కరోనావైరస్: ఆ తల్లిదండ్రులకు 13 మంది పిల్లలు - ఆ కుటుంబం లాక్‌డౌన్‌లో ఎలా ఉంది?

హాన్స్ కుటుంబం

ఫొటో సోర్స్, LESLEY MARTIN

ఫొటో క్యాప్షన్, హాన్స్ కుటుంబం
    • రచయిత, మేరీ మెక్‌కూల్
    • హోదా, బీబీసీ స్కాట్లండ్ న్యూస్

దేశంలో లాక్‌డౌన్ చర్యలను ప్రకటించారు. అందరూ ఇంట్లోనే ఉండాలి. రాయ్, ఎమ్మా హాన్‌లు తమ ఇంట్లో పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండేందుకు భీకర ప్రయత్నాలు చేశారు.

డండీకి చెందిన హాన్స్ కుటుంబం స్కాట్లండ్‌లోనే అతి పెద్ద కుటుంబాల్లో ఒకటి. వారికి 13 మంది పిల్లలు. పది మంది ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులతో రెండు బాస్కెట్ బాల్ టీమ్‌లు తయారు చేయొచ్చు.

పిల్లలకు టైమ్ టేబుల్ వేసి దానిని కచ్చితంగా పాటించాలని చెప్పారు. అతికష్టం మీద నాలుగు రోజులు పరిస్థితులు మామూలుగానే ఉన్నాయి.

ఆ తర్వాత క్రమశిక్షణ కిటికీలో నుంచి పారిపోయింది.

సహనం నసించింది. గొడవలు మొదలయ్యాయి. అశాంతి కొత్త సాధారణ విషయంగా మారిపోయింది.

దానిని ఎదుర్కోవటానికి ఈ కుటుంబం విశ్వప్రయత్నాలు చేసింది.

ఈ ఉద్రిక్తతలన్నీ గురువారం గాలికి ఎగిరిపోయాయి. కారణం.. రాయ్‌కి కోవిడ్-19 పాజిటివ్ అని తెలియటమే.

‘‘కొన్ని రోజులైంది. వ్యాధి చాలా స్వల్పంగానే ఉంది. పరీక్షలో నాకు పాజిటివ్ వచ్చినపుడు చాలా ఆశ్చర్యపోయాను’’ అని చెప్పారు రాయ్.

రాయ్ హాన్

ఫొటో సోర్స్, ROY HANN

‘‘నేను చాలా మంది కోవిడ్ రోగుల సమీపంలో ఉన్నాను. కానీ రక్షణ పరికరాలు ధరించేవాడిని. టేసైడ్‌లో పరీక్షలు నిర్వహించేటపుడు మేం ఎంత క్రియాశీలంగా ఉండేవాళ్లమంటే.. ఇప్పుడు మమ్మల్ని కూడా హాట్‌స్పాట్‌ జాబితాలో చేర్చారు’’ అని ఆయన వివరించారు.

‘‘అయితే మాకు సూపర్‌మార్కెట్‌లో ఈ వ్యాధి సోకుతుందని మేం జోక్ చేసుకునేవాళ్లం. ఉద్యోగానికి వెళ్లకుండా ఉండటం ఏం బాగోలేదు’’ అన్నారాయన.

‘మాకు మూక రోగనిరోధక శక్తి వస్తుందని మేం జోక్ చేసుకునే వాళ్లం’

హాన్ ఇంట్లోని వాళ్లందరూ ఇప్పుడు 14 రోజుల క్వారంటైన్‌లో ఉన్నారు. రాయ్ ఏడు రోజుల పాటు ఏకాంతంలో ఉంటారు.

ఈ 50 ఏళ్ల తండ్రికి టైప్-2 డయాబెటిస్ ఉంది. మామూలుగా తాను చాలా ఆరోగ్యంగా ఉంటానని ఆయన చెప్తున్నారు. పూర్తిగా ఆరోగ్యం సంతరించుకుని త్వరలోనే మహమ్మారి మీద పోరాటానికి మళ్లీ ముందు వరుసలోకి వెళతానని ధీమాగా ఉన్నారు.

‘‘నా జీవితమేమీ మారిపోలేదు. నా పిల్లల్ని మరింత ఎక్కువగా చూసుకునే సమయం దొరికింది.. అంతే. నాకు ఈ వ్యాధి రావటం ఒక రకంగా సంతోషంగానే ఉంది. ఇప్పుడు మరింత ధీమాగా విధుల్లోకి వెళ్లొచ్చు’’ అని రాయ్ పేర్కొన్నారు.

