కరోనావైరస్: కోవిడ్ రాకుండా తొలిసారిగా బ్రిటన్‌లో వ్యాక్సీన్ ట్రయల్స్

- రచయిత, ఫెర్గూస్ వాల్ష్
- హోదా, మెడికల్ కరెస్పాండెంట్
మొత్తం 800 మందికి పైగా పాల్గొన్న ఈ పరిశోధనలో ప్రస్తుతం తొలి ఇద్దరు వాలంటీర్లకు టీకాను ఇంజెక్ట్ చేశారు. ప్రయోగంలో పాల్గొంటున్న వారిలో సగం మందికి కోవిడ్-19 టీకాను ఇస్తారు. మిగిలిన సగం మందికి వారి నాడీ మండలంలో కలిగే మార్పులను అదుపులో ఉంచే టీకాను అందిస్తారు.
అయితే, ఎవరికి ఏ టీకాను ఇస్తున్నారన్న విషయం వైద్యులకు తప్ప వాలంటీర్లకు మాత్రం తెలియనివ్వరు.
యూరప్‌లో టీకా ప్రయోగాల్లో భాగంగా వ్యాక్సీన్ వేయించుకున్న తొలి ఇద్దరు వ్యక్తులలో ఒకరైన ఎలిసా గ్రానాటో బీబీసీతో మాట్లాడుతూ, “ నేను ఒక శాస్త్రవేత్తను. అందుకే ఈ ప్రయోగానికి నాకు వీలైనంత సహాయం అందించాలనుకుంటున్నాను.” అని అన్నారు.
ఈ టీకాను అభివృద్ధి చేయడానికి 3 నెలల సమయం పట్టింది. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ఒక శాస్త్రవేత్తల బృందం దీన్ని తయారు చేసింది. జిన్నెర్ ఇనిస్టిట్యూట్‌లోని వ్యాక్సినాలజీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సారా గిల్బర్ట్ ఈ ప్రి క్లినికల్ రిసెర్చ్‌కి నాయకత్వం వహించారు.
“నా వరకు ఈ టీకా కచ్చితంగా విజయవంతమవుతుందన్న నమ్మకం బలంగా ఉంది.” అని ఆమె అన్నారు.
ఈ టీకా విజయవంతం కావడం పట్ల తాను 80% సంతృప్తితో ఉన్నానని మొదట్లో ఆమె చెప్పారు. కానీ, ఇప్పుడు మాత్రం చాలా ఆశావహ దృక్పథంతో ఉన్నానని చెబుతున్నారు.
టీకా ఎలా పని చేస్తుంది?
ఈ టీకాను చింపాంజీల్లో వచ్చే సాధారణ జలుబుకు సంబంధించిన అతి బలహీనమైన వైరస్ నుంచి తయారు చేశారు. దీన్ని అడినోవైరస్ అంటారు. ఈ వైరస్ మనుషుల్లో పెరగలేదు.
మరో రకం కరోనావైరస్‌కు చెందిన మెర్స్ వ్యాధికి ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ గతంలో టీకాను అభివృద్ధి చేసింది. ఇప్పుడు కూడా అదే విధానాన్ని ఉపయోగించారు. అప్పట్లో అది కూడా క్లినికల్ ట్రయిల్స్ లో మంచి ఫలితాన్ని ఇచ్చింది.

టీకా పని చేసినట్టు ఎలా తెలుస్తుంది ?
మొత్తం రెండు వేర్వేరు భాగాలుగా జరుగుతున్న ఈ ప్రయోగంలో రాబోయే రోజుల్లో ఏ విభాగానికి చెందిన వారు ఎంత మంది కరోనావైరస్ బారిన పడతారో పరిశీలిస్తారు. కోవిడ్-19 టీకా పని చేస్తుందో లేదో తెలియడానికి ఉన్న ఏకైక మార్గం అదే.
అయితే, యూకేలో ఒకే సారి కేసుల సంఖ్య తగ్గితే మాత్రం ఈ ప్రయోగానికి ఇబ్బందే. ఎందుకంటే అప్పుడు వారికి కావాల్సినంత డేటా లభించే అవకాశం ఉండదు.
ఆక్స్ ఫర్డ్ వ్యాక్సీన్ గ్రూప్ డైరక్టర్‌గా పని చేస్తున్న ప్రొఫెసర్ అండ్రూ పొలార్డ్ ఈ పరిశోధన బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.
“ప్రస్తుతం ఈ మహమ్మారి గమనాన్ని వెంటాడుతున్నాం. ఒక వేళ మేం దాన్ని చేరుకోలేకపోతే రానున్న కొద్ది నెలల్లో ఈ టీకా పని చేస్తుందా, లేదా అన్న విషయాన్ని మేం చెప్పలేం. అయితే మున్ముందు మరిన్ని కేసులు వస్తాయన్న నమ్మకం మాకుంది. ఎందుకంటే ఇంకా ఈ వైరస్ మనల్ని వదిలి వెళ్లలేదు.” అని ఆయన వ్యాఖ్యానించారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్‌కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?

