కరోనావైరస్: తెలుగు రాష్ట్రాల లాక్‌డౌన్ సమయంలో తండ్రి అయిన ఒక కొడుకు కథ

శిశువును ఎత్తుకున్న వ్యక్తి
    • రచయిత, చిట్టత్తూరు హరికృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సాధారణంగా అదో ఆనందమైన సందర్భం.. చుట్టూ బంధువులు, స్నేహితులు ఉన్నప్పుడు ఒక కుటుంబంలో, ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్న బిడ్డకు స్వాగతం పలకాల్సిన సమయం. కానీ, వంశీకృష్ణ చుట్టూ వారెవరూ లేరు.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

భార్య డెలివరీ డేట్ సమయానికి (ఏప్రిల్ 15) లాక్‌డౌన్ ఎత్తేస్తారనుకున్న ఆయనకు, ముందు రోజు (ఏప్రిల్ 14) ప్రధాని దానిని పొడిగిస్తున్నట్టు ప్రకటించగానే భయమేసింది.

వంశీ హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఆయన భార్య నిషా కూడా మరో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తారు. పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఆ రోజు గురించి బీబీసీతో ఫోన్లో మాట్లాడిన వంశీ... “ముందే ప్లాన్ చేసిన డేట్ కావడంతో మా కజిన్ నవీన్, నేను నిషను తీసుకుని కారులో బొగ్గులకుంట దగ్గర ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి బయల్దేరాం. పోలీసులు చెక్ పాయింట్ల దగ్గర ఆపినా, మా పరిస్థితి చెప్పడంతో వదిలేశారు. కరోనా భయం, రాత్రి కావడంతో ఆస్పత్రిలో పెద్దగా స్టాఫ్ లేరు. మా కజిన్‌ను లోపలికి అనుమతించలేదు. కర్ఫ్యూ ఉంది కాబట్టి ఆస్పత్రి బయట కూడా ఉండనీయలేదు. దాంతో అతడు ఇంటికి వెళ్లిపోయాడు” అని చెప్పారు.

ఆస్పత్రిలో నిషను అడ్మిట్ చేసుకున్నారు. మొత్తం ఆరు లేబర్ రూమ్స్ (పురిటి నొప్పులు వస్తున్న వారిని ఉంచే గదులు) ఉన్నప్పటికీ, ఒక్కో గదికి ఒక్క నర్సు మాత్రమే ఉన్నారు. నిషను చూసుకోడానికి అక్కడ వంశీ తప్ప మరెవరూ లేరు. దాంతో ఆయన ఆమె దగ్గరి నుంచి కదల్లేని పరిస్థితి. భార్య అవసరాలు చూసుకుంటూనే నర్సులకు కూడా కావల్సిన సాయం చేశారు.

“నిషను ఆస్పత్రిలో అడ్మిట్ చేశానని తెలియగానే, మా అమ్మనాన్నలు, బంధువుల నుంచి ఫోన్లు మొదలయ్యాయి. కానీ, ఆస్పత్రిలో నర్సులు లోపల మాట్లాడద్దని గట్టిగా చెప్పారు. బయటికి వెళ్లి మాట్లాడదామంటే... అక్కడ తన దగ్గర కచ్చితంగా ఎవరో ఒకరు సాయం ఉండాలి. ఫోన్ ఆఫ్ చేసేద్దామా అంటే అందరూ కంగారు పడతారేమోనని భయం. దీంతో మూడు రోజులు లోపలకూ బయటకూ పరుగులు తీస్తూ గడిపాను” అన్నాడు వంశీ.

మాస్కులు ధరించిన ముగ్గురు వ్యక్తులు

నెల్లూరు జిల్లా టు హైదరాబాద్

ఆ క్షణం కోసం వంశీ, నిషల కుటుంబాలు ఎంతో ఎదురుచూశాయి. కానీ, ఇప్పుడు ఆ సమయం వచ్చాక అందరూ వారిని చేరుకోలేనంత దూరంగా ఉన్నారు.

