ఆంధ్రప్రదేశ్: 'పంట బాగా పండినా, లాక్‌డౌన్ నాన్నను మాకు దూరం చేసింది'

- రచయిత, హృదయ విహారి బండి
- హోదా, బీబీసీ కోసం
‘‘సాలీడు గూడు అల్లుకున్నట్లు మా నాయన, బత్తాయి తోట చుట్టూ గూడు కట్టుకని ఆడాడే తిరిగినాడు. ఆయనకు 24 గంటలూ తోట ఆలోచనలే. నెలకిందటే అమ్ముడుపోవాల్సిన పంట, ఈ లాక్‌డౌన్‌తో చెట్టు మిందే పండి, రాలిపోయింది. అది చూసి తట్టుకోలేక, విషం మాత్రలు మింగి సచ్చిపోయినాడు మా నాయన” అన్నారు సుగునాథ్ రెడ్డి.
కడప జిల్లా పులివెందులలో బత్తాయి సాగు చేస్తున్న 59 ఏళ్ల రైతు బొగ్గుల పాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. ఏప్రిల్ 19, ఆదివారం ఉదయం, ఆయన తన పొలంలోనే విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు పులివెందుల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
వ్యవసాయం కోసం చేసిన రూ.8 లక్షల అప్పు ఒకవైపు, ఆ అప్పును తీర్చడానికి... చేతికొచ్చిన బత్తాయి పంటను అమ్ముకోలేని లాక్‌డౌన్ పరిస్థితులు మరోవైపు... పాల్ రెడ్డి, ఆయన భార్య పేరు మీద 9 ఎకరాల బత్తాయి తోట ఉంది. గత 8 ఏళ్లుగా చెట్లను కన్నబిడ్డల్లా సాకుతున్నారు పాల్ రెడ్డి.
పెద్దకొడుకు తుమ్మలపల్లె యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో గుమస్తా, రెండో కొడుకు మరో చిన్న ఉద్యోగం చేస్తున్నారు.

బత్తాయి పంట తమ చేతికొచ్చే సమయానికి లాక్‌డౌన్ తమను బాగా ఇబ్బంది పెట్టిందని, గత నెలరోజులుగా తండ్రి తీవ్ర ఆందోళనకు గురయ్యాడని పాల్‌రెడ్డి పెద్దకొడుకు సుగునాథ్ రెడ్డి బీబీసీకి చెప్పారు.
“ఏడెమినిదేండ్లుగా నాయిన బత్తాయి పంటను సాగు చేస్తున్నాడు. ఆయన ధ్యాస ఎప్పుడూ ఆ తోట మిందనే ఉంటాండె. కరోనా వచ్చినంక లాక్‌డౌన్ అనిరి. దాంతో మాకాడికి వచ్చే వ్యాపారులు రాకపాయిరి. చెట్టు మింద కాయలేమో పండిపోయి రాలిపాయ. నాకు ఫోన్ చేసిన ప్రతిసారీ, ఒక్కో చెట్టు కింద గంపెడు కాయలు రాలిపాయె కదరా... అని చింత చేస్తాండె” అన్నారు.
కడప జిల్లాలో ఏప్రిల్ 20వ తేదీ నాటికి కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 40. వీరిలో చికిత్స అనంతరం 19మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం జిల్లాలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 21. అందులోనూ పులివెందుల మండలం రెడ్‌జోన్‌లో ఉంది.

ఫొటో సోర్స్, Shafi
గత ఏడెనిమిదేళ్ల నుంచి పాల్ రెడ్డి బత్తాయి సాగు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటి దాకా 8 బోర్లను వేయించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ బోర్లు వేయించడానికి, పెట్టుబడికి కలిపి ఇప్పటిదాకా రూ.8 లక్షలు అప్పు చేసినట్లు చెప్పారు.
”ఇప్పటికి నెల రోజుల కిందటే పంట మొత్తం అమ్ముడుపోయి ఉండల్ల సార్. కానీ లాక్‌డౌన్ వల్ల పంట కొనేకి వ్యాపారులు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఎండాకాలంలో ఒక టన్ను చీనీ (బత్తాయి) కాయలు కనీసం 40-50వేల రూపాయల ధర పలుకుతుంది. కానీ మార్కెట్‌లో ఇప్పుడు ఒక టన్ను 10-15 వేలకు అడుగుతున్నారు. పంట లోడుతో మేం మార్కెట్టుకు పోతే, బంగారం మాదిరున్న పంటను నాలుగు దుడ్లకు అడుగుతారు. ఆ రేటుతో వాళ్లకు అమ్మలేము, బాడుగ పెట్టి ఎనక్కు తేలేము. చేసేదిలేక రోడ్డు మింద పారెయ్యల్లంతే! అందుకే మాకు వ్యాపారులే దిక్కు, వేరే గత్యంతరం లేదు. లాక్‌డౌన్ ఉందని పదెకరాల పొలమున్న రైతు, తోపుడు బండిపై కాయల్ని అమ్మలేడు కదా’’ అని సుగునాథ్ అన్నారు.

