కరోనావైరస్‌పై పోరాటానికి సిద్ధమైన భారతీయ రైల్వే

భారత రైల్వే

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అపర్ణ అల్లూరి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కోవిడ్-19 కేసుల వరద మొదలైతే ఎలా ఎదుర్కోవాలన్నదాని కోసం భారత్ అన్ని విధాలుగా సన్నద్ధమవుతోంది. ఆరోగ్యం అంశంతో పెద్దగా సంబంధం లేని రైల్వే వ్యవస్థను కూడా ఇందుకోసం ఉపయోగించుకోవాలనుకుంటోంది.

భారతీయ రైల్వేది ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో నాలుగో స్థానం.

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మార్చి 25 లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో రైల్వే తొలిసారి సేవలు నిలిపివేసింది.

ఈ సంక్షోభంలో రైల్వే వ్యవస్థ తరఫున దేశానికి తోడ్పాటు ఎలా అందించాలో ఆలోచించామని, తమకో పరిష్కార మార్గం తట్టిందని భారతీయ రైల్వే అధికార ప్రతినిధి రాజేశ్ బాజ్‌పేయీ బీబీసీతో అన్నారు. తమ ఆలోచన కూడా అందరికీ నచ్చిందని ఆయన చెప్పారు.

రైల్వే కోచ్‌లను క్వారంటీన్ లేదా ఐసోలేషన్ వార్డులుగా మార్చడమే ఆ ఆలోచన.

భారతీయ రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్దది

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, భారతీయ రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్దది

5000 రైల్వే కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చే పనులను ఇప్పటికే రైల్వే మొదలుపెట్టింది. ఇవి పూర్తైతే 40వేల పడకలు అందుబాటులోకి వస్తాయి. మరో 15వేల పడకలను అందుబాటులోకి తెచ్చేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది.

భారీ తనానికి భారతీయ రైల్వే, రైల్వే మంత్రిత్వ శాఖ పేరు పొందాయి. రోజూ 2.3 కోట్ల మంది ప్రయాణికులు రైల్వే సేవలను వినియోగించుకుంటారు. దేశం మొత్తాన్ని కలుపుతూ 65 వేల కి.మీ.ల పొడవున రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి. 12 వేలకుపైగా రైళ్లు నడుస్తుంటాయి.

ఇన్నేసి కోచ్‌లు ఐసోలేషన్ వార్డులకు కేటాయించడం వల్ల సమస్యేమీ లేదని బాజ్‌పేయీ అన్నారు. తాము ఎక్కువగా పాత కోచ్‌లనే ఇందుకు కేటాయిస్తున్నామని, రాబోయే నెలల్లో ప్రయాణికుల సంఖ్య తక్కువగానే ఉంటుంది కాబట్టి తక్కువ కోచ్‌లతో రైళ్లు నడిచినా ఇబ్బందేమీ ఉండదని వివరించారు.

‘‘రైల్వేకు ఇది కొత్త విషయమేం కాదు. ప్రత్యేక, ఎగ్జిబిషన్, లగ్జరీ రైళ్లు మేం నడుపుతుంటాం. ఆపరేషన్ థియేటర్లుండే ఆసుప్రతి రైళ్లు కూడా నడుపుతుంటాం. కోచ్‌లు ఖాళీ డబ్బాలు. వాటిని అవసరానికి తగ్గట్లు ఎలాగైనా మార్చుకోవచ్చు. కిచెన్, డైనింగ్ రూమ్, హాస్పిటల్.. ఇలా ఎలాగైనా తీర్చిదిద్దుకోవచ్చు’’ అని ఆయన అన్నారు.

రైల్వే‌ కోచ్‌ను క్వారంటీన్ వార్డుగా మార్చేందుకు మూడు రోజుల వరకూ సమయం పడుతుంది

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, రైల్వే‌ కోచ్‌ను క్వారంటీన్ వార్డుగా మార్చేందుకు మూడు రోజుల వరకూ సమయం పడుతుంది

‘ఎక్కడికి తీసుకువెళ్తారు’

కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే స్టేడియాలు, క్రీడా కేంద్రాలు, ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, రిసార్టులను క్వారంటీన్ కేంద్రాలుగా మార్చేస్తున్నాయి. అయినా, పెద్ద స్థాయిలో పరీక్షలను చేపడితే, క్వారంటీన్‌లో ఉంచాల్సిన జనాన్ని పెట్టేందుకు స్థలం చాలకపోవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒక్క వ్యక్తికి కరోనావైరస్ పాజిటివ్‌గా తేలితే, ఆ వ్యక్తిని కలిసినవారిని, కుటుంబ సభ్యులను పెద్ద సంఖ్యలో క్వారంటీన్‌లో పెట్టాల్సి రావచ్చు. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాల్లో, ముఖ్యంగా జనం ఎక్కువుండే ఇరుకైన వాడల్లో నివసించేవాళ్లకు ఇళ్లలో క్వారంటీన్‌లో ఉండటం వీలుపడకపోవచ్చు.

ముంబయిలోని ధారావి మురికివాడలో ఓ వ్యక్తికి కరోనావైరస్ పాజిటివ్ సోకినట్లు తెలిశాక, అధికారులు ఆయన ఉండే భవనంలోని సుమారు 300 మందిని క్వారంటీన్‌లో పెట్టారు.