వంశీ అమ్మనాన్నలు నెల్లూరు జిల్లాలోని నాయుడుపేటలో ఉంటారు. నిష తల్లిదండ్రులది ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌. లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తున్న సమయంలో వారు హైదరాబాద్ చేరుకోవడం అంటే ఓ సాహసమే.

ఆరోజు పరిస్థితి గురించి బీబీసీతో మాట్లాడిన వంశీ తల్లి కల్యాణి “మేమే మా బిడ్డ దగ్గరకు వెళ్లగలమా? అనిపించింది. వాళ్లిద్దరికీ ఏం తెలీదు. పుట్టే బిడ్డ జాగ్రత్తలు ఎలా చూసుకోగలరు? మనం కూడా వెళ్లలేకపోతే పరిస్థితి ఏంటి? కనీసం పక్కింటి వాళ్లనైనా పిలవమని చెబుదామా అంటే, ఈ కరోనా వల్ల ఎవరు ఒప్పుకుంటారు? అందుకే ఎలాగైనా మాకొక దారి చూపించమని దేవుళ్లందరినీ మొక్కుకున్నా” అని చెప్పారు.

ఆస్పత్రిలో వంశీకి కూడా దిక్కుతోచడం లేదు. డెలివరీ సమయానికి ముందే భార్యను ఆస్పత్రిలో చేర్చినా.. పెద్దవాళ్లు ఎవరూ దగ్గర లేకపోవడంతో ఆయనకు లోలోపల ఆందోళనగా ఉంది.

“పెళ్లైన తర్వాత లైఫ్ అప్పటివరకూ సరదాగా గడిచిపోయింది. ఆస్పత్రిలో మొదటిసారి భయం వేసింది. అలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. అసలు లేబర్ రూం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. నిషది కూడా నాలాంటి పరిస్థితే. చాలా భయపడిపోయి ఉంది. నేను కాసేపు కనిపించకపోయినా, కంగారు పడుతోంది. తండ్రిని కాబోతున్నాను అనే ఫీలింగ్‌ను అవన్నీ డామినేట్ చేసేశాయి. అక్కడ ఉండడానికి ఇంకెవరూ లేకపోవడంతో ఆమెకు అన్నీ నేనే అయ్యాను.”

"మూడు రోజులు సరిగా తిండి, నిద్ర కూడా లేదు. ఆస్పత్రి క్యాంటీన్‌లో తినడానికి ఏదైనా ఉందా అని అడిగితే, లేదు, లిమిటెడ్‌గా తెప్పిస్తాం, అయిపోయింది అని చెప్పారు. బయటికెళ్లి ఏదైనా తిందామా అంటే, లాక్‌డౌన్ కాబట్టి ఏదీ దొరకదు. నిద్రపోకుండా ఉంచడానికి కనీసం కాఫీ అయినా దొరికింది. నిషకు ఏదైనా అవసరం వస్తుందేమో అని నిద్ర వచ్చినప్పుడల్లా కప్పు కాఫీ తాగేసి తన పక్కనే కూచునేవాడిని” అని వంశీ వివరించారు.

ఆంధ్రప్రదేశ్ పోలీసు

ఫొటో సోర్స్, Getty Images

పోలీసుల సహకారం

నాయుడుపేటలో ఉన్న వంశీ అమ్మానాన్నల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. లాక్‌డౌన్ ఎత్తేయగానే ఆగమేఘాల మీద హైదరాబాద్ చేరుకుందామని సిద్ధమైన వాళ్లు, కేంద్రం దానిని పొడిగించడంతో కంగారు పడ్డారు. ఎలాగైనా హైదరాబాద్ చేరుకోడానికి అన్నిరకాల ప్రయత్నాలూ చేశారు.

