ఇనుప కొక్కేలను వీపులో గుచ్చుకుని వేలాడే హింసాత్మక గజన్ పండుగ....

నోట్లో గుచ్చిన ఇనుప చువ్వల్ని పట్టుకున్న సందోస్
ఫొటో క్యాప్షన్, నోట్లో గుచ్చిన ఇనుప చువ్వల్ని పట్టుకున్న సందోస్
    • రచయిత, సహర్ జంద్
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్ రేడియో

హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని ఫొటోలు కొందరు పాఠకులను కలతకు గురిచేయవచ్చు

పశ్చిమ బెంగాల్‌లో పంట కోతలకు ముందు చేసుకునే పురాతన పండుగ ఇది. ఇందులో పురుషులు తమ శరీరాలకు ఇనుప చువ్వలు, కొక్కేలను గుచ్చుకుంటారు. కరోనావైరస్ కారణంగా ఈ ఏడాది ఈ పండుగను రద్దు చేశారు.

అయితే.. హిందూ దేవుడైన శివుడికి తమ భక్తిని ఈ పండుగ ద్వారా తెలియజేయనిదే.. తమ పంట బాగా రాదని స్థానికులు చాలా మంది భావిస్తున్నట్లు గత ఏడాది ఏప్రిల్‌లో ఈ పండుగకు హాజరైన సహర్ జాంద్ చెప్తున్నారు.

సరిగ్గా ఏడాది కిందట ఏప్రిల్ నెలలో ఒక రోజు ఉదయం. గంగా నది ఒడ్డున కొందరు యువకులు ఓ చెట్టు నీడలో వలయంలా కూర్చున్నారు. ఎర్రటి దుస్తులు ధరించారు. ఆ రోజు సంప్రదాయ క్రతువు కోసం ఇనుప చువ్వలకు పదునుపెడుతున్నారు. వాటిని బర్సీలు అంటారు. ఒక్కోటి రెండు అడుగుల పొడవుంది. ఆ చువ్వ ఎంత పదునుగా ఉంటే దానివల్ల అంత తక్కువ గాయం అవుతుంది.

ఈ బృందంలో పెద్దవాడు 26 ఏళ్ల సందోస్. ఇంతకుముందు శరీరాన్ని హింసించుకునే ఈ ఆచారాల్లో పాల్గొన్న అనుభవం ఉన్న వ్యక్తి అతడొక్కడే. గతంలో పండుగలప్పుడు పెదవులు, చెవులు, చేతులు, ఛాతీ, పొట్ట, వీపు.. అన్నిటికీ మోకులు గుచ్చుకున్నానని అతడు నాతో చెప్పాడు.

‘‘అవును. నొప్పిగా ఉంటుంది. కానీ ఆ బాధ తాత్కాలికమే. దాని ఫలితం శాశ్వతంగా ఉంటుంది. మనకు కావలసింది పొందాలంటే మనమంతా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నాడు.

తన మిత్రులతో సందోస్ (ఎడమ)
ఫొటో క్యాప్షన్, తన మిత్రులతో సందోస్ (ఎడమ)

వాళ్లు కోరుకుంటున్నది మంచి పంట కావాలని. పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణదేవపూర్ గ్రామంలో.. పంట కోతకు ముందు జరిగే పండుగ గజన్. బెంగాలీ కేలండర్ ముగిసే సమయంలో ఈ పండుగ చేసుకుంటారు. సంవత్సరంలో అతి పెద్ద పండుగ ఇదే.

‘‘మేం ఆచారాలు మొదలుపెట్టగానే శివుడు మమ్మల్ని ఆవహిస్తాడు. అతడి మానవాతీత బలం, ధైర్యం మాకు వస్తాయి’’ అని సందోస్ చెప్తున్నారు.

ఈ మాటలు రాహుల్ శ్రద్ధగా వింటున్నాడు. తనకు పదేళ్ల వయసు నుంచీ ఈ ఆచారాల్లో పాల్గొనటానికి అనుమతించాలని తన తల్లిదండ్రులను కోరుతున్నట్లు అతడు చెప్పాడు. ఇప్పుడు రాహుల్ వయసు పదిహేనేళ్లు. వరుసగా పంట దిగుబడి తక్కువగా ఉండటంతో అతడి తల్లిదండ్రులు ఈసారి అయిష్టంగానే ఒప్పుకున్నారు.

‘‘శివుడు సంతోషంగా లేడు. అందుకే మేమంతా కష్టాలపాలయ్యాం. మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నాడు’’ అని రాహుల్ చెప్తుంటే.. ఆ బృందంలోని మిగతావాళ్లు అవునన్నట్లుగా తల ఊపారు.