స్థానిక ఆరోగ్య కార్యకర్తలపైనే ఈ టీకాను ఎక్కువగా ప్రయోగించాలని పరిశోధకులు భావిస్తున్నారు. మిగిలిన వారితో పోల్చితే ఈ వైరస్ ముప్పు వారికే ఎక్కువగా ఉండటమే అందుకు కారణం.
రానున్న నెలల్లో సుమారు 5 వేల మందిపై దీనిని ప్రయోగించాలని భావిస్తున్నారు. ఈ ప్రయోగానికి ఎలాంటి వయో పరిమితి కూడా లేదు.
నిజానికి వృద్ధుల్లో వ్యాధి నిరోధకత తక్కువగా ఉంటుంది. అందువల్ల టీకాలకు స్పందించే గుణం కూడా తక్కువే. అయితే అటువంటి వారికి రెండు డోసుల టీకా అవసరం ఉంటుందా.. లేదా అన్న విషయాన్ని కూడా ఈ ప్రయోగం ద్వారా పరిశీలించనున్నారు పరిశోధకులు. ఆఫ్రికాలో కూడా ఈ వ్యాక్సీన్ ట్రయిల్స్ నిర్వహించాలని భావిస్తోంది ఆక్స్ ఫర్డ్ బృందం.

ఫొటో సోర్స్, Sean Elias - Oxford Vaccine trial
ఎంత వరకు సురక్షితం?
రానున్న నెలల్లో ఈ ట్రయిల్స్‌లో పాల్గొన్న వాలంటీర్లను చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు. వ్యాక్సినేషన్ జరిగిన కొద్ది రోజుల తర్వాత కొంత మందికి చేతుల నొప్పులు, మరి కొంత మందికి తలనొప్పి, లేదా జ్వరం రావచ్చని వారికి ముందే చెప్పారు.
ఒక్కోసారి కరోనావైరస్ బారిన పడే ప్రమాదం కూడా ఉందని వారికి ముందే హెచ్చరించారు. గతంలో సార్స్ టీకా అధ్యయనాల ప్రారంభ దశలో అలాంటి సమస్యే తలెత్తింది. అయితే ఆక్స్ ఫర్డ్ బృందం మాత్రం ఈ సారి అలాంటి అవకాశాలు చాలా తక్కువ అని చెబుతోంది.
సెప్టెంబర్ నాటికి పది లక్షల డోసుల్ని సిద్ధం చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. టీకా ప్రభావంతంగా పని చేసే విషయంలో స్పష్టత వచ్చిన తర్వాత వాటి తయారీని గణనీయంగా పెంచుతారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
మొదట ఎవరికి?
ఆ సంగతి ఇంకా నిర్ణయించ లేదని అంటున్నారు ప్రొఫెసర్ గిల్బర్ట్. “ ఏం జరగనుందన్న విషయాన్ని నిర్ణయించేది మేం కాదు. వ్యాక్సీన్‌ను తయారు చేసి అది సరిగ్గా పని చేస్తోందో లేదో చూడటం వరకే మా పని. ఎవరికి అందించాలన్నది నిర్ణయించడానికి వేరొకరు ఉన్నారు.” అని వ్యాఖ్యానించారు.
కరోనావైరస్‌కు టీకాపై ఇంపీరియల్ కాలేజ్ లండన్‌కు చెందిన మరో బృందం కూడా పరిశోధనలు నిర్వహిస్తోంది. వచ్చే జూన్ నాటికి వారు సిద్ధం చేస్తున్న టీకాను మనుషులపై ప్రయోగించే అవకాశం ఉంది.
ఆక్స్ ఫర్డ్, ఇంపీరియల్ పరిశోధన బృందాలకు బ్రిటన్ ప్రభుత్వం సుమారు 375 కోట్ల రూపాయలకు పైగా నిధుల్ని కేటాయించింది.
ఈ రెండు పరిశోధనా బృందాలను అభినందించిన బ్రిటన్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాట్ హ్యాన్‌కాక్.. టీకాను అభివృద్ధి చేసేందుకు తాము అన్ని విధాల ప్రయత్నిస్తున్నామని అన్నారు.
వచ్చే ఏడాది నాటికి కోవిడ్-19కు చికిత్స అందించేందుకు టీకా లేదా మందులు అందుబాటులో ఉండే అవకాశం ఉందని బ్రిటన్ ప్రధాన వైద్య సలహాదారు ప్రొఫెసర్ క్రిస్ విట్టీ తెలిపారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారు చేసే అవకాశాన్ని ప్రపంచం ఎలా చేజార్చుకుంది?
- కరోనావైరస్: తొలి కేసు నమోదవడంతో యెమెన్‌లో 'భయం భయం'
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి నిర్థరణకు ఎలాంటి పరీక్షలు చేస్తారు?
- కరోనావైరస్: ఇటలీని దాటేసిన అమెరికా, ప్రపంచంలో అత్యధిక మరణాలు ఇక్కడే
- కరోనా లాక్డౌన్: విపరీతంగా బయటపడుతున్న ఎలుకలు.. వీటిని నివారించడం ఎలా
- వుహాన్‌లో లాక్ డౌన్ ఎత్తేసిన చైనా ప్రభుత్వం.. రైళ్లు, విమానాల్లో మొదలైన ప్రయాణాలు
- కరోనావైరస్: నియంత్రణ రేఖ 'సామాజిక దూరం' ఎలా పాటించాలంటున్న స్థానికులు
- మామకు కరోనా పాజిటివ్... రహస్యంగా చూసివచ్చిన అల్లుడిపై కేసు
- కొడుకు శవంతో రోడ్డుపై పరుగులు తీసిన తల్లి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








