కరోనావైరస్: పేద ప్రజల "రెండు రూపాయల డాక్టర్" ఇస్మాయిల్ హుస్సేన్

డాక్టర్ ఇస్మాయిల్ హుస్సేన్
ఫొటో క్యాప్షన్, డాక్టర్ ఇస్మాయిల్ హుస్సేన్
    • రచయిత, జింకా నాగరాజు
    • హోదా, సీనియర్ జర్నలిస్ట్, బీబీసీ కోసం

రోజూ వెళ్లే దారి అకస్మాత్తుగా కాలనాగై కాటేస్తుందనుకోలేం? కర్నూలు పట్టణంలో ఏప్రిల్ 14న అదే జరిగింది. దేశం ఆ రోజు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్(జయంతి)కి నివాళులర్పిస్తోంది. మరోవైపు కర్నూలు పేదలు తమ ఆప్తుడిని కోల్పోయారు.

డాక్టర్ ఇస్మాయిల్ హుస్సేన్ (76) తను రోజూ వెళ్లే దారిలోనే వెళ్లినా, మళ్లీ తిరిగి రాలేదు. ప్రఖ్యాత కవి అజంతా అన్నమాట గుర్తొస్తుంది కదూ! నడుస్తున్న రోడ్డు మధ్యలోనే మటుమాయం కావడం ఏమిటి? ఆయనింకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఊరంతా ఎవరిళ్లలో వాళ్లు దాక్కున్నపుడు కరోనావైరస్ చడీచప్పుడు లేకుండా ఆయన రోజూ ప్రయాణించే దారిలోనే దూరి ఎందరో పేద ప్రజలకున్న కొండంత అండను కబళించింది.

పదమూడో తేదీన ఆయన ఎప్పటిలాగే తన నర్సింగ్ హోమ్‌లో రోగులను చూసి ఇంటికి చేరుకున్నారు. రాత్రి ఇంట్లో ఉన్నట్లుండి కింద పడిపోయారు. ఆయనను మొదట ఒక ప్రైవేటు ఆసుప్రతిలో చేర్చారు. అక్కడి వాళ్లు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లమన్నారు. కర్నూలు జనరల్ ఆసుపత్రికి తరలించారు. మరుసటి రోజు ఆయన చనిపోయారు. ఆ రోజు ఆర్ధరాత్రి ఆయనకు కేవలం ఆరుగురు కుటుంబ సభ్యుల మధ్య కరోనా ప్రొటోకోల్ ప్రకారం అంత్యక్రియలు జరిగాయి.

కర్నూలు జిల్లాతో పాటు, పక్కనే తమకొక మంచి డాక్టరున్నాడనే ధైర్యంతో బతుకుతున్న వేలాది మంది తెలంగాణలోని గద్వాల జిల్లా ప్రజలకు, కర్నాటకలోని రాయచూరు ప్రజలకు ఈ విషయం తెలియనే తెలియదు.

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

వైద్యం భరించలేనంతగా ఖరీదైపోయింది. చాలా రోగాలను ఒంట్లోనే దాచుకుని పేదలు బతుకు వెళ్లదీస్తుంటారు. ఇలాంటి రోజుల్లో పేద రోగులను అక్కున చేర్చుకుని, ఫీజు గురించి ఆలోచించకుండా యాభయ్యేళ్లుగా చికిత్స చేస్తూ వచ్చిన వైద్యుడు ఉన్నట్లుండి మాయమయ్యాడు.

కర్నూలు ఎందరో గొప్ప డాక్టర్లను అందించింది. డాక్టర్ సీతారాం (న్యూరాలజిస్టు), డాక్టర్ బాలకృష్ణమూర్తి (కంటివైద్యుడు), డాక్టర్ ఆర్‌జే శ్రీనివాస్ (గైనకాలజిస్టు)... ఇలా ఎందరో డాక్టర్లు కర్నూలు ప్రజల మనుసులో నిలిచిపోయారు. వీళ్లంతా స్పెషలిస్టులు.

