కరోనావైరస్: అమెరికాలో ఉపాధి కోల్పోయిన వారి కష్టాలు, కన్నీళ్ళు

జూకీపర్ కెరియన్ బల్లన్కో, బార్ యజమాని డానియేల్ విక్టరీ, సెలూన్ యజమాని డయానా చెన్, బుక్ సెల్లర్ టోనీ మానో

ఫొటో సోర్స్, Crista Rock and supplied

ఫొటో క్యాప్షన్, జూకీపర్ కెరియాన్ బల్లాంకో, బార్ యజమాని డేనియల్ విక్టరీ, సెలూన్ యజమాని డయానా చెన్, బుక్ సెల్లర్ టోనీ మానో
    • రచయిత, హెలియర్ చూంగ్
    • హోదా, బీబీసీ న్యూస్, వాషింగ్టన్ డీసీ

గత ఐదు వారాల్లో2.6 కోట్ల మందికి పైగా అమెరికన్లు నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అంటే, ఆ దేశంలోని మొత్తం శ్రామిక శక్తిలో 15 శాతానికి పైగా ఇప్పుడు ఉపాధి కోల్పోయారు.

చిరు వ్యాపారాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. చిన్ని చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి రుణాలు ఇచ్చేందుకు కేటాయించిన 349 బిలియన్ డాలర్ల నిధి రెండు వారాల్లోనే ఖాళీ అయిపోయింది.

అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. ఉపాధి లేక అనేక మంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారిలో ఎవరిని కదిలించినా ఆందోళన, భయం, కొంత ఆశ కనిపిస్తున్నాయి.

అనూహ్యంగా పంజా విసిరిన కరోనావైరస్ మహమ్మారి వల్ల ప్రభావితమైన కొంతమంది అమెరికన్ల గాథలు చూద్దాం.

కెరియాన్ బల్లాంకో

ఫొటో సోర్స్, Keriann Ballanco

కెరియాన్ బల్లాంకో, 30, జూ సంరక్షకురాలు, చికాగో, ఇల్లినాయిస్

నేను బ్రూక్‌ఫీల్డ్‌ జూలో ప్రైవేటు ఉద్యోగిని. ఈ రంగంలో ఉద్యోగాలకు పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. జూ కీపర్ ఉద్యోగానికి అర్హత సాధించాలంటే, నాలుగేళ్ల సైన్స్ డిగ్రీ పూర్తి చేయాలి. అంతేకాదు, కనీసం మూడేళ్ల పాటు వేతనం లేకుండా ఇంటర్న్‌షిప్ చేయాలి. ఆ తర్వాతే వేతనంతో కూడిన ఉద్యోగం వస్తుంది.

నన్ను ఉద్యోగం నుంచి తొలగించడం ఇదే మొదటిసారి. ఊహించని ఈ పరిణామంతో ఒక్కసారిగా షాకయ్యాను.

సాధారణంగా ఇది చాలా సురక్షితమైన ఉద్యోగమని అంటారు. ఈ ఉద్యోగం సాధిస్తే హాయిగా ఉండొచ్చనే భావన ఉండేది.

రోజూ జంతువుల ఆలనా పాలనా చూసుకోవడం తప్పనిసరి కాబట్టి సంరక్షకులు చాలా అవసరమని మా సూపర్‌వైజర్లు చెప్పేవారు.

కానీ, ఉద్యోగుల్లో అందరికంటే చిన్నదాన్ని అని నన్ను ఇంటికి పంపించారు.

నాకంటే రెండు వారాల మందే నా భర్త కూడా ఉద్యోగం కోల్పోయారు. ఆయన ఓ రెస్టారెంట్‌లో పనిచేసేవారు.

ఈ ఊహించని పరిణామంతో మేము తీవ్ర ఒత్తిడికి లోనయ్యాం. అయితే, అదృష్టం కొద్ది మాకు ఉద్దీపన ప్యాకేజీకి సంబంధించిన చెక్కులు వచ్చాయి. దాంతో మాకు కాస్త ఉపశమనం దొరికినట్లు అయ్యింది.