‘‘మా ఇంట్లో ఎంత మంది ఉన్నారంటే.. మాకు మూక రోగనిరోధకశక్తి వస్తుందని మేం జోక్ చేసుకునే వాళ్లం’’ అని నవ్వుతూ చెప్పారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

రాయ్ ఇప్పుడు పూర్తి సమయం ఇంట్లోనే ఉండటంతో.. కుటుంబాన్ని పర్యవేక్షించటం - కేఫ్ నడిపే ఎమ్మాకు మరింత సులభమవుతోంది. కానీ అందులో సవాళ్లూ ఉన్నాయి.

హాన్ పిల్లల వయసు ఐదేళ్ల నుంచి 28 ఏళ్ల వరకూ ఉంటుంది. ఒక సమయంలో ఈ కుటుంబం వారానికి 25 లీటర్ల పాలు, ఐదు పెద్ద పెట్టెల సెరియల్, 21 బ్రెడ్ ప్యాకెట్లు ఖర్చయ్యేవి.

ఇప్పుడు సూపర్ మార్కెట్లలో సోషల్ డిస్టాన్సింగ్, ఉత్పత్తుల మీద పరిమితుల కారణంగా ఆహారం కొనటం చాలా కష్టంగా మారింది.

‘‘మాది చాలా పెద్ద కుటుంబం. కాబట్టి సామాజిక దూరం మార్గదర్శకాలను పాటించటం పెద్ద సమస్య’’ అంటారు ఎమ్మా.

‘‘షాపుకు వెళ్లి ఏ వస్తువునైనా మూడు మాత్రమే కొనుక్కోవటం అంటే.. మేం చాలా ఎక్కువ సార్లు వెళ్లాల్సి ఉంటుంది. దానివల్ల మేం మరింత ఎక్కువగా ప్రమాదంలో పడతాం. ఇది చాలా విపత్కర పరిస్థితి’’ అని తెలిపారు.

పనులు ఆగిపోవటంతో.. తన పిల్లల సంరక్షణ మీదే ఎమ్మా పూర్తిగా దృష్టి పెట్టారు.అమ్మగా 28 ఏళ్ల ఆమె అనుభవం ఇప్పుడు చాలా ఉపయోగపడింది. కానీ లాక్‌డౌన్ జీవితపు ఒత్తిళ్లు అప్పుడప్పుడూ తీవ్రంగానే ఉన్నాయి.

లాక్ డౌన్ లైఫ్

ఫొటో సోర్స్, EMMA HANN

‘‘రాయ్‌కి పాజిటివ్ అని తెలియటానికి ముందు నేను నడవటానికి వెళ్లాను. గోడను కొడుతూ ఏడవటం మొదలుపెట్టాను. ఇక నా వల్ల కాదనుకున్నాను. చాలా కష్టంగా ఉంది. అన్నీ వదిలేయాలనిపించింది’’ అని చెప్పారామె.

‘‘విచిత్రంగా తర్వాతి రోజు పొద్దున్నే నేను రాయ్ గురించి కుటుంబానికి చెప్పినప్పుడు.. అందరూ కాస్త కుంగిపోయారు. గత రెండు రోజులుగా అందరూ కొంచెం కొంచెం స్థిమితపడుతున్నారు’’ అని వివరించారు.

కుటుంబంలో మళ్లీ ఐకమత్యం వికసించింది. అందరూ రాత్రిపూట తమ గార్డెన్‌లో బాస్కెట్ బాల్ ఆడుకుంటున్నారు.

ఇది చిన్న ఆనందమే. కానీ చాలా మార్పు తీసుకొచ్చింది.

రాయ్ ఇంట్లో ఆహారం

ఫొటో సోర్స్, EMMA HANN

ఫొటో క్యాప్షన్, రాయ్ ఇంట్లో ఆహారం

‘‘మేం చాలా అదృష్టవంతులం. మాకు ఒక తోట ఉందన్న విషయం తెలుసు. ఒకప్పుడు ఐదుగురు పిల్లలతో ఒక ఫ్లాట్‌లో ఉన్న పరిస్థితి. ఇప్పుడు అలా చేయాలన్న ఆలోచనే భయం పుట్టిస్తుంది’’ అని ఎమ్మా పేర్కొన్నారు.

‘‘నా 14 ఏళ్ల కొడుకు రాత్రిళ్లు ఎక్కువ సేపు ఎక్స్-బాక్స్‌తో గడుపుతాడు. నా కూతురు పొద్దున ఆరు గంటలకు లేచి ఇంటి నుంచే పని చేస్తుంది. ఒక్కొక్కళ్లకి ఒక్కోసారి తిండి పెట్టాలంటే మొదట నచ్చేది కాదు.. కానీ నిజానికి అలా చేయటం సులభం’’ అన్నారు.

‘‘పట్టువిడుపులు ఉండటం ఉత్తమం. మనం చేయగలిగింది చేయాలి.. అంతే’’ అని చెప్పారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)