“హైదరాబాద్ వెళ్లడానికి పాస్ కోసం దరఖాస్తు చేసుకోగానే, పోలీసులు ప్రొటోకాల్ ప్రకారం మా అడ్రస్ ప్రూఫ్‌లు అడిగారు. తర్వాత మా ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేశారు. జ్వరం లాంటివి ఏవైనా ఉన్నాయేమో చూశారు. మాకు ట్రావెల్ హిస్టరీ ఏదైనా ఉందా అని చుట్టుపక్కల అందరినీ అడిగారు. అన్ని వెరిఫికేషన్లు అయ్యాక, మీరు వెళ్లచ్చు అని చెప్పారు. అవసరమైతే మాకు ఫోన్ చేయండి అని నంబర్ కూడా ఇచ్చారు. పాస్ లేకపోయినా వాళ్ల భరోసాతో హైదరాబాద్ బయల్దేరాం” అని వంశీ వాళ్ల నాన్న వెంకటేశ్వర్లు చెప్పారు.

ఒక స్నేహితుడు కారు ఇచ్చి, వాళ్ల డ్రైవర్‌ను పంపించడంతో వెంకటేశ్వర్లు, భార్యతో కలిసి హైదరాబాద్ బయల్దేరారు. అడుగడుగునా ఆపుతున్న పోలీసులకు తమ పరిస్థితి చెబుతూ గుంటూరు జిల్లా రొంపిచెర్ల బైపాస్ వరకూ చేరుకున్నారు. కానీ అక్కడ పోలీసులు వారిని ముందుకు వెళ్లనీయలేదు. పాస్ లేకుంటే పంపించలేమని కచ్చితంగా చెప్పేయడంతో ఐదారు గంటలు రోడ్డు మీదే గడిపిన తర్వాత వెంకటేశ్వర్లు తిరిగి నాయుడుపేట బయల్దేరారు.

“రొంపిచెర్ల బైపాస్ దగ్గరకు రాగానే కారు ఆపేశారు. మేం నాయుడుపేట పోలీసులు వెరిఫికేషన్ చేసిన తర్వాతే బయల్దేరామని చెప్పాం. పాస్‌కు కూడా అప్లై చేశామని, ఏ క్షణంలో అయినా రావచ్చని మా దగ్గర ఉన్న రిపోర్టులు కూడా చూపించాం. కానీ, పాస్ లేకపోతే మందుకు పంపించడం సాధ్యం కాదని చెప్పారు. మాలాగే అక్కడి వరకూ చేరుకున్న చాలామంది తిరిగి వెనక్కు వెళ్లిపోతుండడంతో మేం కూడా తిరిగి ఇంటికి బయల్దేరాం” అని వెంకటేశ్వర్లు చెప్పారు.

పాస్‌ల జారీ ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుందని నెల్లూరు జిల్లా పోలీసు శాఖకు చెందిన అధికారి చెప్పారు.

“దేశంలో కరోనా తీవ్రంగా ఉంది కాబట్టి పాస్‌ల జారీ విషయంలో చిన్న పొరపాటు జరిగినా దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకే పూర్తిగా ధ్రువీకరించుకున్న తర్వాతే వాటిని ఇచ్చాం” అన్నారు.

నెల్లూరు జిల్లా పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రం
ఫొటో క్యాప్షన్, నెల్లూరు జిల్లా పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రం

కేటీఆర్‌కు ట్వీట్

ఇటు వంశీ కూడా హైదరాబాద్‌లో తన సమస్య గురించి చెప్పి ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌ను సాయం కోరారు. చివరికి కొందరు మీడియా ప్రతినిధుల సాయంతో వెంకటేశ్వర్లుకు నెల్లూరు ఎస్పీ కార్యాలయం నుంచి హైదరాబాద్ వెళ్లడానికి పర్మిషన్ వచ్చింది. దాని సాయంతో వెంకటేశ్వర్లు, ఆయన భార్య కల్యాణి మళ్లీ హైదరాబాద్ బయల్దేరారు.

హైదరాబాద్‌లో ఉన్న వంశీకి కూడా కేటీఆర్ కార్యాలయం నుంచి సందేశం వచ్చింది. ఏదైనా సమస్య వచ్చినా తమకు కాల్ చేయాలంటూ కేటీఆర్ ఆఫీసు నుంచి ఆయనకు ఒక ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. కానీ, తెలంగాణలో ఎలాంటి సమస్యా రాలేదు.

