కరోనావైరస్: రాయలసీమలో ఈ మహమ్మారి ఎలా వ్యాపిస్తోంది?

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, హృదయ విహారి బండి
    • హోదా, బీబీసీ కోసం

రాయలసీమలోకి కరోనావైరస్ ప్రభావం ఆలస్యంగా కనిపించినా, ప్రస్తుతం ఈ ప్రాంతంలోని 4 జిల్లాల్లో అది విజృంభిస్తోంది.

రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలతో పాటుగా నెల్లూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్-19 బారిన పడి ఇప్పటి వరకు 15 మంది చనిపోయారు. అందులో రాయలసీమ జిల్లాలకు చెందినవారు నలుగురు, నెల్లూరు జిల్లాకు చెందినవారు ఇద్దరు ఉన్నారు.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మార్చి 19న లండన్ నుంచి స్వగ్రామానికి వచ్చిన ఓ యువకుడికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. రాయలసీమలో నమోదైన మొట్టమొదటి కోవిడ్-19 కేసుగా దీన్ని భావించవచ్చు.

తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం, ఆరోగ్యం మెరుగవ్వడంతో అధికారులు, వైద్య సిబ్బంది కరతాళ ధ్వనుల మధ్య ఆ యువకుడిని హాస్పిటల్ నుంచి డిశ్ఛార్జ్ చేసి, హోం ఐసొలేషన్‌లో ఉండాలని సూచించారు. అయితే, అప్పుడు మొదలైన కరోనా కేసుల కౌంటింగ్, రాయలసీమ ప్రాంతంలో ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఏప్రిల్ 18 ఉదయం 10 గంటల వరకూ ఉన్న సమాచారం ప్రకారం కోవిడ్-19 పాజిటివ్ కేసుల్లో రాయలసీమలో మాత్రమే కాదు, మొత్తం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కర్నూలు అగ్రస్థానంలో నిలిచింది.

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 129. ఇందులో ఇద్దరు మరణించగా, ప్రస్తుతం 126 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో గుంటూరు తర్వాత అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన జిల్లా కర్నూలు.

దిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో తబ్లీగీ జమాత్ సంస్థ నిర్వహించిన సామూహిక ప్రార్థనలకు కర్నూలు జిల్లా నుంచి కూడా పెద్దసంఖ్యలో హాజరవ్వడం, జిల్లాలో కోవిడ్ కేసులు పెరగటానికి కారణమైందని, కరోనా బాధితుల కాంటాక్ట్ వివరాలను పరిశీలిస్తే అర్థమవుతుంది.

రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తికి కరోనా నిర్ధరణ కావడంతో కర్నూలు జిల్లాలో కోవిడ్-19 కేసులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత వెంటవెంటనే జిల్లాలో పదుల సంఖ్యలో కేసులు నమోదై జిల్లా ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. ఏప్రిల్ 14న, కర్నూలు ప్రభుత్వాసుపత్రి నుంచి ఆ రాజస్థాన్ యువకుడిని డిశ్ఛార్జ్ చేశారు. కరోనా నుంచి కోలుకుని బయటకు వచ్చిన ఆ యువకుడిని జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ డా.ఫక్కీరప్ప, ఇతర అధికారులు కలిసి అభినందించారు.

కరోనావైరస్-రాయలసీమ

‘మతానికి ముడిపెట్టొద్దు’

కర్నూలులో కోవిడ్ బాధితుల సంఖ్య పెరగడంపై అధికారులు, ప్రజాప్రతినిధులు ఆందోళన చెందారు. జిల్లాలో కేసులు పెరగడానికి కారణం దిల్లీలో జరిగిన మతపరమైన ప్రార్థనలేనని, ఒక మతానికి చెందినవారి వల్లనే జిల్లాలో పదుల సంఖ్యలో కేసులు పెరిగాయని కొందరు నేతలు విమర్శించారు. అయితే, ఇలాంటి సందర్భంలో రాజకీయాలకు తావివ్వకూడదని, ఇది ఎవ్వరూ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ బీబీసీతో అన్నారు.