ఇలాంటి కేసులు మరిన్ని వస్తే, కోవిడ్-19 లక్షణాలున్నవారిని, బాగా ముప్పు ఉన్నవారిని ఎక్కడికి తరలిస్తారన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.

దీనికి చాలా మార్గాలున్నాయని, అందులో రైల్వే కోచ్‌లు కూడా ఒకటిని బాజ్‌పేయీ దానికి బదులిస్తున్నారు.

ఇప్పుడున్న క్వారంటీన్ కేంద్రాలు నిండిపోయే వరకూ సమస్యేమీ రాకపోవచ్చని ఆయన అంటున్నారు. అయితే, తాము అవసరమైన వసతులను సమకూర్చుతామని ఆయన చెప్పారు.

కోచ్‌ల్లో ఆక్సిజన్ సిలిండర్లు, బాత్ రూమ్‌లు, అవసరమైన వైద్య సామగ్రిని పెట్టేలా క్యాబిన్లు.. . ఇలా ఏర్పాట్లన్నీ చేస్తామని చెప్పారు. వైద్య అవసరాలకు తగ్గట్లుగా కుళాయిలు, చెత్త డబ్బాలను కూడా మార్చుతామని వివరించారు.

అన్ని క్యాబిన్ల కోసం దోమ తెరలను, హుక్కులను రైల్వే శాఖ ఆర్డర్ చేసింది. చార్జింగ్ పాయింట్లు పని చేసేలా చూడాలని అధికారులను ఆదేశించింది. సీట్లు, పరికరాలన్నీ బాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

దేశవ్యాప్తంగా 130 ప్రాంతాల్లో ఈ క్వారంటీన్ కోచ్‌లు సిద్ధమవుతున్నాయి. వీటిని ఏయే స్టేషన్లకు తీసుకువెళ్లాలన్నది ఇంకా నిర్ణయించలేదు.

అది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమని బాజ్‌పేయీ అన్నారు. కానీ, కోచ్‌లకు నిత్యం విద్యుత్, నీటి సరఫరా అవసరమని వివరించారు.

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?

మండు వేసవిలో ఎలా...

దేశంలో వేసవి మొదలైంది. చాలా ప్రాంతాల్లో ఎండలు మండిపోతుంటాయి. ఉష్ణోగ్రత 40 డిగ్రీ సెంటీగ్రేడ్‌లు దాటుతూ ఉంటుంది. కానీ, ఈ క్వారంటీన్ కోచ్‌లు ఏసీ సౌకర్యం ఉన్నవి కావు.

‘‘రోగులు బాగా ఇబ్బంది పడతారు. వైద్యులు, నర్సులు కూడా రక్షణ మాస్క్‌లు, సూట్‌లు ధరిస్తారు. వారికి కూడా మండుటెండలో వీటిలో ఉండటం చాలా అసౌకర్యంగా ఉంటుంది’’ అని రైల్వే బోర్డు మాజీ ఛైర్మన్ వివేక్ సహాయ్ అన్నారు.

సాంప్రదాయిక మరుగుదొడ్లు అందరికీ సౌకర్యంగా ఉండకపోవచ్చని, కోచ్‌ల్లో వ్యర్థాల నిర్వహణ మెరుగ్గా ఉన్నదీ, లేనిదీ అనుమానమేనని ఆయన అన్నారు.

‘‘ఇది కుదరదని నేను అనడం లేదు. కానీ, ఈ విషయాలను మనం చూసుకోవాలి. ఇది చేయగలిగిన వాళ్లు ఎవరైనా ఉన్నారా అంటే, అది రైల్వేనే’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఒక్క కోచ్‌లతోనే సమస్యలు పరిష్కారమైపోవని నిపుణులు అంటున్నారు.

‘‘మనకు ఇప్పుడు అవసరమైంది స్థలం ఒక్కటే కాదు. వేల సంఖ్యలో వైద్యులు, నర్సులు కావాలి. లేకపోతే ఫలితం ఉండదు’’ అని పల్మనాలజిస్ట్ డాక్టర్ సుమిత్ సేన్ గుప్తా అన్నారు.

దేశంలో వైద్య వసతులకూ, సిబ్బందికీ కొరత ఉంది. వైద్య సిబ్బంది ఇన్ఫెక్షన్‌కు గురవ్వడంతో ఈ వారం మూడు ఆసుపత్రులను మూసేశారు.

‘‘లక్షణాలున్నవారికి చికిత్స చేయకుండా ఐసోలేషన్‌లో పెట్టడం ఎందుకు? వ్యాప్తిని అడ్డుకోవచ్చు. కానీ, చాలా మందిలో లక్షణాలు బయటపడవు. వారి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది. కాబట్టి లక్షణాలున్నవారిని ఐసోలేషన్‌లో పెట్టడం ఒక్కటే పరిష్కారం కాదు. పెద్ద స్థాయిలో పరీక్షలు చేయడం మొదలుపెడితేనే ఫలితం ఉంటుంది. పరీక్షించడం, గుర్తించడం, ఐసోలోషేన్‌లో పెట్టడం... ఇదీ ప్రక్రియ. అన్నింటి కన్నా ముందు పరీక్షలు చేయడం ముఖ్యం’’ అని ఆయన అన్నారు.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)