‘‘ఆయన క్రోధం నుంచి మమ్మల్ని, మా కుటుంబాలను కాపాడుకోవటానికి అతడి మీద మా భక్తిని నిరూపించుకోవటం ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం’’ అన్నాడు.

ఇనుప చువ్వలకు పదును పెట్టిన తర్వాత.. ఈ యువకులు పవిత్రమైన నదిలో దిగి తమ శరీరాలను, ఆత్మలను పరిశుభ్రం చేసుకుంటారు.

ఇనుప చువ్వలు

ఆరేళ్లుగా ఈ గజన్‌లో పాల్గొంటున్న 22 ఏళ్ల అజోయ్ ఈసారి పాల్గోవటం లేదు. అతడిలో సందేహాలు పెరిగాయి. ‘‘నాకు ఫలితాలేమీ కనిపించటం లేదు. అలాంటపుడు నన్ను నేను ఎందుకు హింసించుకోవాలి?’’ అని ప్రశ్నిస్తున్నాడు.

అతడు తమ కుటుంబ పొలం దగ్గరికి నన్ను తీసుకెళ్లాడు. పొలం నిండా కుళ్లిపోయిన కూరగాయల వరుసలు, వాటి చుట్టూ ఖాళీ మామిడి చెట్లు, పురుగులు పట్టిన పండ్లు కనిపించాయి.

‘‘కొన్నిసార్లు వర్షాలు పడాల్సినపుడు అసలు వర్షమే ఉండదు. కరవుతో మా పంటలు ఎండిపోతాయి. ఇంకొన్నిసార్లు అకాలంగా భారీ వర్షాలు వచ్చి మా పొలాలను ముంచేస్తాయి. పంట పాడైపోతుంది’’ అని చెప్పాడు. వడగాడ్పులు కూడా మరింతగా ముదురుతున్నాయి.

సమస్య వాతావరణ మార్పు అని, శివుడి ఆగ్రహం కాదని అతడు పేర్కొన్నాడు. కోల్‌కతాలోని ఒక కాలేజీలో బెంగాలీ సాహిత్యం అభ్యసిస్తున్నాడు అజోయ్. చదువు పూర్తయిన తర్వాత ఇంకెక్కడైనా ఉద్యోగం చూసుకుంటానని చెప్పాడు.

అజోయ్
ఫొటో క్యాప్షన్, అజోయ్

పండగ మొదలుకాబోతుందనగా.. ఒక ఫుట్‌బాల్ మైదానం అంత విస్తీర్ణంలోని ప్రాంతంలో వందలాది మంది జనం పోగయ్యారు. మహిళలు రంగు రంగుల చీరలు కట్టుకున్నారు. పిల్లలు సంతోషంతో పరుగులు తీస్తున్నారు. చిన్నపాటి మంటలు, స్థానిక చిరుతిళ్లు, మసాలాల వాసన, లౌడ్‌స్పీకర్లలో సంగీతం హోరెత్తుతోంది.

మైదానం మధ్యలో సందోస్, రాహుల్, వారితో పాటు దాదాపు మరో 100 మంది మగవాళ్లు ఉన్నారు. వారి ఒంటి మీద నడుం చుట్టూ ఎర్రటి బట్టలు తప్ప మరే దుస్తులూ లేవు.

‘‘శివుడు అత్యంత శక్తిమంతమైన దేవుడు. అతడి భక్తులందరూ అతడిని కొలవాలి’’ అంటూ వారు జపం చేస్తున్నారు.

గంటల తరబడి ఈ మంత్రం పఠిస్తున్నారు. వీరిని ఒక మైకంలోకి తీసుకెళ్లటానికి ఇది కీలకమైన ప్రక్రియ. పండుగ రోజు వారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. అయితే మద్యం తాగొచ్చు. గాంజాయి పీల్చొచ్చు. ఇది వారికి గాయాలయ్యే ప్రమాదాలను తగ్గిస్తుందని భావిస్తారు.

మంత్రోచ్ఛారణ చేస్తున్న రాహుల్ (మధ్యలో)
ఫొటో క్యాప్షన్, మంత్రోచ్ఛారణ చేస్తున్న రాహుల్ (మధ్యలో)

భక్తులకు ఇనుప చువ్వలు గుచ్చే పూజారి చుట్టూ రాహుల్ నాట్యం చేస్తున్నాడు. అతడి కళ్లు విప్పారాయి. చూపు నా గుండా పోతోంది.

చువ్వలు గుచ్చటం మొదలవతుండగా గుంపు బాగా చిక్కబడింది. మహిళలు గట్టిగా ఊళపెడుతున్నారు.