ఇలా కాకుండా మరో తరం ఉంది. వాళ్లు జనరల్ ఫిజీషియన్స్. నిత్యం ప్రజలకు అవసరమయ్యే డాక్టర్లు. వీళ్లంతా ముస్లింలు కావడం యాదృచ్ఛికం. ఇందులో మొదట చెప్పుకోదగ్గ పేరు డాక్టర గఫార్, ఈయన చాలా పాత తరం డాక్టర్. తర్వాత తరం వాళ్లలో డాక్టర్ ఎస్ఏ సత్తార్, డాక్టర్ ఇస్మాయిల్ హుస్సేన్ ఉంటారు. వీళ్లందరూ కన్సల్టేషన్ ఫీజు మీద కన్నేయని డాక్టర్లు.

ఈ వర్గంలో కూడా డాక్టర్ ఇస్మాయిల్ దారే వేరు. కన్సల్టేషన్ ఫీజు ఇంత అని నిర్ణయించలేదు. అయితే, లేదనకుండా రెండు రూపాయల ఫీజిచ్చి పోయేవారు రోగులు. కొందరైతే రూపాయి బిళ్లో అర్ధరూపాయి బిళ్లో చేతిలో పెట్టి పోయేవారు. అయితే, ఆయనకు "రెండు రూపాయల డాక్టర్" అనే పేరు స్థిర పడిపోయింది.

కర్నూలు మెడికల్ కాలేజీలో చదువుకుని, అక్కడే పోస్టుగ్రాడ్యుయేషన్ చేసి, టీచింగ్ డాక్టరైనా, ఆ ఉద్యోగంలో ఆయన ఎక్కువకాలం ఉండలేదు. తన సొంత వైద్యశాల ఏర్పాటు చేసుకున్నారు. దానికే పరిమితమయ్యారు. మధ్యలో కొంతకాలం కర్నూలులో ఏర్పాటుచేసిన డాక్టర్ అబ్దుల్ హక్ యునానీ వైద్య కళాశాల (డాక్టర్ అబ్దుల్ హక్‌ది మరో ఉత్తేజకరమైన జీవితం) ప్రిన్సిపల్‌గా పనిచేశారు.

కర్నూలు పట్టణానికి గొప్ప మత సామరస్యం చరిత్ర ఉంది. హిందూ ముస్లింల మధ్య గొప్ప సెక్యులర్ సంబంధాలుండేవి. చాలా మంది ముస్లిం తెలుగు పండితులుండే వారు. కవులు కళాకారులు కూడాను. ఈ సంప్రదాయం నుంచి వచ్చిన వాళ్లే డాక్టర్ గఫార్, డాక్టర్ సత్తార్, డాక్టర్ హక్, డాక్టర్ ఇస్మాయిల్.

1960 దశకంలో డాక్టర్ ఇస్మాయిల్ కర్నూల్ 'వన్ టౌన్'లో ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆయన ప్రాక్టీసు పద్ధతి చాలా భిన్నంగా, వింతగా ఉంటుంది. మధ్యాహ్నం మొదలైతే రాత్రంతా కొనసాగి, మరుసటి రోజు తెల్లవారుజామున ముగుస్తుంది. చివరి రోగిని చూసే దాకా క్లినిక్ మూత పడేదికాదని, ఆయన కుటుంబానికి ధార్మిక అధ్యాపకుడు అబ్దుల్ రవూఫ్ చెప్పారు.

రవూఫ్ ఓ రిటైర్డు టీచర్. ఇస్మాయిల్ తండ్రి కాలం నుంచి ఆ ఇంటితో పరిచయమున్న వ్యక్తి.

"మొదట వైద్యం... తర్వాత ఫీజు. అది కూడా ఇస్తేనే. తనకు తానుగా ఫీజు అడగడు. చాలా మంది వైద్యం చేయించుకుని 'సలాం సాబ్' అని నమస్కారం చేసి వెళ్లిపోతారు. డాక్టరేమో.. తన పని తాను చేశాను, డబ్బుతో పనేంటి? అనే ధోరణితో ఉండేవాడు'' అని రవూఫ్ చెప్పారు.

