కరోనావైరస్: లాక్‌డౌన్‌తో ఉత్తరాంధ్రలో కుదేలైన చిరు కార్మికుల జీవితాలు

- రచయిత, విజయ్ గజం
- హోదా, విశాఖ నుంచి బీబీసీ కోసం
కరోనావైరస్ దెబ్బ ఉత్తరాంధ్రలో చిన్న పరిశ్రమల కార్మికులనూ, వారిపై ఆధారపడ్డ చిరువ్యాపారుల జీవితాలను చిందరవందర చేస్తోంది.
ఇప్పటికే వరుస తుఫాన్ల తాకిడి నుంచి పూర్తిగా కోలుకోకముందే.. తాజాగా కరోనావైరస్ లాక్‌డౌన్ దెబ్బకు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు.
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కొన్ని ఫార్మా పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు తప్ప మిగతా అన్ని పరిశ్రమలూ దాదాపు మూతపడ్డాయి.
ఒక్క విశాఖ నగరంలోని వివిధ పెద్ద పరిశ్రమల్లో దాదాపు 70,000 మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతుంటే.. పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి లభిస్తోంది.
విశాఖ పోర్టు, స్టీల్ ప్లాంటు, బీహెచ్ఈఎల్ వంటి సంస్థలు కూడా అత్యవసర విభాగాలను మినహా మిగతా విభాగాలన్నిటినీ మూసివేశాయి.

ప్రధాన పరిశ్రమలైన హెచ్‌సీఎల్, షిప్ యార్డ్, కోరమండల్, నేవల్ డాక్ యార్డ్, షిప్ బిల్డింగ్ సెంటర్, డ్రాండిక్స్, బెల్, హెచ్‌పీవీపీలలో కూడా ఇలాంటి పరిస్థితే. పెద్ద సంస్థలు ఉత్పత్తి ఆపకపోయినా, ఇతర అత్యవసరం కాని విభాగాలను మూసేస్తున్నాయి.
''ఈ పరిశ్రమల్లో రెగ్యులర్, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు పెద్దగా ఇబ్బంది ఉండదు. వారి జీతాలు వాళ్లకు వచ్చేస్తాయి. కానీ ఈ పరిశ్రమలపై ఆధారపడి పనిచేసే చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సంస్థలు కూడా మూతపడటంతో.. వాటిలో పనిచేసే శ్రామికులు, వాటి మీద ఆధారపడ్డ చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు'' అని అటువంటి శ్రామికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
గాజువాక ఆటోనగర్, దువ్వాడ సెజ్‌లు కూడా దాదాపుగా మూతపడ్డాయి. దువ్వాడ సెజ్‌లో మొత్తం 63 పరిశ్రమలు ఉండగా.. వాటిలోని నాలుగు ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు మినహా మిగతా 59 పరిశ్రమలు పూర్తిగా మూతపడ్డాయి. ఈ సెజ్‌లో ఉన్న ఎక్స్‌పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్లలో 54 పని చేస్తున్నాయి.
కరోనావైరస్ నేపధ్యంలో పరవాడ ఫార్మా సిటీలోని పలు కంపేనీలు ఈ నెల 31 వరకూ లాక్‌డౌన్ ప్రకటించాయి. ప్రస్తుతం పరవాడ ఫార్మాసిటీలో 82 కంపెనీల్లో ఉత్పత్తి జరుగుతోంది. వీటిలో ఉత్పత్తిని తగ్గించటానికి కంపేనీలు ప్రయత్నిస్తున్నాయి. ఉదయం 7 గంటలలోగా విధులకు వచ్చే వారిని అనుమతిస్తున్నారు.

దీంతో ఈ సంస్థల్లో పనిచేస్తూ ఉపాధి పొందేవారు ఇబ్బందులు పడుతున్నారు. చాలా సంస్థలు ఉన్న కూలీలకు పని కల్పించాలన్న ఉద్దేశంతో వంతుల వారీగా పనికి పిలుస్తున్నాయి. అంటే ఇవాళ పని ఇచ్చిన వారిని మళ్లీ ఎల్లుండి పిలుస్తారు. రేపు వేరే వారికి పని ఇస్తారు. దానివల్ల తమ దగ్గర ఉన్న అందరికీ ఎంతో కొంత పని కల్పించవచ్చని కొన్ని సంస్థల ఉద్దేశం. కనీసం అది కూడా చేయలేని సంస్థలు చాలానే ఉన్నాయి.
ఆటోనగర్‌లోని ఒక యూనిట్‌లో కళాసీగా పనిచేసే సింహాచలం ఇప్పుడు పనిలేక ఖాళీగా ఉంటున్నారు. ఆయన కూలికి పనికి వెళ్లినప్పుడు రోజుకు రూ. 500 నుంచి రూ. 700 వరకూ పనిని బట్టి సంపాదిస్తాడు. కానీ ఇప్పుడు పనే లేకుండా పోయింది. అతనికి రోజూ పని ఇచ్చే యూనిట్ లాక్‌డౌన్ కావటంతో ఇంటికే పరిమితమయ్యాడు.
''ఎప్పుడైనా పండగలు లేదంటే తుఫాన్లు వస్తే తప్ప దాదాపు రోజూ పని ఉంటుంది. మొన్నామధ్య ఆర్డర్లు తగ్గాయని (మాంద్యం ప్రభావం వల్ల) కొన్ని రోజులు పని దొరకడం ఇబ్బంది అయింది. ఇప్పుడు మళ్లీ ఈ జబ్బు వచ్చింది.. మళ్లీ పనులు లేకుండాపోయాయి'' అని ఆయన వాపోయారు.

- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు

''రోజూ పనుంటే ఇంట్లో తినడానికి లోటు లేకుండా నాలుగు రోజులకో వారానికో ఒకసారి సరకులు తెచ్చుకునే వాళ్లం. కానీ ఇప్పుడు పనిలేకండా ఇరవై రోజులు, నెల రోజులు కిరాణా సామాను మేమెలా తెచ్చుకునేది? ఏదో ఒకటి చేసి, రేషన్ బియ్యం, చిన్నా చితకా చేసుకుని తిండికి ఇబ్బంది లేకుండా చూసుకున్నా, ఇంటి అద్దె ఎలా కడతాం? మిగతా అప్పులు, వాయిదాలు, ఖర్చులు.. ఏం చేయాలో తెలియడం లేదు'' అని ఆవేదన వ్యక్తంచేశారు సింహాచలం.
చిరు వ్యాపారులకు తాము వీలైనంత సాయం చేయాలనుకుంటున్నామని బీబీసీతో చెప్పారు విశాఖ స్మాల్ స్కేల్ ఇండస్ర్టీస్ వేల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలాజీ.
''ఆటోనగర్‌లో ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా పరిశ్రమలు మాత్రమే తెరిచి ఉంచుతున్నాం. మిగిలినవన్నీ మూసేస్తున్నాం. మామీద ఆధారపడి వర్కర్లు ఉన్నారు. వారిని మేం ఆదుకోవాలి కదా. అసోసియోషన్ అంతా కలిసి చర్చించి వాళ్లకు ఎంతో కొంత సహాయం చేస్తాం'' అని చెప్పారు.

ఇక అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న బ్రాండిక్స్ కంపేనీ... ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడానికంటే రెండు రోజుల ముందుగానే ఉద్యోగులందరికీ సెలవు ప్రకటించింది.
ఇందులో దాదాపు 23,000 మంది కార్మికులు పనిచెస్తున్నారు. వంద మంది కార్మికులు ఒక్కో యూనిట్‌గా పనిచెయ్యాల్సి ఉంటుంది. దీంతో కరోనావైరస్ వ్యాప్తి చెందుతుందేమో అన్న అనుమానంతో యాజమాన్యం ముందుగానే సెలవు ప్రకటించింది.
ఈ విషయంపై బ్రాండెక్స్ ఇండియా పార్టనర్ దొరైస్వామి మాట్లాడుతూ.. కార్మికుల ఆరోగ్యం కంటే తమకు ఏదీ ఎక్కువ కాదని, అందుకనే ముందుగానే సెలవు ప్రకటించామని చెప్పారు. ఈ సెలవు కాలాలనికి వేతనం కూడా చెల్లిస్తామని తెలిపారు.
అయితే బ్రాండెక్స్ లాగా తన సిబ్బందికి సెలవులు ఇచ్చి జీతాలు కూడా ఇవ్వగలిగిన, ఇచ్చే పరిశ్రమలు కేవలం వేళ్లపై లెక్కించదగినవే ఉంటాయి. మిగతా వారి పరిస్థితి దారుణంగానే ఉంది.

శ్రీకాకుళంలో జీడిపప్పు పరిశ్రమ సుమారు 30,000 మందికి ప్రత్యక్షంగా, మరో 15,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. ఇప్పుడు వాళ్లందరికీ పనులు లేవు.
''వాళ్లకు మా సంఘం నుంచి చేయాల్సింది చేస్తాం. ప్రభుత్వం కూడా వాళ్లను, ఆదుకోవాలి'' అని జీడిపప్పు పరిశ్రమల సంఘం అధ్యక్షుడు రామేశ్వర రావు చెప్పారు.
ఇక అసంఘటిత రంగాల్లోని రోజు వారీ కూలీలు లక్షలాది మంది ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ వల్ల వాళ్లందరికి ఉపాధి లేకుండా పోయింది.
''నిన్నటి వరకూ ఇసుక దొరకలేదు. ఇప్పుడు ఇసుక దొరికే సమయానికి కరోనావైరస్ వచ్చింది. పనులు లేకుండా పోయాయి. ప్రభుత్వం ఒక వైపు వైట్ రేషన్ కార్డు ఉన్నవారి అందరికి ముందుగానే నిత్యవసరాలు ఇవ్వడంతో పాటు వెయ్యి రూపాయలు ఇచ్చినా.. అవి సరిపోవు కదా'' అంటున్నారు నాయుడు అనే భవన నిర్మాణ కార్మికుల మేస్త్రి.
''నా దగ్గర 20 మంది కార్మికులు పని చేసేవారు. ఇప్పుడు కేవలం 10 మంది లోపే పనులు దొరుకుతున్నాయి. ఒక రోజు ఒకరికి ఇస్తే మరో రోజు ఇంకొకరికి పనులు అప్పచేబుతున్నా'' అని బీబీసీకి వివరించారు.

