కరోనావైరస్ క్వారంటైన్ సెంటర్లుగా తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం దేవస్థానాల భవనాలు... మతాలకు అతీతంగా రోగులకు సేవలు

- రచయిత, బండి హృదయ విహారి
- హోదా, బీబీసీ కోసం
మానవ సమాజంలో ప్రస్తుతం ఓ సరికొత్త అధ్యాయం నడుస్తోంది. వేల మందిని కబళిస్తున్న కరోనావైరస్‌ను అర్థం చేసుకోవడానికి ప్రపంచం ప్రయత్నిస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని బడులు, గుడులు క్వారంటైన్ కేంద్రాలుగా మారిపోతున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు చెందిన భవనాలు కూడా క్వారంటైన్ సెంటర్లుగా మారిపోయాయి. కోవిడ్ బాధితుల కోసం తిరుమల-తిరుపతి దేవస్థానం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలు తమ దేవస్థానాల అనుబంధ భవనాలను క్వారంటైన్ కేంద్రాలకు ఇచ్చేశాయి. మతాలకు అతీతంగా ఈ భవనాలు ఇప్పుడు అందరికీ వసతి కల్పిస్తున్నాయి.
ఈ దేవాలయ భవనాల్లో హిందూ, ముస్లిం మతస్థులతోపాటు ఇతర రాష్ట్రాలు, విదేశీయులు కూడా ఆశ్రయం పొందుతుంటే, మరికొందరు చికిత్స పొందుతున్నారు.

తిరుపతి పట్టణంలో టీటీడీకి చెందిన సత్రాలు, గెస్ట్‌హౌస్‌లు చాలానే ఉన్నాయి. వాటిలో శ్రీనివాసం, మాధవం సత్రాలు ప్రధానమైనవి. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే వేలాదిమంది భక్తులు, కొండ పైన ఉన్న సత్రాలతో పాటు కింద ఉండే ఈ సత్రాల్లో విడిది చేస్తారు. ఈ భవనాలు నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంటాయి.
తిరుపతి బస్టాండ్ సమీపంలో, విశాలమైన ప్రాంగణంలో ఉన్న శ్రీనివాసం, మాధవం భవనాల్లో ప్రస్తుతం నిరాశ్రయులు, వలస కూలీలు, అన్నార్తులు సేదతీరుతున్నారు. వీరిలో వివిధ మతాలకు, కులాలకు, ప్రాంతాలకు చెందిన ప్రజలు ఉన్నారు.

లాక్ డౌన్ కారణంగా సొంతూళ్లకు వెళ్లలేక, ఉన్న ఊరిలో ఆశ్రయం పొందలేక ఇబ్బంది పడుతున్న వందలాదిమంది సాధారణ ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఎక్కువ మంది భక్తులకు సుపరిచితమైన ఈ రెండు భవనాలతోపాటుగా తిరుపతి రైల్వేస్టేషన్ ముందున్న విష్ణు నివాసం, స్టేషన్ వెనుకవైపున్న రెండో సత్రాన్ని కూడా పేదలు, అనాథలు, వలస కూలీలు, ఇతరుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి టీటీడీ ఇచ్చేసింది.

అయితే, రేణిగుంట హైవేపై ఈమధ్యనే నిర్మించిన 'పద్మావతి నిలయం' భవనాన్ని కోవిడ్-19 బాధితుల కోసం క్వారంటైన్ కేంద్రంగా మార్చివేశారు. ఇందులోని దాదాపు 500 గదుల్లో ప్రస్తుతం 200 మంది బాధితులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని డీఎంహెచ్ఓ పెంచలయ్య బీబీసీతో అన్నారు. దిల్లీలో మర్కజ్ సమావేశాలకు వెళ్లి వచ్చిన వారు కూడా ఇక్కడ క్వారంటైన్‌లో ఉన్నారు. వీరికి వైద్య పర్యవేక్షణతో పాటు భోజన వసతిని కూడా టీటీడీనే కల్పిస్తోంది.