‘‘కర్నూలు జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతుండటం వాస్తవం. కానీ, నిజాముద్దీన్‌కు వెళ్లొచ్చిన వారికో, మరొకరికో ఇది పరిమితం కాదు. ఈ పరిస్థితుల్లో సాధారణ అనారోగ్యానికి గురైనవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలులో ఇబ్బందికర పరిస్థితులున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో కొందరు ఒక వర్గం వారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు.

ముస్లింల పట్ల సానుభూతి చూపించాల్సిన సమయం ఇది. దిల్లీ నుంచి వచ్చినవాళ్ల మానసిక పరిస్థితిని ముందుగా మనం అర్థం చేసుకోవాలి. ఇదంతా తెలియకుండా జరిగిందని, మీరు ఏ పాపం చేయలేదని వారికి భరోసా ఇవ్వాలి. అప్పుడే ఒక పరిష్కారం దొరుకుతుంది.

నిజాముద్దీన్ విషయం తెలియగానే మేం ముస్లిం మతపెద్దలతో మాట్లాడి, 350 మందికిపైగా క్వారంటైన్‌కు వెళ్లేలా చేశాం. వాళ్ల మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని ప్రవర్తించాలే కానీ, భయపెడితే వాళ్లు బయటకు రావడానికి కూడా నిరాకరిస్తారు. ప్రస్తుతం కర్నూలులో యుద్ధ వాతావరణం నెలకొంది’’ అని హఫీజ్ ఖాన్ బీబీసీతో అన్నారు.

కరోనావైరస్-రాయలసీమ

ఆస్పత్రి సీజ్

కర్నూలులోని ఊస్మానియా కాలేజ్ రోడ్డులోని కేఎం హాస్పిటల్‌లో ఒకరికి కరోనా సోకడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. వెంటనే ఆ హాస్పిటల్‌ను సీజ్ చేశారు. గతవారం పదిరోజుల్లో ఎవరెవరు ఆ ఆస్పత్రికి వచ్చారో వారంతా స్వచ్ఛందంగా ముందుకు వస్తే, ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు చేస్తుందని అధికారులు చెప్పారు.

అయితే, కేఎం హాస్పిటల్‌లో కరోనా సోకింది, ఆ ఆసుపత్రిలోని ప్రముఖ వైద్యుడికేననీ, మరుసటి రోజే ఆయన మరణించారని స్థానిక మీడియా తెలిపింది. ఆయన చనిపోవడానికి పదిరోజుల ముందు నుంచి కొన్ని వందల మందికి వైద్యం చేసినట్లు తెలుస్తోంది. అయితే, పేషెంట్ల వివరాలేవీ ఆస్పత్రిలో లేకపోవడంతో అధికారులు అయోమయంలో పడ్డారు. అందుకే, ఈ హాస్పిటల్‌కు వచ్చినవారు స్వచ్ఛందంగా ముందుకురావాలని వారు కోరుతున్నారు.

‘‘కేఎం హాస్పిటల్ డాక్టర్ ఓ మానవతావాది. పేదల డాక్టర్! ఆయనకు దాదాపు 80 ఏళ్లు ఉంటాయి. రోగులు తమంతట తాము ఫీజు ఇస్తే తప్ప ఆయన నోరు తెరిచి డబ్బు అడగరు. కానీ ఆయన కరోనావైరస్‌తో మరణించడం దురదృష్టం. ఇప్పుడు కర్నూలులో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ విషయమై డాక్టర్ కుటుంబ సభ్యులతో మాట్లాడాం. ఆయనకు కరోనా సోకిందన్న విషయం ప్రజలకు చెప్పక తప్పదు. అప్పుడే ప్రజల ప్రాణాలను కాపాడగలం. అందుకని ఆయన కుటుంబ సభ్యుల నుంచి అనుమతి కూడా తీసుకున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కర్నూలుకు ఒక అధునాతన ల్యాబ్‌ను, కోవిడ్ టెస్టింగ్ యూనిట్‌ను కేటాయించారు. గంటకు దాదాపు 100 శాంపిళ్లను పరీక్షించవచ్చు’’ అని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ బీబీసీతో చెప్పారు.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్‌‌డేట్ అవుతుంది. కానీ, ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన తాజా సమాచారం వెంటనే కనిపించకపోవచ్చు

రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం మొత్తం కేసులు కోలుకున్నవారు మరణాలు
మహారాష్ట్ర 1351153 1049947 35751
ఆంధ్రప్రదేశ్ 681161 612300 5745
తమిళనాడు 586397 530708 9383
కర్నాటక 582458 469750 8641
ఉత్తరాఖండ్ 390875 331270 5652
గోవా 273098 240703 5272
పశ్చిమ బెంగాల్ 250580 219844 4837
ఒడిశా 212609 177585 866
తెలంగాణ 189283 158690 1116
బిహార్ 180032 166188 892
కేరళ 179923 121264 698
అస్సాం 173629 142297 667
హరియాణా 134623 114576 3431
రాజస్థాన్ 130971 109472 1456
హిమాచల్‌ ప్రదేశ్ 125412 108411 1331
మధ్యప్రదేశ్ 124166 100012 2242
పంజాబ్ 111375 90345 3284
ఛత్తీస్‌గఢ్ 108458 74537 877
జార్ఖండ్ 81417 68603 688
ఉత్తర్‌ప్రదేశ్ 47502 36646 580
గుజరాత్ 32396 27072 407
పుదుచ్చేరి 26685 21156 515
జమ్మూ కశ్మీర్ 14457 10607 175
చండీగఢ్ 11678 9325 153
మణిపుర్ 10477 7982 64
లద్దాఖ్ 4152 3064 58
అండమాన్ - నికోబార్ దీవులు 3803 3582 53
దిల్లీ 3015 2836 2
మిజోరమ్ 1958 1459 0

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కర్నూలు జిల్లాలో ఎన్-95 మాస్కులు, పీపీఈ కిట్లకు కొరత లేదని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ నెల 14న మూడు వేల పీపీఈ కిట్లు, 96 వేల హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలు వచ్చాయని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు.

"శనివారం ఉదయం నుంచి కర్నూలు, నంద్యాల, బనగానపల్లె, ఆదోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ట్రూనాట్ యంత్రాల ద్వారా కోవిడ్/కరోనా టెస్టింగ్ ప్రారంభించాం. కర్నూలు, నంద్యాల, బనగానపల్లె, ఆదోనిలలో ట్రూనాట్ యంత్రాల ద్వారా రోజుకు 300 కోవిడ్ టెస్టులు నిర్వహించి, వెంటనే ఫలితాలు తెలుసుకుంటాం.కరోనావైరస్ టెస్ట్ కోసం ఎవరూ నేరుగా వెళ్లకూడదు. స్థానిక ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ సూచించిన వాళ్లు మాత్రమే టెస్టింగ్‌కు వెళ్లాలి. ఈ రోజు నుండి కర్నూలు నగరంలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో కరోనా టెస్టింగ్ నమూనాల సేకరణ కోసం మొబైల్ బూత్ ఏర్పాటును పకడ్బందీగా పర్యవేక్షించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను, మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించాం" అని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు.

కరోనావైరస్-రాయలసీమ

మందులు డోర్‌ డెలివరీ

లాక్‌ డౌన్ కారణంగా, తమకు అవసరమైన ఔషధాలను కొనుగోలు చేయడానికి ప్రజలు ఇబ్బందిపడరాదన్న ఉద్దేశంతో కర్నూలు, నంద్యాల డివిజన్లలోని రెడ్‌ జోన్ ప్రాంతాల్లో ఔషధాలను డోర్ డెలివరీ చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 53 మెడికల్ షాపుల వాట్సాప్ నంబర్లను వెల్లడించారు. వైద్యులు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్‌ను ఆ వాట్సాప్ నంబర్లకు పంపి, తమకు అవసరమైన మందులు డోర్‌ డెలివరీ ద్వారా పొందవచ్చునని అధికారులు తెలిపారు.