''ప్రభుత్వం మన కోసమే కదా బయటకు రావద్దని చెబుతోంది. దాన్ని పాటించాలి. కానీ మా కుటుంబాల పోషణ కోసం మేం కూలి పనులు చెసుకోవాలి కదా'' అన్నారు.
బీహార్ నుంచి రిజ్వాన్.. ఇళ్లు, భవనాల్లో టైల్స్ వేసే పనిచేస్తాడు. పదేళ్లుగా విశాఖలో పనిచేస్తున్నాడు. ''నేను గతంలో రోజుకు రూ. 800 సంపాదించేవాడిని. సెడన్‌గా లాక్‌డౌన్ అన్నారు. కొన్ని పనులు మధ్యలో ఆగిపోయాయి. ఆ పనులు పూర్తి చెసేంత వరకూ యజమాని డబ్బులు ఇవ్వరు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. పోనీ వేరే ఏ పనికి వెళదామన్నా ఆపేస్తున్నారు. నాబోటి వాళ్లకు చాలా మందికి పనులు లేవు'' అని ఆయన చెప్పారు.
''జనతా కర్ఫ్యూ అనగానే బియ్యం తీసుకొచ్చుకున్నాను. నిన్న ఉదయం మార్కెట్‌కి వెళ్లి కూరగాయలు తెచ్చుకున్నాను. రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. నాలాంటి వాళ్లు ఇక్కడ చాలా మంది ఉన్నారు'' అని కోరారు.
లాక్‌డౌన్ ప్రభావంతో చిరు వ్యాపారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాలు అమ్మే వారు కూడా సమస్య ఎదుర్కొటున్నారు.

తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకునే రాము నాయుడు.. ''మామూలు రోజుల్లో రోజుకు కనీసం రూ. 500 సంపాదించే వాడిని. ఇప్పుడు అసలు బండి వేసుకోనివ్వడం లేదు. నాలుగు రోజులయ్యింది బండి వెయ్యక. నా దగ్గర ఉన్న కొద్ది పాటి సరకు పాడవుతుంది. కూరగాయలు నిల్వ ఉండవు కదా'' అని ప్రశ్నిస్తున్నారు.
''ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి వెయ్యి రూపాయలు ఇస్తా అంటుంది. కానీ నా రేషన్ కార్డు ఊరిలో ఉంది. ఏం చేయాలి? ఎవరినైనా అప్పు అడుగుదామన్నా ఎవరూ ఇచ్చే పరిస్థితి లేదు'' అంటున్నారు ఆయన.
ట్రాన్స్‌పోర్ట్ వర్కర్లు, ఆటోలు నడుపుకునే వాళ్లు తమ బండ్లకు ఫైనాన్స్ కట్టాలి. ''ఈఎంఐలు వాయిదా పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి'' అని వారు కోరుతున్నారు.
విశాఖపట్నంలో పది వేల మంది వరకూ ముఠా హమాలీలు ఉన్నారు. ''ప్రభుత్వం ఇచ్చే పది కేజీల బియ్యం, కేజీ పప్పు ఎన్ని రోజులు వస్తుంది? చిన్న షాపుల్లో పనిచేసేవారి సంగతేంటి? వారికి కూడా ప్రభుత్వం ఏదో ఒక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. ప్రత్యక్ష నగదు బదిలీ, వాయిదాలపై, వడ్డీలపై మాఫీ వంటివి ప్రకటించాలి'' అని డిమాండ్ చేశారు సీపీఎం నగర అధ్యక్షులు కుమార్.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ప్రపంచ చరిత్రను మార్చేసిన అయిదు మహమ్మారులు
- కరోనావైరస్: ప్రపంచమంతా ఇంట్లో ఉంటే... వీళ్ళు బీచ్‌లో ఏం చేస్తున్నారు?
- తిరుమలలో చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం.. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలంటున్న అధికారులు
- కరోనావైరస్ ప్రభావంతో భారత్‌లో ఎన్ని ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు
- కరోనావైరస్తో మన రోగనిరోధక వ్యవస్థ ఎలా పోరాడుతుందంటే..
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి? - 10 కీలక ప్రశ్నలు... నిపుణుల సమాధానాలు
- కరోనావైరస్లు ఎక్కడి నుంచి వస్తాయి... ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి?
- ఈ కుర్రాడు రతన్ టాటాకు క్లోజ్ ఫ్రెండ్...
- కరోనావైరస్: భారతదేశం కోవిడ్ నిర్థరణ పరీక్షలు తగిన స్థాయిలో ఎందుకు చేయలేకపోతోంది?
- 'షూట్ ఎట్ సైట్' ఆర్డర్ ఇచ్చే పరిస్థితి తీసుకురావద్దు, అవసరమైతే ఆర్మీని దింపుతాం' - తెలంగాణ సీఎం కేసీఆర్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








