కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, హెలెన్ బ్రిగ్స్
- హోదా, బీబీసీ న్యూస్
ప్రాణాంతక కరోనావైరస్ వన్యప్రాణుల నుంచి మనుషులకు ఎలా వ్యాపించిందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు.
''చైనాలో ఎక్కడో ఒక చోట గబ్బిలం ఒకటి ఆకాశంలో ఎగురుతూ విసర్జిస్తే అది అడవిలో పడి ఉంటుంది. అందులో కరోనా వైరస్ ఆనవాళ్లు ఉండుంటాయి. అడవి జంతువు ఏదైనా, బహుశా అలుగు(పాంగోలిన్) ఆకుల మధ్య పురుగుల కోసం వెతుకుతూ ఆ గబ్బిలం విసర్జితాలను సమీపించినప్పుడు అందులోని కరోనా వైరస్ దానికి సంక్రమించి ఉండొచ్చు.
అక్కడి నుంచి ఈ వైరస్ వన్యప్రాణుల్లో వ్యాపించగా అలాంటి ఒక వన్యప్రాణిని వేటాడినప్పుడు ఎవరైనా ఈ వైరస్ బారిన పడి.. వన్యప్రాణులను అమ్మే మార్కెట్లో ఉండేవారికి సంక్రమింపజేయడంతో ఇది ప్రబలడం ప్రారంభమై ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.


ఇందుకోసం ఈ వైరస్ ఏ జంతువుల్లో ఉంటుందన్నది గుర్తించి దాని ద్వారా తమ సూత్రీకరణ నిజమని నిరూపించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
ఇది కనుక్కోవడం ఒక రకంగా డిటెక్టివ్ కథలాంటిదని జూలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్‌కు చెందిన ప్రొఫెసర్ ఆండ్రూ కన్నింగ్‌హామ్ అన్నారు.
అడవిజంతువుల్లో అనేక రకాలకు ఈ వైరస్ ఉండొచ్చని.. ముఖ్యంగా గబ్బిలాల్లో వివిధ రకాల కరోనా వైరస్ ఉంటుందని అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒక రోగి శరీరం నుంచి ఈ కొత్త వైరస్ కోడ్‌ను శాస్త్రవేత్తలు గుర్తించినప్పుడు చైనాలో గబ్బిలాలతో సంబంధం బయటపడింది.
క్షీరదాలైన గబ్బిలాలు పెద్దపెద్ద సమూహాలుగా గుమిగూడుతాయి. ఇది సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తాయి. భూమి మీద ప్రతి ఖండంలోనూ వీటి ఉనికి ఉంది. ఇవి రోగాల బారిన పడడం చాలా అరుదు.. కానీ, వ్యాధికారకాలను మాత్రం అవి వ్యాపింపజేస్తాయి.
లండన్ యూనివర్సిటీ కాలేజ్ ప్రొఫెసర్ కేట్ జోన్స్ చెప్పిన ప్రకారం.. గబ్బిలాలు ఎగరడానికి కావాల్సిన శక్తి అవసరాలను సమకూర్చుకోవడంతో పాటు డీఎన్‌ఏకు కలిగే నష్టాన్ని మరమ్మతులు చేసుకునే సామర్థ్యాలనూ సంతరించుకున్నాయి. ఈ కారణంగానే ఇవి వైరస్‌లను తట్టుకుంటాయని భావిస్తున్నట్లు చెప్పారు కేట్ జోన్స్.
గబ్బిలాల ప్రవర్తన వైరస్‌ల వృద్ధికి వీలు కల్పిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అవి నివసించే విధానాన్ని పరిశీలిస్తే వాటికి పెద్ద సంఖ్యలో వైరస్‌లుంటాయని అర్థమవుతుందని నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జోనాథన్ బాల్ చెప్పారు. అంతేకాకుండా గబ్బిలాలు క్షీరదాలు కావడం వల్ల మానవులకు ప్రత్యక్షంగా కానీ ఇతర జీవుల ద్వారా కానీ వైరస్‌లను వ్యాపింపజేసే అవకాశముందని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
వేళ్లన్నీ పాంగోలిన్ వైపే..