పండ్లతోటల రైతుల కోసం మరో అడుగు ముందుకేసిన అధికారులు, రైతులతో మాట్లాడి, రోగనిరోధక శక్తిని పెంచే పళ్లను ప్రజలకు డోర్ డెలివరీ చేస్తున్నారు. 100 రూపాయలకు 8 అరటి పండ్లు, 5 నారింజ పండ్లు, ఒక బొప్పాయి, ఒక కర్బూజ కాయ, 5 నిమ్మకాయలకు అందిస్తున్నారు.

‘‘క్వారంటైన్ కేంద్రాల్లో ఒక్కో వ్యక్తికి రోజుకు 500 రూపాయల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఆ కేంద్రాల్లో వసతులకు లోటు లేకుండా చర్యలు తీసుకోవాలి. క్వారంటైన్‌లో ఉండే వ్యక్తికి పరీక్షలు చేస్తే, రెండుసార్లు నెగెటివ్ అని వచ్చిన తర్వాత మరో 14 రోజులు హోమ్ క్వారంటైన్‌లో ఉండాలి’’ అని కర్నూలు జిల్లా కోవిడ్-19 ప్రత్యేక పరిశీలకుడు అజయ్ జైన్ వివరించారు.

కర్నూలు జిల్లా ఆంధ్ర-తెలంగాణ సరిహద్దుల్లో ఉండటంతో జిల్లా ఎస్పీ డాక్టర్ కాగినెల్లి ఫక్కీరప్ప జిల్లా సరిహద్దులో తనిఖీలు నిర్వహించారు. వస్తు రవాణా వాహనాల్లో వలస కూలీలు, ఇతరులు ఎవరూ రాష్ట్రంలోకి రాకుండా ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ అలా ఎవరైనా వస్తే, వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలని డా.ఫక్కీరప్ప ఆదేశించారు.

ఏప్రిల్ 15 వరకు అందిన లెక్కల ప్రకారం, విదేశాల నుంచి 840 మంది కర్నూలు జిల్లాకు వచ్చారు. అందులో 788 మంది హోమ్ ఐసొలేషన్ పూర్తి చేశారని, మిగతా 52 మంది హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 20 కోవిడ్ కేర్ సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
అనంతపురంలో ఒక తొమ్మిదేళ్ల బాలుడికి కరోనా సోకింది, ఆ బాలుడు కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు
ఫొటో క్యాప్షన్, అనంతపురంలో ఒక తొమ్మిదేళ్ల బాలుడికి కరోనా సోకింది, ఆ బాలుడు కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు

అనంతపురంలో 9 ఏళ్ల బాలుడితో ప్రారంభం

అనంతపురం జిల్లాలో మక్కా నుంచి తిరిగొచ్చిన ఒకరి ద్వారా లేపాక్షికి చెందిన 9 ఏళ్ల బాలుడికి కరోనా సోకింది.

హిందూపురానికి చెందిన 36 ఏళ్ల మహిళ కూడా మక్కా వెళ్లి వచ్చారని, ఆమెకు కూడా కరోనా సోకిందని అధికారులు తెలిపారు. ఈ రెండు కేసులతో అనంతపురంలో కరోనావైరస్ ఖాతా తెరిచింది. అధికారులు వీరిద్దరినీ క్వారంటైన్‌కు తరలించారు. అయితే, హిందూపురంలోనే 60 ఏళ్ల వృద్ధుడికి మక్కా వెళ్లొచ్చిన మరొకరి నుంచి కరోనా సోకింది. మొదట్లో సాధారణ అనారోగ్యంగా భావించిన ఆయన, అనంతపురం ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. వైద్యులు కూడా ఆయనకు కరోనా ఉన్నట్లు ఆలస్యంగా గుర్తించారు. కోవిడ్ రిపోర్ట్ వచ్చేలోపే అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో ఆయన మరణించారు. దీంతో అప్రమత్తమైన వైద్యులు ఆయన తల్లి, కొడుకుతోపాటు వైద్య సిబ్బందిని కూడా క్వారంటైన్‌కు పంపారు. వీరిలో బాధితుడి తల్లి, కొడుకుతోపాటు, వారిని అనంతపురం తరలించిన అంబులెన్స్ డ్రైవర్, ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు నర్సులకు కూడా కోవిడ్ పాజిటివ్ అని నిర్ధరణ అయ్యింది.

