కరోనా వైరస్: వూహాన్‌లో ఏం జరుగుతోందో ప్రపంచానికి చూపించిన రిపోర్టర్స్ మిస్సింగ్

ఫొటో సోర్స్, Getty Images
ఇద్దరు పాత్రికేయులు... కరోనావైరస్ పుట్టినిల్లయిన చైనాలోని వూహాన్లో అసలేం జరుగుతోందో ప్రపంచానికి అందించాలన్నదే వారి తాపత్రయం. మిగిలిన దేశంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయన ఆ నగరంలో తాజా పరిస్థితిపై ఆన్‌లైన్లో వీడియోలు పోస్ట్ చేసేవారు. అక్కడ దయనీయ స్థితిపై కథనాలను అందించేవారు. కానీ ఒక్కసారిగా వారిద్దరూ మాయమైపోయారు.
ఫాంగ్ బిన్, షెన్ కిషి.. ఇద్దరూ హూబే ప్రావిన్స్ రాజధాని వూహాన్లో తలెత్తిన సంక్షోభం గురించి తాము అక్కడ చూసింది చూసినట్టుగా ప్రపంచానికి అందించాలనుకున్నారు. ఫలితంగా వాళ్లు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసే వీడియోలను వేలాది మంది వీక్షించారు.
కానీ ఒక్కసారిగా వాళ్ల ఛానెల్స్ ఇప్పుడూ మూగబోయాయి. ఇన్నాళ్లు వాళ్లను సామాజిక మాధ్యమాల్లో ఫాలో అవుతూ వచ్చిన వాళ్లంతా ఒక్కసారిగా వాళ్ల నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.



ఫొటో సోర్స్, YOUTUBE
అసలింతకీ ఎవరీ ఫాంగ్ బిన్?
వూహాన్‌లో వ్యాపారి అయిన ఫాన్ బిన్ అక్కడ కరోనావైరస్ కారణంగా అక్కడ తలెత్తిన పరిస్థితులకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తుండేవారు. ఈ విషయంలో తన శక్తిమేర ఉన్నది ఉన్నట్టు చూపిస్తానంటూ తన రిపోర్టింగ్‌లో వాగ్దానం చేశారు.
జనవరి 25న తన మొదటి వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. అయితే దాన్ని చైనా ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ వర్ట్యువల్ ప్రైవేట్ నెట్ వర్క్స్(వీపీఎన్) ద్వారా ఆ వీడియో అందుబాటులో ఉంది. మొదట్లో ఆయన నగరమంతా డ్రైవ్ చేస్తూ, వేర్వేరు ప్రాంతాలను చూపుతూ చేసిన వీడియోలను వెయ్యిమందికి అటూ ఇటూగా వీక్షించేవారు.
కానీ ఫిబ్రవరి 1న వూహాన్లోని ఓ ఆస్పత్రి ముందు మినీ వ్యాన్‌లో 8 శవాలను ఎక్కిస్తున్న వీడియో బాగా వైరల్ అయ్యింది. ఏకంగా 2 లక్షల సార్లు జనం ఆ వీడియోను చూశారు. అయితే అదే రోజు పోలీసులు తన ఇంట్లో చొరబడి తనను, తన వీడియోల గురించి ప్రశ్నించారని ఆయన ఆరోపించారు.
ఆయన్ను తీసుకెళ్లి హెచ్చరించి విడిచిపెట్టారని చెప్పారు. కానీ ఫిబ్రవరి 9న 13 సెకెండ్ల నిడివి ఉన్న వీడియోను పోస్ట్ చేశారు. అందులో ప్రభుత్వంపై తిరగబడ్డ జనం ..ప్రజలకు తిరిగి అధికారం రావాలంటూ నినాదాలు చేస్తున్నట్టు ఉంది. సరిగ్గా అప్పటి నుంచే ఆయన అకౌంట్... సైలెంట్ అయ్యింది.