కొద్ది రోజులాయన టేబుల్ మీద అట్ట పెట్టె పెట్టి రోగులు తమకు ఇష్టమొచ్చినంత ఫీజు వేసేలాగా ఏర్పాటుచేశారు. డబ్బు లేదంటే వెళ్లిపోవచ్చు. డాక్టర్ ఇస్మాయిల్ రోగులకు పెద్దగా పరీక్షలు సిఫార్సు చేసే వారు కాదు. ఇంజెక్షన్ కావాలా, మాత్రలు కావాలా అని అడిగేవారు. ఇంజెక్షన్ కావాలంటే కాంపౌండర్ చేసేవారు. రోగులు దీనికి డబ్బిస్తే అది కాంపౌండర్ ఫీజు. అందులో డాక్టర్‌కు వాటా లేదు.

"మావూరికి ఆయన దేవుడిలాంటి వాడు. ఆయన మంచితనం గురించి ఎలా చెప్పాలో తెలియదు" అని కర్నూలు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సోమిశెట్టి వెంకట్రామయ్య చెప్పారు.

"ఫీజు తీసుకోవాలనే స్పృహ ఆయనకు లేదు. ఎంత ఇచ్చినా దాన్ని చూడకుండా జేబులో వేసుకుంటాడు. ఉత్త చేయి ఆయన చేతిలో పెడితే, ఏదో ఇచ్చాడులే అనుకుని కూడా జేబులో వేసుకునే అమాయకత్వం ఆయనది. ఆయన లేని లోటు అక్షరాలా తీరని లోటు" అని డాక్టర్ ఇస్మాయిల్‌తో చాలా సాన్నిహిత్యం ఉన్న వెంకట్రామయ్య చెప్పారు.

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?

డాక్టర్ ఇస్మాయిల్ ఫిలాసఫీ ఇదే

ఎదురుగా జీవితంలో ఎన్నో పరిణామాలు వచ్చి డబ్బు ప్రాముఖ్యం పెరిగినా, ఎపుడో పాత కాలంలో మొదలయిన సేవా భావం డాక్టర్ ను వదలకపోవడానికి కారణం ఏమిటి?

ఆయనతో కాలేజీ రోజులనుంచి సాన్నిహిత్యం ఉన్న మిత్రుడు కురాడి చంద్రశేఖర కల్కూర దీని నేపథ్యాన్ని వివరించారు. ఈ విషయాలను ఈ మధ్యే డాక్టర్ ఇస్మాయిల్ తనతో పంచుకున్నాడని 75 సంవత్సరాల ఉడిపి బ్రాహ్మణుడయిన కల్కూర చెప్పారు. కర్నూలు పట్టణంలో మొదటి ఉడిపి హోటల్ ప్రారంభించిన కుటుంబానికి చెందిన వ్యక్తి కల్కూర.

"నాతో డాక్టర్ ఇస్మాయిల్ ఇలా చెప్పారు: పేదవాళ్ల జీవితం ఎలా ఉంటుందో చూశాను. మా తండ్రి ఒక స్కూల్ టీచర్. విలువల విషయంలో ఆయన ఎపుడూ జీవితంలో రాజీ పడలేదు. హుందాగా జీవించడం అలవర్చుకున్నారు. ఇదే మాకు అబ్బింది. ఇందులో డబ్బుకుచోటు లేదు. ఇపుడు నాజీవితం చూడండి, నేనుడాక్టర్ ని, మా అబ్బాయి డాక్టర్, ఒక అల్లుడు ఇంతియాజ్ ఐఎఎస్ ఆఫీసర్- కృష్ణా జిల్లా కలెక్టర్. మరొక ఇద్దరు అల్లుళ్లు బాగా స్థిరపడ్డారు. అందువల్ల ఎపుడూ నాకు సంపాదన మీద మనసుపడలేదు. ఇంక కన్సల్టేషన్ ఫీజు ఎందుకు?"