ఇక ఈ చిక్కుముడిలో రెండో భాగమేంటంటే.. తన ఒంట్లో వైరస్ నింపుకొని వుహాన్ మార్కెట్‌కు తీసుకొచ్చిన జంతుజాతిని గుర్తించడం. ఈ విషయంలో అనుమానాలన్నీ పాంగోలిన్‌లపైనే ఉన్నాయి.
ప్రపంచంలో అత్యధికంగా అక్రమ రవాణాకు గురవుతున్న జంతువులు పాంగోలిన్‌లుగా చెబుతారు. ఇవి చీమలను తిని బతుకుతాయి. ప్రస్తుతం ఇవి అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. చైనా సంప్రదాయ ఔషధాల తయారీలో వీటిని ఉపయోగించడం వల్ల వీటికి ఆసియాలో మంచి గిరాకీ ఉంది. అంతేకాదు, పాంగోలిన్ మాంసాన్ని కొందరు బాగా ఇష్టపడతారు.
పాంగోలిన్‌లలో కనుగొన్న కరోనా వైరస్‌లకు మనుషుల్లో గుర్తించిన కరోనా వైరస్‌లకు దగ్గర పోలికలున్నట్లు చెబుతున్నారు. మనుషులకు సోకడానికి ముందు గబ్బిలాలు, పాంగోలిన్‌ల మధ్య కరోనా వైరస్ మార్పిడి జరిగిందా అన్న అనుమానాలున్నాయి. దీనికి సంబంధించి నిర్ధారణలకు రావడానికి ముందు నిపుణులు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. పాంగోలిన్‌లపై జరుగుతున్న అధ్యయనానికి సంబంధించి ఇంకా పూర్తి డేటా అందుబాటులోకి రాకపోవడంతో దీన్ని నిర్ధారించుకోవడం అసాధ్యం.
ఎన్ని పాంగోలిన్‌లపై అధ్యయనం చేశారు.. వాటి మూలాలు ఏంటనేది ముఖ్యమని ప్రొఫెసర్ కన్నింగ్‌హామ్ అన్నారు. ''ఉదాహరణకు.. అడవి నుంచి నేరుగా పాంగోలిన్‌లను శాంపిల్ కోసం తీసుకున్నారా.. లేదంటే ఎక్కడైనా బందీగా ఉన్నదో, మార్కెట్‌లోనిదో పాంగోలిన్‌పై అధ్యయనం చేశారా అన్నది ప్రధానం. అడవుల నుంచి ఎక్కువ సంఖ్యలో పాంగోలిన్‌లను తెచ్చి అధ్యయనం చేస్తే అది అర్థవంతంగా ఉంటుంది, మార్కెట్ల నుంచి తెచ్చిన ఒకట్రెండుపై అధ్యయనం చేస్తే ఫలితాలలో కచ్చితత్వం సందేహాస్పదమే''నన్నది కన్నింగ్‌హామ్ మాట.

ఫొటో సోర్స్, Getty Images
''పాంగోలిన్లు, గబ్బిలాలు, ఇతర అడవి జంతువులను మార్కెట్లలో తరచూ విక్రయిస్తారు. ఈ పరిస్థితులు ఒక జంతువు నుంచి మరో జంతువుకు వైరస్ సంక్రమించేలా చేస్తాయి. మనుషులకు కూడా ఇలాంటి చోట సంక్రమించే ప్రమాదముంది'' అన్నారు కన్నింగ్‌హామ్.
చైనాలో కరోనా వైరస్ ప్రబలడానికి కేంద్ర స్థానమైన వుహాన్ మార్కెట్‌ను మూసివేయడానికి ముందు అక్కడ అన్ని రకాల జంతువులు, పక్షులు బతికి ఉన్నవి విక్రయించడమే కాకుండా వాటి మాంసాన్నీ విక్రయించేవారని 'ది గార్డియన్' తెలిపింది. ఒంటెలు, కోలాలు అవయవాలతో పాటు తోడేలు పిల్లలు, తేళ్లు, ఎలుకలు, ఉడుతలు, నక్కులు, చెట్టు పిల్లులు, ముళ్ల పందులు, సాలమాండర్స్, తాబేళ్లు, మొసళ్లు, తొండలు, బళ్లులు, ఉడుములు వంటివన్నీ విక్రయించేవారు.