ఫొటో సోర్స్, YOUTUBE
షెన్ క్విషీ ఎవరు ?
షెన్ ఒకప్పుడు హ్యూమన్ రైట్స్ న్యాయవాదిగా పని చేసేవారు. ఆ పై వీడియో జర్నలిస్ట్‌గా మారారు. అప్పటికే ఆయనకు హక్కుల కార్యకర్తగా పేరుంది. గత ఆగస్టులో హాంకాంగ్‌లో మొదలైన ఆందోళనల్ని కవర్ చెయ్యడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన జనంలో బాగా ప్రాచుర్యం పొందారు.
అయితే ఆ కవరేజ్ కారణంగా ఆయనకు వేధింపులు ఎదురయ్యాయి. తిరిగి స్వదేశానికి రావడంలో చైనా అధికారుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చైనీస్ సోషల్ మీడియాలో సుమారు 7 లక్షల మంది ఫాలోయర్లు ఉన్న ఆయన అకౌంట్లను అధికారులు డిలీట్ చేశారు.
అయినా ఆయన వెనకడుగు వేయలేదు గత అక్టోబర్లో యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఛానెల్‌కు సుమారు 4లక్షల మంది సబ్ స్క్రైబర్లున్నారు. ట్విట్టర్లో సుమారు 2లక్షల65వేల మంది ఆయన్ను ఫాలో అవుతున్నారు. జనవరి నెలాఖరులో వూహన్ వెళ్లి అక్కడ దారుణ పరిస్థితుల్ని రిపోర్ట్ చెయ్యాలని ఆయన నిర్ణయించుకున్నారు.
" వాస్తవాలను చిత్రీకరించేందుకు మాత్రమే నా కెమెరాను ఉపయోగిస్తాను. నిజాన్ని దాచి పెట్టబోనని వాగ్దానం చేస్తున్నాను. " ఇది ఆయన మొట్ట మొదటిసారిగా చిత్రీకరించిన యూట్యూబ్ వీడియోలో చెప్పిన విషయం.
వూహాన్లో వేర్వేరు ఆస్పత్రులను ఆయన సందర్శించారు. అక్కడ పరిస్థితుల్ని గమనించడమే కాదు అక్కడ రోగులతో మాట్లాడారు కూడా. ఇది తనను ప్రమాదంలోకి నెడుతుందన్న విషయం కూడా ఆయనకు తెలుసు.
ఇలా ఎంత కాలం కొనసాగించగలనో తెలియదని బీబీసీ ప్రతినిధి జాన్ సడ్వర్త్‌తో ఆయన చెప్పారు. నిషేధాజ్ఞలు చాలా కఠినంగా కొనసాగుతున్నాయని... తన వీడియోలను ఎవరు షేర్ చేసినా వాళ్ల అకౌంట్లను తక్షణం మూసేస్తున్నారన్నారు.
ఫిబ్రవరి 7న షెన్ ట్విట్టర్ అకౌంట్లో ఓ వీడియో పోస్ట్ అయ్యింది. ప్రస్తుతం షెన్ అకౌంట్‌ను ఆయన ఫ్రెండ్ నిర్వహిస్తున్నారు. అందులో తన బిడ్డ కనిపించడం లేదని షెన్ తల్లి చెబుతున్నారు. ఆ తర్వాత షెన్ స్నేహితుడు షు షియోడంగ్ తనను బలవంతంగా వెలి వేశారంటూ యూట్యూబ్ వీడియోలో ఆరోపించారు.