డాక్టర్ ఇస్మాయిల్ గొప్ప సెక్యులర్ విలువలు ఉన్నవాడని కల్కూర చెప్పారు. డాక్టర్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. చాలా మంది ప్రజలు రెండో సినిమా చూశాక ఆయన క్లినిక్‌కు తీరుబడిగా వచ్చేవారు. "1980 దశకంలో ఒకసారి ఎన్నికలపుడు ఆయన క్లినిక్‌ను రాత్రి పదిన్నర కల్లా మూసేయాలని పోలీసులు చెప్పారు. ఆయన మూసేశారు. అయితే, ప్రజలు దీనికి అంగీకరించేలేదు. చాలమంది జమకూడి జిల్లా ఎస్ పి దగ్గిరకువెళ్లారు. ఎస్ పి ఎన్నికల కోడ్ అన్చెప్పి క్లినిక్ రాత్రంతా నడపడం సాధ్యం కాదన్నారు. డా.ఇస్మాయిల్ రాత్రి క్లినిక్ ఓల్డ్ టౌన్ సంప్రదాయం అని పత్రిలు ఈ సమస్య గురించి ప్రముఖంగా రాశాయి. ఎస్ పి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి దృష్టికి ఈ విషయం తీసుకువచ్చారు. రోగుల డిమాండ్‌ను ఆయన కూడా సమర్థించారు. అపుడు ఎస్‌పీ ఊర్లో ఉన్న కొంత మంది పెద్దమనుషులను చర్చలకు పిలిచారు. అందులో రామ్ భూపాల్ చౌదరి (ఎమ్మెల్యే), దావూద్ ఖాన్, సోమిశెట్టి వెంకట్రాయమ్య (అప్పటి మునిసిపల్ వైస్ చైర్మన్), నేను ఉన్నాం. చివరకు ఎప్పటిలాగా డాక్టర్‌కు ఇష్టమైనట్లు, రోగులకు అనుకూలంగా ఉండేలా క్లినిక్ నడిపేందుకు ఎస్‌పీ అంగీకరించారు" అని కల్కూర చెప్పారు.

మ్యాప్

ప్రపంచవ్యాప్తంగా ధ్రువీకరించిన కేసులు

Group 4

పూర్తిస్థాయి ఇంటరాక్టివ్ చూసేందుకు దయచేసి మీ బ్రౌజర్‌ని అప్‌గ్రేడ్ చేయండి.

ఆధారం: జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ, జాతీయ ప్రజారోగ్య సంస్థలు

గణాంకాలు చివరిసారి అప్‌డేట్ అయిన సమయం 5 జులై, 2022 1:29 PM IST

డాక్టర్ ఇస్మాయిల్ కర్నూలు మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నపుడు జరిగిన ఒక సంఘటనను ఆయన విద్యార్థి, ఇపుడు నగరంలో మంచి పేరున్న డాక్టర్ అయిన డి. వాదిరాజ్ చెప్పారు.

"రాజమోహన్ అనే హౌస్ సర్జన్ ఉన్నట్లుండి చనిపోయారు. మృతదేహాన్ని చిత్తూరు జిల్లా కాళహస్తికి పంపించాలి. అంబులెన్స్ అందుబాటులో లేదు. సాటి హౌస్ సర్జన్లు, పిజి విద్యార్థులు, స్టాఫ్ ఒక రోజు వేతనం సాయం చేశారు. అపుడు డాక్టర్ ఇస్మాయిల్ ముందుకు వచ్చి ట్రాన్స్ పోర్ట్ ఖర్చు తానే భరించి మృతదేహాన్ని పంపించారు. వసూలు చేసిన డబ్బును కుటుంబానికి అందించారు. అంతేకాదు, చాంద్ టాకీస్ లో ఒక బెనిఫిట్ షో వేసి రూ. 4800 లను ఎఫ్ డి రూపంలో రాజమోహన్ తల్లితండ్రలకు అందించారు."