ఇటీవల కాలంలో మనకు తెలిసిన అనేక వైరస్‌లు అడవి జంతువుల నుంచే వచ్చాయి. ఎబోలా, హెచ్ఐవి, సార్స్ వంటివన్నీ అడవి జంతువుల నుంచే మనుషులకు సంక్రమించాయని ప్రొఫెసర్ కేట్ జోన్స్ అన్నారు. వైరస్‌లను గుర్తించే సామర్థ్యం పెరగడం ఇదంతా తెలుస్తోందని.. అటవీ ప్రాంతాల్లో మనుషుల చొరబాటు పెరగడం వల్ల మానవ జాతి ముందెన్నడూ ఎదుర్కోని వైరస్‌లు సంక్రమిస్తున్నాయని జోన్స్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రమాద కారకాలను తెలుసుకుంటే నివారణా చర్యలూ తీసుకోవచ్చని.. అయితే, అవి వన్యప్రాణులపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఉండాలని ప్రొఫెసర్ కన్నింగ్‌హామ్ అన్నారు. గబ్బిలాలలో అనేక వైరస్‌లు ఉంటున్నా పర్యావరణ వ్యవస్థలో అవి కూడా అవసరమేనని చెప్పారు. ''కీటకాలను ఆహారంగా తీసుకునే గబ్బిలాలు దోమలు, పొలాల్లోని కీటకాలను తింటాయని.. పండ్లను తినే గబ్బిలాలు చెట్ల మధ్య పరాగసంపర్కం చేసి విత్తనాలను వ్యాప్తికి సహకరిస్తాయని చెప్పారు.
వేల మంది మరణానికి కారణమైన ఈ వైరస్ మానవులకు ఎలా సంక్రమించిందన్నది కచ్చితంగా తెలుసుకోలేకపోయినా.. భవిష్యత్తులో ఇలాంటి వైరస్‌లను ఎదుర్కోవడానికి ఈ అధ్యయనాలు ఉపకరిస్తాయని ఈస్ట్ ఆంగ్లియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ డయానా బెల్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:
- కరోనా వైరస్ రోగులకు సేవలు అందిస్తున్న గర్భిణీ - ప్రభుత్వ మీడియాపై తీవ్ర విమర్శలు
- కరోనావైరస్ - ‘మహమ్మారిగా మారకముందే ఎదుర్కోండి’ - ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
- దిల్లీ హింస: ముస్లింలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో హింసకు కారకులెవరు? ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారు?
- దిల్లీ హింస: తాహిర్ హుస్సేన్ ఫ్యాక్టరీ సీజ్.. ఐబీ అధికారి మృతి కేసులో AAP నాయకుడి పాత్రపై అనుమానాలు
- డయానా నుంచి ట్రంప్ వరకు: తాజ్‌మహల్‌ను సందర్శించిన విదేశీ ప్రముఖుల ఫొటోలు
- దిల్లీ హింస: సీఏఏ అనుకూల, వ్యతిరేక నిరసనలతో రాత్రంతా భయం గుప్పిట్లో...
- యువకుడి ఆచూకీ కోసం వెదుకుతుంటే సింహాల బోనులో అస్థిపంజరం దొరికింది
- దిల్లీ హింసను 2002 నాటి గుజరాత్ అల్లర్లతో ఎందుకు పోలుస్తున్నారంటే...
- యాపిల్ మొట్టమొదటి ఇండియన్ స్టోర్ 2021లో ప్రారంభం: టిమ్ కుక్
- దిల్లీ హింస ప్రభావం హైదరాబాద్‌పై ఎలా ఉంది?
- అభినందన్ క్రాష్ ల్యాండింగ్ ఎలా జరిగింది? అప్పుడు అక్కడ ఉన్నవాళ్లు ఏమన్నారు...
- దిల్లీ హింస: జస్టిస్ మురళీధర్ ఎవరు? ఆయన బదిలీపై చర్చ ఎందుకు?
- వాట్సాప్, ట్విటర్, టిక్‌టాక్‌లపై క్రిమినల్ కేసు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