ఫొటో సోర్స్, Hrudaya vihari
నాలుగేళ్ల క్రితం ఆత్మహత్యాయత్నం
పాల్ రెడ్డి 2016లో కూడా అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేశారని, తృటిలో ప్రాణాపాయం తప్పిందని సుగునాథ్ బీబీసీతో అన్నారు.
“ఇది మొదటిసారి కాదు, 2016లో కూడా ఒకసారి ఆత్మహత్య చేసుకునేకి ట్రై చేసినాడు మా నాయిన. మా టైం బాగుండి గండం గట్టెక్కింది. చీనీ పంటను కాపాడేకి అప్పు చేసి, 3-4 బోర్లు ఏసినాడు. బోర్లలో నీళ్లేమో సరిగా రాకపాయ. కానీ, అప్పు ఏమో పెరగబట్టె. అప్పుడు విషం తాగినాడు. ఎట్లో ఆయన ప్రాణం నిలబెడితిమి. అన్నదమ్ములం ఇద్దరమే ఆ అప్పును కడితిమి” అన్నారు సుగునాథ్.
"2016లో కూడా పాల్‌రెడ్డి ఒకసారి ఆత్మహత్యకు ప్రయత్నించారని తెలిసింది. అయితే, అప్పట్లో ఆ విషయం మా దృష్టికి రాలేదు. చీనీ పంట కోసం ఆయన అప్పు చేసి బోర్లు వేశారు. గతంలో ఒకసారి బత్తాయి వ్యాపారి వద్ద ఆయన మోసపోయినట్లు మాకు ఫిర్యాదు అందితే, దానిపై మేము పులివెందుల స్టేషన్‌లో కేసు నమోదు చేశాం. అప్పుల భారంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు మా ప్రాథమిక దర్యాప్తులో తేలింది" అని పులివెందుల సీఐ భాస్కర్ రెడ్డి చెప్పారు.