'రోజుకు 1.4లక్షల మందికి ఆహారం'
టీటీడీ ఇక్కడి అన్నార్తుల ఆకలి కూడా తీరుస్తోంది. కోవిడ్ సంక్షోభ సమయంలో తమవంతు సాయంగా రోజుకు 1.4లక్షల మందికి ఆహారపు పొట్లాలను అందజేస్తోంది. దీనికోసం దాదాపు 500మంది దాకా టీటీడీ ఉద్యోగులు రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నారని టీటీడీ పీఆర్ఓ రవి బీబీసీకి చెప్పారు.
''ప్రతి రోజూ 1.4లక్షల మందికి ఆకలి తీర్చే కార్యక్రమాన్ని టీటీడీ తలపెట్టింది. మధ్యాహ్నం 70వేల మందికి, రాత్రి 70వేల మందికి ఆహారాన్ని తయారు చేసి, ప్యాకింగ్ చేసి, తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, రెవెన్యూ అధికారులకు అందిస్తున్నాం. పద్మావతి నిలయంలో క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తులకు మినహా, తిరుపతిలోని మాధవం, శ్రీనివాసం, ఇతర టీటీడీ భవనాల్లో ఆశ్రయం పొందుతున్నవారి ఆకలిని కూడా టీటీడీనే తీరుస్తోంది'' అని ఆయన వివరించారు.

కాణిపాకం దేవస్థానం
కాణిపాకం దేవస్థానం అధికారులు ఆలయానికి చెందిన 100 గదుల 'గణేష్ సదన్' భవనాన్ని కొన్నిరోజులపాటు క్వారంటైన్ సెంటర్ కోసం కేటాయించారు. ఇక్కడ 4 రోజులపాటు హిందూ, ముస్లిం మతాలకు చెందిన దాదాపు 40 మంది కరోనా అనుమానితులు గణేష్ సదన్‌లో ఉన్నట్లు దేవాలయ అధికారి దేవుళ్లు బీబీసీతో అన్నారు.
''ఏప్రిల్ 1 నుంచి 4 వరకు కాణిపాకం దేవస్థానానికి చెందిన గణేష్ సదన్‌ను క్వారంటైన్ కేంద్రం కోసం ప్రభుత్వానికి ఇచ్చాం. ఈ క్వారంటైన్ కేంద్రంలో ఉన్నవారెవ్వరికీ కరోనా లేదని తేలాక, అధికారులు అందర్నీ పంపించి వేశారు. ఆ తర్వాత మళ్లీ ఎవ్వరూ ఇక్కడకు రాలేదు'' అని దేవుళ్లు తెలిపారు.
అయితే, కాణిపాకం దేవాలయాన్నే క్వారంటైన్ కేంద్రంగా మార్చారని, ముస్లిం వ్యక్తులు చెప్పులు వేసుకుని ఆలయంలో తిరుగుతున్నారంటూ, కొన్ని రోజుల క్రితం ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అసలు విషయాన్ని వక్రీకరిస్తూ కాణిపాకం గణేష్ సదన్ వీడియోను కొందరు పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ చేస్తున్నారంటూ చిత్తూరు క్రైం బ్రాంచ్‌లో కేసు నమోదైంది.

ఈ కేసులో తెలంగాణలోని సిద్ధిపేటకు చెందిన ఎం.విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేసి సబ్‌జైలుకు తరలించారు. సదరు వ్యక్తి మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని, తన ఫేస్‌బుక్, ట్విటర్ ఖాతాల్లో ప్రభుత్వ ఉద్యోగులను అసభ్య పదజాలంతో దూషించారని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు ఆ వ్యక్తిపై నమోదు చేశారు.
''క్వారంటైన్ సమయంలో గణేష్ సదన్‌లో ముస్లింలు ఉన్నమాట వాస్తవమే. కానీ గణేష్ సదన్ అన్నది దేవాలయం కాదు. ఒక సత్రం మాత్రమే. గణేష్ సదన్‌కు, ఆలయానికి కనీసం 300 మీటర్ల దూరం ఉంటుంది. మొదట్లో కాణిపాకం ఊళ్లో ఉన్న వినాయక సదనాన్ని క్వారంటైన్‌కు ఇద్దామనుకుంటే, గ్రామస్థులు భయపడి వద్దన్నారు.
లాక్‌డౌన్ సమయంలో దేవాలయం వద్ద ఎవ్వరూ ఉండరు కాబట్టి, మేం గణేష్ సదన్‌ను కేటాయించాం. దేవాలయ సత్రాల్లో గదులు, బాత్‌రూంలు వేరువేరుగా ఉంటాయి. కరోనా అనుమానితులు సోషల్ డిస్టెన్స్ పాటించడం చాలా అవసరం. అందుకు దేవాలయ సత్రాలు అనుకూలం'' అని దేవుళ్లు బీబీసీతో అన్నారు.
చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కాణిపాకంలోని గణేష్ సదన్ క్వారంటైన్ కేంద్రంలోని వారికి కరోనా నెగిటివ్ రావడంతో అధికారులు అందర్నీ పంపించేశారు. ప్రస్తుతం గణేష్ సదన్ ఖాళీగా ఉంది.