ఇప్పుడు ఏ బిల్లులు చెల్లించగలను? వేటిని వాయిదా వేయాలి? నా చదువు కోసం తీసుకున్న రుణం చెల్లించాలా? అన్నది నేను నిర్ణయించుకోవాల్సి ఉంది.

ఇక నేను మళ్లీ జూకు వెళ్లనేమో అని, ఆ పోస్టును శాశ్వతంగా రద్దు చేస్తారేమోనని ఆందోళనగా ఉంది.

స్టాన్లీ చెన్

ఫొటో సోర్స్, Stanley Chen

స్టాన్లీ చెన్, ఆటోమోటివ్ టెక్నీషియన్, 59, హ్యూస్టన్, టెక్సాస్

నేను 11 ఏళ్లుగా ఓ కార్ల షోరూంలో పనిచేశాను. కార్ల నిర్వహణ, మరమ్మతులు, విడి భాగాలను మార్చడం వంటివి చేసేవాడిని. కానీ, ఈ ఏప్రిల్‌లో నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు.

నా భార్య ఓ క్షౌరశాల నడుపుతుండేది. ఇప్పుడు అది కూడా మూతపడింది.

నాకు ఉద్యోగం లేకపోవడం నా అమెరికా జీవితంలో ఇదే మొదటిసారి.

30 ఏళ్లుగా టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాను. నిరుద్యోగిగా పేరు నమోదు చేసుకుంటానని నేను ఎన్నడూ ఊహించలేదు.

దేశంలో లక్షల మంది ఉపాధి కోల్పోయారు. అందరూ నిరుద్యోగ ప్రయోజనాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్నారు. దాంతో, వెబ్‌సైట్ కొన్ని రోజులు మొరాయించింది. మా వివరాలు నమోదు చేయడానికి చాలా రోజులే పట్టింది. ఆఖరికి ఇటీవలే మాకు మొదటి విడత డబ్బులు అందాయి.

మా దగ్గర ప్రస్తుతం సరిపడా డబ్బులు లేవు. గతంలో మాకు రెండో సెలూన్ కూడా ఉండేది. కానీ, పెను తుపాను (హారికేన్) ధాటికి అది ధ్వంసమైంది. అప్పుడు చాలా నష్టపోయాం.

ఇప్పుడు ఇంటి పనుల్లో నా భార్యకు సాయపడుతున్నాను. స్థానిక ఆస్పత్రికి విరాళంగా ఇచ్చేందుకు కాటన్ మాస్కులను తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.

నాకు, నా భార్యకు ఇద్దరికి ఆస్తమా ఉంది. కాబట్టి, నెమ్మదిగా మాస్కులు తయారు చేస్తున్నాం.

డయానా చెన్

ఫొటో సోర్స్, Diana Chen

డయానా చెన్ (స్టాన్లీ భార్య), క్షౌరశాల యజమాని, 57, హ్యూస్టన్, టెక్సాస్

25 ఏళ్లుగా క్షౌరశాలను నడుపుతున్నాను. సెలూన్ మూసివేయాల్సిన విపత్కర పరిస్థితి ఎన్నడూ రాలేదు.

సెలూన్‌ను మూసివేయడానికి ముందు వారంలో వ్యాపారం బాగా పడిపోయింది. అంతకుముందు సాధారణంగా రోజూ 30 నుంచి 50 మంది కస్టమర్లు వచ్చేవారు. కానీ, కరోనావైరస్ భయం వల్ల రోజుకు ఐదారుగురు మాత్రమే వచ్చేవారు.

ఇప్పుడు సెలూన్‌ను పూర్తిగా మూసివేయాల్సి వచ్చింది.

ఈ క్లిష్ట పరిస్థితులను చూస్తుంటే చాలా భయమేస్తోంది. రిటైల్ వ్యాపారాలు తొందరగా తెరుచుకోవాలని మేము ఆశిస్తున్నాం.