నేను అప్రయత్నంగా వెనక్కు తిరిగాను. మళ్లీ వెనుదిరిగి చూస్తే అప్పటికే ఇద్దరు భక్తుల శరీరంలో - వారి బుగ్గలు, చెవులు, పెదవులు, ముక్కు, ఛాతీ, అరచేయి, వీపుల మీద ఇనుప చువ్వులు గుచ్చుకుని ఉన్నాయి. వారు శివుడి మంత్రం జపిస్తున్నారు.

సందోస్ పదునుపెట్టుకున్న ఇనుప చువ్వల్లో ఒక దానిని పూజారి తీసుకున్నాడు. దానికి ఒక అరటిపండు పూశాడు. ఏదో మంత్రం చదువుతూ సాండోస్ బుగ్గ లాగాడు. వేగంగా ఇనుప చువ్వ గుచ్చాడు. అది ఒకవైపు నుంచి లోపలికి వెళ్లి మరోవైపు నుంచి బయటకు వచ్చింది.

సందోస్ ముఖం చిట్లించాడు. అతడి శరీరమంతా వణికింది. అదే బుగ్గలో మరో రెండు చువ్వలు గుచ్చాడు పూజారి. అన్నీ గుచ్చుకుని ఉన్నాయి.

రాహుల్
ఫొటో క్యాప్షన్, రాహుల్

తర్వాత రాహుల్ వంతు. అతడు ముందుకు వచ్చాడు. కళ్లు గట్టిగా మూసుకున్నాడు. పూజారి అతడి చెవి తమ్మెతో మొదలుపెట్టాడు. తర్వాత కింది పెదవిలో కొన్ని చువ్వలు, పై పెదవిలో కొన్ని చువ్వలు గుచ్చాడు. చివరిగా రాహుల్ ఛాతీ మీద రెండు చువ్వలు గుచ్చాడు. ఒక్కోటి అంగుళం మేర శరీరంలో గుచ్చుకుని ఉంది. రాహుల్ ముఖం మీద కేవలం ఒక కన్నీటి చుక్క మాత్రమే కనిపించింది.

అతడు శివుడి మంత్రోచ్ఛారణ కొనసాగించాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ అతడి మాటలు ముద్దముద్దగా వస్తున్నాయి. అతడి ముఖంలో గుచ్చిన ఇనుపచువ్వలు అతడి ముఖ కదలికలను పరిమితం చేస్తున్నాయి.

మరో భక్తుడు రాహుల్‌ను తన భుజాల మీదకు ఎత్తుకున్నాడు. మిగతా వాళ్లతో కలిసి ఒక వలయంలో ప్రదక్షిణ చేయటం మొదలుపెట్టాడు. జనమంతా అది వీక్షిస్తున్నారు.

ఈ మొత్తం ప్రక్రియలో ఒక్క చుక్క రక్తం కూడా కనిపించకపోవటం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది.

తన వీపుకు మోకులు గుచ్చుకున్న సుమన్
ఫొటో క్యాప్షన్, తన వీపుకు కొక్కీలు గుచ్చుకుని, వాటికి మోకులు కట్టి రాట్నానికి వేలాడుతున్న సుమన్

ఈ పండుగ ఇంకా పూర్తికాలేదు. భక్తులు ఇప్పుడు చరక్ పూజకు సిద్ధమవుతున్నారు. పండుగలో చివరి అంకం.. ఒళ్లుగగుర్పొడిచే భాగం ఇదే. స్వీయ హింస స్థాయి ఇంకా పెరుగుతుంది. అనుభవమున్న కొంతమంది భక్తులు.. తమ వీపుల మీద చర్మానికి రెండు కొండీలు తగిలించుకుని వాటితో రాట్నాలకు వేలాడతారు.

వరుసలో మొదట సుమన్ ఉన్నారు. తనకు 12 ఏళ్ల వయసున్నప్పటి నుండీ గజన్ ఆచారాలను పాటిస్తున్నట్లు చెప్పాడు. ఆయన వయసు ఇప్పుడు 34 ఏళ్లు.

అతడికి కొండీలు గుచ్చటానికి పూజారి మొదట నిరాకరించాడు. ఎందుకంటే అతడి వీపు మీద ఖాళీ లేదన్నాడు. కానీ సుమన్ కోపంగా పట్టుపట్టటంతో పూజారి అతడి వీపు కింది భాగంలో చేతితో చరిచి.. చేతికి చిక్కినంత మాంసం పట్టుకుని తనకు చేతనైనంత వరకూ సాగదీసి అందులో నుంచి బలంగా కొండీని గుచ్చాడు. సుమన్ పిడిగిళ్లు గట్టిగా బిగిసుకున్నాయి. కళ్లు గట్టిగా మూసేసుకున్నాడు. అతడి నుదిటి మీద రక్తనాళాలు పగిలిపోతాయేమో అన్నట్లుగా ఉబ్బాయి. సుమన్ స్పృహ తప్పాడు.