శ్రీకాళహస్తి
వాయులింగంగా భక్తులు కొలిచే చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయం కూడా మొదట్లో దేవస్థానానికి చెందిన 'గంగా సదనం' గెస్ట్‌హౌస్‌ను ప్రభుత్వానికి ఇచ్చిందని, ఆలయ ఎండోమెంట్ ఆఫీసర్ బీబీసీతో అన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు అధికారులు క్వారంటైన్ కేంద్రాన్ని మరోచోటకు మార్చారని ఆయన చెప్పారు.
''మొదట్లో కోవిడ్-19 క్వారంటైన్ కేంద్రం కోసం, దేవస్థానానికి చెందిన గంగా సదనం అనే గెస్ట్‌హౌస్‌ను మేం తీసుకున్నాం. ఆ భవనంలో వివిధ వర్గాలకు చెందిన దాదాపు 70 మంది ఉండేవారు. కానీ కొన్ని కారణాలతో వారం రోజుల తర్వాత ఈ క్వారంటైన్ కేంద్రాన్ని వేర్పేడు సమీపానికి మార్చాం.
శ్రీకాళహస్తిలోని గంగా సదనంలో ఉన్నన్నాళ్లూ, క్వారంటైన్‌లోని వివిధ మతాల వారికి, దేవస్థానం నుంచే భోజనాలు అందాయి. ఇది మతాలకు అతీతంగా ఆలోచించాల్సిన సమయం. ప్రస్తుతం శ్రీకాళహస్తిలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. విధుల్లో ఉన్న అధికారులకు సైతం పాజిటివ్ అని తేలింది'' అని సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్న శ్రీకాళహస్తి ఎంఆర్ఓ జరీనా బేగం బీబీసీతో అన్నారు.
శ్రీకాళహస్తి దేవస్థానం వారు ఆలయానికి చెందిన ఏయే సత్రాలను క్వారంటైన్ కోసం కేటాయించారో తెలుసుకునేందుకు ఆలయ అధికారులను బీబీసీ ఫోన్‌లో సంప్రదించింది. అందుకు బదులుగా, అవతలివైపున్న అధికారి కాస్త ఆందోళనగా మాట్లాడారు.

''మీరు ఆ విషయం గురించి ఏమీ రాయకండి, దేవస్థానానికి చెందిన భవనాల్లో ఇప్పుడు అలాంటిదేమీ లేదు. మేం గతంలో గంగా సదనాన్ని క్వారంటైన్‌కు ఇచ్చినమాట వాస్తవమే కానీ, ప్రస్తుతం ఆ క్వారంటైన్ కేంద్రాన్ని అధికారులు వేరే ప్రాంతానికి మార్చేశారు'' అని దేవస్థానానికి చెందిన ఒక అధికారి అన్నారు.
కాణిపాకం దేవాలయానికి చెందిన ఒక సదనాన్ని క్వారంటైన్‌కు ఇచ్చిన విషయంలో రేగిన దుమారం, ఫేక్‌న్యూస్ సృష్టించిన ప్రభావం వల్ల బహుశా ఆయన అలా మాట్లాడి ఉండొచ్చు. కానీ, కాసేపటి తరువాత ఆయన నిదానంగా మాట్లాడారు.
''శ్రీకాళహస్తి దేవాలయానికి కిలోమీటర్ దూరంలో గంగా సదనం గెస్ట్‌హౌస్ ఉంది. అది భక్తుల విడిది భవనం. మొదట్లో క్వారంటైన్ కేంద్రాన్ని ఒక వారం రోజులపాటు ఈ భవంతిలోనే ఏర్పాటుచేశారు. తర్వాత వేరే కారణాలతో, సెంటర్‌ను మరోచోటకు మార్చారు. ప్రస్తుతం ఆలయ భవనాల్లో ఎలాంటి క్వారంటైన్ సెంటరూ లేదు'' అని ఆలయ అధికారి బీబీసీతో అన్నారు.
శ్రీకాళహస్తి పట్టణం మొత్తం రెడ్‌జోన్‌లో ఉంది. చిత్తూరు జిల్లావ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య 55గా ఉంది.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