అయితే, సెలూన్లలో సామాజిక దూరం పాటించడం సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే, కస్టమర్లను ఆరు అడుగుల దూరంలో ఉంచలేం.

రాచెల్ స్టెర్నర్

ఫొటో సోర్స్, Rachel Sterner

రాచెల్ స్టెర్నర్, 35, స్టేజ్ మేనేజర్, ‘హ్యారీ పోటర్ అండ్ అది కర్స్డ్ చైల్డ్’ న్యూయార్క్‌

ఎంతో ఇష్టంతో పనిచేశాను. అన్ని ప్రదర్శనలనూ 30 రోజుల పాటు మూసివేస్తున్నట్లు మార్చి 12న మాకు చెప్పారు. దాంతో, నాకు ఒక్కసారిగా అయోమయంగా అనిపించింది.

ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ ఫోటోషాప్ నేర్చుకుంటూ, ఆన్‌లైన్‌లో పని చేస్తున్నాను.

థియేటర్‌లో పనిచేసే ఉద్యోగులను తొలగించడం సరి కాదు. సాధారణంగా, ఇతర రంగాలలో ఉద్యోగం పోతే మరో చోట ఉద్యోగం కోసం ప్రయత్నించొచ్చు. కానీ, ఈ రంగం భిన్నమైనది. ఇందులో ఎక్కువ కాలం పని ఉండదు. ఒకవేళ సగం మంది సిబ్బందితో ప్రదర్శనలు ఇచ్చినా, సందర్శకులు రావాలంటే ఎంతకాలం పడుతుందో చెప్పలేం. పైగా థియేటర్లకు వచ్చి ప్రదర్శనలు వీక్షించేందుకు ప్రజల చేతుల్లో డబ్బులు ఉండాలి కదా.

ఒక విధంగా నేను అదృష్టవంతురాలిని. ఎందుకంటే, మా షో చాలా పెద్దది. కానీ, చాలా థియేటర్లు ఈ పరిస్థితులను తట్టుకొని నిలబడగలవని నేను అనుకోవడం లేదు. అది చాలా బాధాకరం.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

డేనియల్ విక్టరీ, 42, బార్ యజమాని, న్యూ ఓర్లీన్స్, లూసియానా

కరోనావైరస్ మహమ్మారి నన్ను తీవ్రంగా దెబ్బ కొట్టింది.

కాక్‌టెయిల్స్ తయారు చేసి, ప్యాక్ చేసి విక్రయించవచ్చని మేము అనుకున్నాం. కానీ, అలా చేయడానికి వీల్లేదని ప్రభుత్వం చెప్పింది.

ప్రస్తుతం, వారం వారం ఆన్‌లైన్‌లో కాక్‌టెయిల్ పాఠాలు చెబుతున్నాను. కొన్ని వందల డాలర్లు వచ్చాయి. ఆ డబ్బులు బతకడానికి సరిపోవు. కానీ, ఎంతో కొంత ఆసరాగా పనికొస్తున్నాయి.

డేనియల్ విక్టరీ

ఫొటో సోర్స్, Camille Whitworth

ఈ సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కుతామో నాకు అర్థం కావడంలేదు.

ఇక్కడ మాకు ప్రధానంగా ఆదాయం వచ్చేది పర్యటకుల వల్లే. కానీ, భవిష్యత్తు ఎలా ఉంటుందోనని భయంగా ఉంది.

నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాబట్టి కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టమే.

నెలన్నరగా నాకు ఆదాయం లేదు. నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేశాను. కానీ, ఇప్పటికీ నా ఖాతాలో డబ్బులు పడలేదు. కారణమేంటో నాకు తెలియదు. ఆ డబ్బులొస్తే పిల్లలకు వస్తువులు, కారుకు గ్యాస్, ఇంటి అద్దెకు పనికొస్తాయి.