మడకశిర నియోజకవర్గం రొళ్ల మండలం తహసీల్దార్‌కు కరోనా సోకినట్లు అధికారులు ధృవీకరించారు. గత కొన్ని రోజులుగా ఆమె పలు ప్రభుత్వ, సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. దీంతో, తహసీల్దార్‌తో దగ్గరగా మెలిగిన రొళ్ల మండల పరిధిలోని వీఆర్ఓలు, కార్యాలయ అటెండర్లు, ఇతర అధికారులు సహా మొత్తం 57 మందిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

అనంతపురం జిల్లాలో ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయి
ఫొటో క్యాప్షన్, అనంతపురం జిల్లాలో ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయి

జిల్లాలో అనంతపురం, హిందూపురం, కళ్యాణదుర్గంలో కొన్ని ప్రాంతాలను అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఏప్రిల్ 18 ఉదయం 10గంటల సమయానికి జిల్లాలో మొత్తం కోవిడ్ కేసులు 26. వీరిలో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరిని ఏప్రిల్ 16న డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కోవిడ్ కేసులు 22.

జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయి. కంబదూరు మండలం కర్తనపర్తి, జి.పి.గూల్యం గ్రామాల్లో కూలీలు... ముఖానికి మాస్క్ కట్టుకుని, సామాజిక దూరం పాటిస్తూ ఉపాధి పనుల్లో నిమగ్నమయ్యారు.

బాలుడిని డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు వైద్య సిబ్బంది ముఖాల్లో ఆనందం కనిపించింది
ఫొటో క్యాప్షన్, బాలుడిని డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు వైద్య సిబ్బంది ముఖాల్లో ఆనందం కనిపించింది

పోలీసులపై రాళ్ల దాడి

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఎస్‌కేడీ ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో ఏప్రిల్ 13న ఉద్రిక్తత చోటుచేసుకుంది. 14 రోజుల క్వారంటైన్ గడువు పూర్తయినందున తమను స్వగ్రామాలకు పంపాలంటూ క్వారంటైన్‌లోని ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు అక్కడి పోలీసులతో ఘర్షణకు దిగారు. నచ్చజెప్పడానికి ప్రయత్నించిన పోలీసులపై రాళ్లు, చెప్పులు విసిరి దాడిచేశారని, ఈ దాడిలో కొందరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయని సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

ఇక ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొందరు వలస కూలీలు బెంగళూరు నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు కాలినడకన బయల్దేరారు. తమతోపాటు తెచ్చుకున్న కొద్దిపాటి ఆహారంతో, అవస్థలు పడుతూ 44వ నంబర్ జాతీయ రహదారి వెంబడి వెళ్తున్న దృశ్యాలు కూడా జిల్లాలో కనిపించాయి.

అనంతపురం జిల్లాకు చెందిన 176 మంది దిల్లీ నుంచి తిరిగొచ్చారని భారత ప్రభుత్వం చెబుతోంది. అందులో కేవలం 54 మందిని గుర్తించగా, మిగతా వారంతా జిల్లా వెలుపల ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం, అనంతపురం జిల్లాలో మొత్తం 1015 మంది విదేశాల నుంచి వచ్చారు. వారిలో జిల్లా యంత్రాంగం 860 మందిని గుర్తించిందని, విదేశాల నుంచి వచ్చిన 155 మంది జిల్లాలో లేరని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, అనంతపురం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హిందూపురం జిల్లా వైద్యశాలల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 32 క్వారంటైన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.