అతడి మీద నీళ్లు పోసి, చెంపలు చరిచి స్పృహ తెప్పించారు. అతడు లేస్తూ ఆసరా కోసం మరో భక్తుడిని పట్టుకుని నిలుచున్నాడు. ఆ భక్తుడు సుమన్‌ను రాట్నం దగ్గరకు నడిపించుకుంటూ తీసుకెళ్లాడు. అతడి వీపు మీద గుచ్చిన కొండీకి తాడు కట్టారు.

భక్తులకు పిల్లల్ని ఇస్తున్న ఫొటో

రాట్నానికి మరోవైపు మరో భక్తుడిని కట్టారు. అటూ ఇటూ ఇద్దరి బరువుతో అది బ్యాలన్స్ అయింది. ఇద్దరూ గాలిలో గుండ్రంగా తిరుగుతున్నారు. భక్తులు కేరింతలు కొడుతూ వారిని ఉత్పాహపరుస్తున్నారు. వారిలో నొప్పి ఏమీ కనిపించటం లేదు. సుమన్ తన కింద ఉన్న గుంపుతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు.

కొన్ని సార్లు తిరిగిన తర్వాత రాట్నం వేగం తగ్గింది. శివుడి ఆశీస్సుల కోసం చాలా మంది తల్లిదండ్రులు తమ చిన్నారి శిశువులను ఎత్తి పట్టుకున్నారు. సుమన్ ఒక శిశువును చేతులతో అందుకున్నాడు. అటువైపున ఉన్న మరో భక్తుడు కూడా ఒక శిశువును పట్టుకున్నాడు. ఒకసారి గుండ్రంగా తిరిగిన తర్వాత ఆ శిశువులను వారి తల్లిదండ్రులకు ఇచ్చేసి వీరిద్దరూ మరో ఇద్దరు శిశువులను పట్టుకున్నారు.

శరీరానికి కొండీలు గుచ్చుకుని, దానికి మోకు కట్టి, గాల్లో వేలాడుతూ ప్రసాదం పంచుతున్న భక్తుడు
ఫొటో క్యాప్షన్, శరీరానికి కొండీలు గుచ్చుకుని, దానికి మోకు కట్టి, గాల్లో వేలాడుతూ ప్రసాదం పంచుతున్న భక్తుడు

‘‘భక్తులు ఆ పైన ఉన్నంత సేపూ వాళ్లు వాళ్లు కాదు. వాళ్లు శివుడి మారు రూపాలు’’ అని ఒక తల్లి నాతో చెప్పింది. ‘‘నా దేవుడు నా బిడ్డను అందుకున్నపుడు నాకిక ఏ భయమూ ఉండదు’’ అని పేర్కొంది.

సుమారు పది నిమిషాల తర్వాత రాట్నం ఆగింది. సుమన్ కిందికి దిగాడు. మరో భక్తుడు రాట్నానికి వేలాడాడు.

‘‘నేను ఆ పైన ఉన్నంతసేపూ ఆధ్యాత్మికంగా దేవుడితో మమేకమైనట్లు అనిపించింది. దేవుడికి మనిషులకి మధ్య నేను వారధిలాగా అనిపించింది’’ అని సుమన్ నాతో చెప్పాడు. అతడి వీపు మీద కొండీలు ఇంకా అలాగే ఉన్నాయి.

పదునుగా ఉన్న ఇనుప కొక్కీలు
ఫొటో క్యాప్షన్, పదునుగా ఉన్న ఇనుప కొక్కీలు

గజన్ జరగకుండా ఆగిపోతే ఏమవుతుందని మీరు అనుకుంటున్నారు? అని నేను అతడిని అడిగాను.

‘‘ప్రపంచం అంతమైపోతుంది. శివుడి క్రోధం మనందరినీ నాశనం చేస్తుంది’’ అని ఏమాత్రం సంకోచించకుండా సుమన్ బదులిచ్చాడు.

కానీ ఈ ఏప్రిల్‌ నెలలో ఈ భక్తసమాజం గజన్ పండుగకు సిద్ధమవుతుండగా.. కరోనావైరస్ కారణంగా భారత ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది.

ఈ సంవత్సరం గజన్ జరగలేదు. వేల సంవత్సరాల్లో ఇది ఆగిపోవటం బహుశా ఇదే మొదటిసారి.

ఫొటోలు: సహర్ జంద్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)