బైరాన్ గోమెజ్

ఫొటో సోర్స్, Byron Gomez

ఫొటో క్యాప్షన్, భార్య, కొడుకుతో బైరాన్ గోమెజ్

బైరాన్ గోమెజ్, 30, కాఫీ షాప్ మేనేజర్, న్యూ ఓర్లీన్స్, లూసియానా

ఏప్రిల్‌లో చాలా పండుగలు ఉంటాయి కాబట్టి, ఏటా మా దుకాణం అత్యంత రద్దీగా ఉండేది ఈ నెలలోనే.

కాఫీ వ్యాపారంలో లాభాలు అద్భుతంగా ఏమీ ఉండవు. ఈ ఏడాది రద్దీ సీజన్‌లోనే దుకాణం మూసివేయాల్సి రావడం మాకు ఆందోళన కలిగిస్తోంది.

నిరుద్యోగ ప్రయోజనాల కోసం నేను, నా భార్య దరఖాస్తు చేశాం. కానీ, మాకు ఇంకా ప్రభుత్వం నుంచి చెక్కు రాలేదు.

మేము పొదుపు చేసుకున్న 300 డాలర్లు ఉన్నాయి. కానీ, ఇప్పుడు వాటిని ముట్టుకుంటే, చూస్తుండగానే ఖర్చయిపోతాయి.

జాన్ డిగ్నన్

ఫొటో సోర్స్, John Dignan

జాన్ డిగ్నన్, 52, రియల్ ఎస్టేట్ ఏజెంట్, లాస్ వెగాస్, నెవాడా

ఇంతకుముందు ఒక నిర్మాణ సంస్థలో పనిచేసేవాడిని. కానీ, సొంతంగా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచనతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాను.

ఆరు నెలల సేవింగ్స్‌ను పక్కన పెట్టాను. సొంత వ్యాపారం నిలదొక్కుకోవాలంటే కొంత సమయం పడుతుంది. కానీ, అదే సమయంలో ఈ మహమ్మారి సంక్షోభం వచ్చి కోలుకోలేని దెబ్బ కొట్టింది.

ప్రస్తుతం ఎవరూ ఇల్లు కొనేందుకు ఆసక్తి చూపడంలేదు.

నేను గతంలో పనిచేసిన సంస్థలో ఇద్దరు ఉద్యోగులను తొలగించారు. వాళ్లు ఇప్పుడు దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు.

నా వ్యాపారానికి నిధుల కోసం కొందరు పెట్టుబడిదారులను సంప్రదించాను. కానీ, ఈ సంక్షోభం ముగిసే దాకా వేచి చూద్దామని వారు అంటున్నారు.

సాధారణంగా, నిరుద్యోగ ప్రయోజనాలు పొందేందుకు నేను అర్హుడిని కాదు. కానీ, ప్రభుత్వం కేర్స్ చట్టాన్ని ఆమోదించింది. దాని కింద స్వయం ఉపాధి మీద ఆధారపడిన వారికి కూడా ప్రభుత్వ సాయం అందుతుంది. దానికి దరఖాస్తు చేశాను. ఇంకా డబ్బులు రాలేదు.

డేవ్ గియాకోమిన్

ఫొటో సోర్స్, Corey Hilz

డేవ్ గియాకోమిన్, 48, యోగా స్టూడియో యజమాని, మేరీల్యాండ్

మా ఆదాయంలో 5 శాతం దాకా జూమ్ బిజినెస్ ద్వారా వస్తుంది. అది తప్పితే మిగతా వ్యాపారం పూర్తిగా ఆగిపోయింది.

మేము ఈ స్టూడియో ప్రారంభించి మూడేళ్లు అవుతోంది. ఇప్పటి వరకు ఏనాడూ అద్దె చెల్లింపును వాయిదా వేయలేదు.

ఎన్నో కలలు కన్నాం. కానీ, మా శ్రమంతా కనుమరుగైపోయింది. మేము పొదుపు చేసుకున్న డబ్బుల మీద ఇప్పుడు ఆధారపడాల్సి వస్తోంది.