అనంతపురం జిల్లాలో మొదటగా కోవిడ్ బారినపడ్డ 9 ఏళ్ల బాలుడు, 36 ఏళ్ల మహిళను ఏప్రిల్ 16 సాయంత్రం అధికారులు డిశ్ఛార్జ్ చేశారు.

కరోనావైరస్-రాయలసీమ

చిత్తూరు జిల్లా

ఏప్రిల్ 18 నాటికి చిత్తూరు జిల్లాలో మొత్తం 28 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, అందులో ఒకరు డిశ్చార్జ్ అయ్యారు. దీంతో చిత్తూరులో యాక్టివ్ కరోనా కేసులు 29గా ఉంది.

రాయలసీమలో మొదటి కేసు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో నమోదైంది. మార్చి 19న ఇంగ్లండ్ నుంచి స్వగ్రామానికి వచ్చిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అవ్వడంతో ఆయన్ను మార్చి 23న తిరుపతి రుయా ఆస్పత్రి క్వారంటైన్‌కు తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆ యువకుడికి తర్వాత రెండుసార్లు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ రావడంతో డిశ్చార్జ్ చేశారు.

అధికారిక లెక్కల ప్రకారం, విదేశాల నుంచి చిత్తూరు జిల్లాకు 1,816 మంది వచ్చారు. వారంతా హోమ్ ఐసోలేషన్ పూర్తిచేసుకున్నారని అధికారులు చెబుతున్నారు.

తిరుపతి-6, శ్రీకాళహస్తి-7, నగరి-4, పలమనేరు-3, రేణిగుంట-2, ఏర్పేడు-1, నిండ్ర-1, వడమలపేట-1 గా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా దిల్లీలో జరిగిన మతప్రార్థనలకు హాజరైనవారి సంఖ్య 163. వారిలో ఇప్పటిదాకా అధికారులు 142 మందిని గుర్తించారు. మిగతా 21మందిలో 20 మంది జిల్లాలో లేరని, మరొకరిని ఇంకా గుర్తించాల్సివుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

ఏప్రిల్ 16 నాటికి జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల్లో 235 మంది ఉన్నారు. రైలు బోగీలను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తిరుపతి రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన బోగీలను కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా పరిశీలించారు.

కరోనావైరస్-రాయలసీమ

తిరుమల దర్శనం బంద్

మే 3 వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో దర్శనాలను నిలుపుదల చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.

మే 31వ తేదీ వరకు ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకున్నవారికి రీఫండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు లాక్‌డౌన్ కారణంగా తిరుపతి, ఇతర ప్రాంతాల్లోని వలస కూలీలు, నిరాశ్రయుల కోసం తిరుపతి తిరుమల దేవస్థానం వారు ప్రతిరోజూ 70 వేల మందికి మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మార్చి 28 నుంచి ప్రారంభించారు.

కోవిడ్-19తో పోరాడే క్రమంలో చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ కమిషనర్ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. నగరి ఎమ్మెల్యే రోజా అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నప్పటికీ, ప్రభుత్వం వైపు నుంచి ఆశించినంత మేర సహకారం అందడంలేదని ఆ వీడియోలో ఆయనన్నారు. ఇంతవరకూ ప్రభుత్వం నుంచి ఒక్కరూపాయి కూడా తమకు అందకపోయినా, కష్టపడి పనిచేస్తున్నామని ఆ వీడియోలో కమిషనర్ అన్నారు. మాస్కులు, గ్లౌవ్స్, పీపీఈ సూట్లు లాంటి రక్షణ కవచాలేవీ లేకపోయినా వీధుల్లోకి వెళ్లి పనిచేస్తున్నామని అన్నారు. దీంతో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారంటూ ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది.