కేటీఆర్ ట్వీట్

“అమ్మనాన్న రెండోసారి బయల్దేరాక, నెల్లూరు జిల్లా పోలీసుల లెటర్ కూడా ఉండడంతో నాలో వాళ్లు ఈసారీ హైదరాబాద్ చేరుకుంటారనే ధైర్యం వచ్చింది. ఇంటి దగ్గర నుంచి బయల్దేరగానే నాన్న లైవ్ లొకేషన్ షేర్ చేశారు. దాంతో వాళ్లు ఎక్కడికి చేరుకున్నారో చెక్ చేస్తూ వచ్చాను. అప్పుడప్పుడూ మాట్లాడాను” అని వంశి చెప్పారు.

కుర్చీలో కూర్చున్న వ్యక్తి

ఆస్పత్రిలో జాగ్రత్తలు

కానీ, వంశీ మనసు పూర్తిగా కుదుటపడలేదు. వచ్చి రెండు రోజులు అవుతోంది. భార్యకు ఇంకా డెలివరీ కాలేదు. డాక్టర్లు ఇంకా ఎంత సమయం పడుతుందో చెప్పడం లేదు. ధైర్యం చెప్పడానికి ఎవరూ దగ్గర కూడా లేరు.

“మూడు రాత్రులు టెన్షన్‌గా గడిచాక ఏప్రిల్ 18న ఉదయం పాప పుట్టింది. చెప్పగానే ఆనందం. అందరికీ ఫోన్లు చేసి ఆ విషయం చెప్పాలని అనుకున్నా. వెంటనే పాపకు శ్వాస సరిగా లేదని ఎన్ఐసీయూలోకి తీసుకుని వెళ్లిపోయారు. ఆక్సిజన్ పెట్టి నాలుగు గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచాలి అన్నారు. అక్కడ అందరూ పిల్లలే ఉండడంతో కరోనా భయంతో మమ్మల్ని ఎవరినీ అనుమతించలేదు. నాలుగైదు గంటలు పాప లోపలే ఉండిపోయింది.”

"కరోనా నియంత్రణ కోసం తెలుగు రాష్ట్రాల్లో కఠిన చర్యలు పాటిస్తున్న సమయంలో అన్ని ఆస్పత్రులు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. అత్యవసర కేసులు తప్ప వేరే ఎవరినీ అనుమతించడం లేదు. కరోనా వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాయి. తను ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో కూడా కరోనాపై చాలా జాగ్రత్తలు తీసుకున్నారని వంశీ చెప్పారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

“మేం ఆస్పత్రిలోకి వెళ్లిన తర్వాత మా దగ్గర అంగీకర పత్రం మీద సంతకాలు చేయించుకున్నారు. డాక్టర్లు, నర్సుల ద్వారా మీకు కరోనా వస్తే మేము ఎలాంటి బాధ్యత వహించం అని అందులో ఉంది. కానీ, కరోనా జాగ్రత్తలు, పరిశుభ్రత విషయంలో ఆస్పత్రిలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మాస్క్ లేకుండా ఎవరూ మా దగ్గరకు వచ్చేవాళ్లు కాదు. మేం కూడా మాస్క్ వేసుకునే ఉండాలి. నిషకు కూడా మాస్క్ వేశారు. కానీ డెలివరీ సమయంలో శ్వాస బాగా తీసుకోవాలి. మాస్క్ ఉండడం వల్ల తను చాలా ఇబ్బంది పడింది” అని ఆయన వివరించారు.

శిశువును ఎత్తుకున్న వ్యక్తి

వంశీ అమ్మనాన్నలు కూడా క్షేమంగా హైదరాబాద్‌లోని ఇంటికి చేరుకున్నారు. మనవరాలిని ఎప్పుడెప్పుడు ఎత్తుకుందామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ, వారు ఆస్పత్రికి వెళ్లే అవకాశం లేదు.

టెక్నాలజీకి థాంక్స్ చెప్పుకోవాలి. వీడియో కాల్ ద్వారా వంశీ పాపను అందరూ చూసేశారు. పాపకు బోలెడన్ని ముద్దులు అందించారు. తర్వాత వంశీ దంపతులు తమ పాపతో ఇంటికి చేరుకున్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)