్వారా సమాధానం లభించవచ్చు.

ఈ వార్షిక కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణ దేశాధ్యక్షుడు బెర్దీముఖమేదోవ్.

ఆయన వ్యక్తిపూజలో.. ఆరోగ్య పరిస్థితి ప్రతిష్ట కూడా ఒక భాగం. ఆయన జిమ్‌లో కసరత్తులు చేస్తున్న, సైకిల్ తొక్కుతున్న దృశ్యాలను ప్రభుత్వ టీవీ చానల్‌లో తరచుగా చూపిస్తుంటారు. ‘ఆరోగ్యం – సంతోషం’ కార్యక్రమాలను ఆయన ముందుండి నడిపిస్తుంటారు. ఆకార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ ఉదయం వ్యాయామానికి ఒకే రకమైన యూనిఫాం ధరిస్తారు.

అధ్యక్షుడి చలువ ల్ల దేశం ఆరోగ్యంగా, సంతోషంగా ఉందనేది ఈ కార్యక్రమాలన్నిటి ప్రధాన సందేశం.

బెర్దీముఖమెదోవ్ తన పాలనా కాలాన్ని ‘శక్తి, సంతోషాల శకం’గా ప్రకటించారు. ఇప్పుడిక్కడ కోవిడ్-19 ప్రబలితే.. ఆయన సందేశం ఎంత బోలుగా ఉందనేది చాటిచెప్తుంది.

ఈ కారణం చేతనే తుర్క్‌మెన్ ప్రభుత్వం.. దేశంలో వైరస్ వ్యాప్తి చెందుతున్నా, పౌరులకు సోకతున్నా ఆ విషయాలను దాచిపెడుతుండవచ్చు.

ఇదే ప్రొఫెసర్ మెక్‌కీ ఆందోళనకు కారణం.

‘‘కోవిడ్-19 చైనా నుంచి ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు ఎంత వేగంగా ఎలా పాకిందో మనం చూశాం. మనం ఇప్పుడు నివస్తిస్తున్న ప్రపంచీకృత ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలో అత్యంత బలహీనమైన దేశానికి ఎంత భద్రత ఉంటుందో.. ప్రతి దేశానికీ అంతే భద్రత ఉంటుంది’’ అని ఆయన చెప్పారు.

‘‘ఇతర దేశాలు ఈ మహమ్మారిని అదుపులోకి తేగలగినప్పటికీ.. ఆ పని చేయలేకపోయిన దేశాల నుంచి మళ్లీ ఇన్‌ఫెక్షన్లు పుట్టుకుచ్చే ప్రమాదం కొనసాగుతూనే ఉంటుంది. అందుకు తుర్క్‌మెనిస్తాన్ మరో ఉదాహరణ కావచ్చునని కనిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)