కాణిపాకం గురించి నకిలీ పోస్టులు

రాష్ట్ర ప్రభుత్వం కాణిపాకం దేవాలయాన్ని క్వారంటైన్ సెంటర్ కోసం కేటాయించిందని, అక్కడ ఇతర మతస్థులు కాళ్లకు చెప్పులు వేసుకుని తిరుగుతున్నారంటూ కొన్నిరోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక వీడియో హల్‌చల్ చేసింది. కానీ, వాస్తవానికి కాణిపాకంలోని ఒక వసతి గృహంలో క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని వక్రీకరిస్తూ ఒక వీడియోను కొందరు పనిగట్టుకుని సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారని, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఈ వీడియోను వాడుతున్నారంటూ చిత్తూరు క్రైం బ్యాంచ్‌లో కేసు నమోదైంది.

ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, తెలంగాణలోని సిద్ధిపేటకు చెందిన ఎం.విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేసి సబ్‌జైలుకు తరలించారు. తన ఫేస్‌బుక్, ట్విటర్ ఖాతాలలో ప్రభుత్వ ఉద్యోగులను అసభ్య పదజాలంతో దూషించారని, కాణిపాకం దేవాలయాన్ని క్వారంటైన్ సెంటర్‌కు ఇచ్చారంటూ అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆయనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

కరోనావైరస్-రాయలసీమ

కడప జిల్లా

కడప జిల్లాలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో ఒక్కరోజే 13 తగ్గాయి. కడప జిల్లావ్యాప్తంగా 37గా నమోదైన పాజిటివ్ కేసుల్లో, 13 మందికి తాజా పరీక్షల్లో నెగెటివ్ అని తేలడంతో వారిని ఏప్రిల్ 16 సాయంత్రం డిశ్ఛార్జ్ చేశారు.

మార్చి 31న ఒకేరోజు జిల్లాలో 15 మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో వారికి చికిత్స అందించామని, ఆ 15మందిలో ప్రస్తుతం 13 మందిని డిశ్చార్జ్ చేశామని కలెక్టర్ హరికిరణ్ చెప్పారు. వారికి 24 గంటల వ్యవధిలో రెండుసార్లు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా రెండుసార్లు కూడా నెగెటివ్ వచ్చిందని, ఛాతి ఎక్స్‌‌-రే లాంటి మరిన్ని పరీక్షలు చేసి, పూర్తిగా కోలుకున్నట్లు నిర్ధరించాకే వీరిని డిశ్ఛార్జ్ చేశామని కలెక్టర్ తెలిపారు. వారంతా మరో 14 రోజులు స్వీయ గృహనిర్బంధంలో ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

కరోనావైరస్-రాయలసీమ

డిశ్ఛార్జ్ అయినవారందరికీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఒక్కొక్కరికి 2 వేల రూపాయలు, డ్రైఫ్రూట్స్, పళ్లను పంపిణీ చేశామని కలెక్టర్ హరికిరణ్ తెలిపారు.

ఏప్రిల్ 16 లెక్కల ప్రకారం, విదేశాల నుంచి కడప జిల్లాకు వచ్చిన 4,941 మందిని అధికారులు గుర్తించారు. జిల్లాలో పాజిటివ్‌గా తేలిన మొత్తం కేసుల్లో 20 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారు నలుగురు. 21-40 సంవత్సరాల మధ్య వయసున్నవారు 13 మంది, 41-60 మధ్య వయసు వారు 16 మంది, 60 ఏళ్లకు పైబడినవారు ముగ్గురు ఉన్నారు.

కరోనావైరస్-రాయలసీమ

నెల్లూరు జిల్లా

రాష్ట్రంలో మొట్టమొదటి కరోనా కేసు నెల్లూరు జిల్లాలో నమోదైంది.

ఇటలీ నుంచి వచ్చిన యువకుడికి కరోనా లక్షణాలు ఉండటంతో ఐసొలేషన్ వార్డుకు తరలించారు. రిపోర్టులో పాజిటివ్ అని రాగా, రెండోసారి శాంపిల్ సేకరించి పుణే ల్యాబ్‌కు పంపారు. అక్కడి నుంచి కూడా కరోనా పాజిటివ్ అని రావడంతో, ఆంధ్రప్రదేశ్‌లో మొదటి కరోనా కేసుగా నమోదు చేశారు. అయితే వైద్యుల చికిత్స అనంతరం, పూర్తిగా కోలుకున్న యువకుడిని డిశ్ఛార్జ్ చేశారు.