ఆన్‌లైన్‌లో యోగా తరగతులు నిర్వహిస్తున్నాం. కానీ, మా ట్రైనర్లలో కొంతమందికి సరైన కెమెరాలు లేవు. వారి కోసం హెచ్‌డీ కెమెరాలు కొనేందుకు ప్రయత్నిస్తున్నాను.

స్టూడియోను తిరిగి తెరిచిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చేందుకు యోగా విద్యార్థులు భయపడతారేమో అనిపిస్తోంది.

అందరూ ఆరు అడుగుల సామాజిక దూరం పాటించాలి. కాబట్టి, ఎక్కువ మందికి శిక్షణ ఇవ్వడం కుదరదు. ఫలితంగా మా ఆదాయం భారీగా తగ్గిపోతుంది.

టోనీ మన్నో

ఫొటో సోర్స్, Graham R. Shutt

టోనీ మన్నో, 27, పుస్తక విక్రేత, సియాటెల్, వాషింగ్టన్

మా దుకాణం యజమాని మమ్మల్ని తాత్కాలికంగా ఇంటికి పంపించారు. అందరూ ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశించడంతో, దానిని మళ్లీ పొడిగించారు.

ఈ సంక్షోభం సమయంలో 12 అదనపు సిక్ లీవులు, వారం రోజుల వేతనం ఇచ్చేలా మాకు, మా యజమానికి మధ్య ఒక ఒప్పందం కుదిరింది.

మమ్మల్ని ఎప్పుడు తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటారోనని ఎదురు చూస్తున్నాం. ప్రస్తుతానికి మాకు మేము జాగ్రత్తగా ఉంటున్నాం.

ఇప్పుడు కూడా ఎవరికైనా పుస్తకాలు కావాలంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చి మా దుకాణం నుంచి తెప్పించుకోవచ్చు.

అలన్ సిమన్స్

ఫొటో సోర్స్, Saraphia Studio

అలన్ సిమన్స్, 47, ఫ్యాషన్ డిజైన్ డైరెక్టర్, న్యూయార్క్

ఉద్యోగులతో ఇళ్ల నుంచి పని చేయించేందుకు మా సంస్థ ప్రయత్నించింది. కానీ, మా పని వస్త్రాలపై ఆధారపడి ఉంటుంది. దుకాణాల నుంచి వస్త్రాలను తెప్పించుకొని డిజైన్ చేయాల్సి ఉంటుంది.

ఎలాగొలా ఓ వారం రోజుల పాటు ఇళ్ల నుంచి పని చేశాం. కానీ, ఆ తర్వాత అన్ని దుకాణాలూ మా ఆర్డర్‌లను క్యాన్సిల్ చేయడం మొదలుపెట్టాయి. దాంతో, వర్క్ ఫ్రం హోమ్ మాకు సాధ్యం కావడంలేదు.

నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేయడం నాకు సులువే. ఎందుకంటే, 2008 సంక్షోభం సమయంలోనూ దరఖాస్తు చేసుకుని, నిరుద్యోగ ప్రయోజనాలు పొందాను. అయితే, అలా వచ్చే డబ్బులో చాలావరకు నాకు, నా భార్యకు బీమా ప్రీమియం చెల్లిపుంలకే పోతాయి.

మొదటిసారి ఉపాధి కోల్పోయిన వారు మరీ ఎక్కువ భయపడతారు. కాబట్టి, ఈ ఉద్యోగం పోతే మరో ఉద్యోగం వస్తుందిలే అన్న సానుకూల భావనతో ఉండటం చాలా ముఖ్యం.

లేదంటే, సొంతంగా ఏదైనా పని మొదలుపెట్టాలి. నేను, నా భార్య కలిసి చిన్నచిన్న సౌందర్య సాధనాల తయారీ వ్యాపారం ప్రారంభించాం.

ఇక నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ ఒక్కటే కాకుండా, ఇతర ఉద్యోగాల కోసం కూడా వెతుక్కుంటాను. ఎందుకంటే, ఈ రంగంలో మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదా.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)