ఫొటో సోర్స్, Shafi
మొదటిసారి చేసిన ఆత్మహత్యాయత్నం విఫలమై, చావు నుంచి తప్పించుకున్న పాల్ రెడ్డి, మళ్లీ వ్యవసాయంలోకి దిగారు. అప్పు చేసి మళ్లీ మళ్లీ బోర్లు వేశారు. వీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తోన్న పులివెందుల బ్రాంచ్ కెనాల్ ద్వారా మూడేళ్ల కిందట నీళ్లు వచ్చాయి. దాంతో ఈ ప్రాంతంలో బోర్లు రీఛార్జ్ అయ్యాయి.
ప్రస్తుతం చేతికొచ్చిన పంట వైపు ఆశగా ఎదురుచూస్తోన్న పాల్ రెడ్డి లాంటి రైతులకు లాక్‌డౌన్ నిరాశను మిగిల్చింది. వారి కళ్ల ముందే, మార్కెట్‌కు వెళ్లాల్సిన బత్తాయిలు రాలిపోతున్నాయి.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
మోసం చేసిన వ్యాపారి
2019లో పాల్ రెడ్డి, తన చీనీ పంటను 5 లక్షల రూపాయలకు ఒక వ్యాపారికి అమ్మారని, ఆ వ్యాపారి కేవలం 500 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి, మిగతా మొత్తం ఇవ్వకుండా మోసం చేశాడని సుగునాథ్ అన్నారు.
ఈ విషయమై పులివెందుల పోలీస్ స్టేషన్‌లో సుగునాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సి.ఐ.భాస్కర్ రెడ్డి బీబీసీకి చెప్పారు.
“రైతు ఆశాజీవి సార్... ఎన్నిసార్లు పంట కోల్పోయినా, సేద్యం మానలేడు. ఒకసారి ప్రకృతి మోసం చేస్తే, ఇంగోసారి దళారులు మోసం చేస్తారు. పంటను బతికిచ్చుకునేకి ఎరువులు, మందులు, బోర్ల కోసం లక్షలు ఖర్చుపెట్టల్ల. చెట్లని కన్నబిడ్డల కన్నా జాగ్రత్తగా చూసుకోవల్ల. అంతా అయి, ఇంగ అమ్మేదే తడవు అనుకున్నపుడు లాక్‌డౌన్ అని జెప్పిరి. వారం, రెండు వారాలు అనుకుంటా నెలరోజులు గడిచిపాయ. కండ్ల ముందే కాయలు రాలిపాయ” అని సుగునాథ్ అన్నారు.
రైతులకే కాదు, వ్యాపారులకు కూడా పంట కొనడానికి వెసులుబాటు ఇవ్వాలని సుగునాథ్ అన్నారు. ఒకవేళ వ్యాపారులకు వెసులుబాటు ఇచ్చినా, కరోనా నేపథ్యంలో వందల కిలోమీటర్లు ప్రయాణించి, వ్యాపారం చేయడానికి ఎవరు సాహసిస్తారని ఆయన ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Shafi
కొందరు రైతులు తమ సమస్యలను ఎంపీ అవినాష్ రెడ్డి దృష్టికి తీసుకుపోయారని, అయినా వ్యాపారులు తోటల దగ్గరకు వచ్చి, పంటను కొనే పరిస్థితులు లేవని సుగునాథ్ రెడ్డి అన్నారు.
“మాకు తెలిసిన ఇద్దరు వ్యాపారులు, ఇచ్చిన మాట కోసం రైతుల పంటను కొని, మహారాష్ట్ర మార్కెట్‌కు రెండు లోడ్‌లు ఏసుకుపోయినారు. కానీ ఆడ రేటు లేదు, కనీసం లోడ్ దించేకి కూలోళ్లు కూడా లేరంట. సరుకు అమ్ముడుకాక, వాళ్లు నానా అవస్థలు పడినారు. కాబట్టి, మా పంటను ప్రభుత్వమే కొంటే బాగుంటాది” అని సుగునాథ్ రెడ్డి చెప్పారు.
కడప జిల్లాలో ఏప్రిల్ 20నాటికి యాక్టివ్‌గా ఉన్న కోవిడ్ కేసుల సంఖ్య 21. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 19 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏప్రిల్ 20 తర్వాత లాక్‌డౌన్ నిబంధనలను ఎత్తివేస్తారన్న వార్తలను ఎవరూ నమ్మవద్దని, మే 3 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని, రెడ్‌జోన్ ప్రాంతాల్లో నియంత్రణ యథావిధిగా ఉంటుందని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వం తగు చర్యలు తీసుకోకపోతే, పండ్లతోటల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని రైతు సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.
"లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. పండ్ల రైతులకు రవాణా సౌకర్యం కల్పించి, నాగ్‌పూర్, ముంబయి ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం కల్పించాలి. మరింత ఆలస్యం చేస్తే పులివెందులలో ఆత్మహత్య చేసుకున్న పాల్‌రెడ్డి మాదిరిగా చాలామంది నష్టపోయే ప్రమాదం ఉంది. ఇదే డిమాండ్‌తో సీపీఎం పార్టీ మంగళవారం దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతోంది. అందులో భాగంగా విజయవాడతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆందోళనలు చేస్తాం" అని ఆంధ్రప్రదేశ్ సీపీఎం రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: లాక్‌డౌన్ పొడిగిస్తే ఎదురయ్యే పరిస్థితులకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా?
- కరోనావైరస్: తొలి కేసు నమోదవడంతో యెమెన్‌లో 'భయం భయం'
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి? నిర్థరణకు ఎలాంటి పరీక్షలు చేస్తారు?
- కరోనావైరస్: ఇటలీని దాటేసిన అమెరికా, ప్రపంచంలో అత్యధిక మరణాలు ఇక్కడే
- కరోనా లాక్‌డౌన్: విపరీతంగా బయటపడుతున్న ఎలుకలు.. వీటిని నివారించడం ఎలా
- వుహాన్‌లో లాక్ డౌన్ ఎత్తేసిన చైనా ప్రభుత్వం.. రైళ్లు, విమానాల్లో మొదలైన ప్రయాణాలు
- కరోనావైరస్: నియంత్రణ రేఖ 'సామాజిక దూరం' ఎలా పాటించాలంటున్న స్థానికులు
- మామకు కరోనా పాజిటివ్... రహస్యంగా చూసివచ్చిన అల్లుడిపై కేసు
- కొడుకు శవంతో రోడ్డుపై పరుగులు తీసిన తల్లి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








