కరోనావైరస్‌: 'షూట్ ఎట్ సైట్' ఆర్డర్ ఇచ్చే పరిస్థితి తీసుకురావద్దు, అవసరమైతే ఆర్మీని దింపుతాం' -తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

కేసీఆర్

ఫొటో సోర్స్, I&PR Telangana

రాష్ట్రంలో ఇప్పటి వరకు 36 కేసులు నిర్ధరణ అయ్యాయని, అందులో ఒకరు కోలుకున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. కరోనావైరస్‌ తాజా పరిస్థితులను, దాన్ని నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి ప్రెస్ మీట్‌లో సీఎం వివరించారు. బాధితులు అందరూ కోలుకుంటున్నారని కూడా చెప్పారు.

ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారు:

విదేశాల నుంచి వచ్చిన వారందరినీ క్వారంటైన్‌లో ఉంచాం. వారి పాస్‌పోర్టులను అన్నీ సీజ్ చేయాలని అధికారులకు చెప్పాం.

రాష్ట్రంలో ప్రస్తుతం అనుమానితులు 114 మంది ఉన్నారు.

అందరికీ మంచి పద్ధతిలోనే చెప్పి సహకరించాలని కోరుతాం. లేదంటే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది.

అమెరికాలో ప్రజలను కట్టడి చేయడం పోలీసులకు సాధ్యం కాకపోవడంతో సైన్యానికి బాధ్యతలు ఇచ్చారు. మన దగ్గర కూడా ప్రజలు పోలీసులకు సహకరించకపోతే, ఆర్మీని రంగంలోకి దించాల్సి వస్తుంది. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి, అందరూ జాగ్రత్తగా సహకరించి అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని ప్రజలను కోరుతున్నాను.

అప్రమత్తతే మనల్ని కాపాడుతుంది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు కవులు మంచి కవితలు రాయాలని కోరుతున్నాను.

నియంత్రణ విషయంలో పోలీసులు, అధికారులు మాత్రమే బయట కనిపిస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఎటు పోయారు? జీహెచ్‌ఎంసీలో 150 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వాళ్లంతా ఎటు పోయిండ్రు? అది మంచిది కాదు. అందరూ రంగంలోకి దిగాలి. పోలీసులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజాప్రతినిధులందరూ పనిచేయాలి.

బాధ్యత అంతా పోలీసులదే అంటే సరికాదు, మంత్రులు,ఎమ్మెల్యేల నుంచి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు... ఇలా అందరూ బాధ్యత తీసుకోవాలి. ప్రజలకు అవగాహన కల్పించాలి. పోలీసులతో పాటు మనం కూడా 24 గంటలూ పనిచేయాలి.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

రాష్ట్ర సరిహద్దుల దగ్గర దాదాపు 3,400 వాహనాలు నిలిచిపోయాయి. వాటికి ఇవాళ ఒక్కరోజు టోల్‌ ఛార్జీలు రద్దు చేసి వదిలేస్తున్నాం.

ఎవరికైనా ఆరోగ్య సమస్య ఉంటే 104 నంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలి. వెంటనే ప్రభుత్వం మీకు సాయం చేస్తుంది. రైతులు కూడా పట్టణాలలో ఉన్న మార్కెట్లకు రావద్దు. తమతమ ఊర్లలోనే వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

ఇళ్లలో స్వీయ నిర్బంధంలో ఉన్నవారు అలాగే ఉండాలి. మాట వినకపోతే వారి పాస్‌పోర్టులను శాశ్వతంగా రద్దు చేయాల్సి వస్తుంది.

ఎవరైనా అధిక ధరలకు సరకులు, కూరగాయలు అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసు పెట్టి, వారి దుకాణాల లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేస్తాం. తర్వాత మీరు ఎంత మొత్తుకున్నా ఫలితం ఉండదు.

రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. ఒక్క వ్యక్తి కూడా వీధుల్లోకి రావొద్దు. వస్తే పరిస్థితి కఠినంగా ఉంటుంది. ఎవరికైనా అత్యవసరం అయితే 100కు ఫోన్ చేయండి. పోలీసులు మీకు సాయం చేస్తారు.

సాయంత్రం 6 గంటలకే దుకాణాలన్నీ మూసివేయాల్సిందే. 6 గంటల 1 నిమిషానికి దుకాణం తీసి ఉన్నా సీజ్ చేసేస్తాం.

కరోనావైరస్ జాగ్రత్తలు

వ్యవసాయ పనులకు అనుమతి

గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు కొనసాగించవచ్చు. అయితే, అక్కడ కూడా ఎవరూ గుంపులు గుంపులుగా ఉండొద్దు. ఉపాధి హామీ పథకం పనులను కూడా కొనసాగిస్తాం. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణ పనులు కొనసాగించవచ్చు. కానీ, కార్మికులకు శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. ఎక్కడా గుంపులుగా ఉండొద్దు.

నౌకాశ్రయాలు మూసివేశారు. రైళ్లు ఆగిపోయాయి. దేశీయ, అంతర్జాతీయ విమానాలు కూడా పూర్తిగా రద్దయ్యాయి.

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు తన కుమారుడి పెళ్లిని వాయిదా వేసుకున్నారు. అలాగే అందరూ ఆలోచించాలి.

వీధుల్లోకి గుంపులు గుంపులుగా రాకూడదు. ఇద్దరు ముగ్గురు కలిసి ఉన్నా ఈ అంటు వ్యాధి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి, అందరూ జాగ్రత్తగా ఉండాలి. అయినా అనవసరంగా రోడ్ల మీదికి వస్తే పెట్రోల్ బంకులను కూడా మూసివేయాల్సి వస్తుంది.

సోమవారం కొందరు మీడియా ప్రతినిధులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగిందని తెలిసింది. అలాంటివి ఇకనుంచి జరగకూడదు. పోలీసులు కూడా మీడియా వారి పట్ల సంయమనంతో వ్యవహరించాలి.

బ్యాంకు ఖాతాల్లో నగదు

గురువారం నుంచి బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తాం. నగదు సాయాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమచేస్తాం.

రాష్ట్ర ప్రజలందరినీ చేతులెత్తి కోరుతున్నాను. అందరూ ప్రభుత్వానికి సహకరించండి.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)