డాక్టర్ ఇస్మాయిల్ రోగుల్లో ఎక్కువ మంది ముస్లిం లే అయినా, ఇతర మతాల వాళ్లూ ఆయన హస్త వాసి గురించి గొప్పగా చెబుతారు. ఓల్డ్ టౌన్ ఏరియాలో ఆయన వైద్యం మహిమ గురించి వందలో సంఖ్యలో నమ్మలేని కథలు వినబడతాయి.

ప్రజల్లో ఆయనకున్న పలుకుబడిని రాజకీయంగా వాడుకోవాలని కాంగ్రెస్, తెలుగుదేశం రెండూ ప్రయత్నించాయి. ఎమ్మెల్యేని చేయడమే కాదు, క్యాబినెట్ మంత్రిని చేస్తామని స్వయాన ఎన్టీ రామారావు హామీ ఇచ్చారని చెబుతారు. కనీసం కర్నూలు మునిసిపల్ ఛైర్మన్ గా నయినా అంగీకరించండని తెలుగుదేశంపార్టీ బుజ్జగించే ప్రయత్నం చేసింది. ఆయనెపుడూ రాజకీయమాయలో పడలేదు. ఒక దశలో ఆయన తెలుగుదేశం తరఫున మునిపల్ చైర్మన్ అవుతారని అనుకున్నారు. ఆయన పోటీ చేస్తే ముస్లింల నుంచి ఎవరినీ పోటీ పెట్టరాదని ముస్లిం పెద్దలు నిర్ణయించారు. అయినా ఈ పదవి ఆయనను మభ్య పెట్టలేకపోయింది. కుడి ఎడమ అనే తేడాలేకుండా రాజకీయ పార్టీలన్నింటికి ఆయన ఇష్టమయిన వాడే అయ్యారు.

ఇంత అనుభవమున్న వైద్యుడు కరోనా రోగికి ఎలా వైద్యం అందించారు, తాను కరోనా బారిన ఎలా పడ్డారు అని ఎవరికి వారు వారి వారి మనోస్థితి నుంచి చర్చించుకుంటున్నారు. ఆయన దగ్గర వైద్యం చేయించుకున్న వాళ్లందరినీ కూడా ట్రేస్ చేసే ప్రయత్నం జరుగుతోంది.

"సేవ చేయడం తప్ప ఆయనకు మరొకటి తెలియదు. వచ్చిన రోగులందరికి మంచి వైద్యం అందించడమే ఆయన తెలుసు, ఇందులో ఇంతకు మించి ఏముంటుంది" అని చంద్రశేఖర కల్కూర చెప్పారు.

"డాక్టర్ సాబ్ కరోనా తో పోవడం దురదృష్టం. ఇది పేదలకు పిడుగుపాటు లాంటి వార్త. ఎందుకంటే, ఫీజు గురించి ఆలోచించకుండా ఆయన దగ్గరకు వెళ్ల వచ్చు. ఫీజుకు భయపడి రోగాన్ని అణుచుకుని బతకాల్సిన పనిలేదని పేదల నమ్మకం. అయితే, అధికారులు ఆయన మరణ వార్తని వెల్లడించి ఉంటే చాలా మంది ఆయన దగ్గర వైద్యం చేసుకునే వాళ్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకుని ఉండేవారు" అని సోమిశెట్టి అంటున్నారు.

తానీ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లాననీ వెంకట్రామయ్య చెప్పారు.

నగరంలోని మార్వాడీలకు ఆయన ఆత్మీయ డాక్టర్. ముస్లింలతో పాటు పేద హిందువులంతా ఆయన క్లినిక్ వద్ద క్యూలో ఉండేవారు. డాక్టర్ ఇస్మాయిల్ పేదలకు ఒక ధీమా.

ప్రేమాభిమానాలు జోడించి వైద్యం అందించిన డాక్టర్ ఇస్మాయిల్ లేరు, ఇపుడెట్లా? అనేది కర్నూలు చాలామంది పేద ప్రజల ముందు నిలబడ్ద ప్రశ్న.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)