ఏప్రిల్ 18న ఉదయం నాటికి నెల్లూరులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67 కాగా అందులో ఇద్దరు మరణించారు, ఒకరు డిశ్ఛార్జ్ అయ్యారు.

నెల్లూరులో ఒక డాక్టర్‌కు కరోనా సోకి, చెన్నైలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్‌కు పంపారు.

దిల్లీలోని లక్ష్మీనగర్‌కు చెందిన 56 సంవత్సరాల వ్యక్తి అనారోగ్య కారణాలతో నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. మరుసటి రోజు ఆయన నమూనాలను ల్యాబ్‌కు పంపారు. రిపోర్ట్ వచ్చేలోపే ఆయన ఆసుపత్రిలో మరణించారు. తర్వాత వచ్చిన రిపోర్టులో పాజిటివ్ అని నిర్ధరణ అవ్వడంతో, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆయన మృతదేహాన్ని రెవెన్యూ శాఖ వారికి అప్పగించారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 11 క్వారంటైన్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

కరోనావైరస్-రాయలసీమ

దిల్లీలో తబ్లీగీ జమాత్ ప్రార్థనలకు వెళ్లొచ్చినవారిని గుర్తించడంలో ఆలస్యం జరగడం వల్లనే నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు పెరగడానికి కారణం అని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ అన్నారు.

‘‘మనవాళ్లకు కరోనా గురించి పెద్ద అవగాహన లేదు. దీన్ని ఎలా ఎదుర్కోవాలో తెలీదు. అందుకే, దిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చినవారిని గుర్తించడంలో ఆలస్యం జరిగిందని అనుకుంటున్నాను. గతంలో కూడా ఇదే విషయం చెప్పాను. పూర్తిస్థాయిలో కేసులను గుర్తించి, త్వరిత గతిన వారిని క్వారంటైన్ చేయలేకపోయాం’’ అన్నారు.

నెల్లూరు జిల్లాలో అధికారులు సమీక్షలకే పరిమితం అవుతున్నారని, రెడ్‌జోన్‌లో ఉండే ప్రజలకు సరైన అవగాహన కల్పించడంలో అధికారుల పనితీరు ఆశాజనకంగా లేదని, ఒక సందర్భంలో కాకాని గోవర్ధన్ అధికారుల పనితీరు పట్ల అసహనం వ్యక్తం చేశారని నెల్లూరుకు చెందిన సీనియర్ జర్నలిస్టు ఒకరు బీబీసీతో అన్నారు.

ఈ విషయమై ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌ని ప్రశ్నించినపుడు ఆయన మాట్లాడుతూ... ‘‘కరోనా విషయంలో నిమగ్నమైన అధికారులు, ఇతర అనారోగ్య సమస్యలతో వచ్చేవారిని నిర్లక్ష్యం చేశారు. నా సొంత నియోజకవర్గం సర్వేపల్లిలోని వెంకటాచలం మండలం నిడిగుంటపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తీవ్రమైన అనారోగ్యంతో నెల్లూరుకు వచ్చారు. వైద్యులు, ఆసుపత్రులు అన్నీ కరోనాలో మునిగిపోవడంతో, దిక్కులేక ఆయన మరణించారు. అందుకే, సమీక్షా సమావేశాలకు ప్రజాప్రతినిధులను కూడా పిలవమని కలెక్టర్‌కు చెప్పాను. మా దృష్టికి వచ్చిన సమస్యలను కూడా అధికారులకు వివరించే అవకాశం ఉంటుంది కదా’’ అని అన్నారు.

జిల్లాలో కరోనాను ఎప్పటిలోగా కట్టడి చేయగలమో ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)