ఫొటో సోర్స్, EPA
అధికార వర్గాలేం చెబుతున్నాయి ?
ఈ విషయంలో చైనా అధికార వర్గాలు ఎప్పటిలాగే మౌనం వహిస్తున్నాయి. ఇప్పటి వరకు వాళ్లిద్దరూ ఎక్కడున్నారన్న విషయంలో ఎలాంటి ప్రకటన చెయ్యలేదు వాళ్లద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారా లేదా బలవంతంగా ఎక్కడైనా దాచారా అన్న విషయంలో ఇప్పటకీ స్పష్టత లేదని ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ పరిశోధకుడు పాట్రిక్ పూన్ అన్నారు.
కనీసం వారి కుటుంబ సభ్యులకైనా అధికారులు భరోసా ఇవ్వాల్సివసరం ఉందని అభిప్రాయపడ్డారు. వారికి ఆచూకీకి సంబంధించిన సమాచారాన్నివ్వాలన్నారు. అలాగే వాళ్లు కావాలనుకున్న న్యాయవాదిని అనుమతించాలని... లేదంటే వాళ్లను వేధిస్తున్నారన్న విషయం అధికారికంగా ధ్రువీకరించినట్టవుతుంది పూన్ బీబీసీతో చెప్పారు.
వాళ్లు కనిపించకుండాపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు ?
ఎదురు చెప్పే గళాలను నొక్కేయడంలో బీజింగ్ పెట్టింది పేరు. అందులోనూ కరోనావైరస్ విషయంలో వాళ్లు ఏ విషయమూ బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. చైనా ఈ విషయంలో ఇలా వ్యవహరించడం పెద్దగా ఆశ్చర్యపరచలేదన్నది ఓ మానవ హక్కుల పరిశోధకుని మాట.
అసలు ఈ వైరస్ గురించి డిసెంబర్లో మొట్ట మొదట హెచ్చరించిన వైద్యుని విషయంలోనే అసత్య ప్రచారాలు చెయ్యద్దంటూ హెచ్చరించారు. ఆ తర్వాత ఆయన అదే వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లడయ్యాయి. దీంతో నివ్వెర పోయిన చైనా అధికార వర్గాలు సోషల్ మీడియాలో ఆయన మరణంపై వెల్లువెత్తిన విమర్శలన్నింటినీ సెన్సార్ చెయ్యడం మొదలుపెట్టాయి.

ఫొటో సోర్స్, Reuters
నిజానికి 2003లో సార్స్ వైరస్ వణికించిన సమయంలోనూ, ఆతర్వాత 2008లో వాంచువాన్ భూకంపం సమయంలోనూ, 2015లో టియాంజిన్ రసాయనిక పేలుడు సందర్భంలోనూ వాస్తవాలు బయటకు రాకుండా చైనా ప్రభుత్వం ప్రజల గొంతును అణిచివేసే ప్రయత్నం చేసిందని మానవహక్కుల కార్యకర్త యాకి వాంగ్ బీబీసీతో చెప్పారు.
సమాచార స్వేచ్ఛ, పారదర్శకత, మానవహక్కుల్ని గౌరవించడం, వ్యాధిని నిర్మూలించడానికి తగిన సౌకర్యాలను ఏర్పాటు చేసే విషయంలో గతానుభవాలనుంచి చైనా నేర్చుకోవాలే తప్ప వాటిని దాచే ప్రయత్నం చెయ్యకూడదని ఆమె చెప్పుకొచ్చారు. ఫాంగ్, షెన్‌లను కనిపించకుండా చెయ్యడం ద్వారా అధికారులు తమకు తామే హాని తలపెట్టుకుంటున్నారని ఆరోపించారు.
చైనీస్ న్యూస్ సైట్ విబో షెన్, ఫాంగ్ విషయంలో కామెంట్లను సాధ్యమైనంత వరకు పోస్ట్ చేస్తున్నా... అది కూడా ఎంతో కాలం కొనసాగకపోవచ్చు. ఎందుకంటే అనుక్షణం గమనించినే సెన్సర్లు ఎప్పుడైనా వాటిని డిలీట్ చెయ్యవచ్చు.
వాళ్లు చరిత్రను తిరగరాశారు... ఇది ఆ కామెంట్లలో ఒకటి. చూస్తుంటే త్వరలోనే మరో షెన్ క్విషీ పుట్టుకురావచ్చేమో... చెప్పలేం.

ఇవి కూడా చదవండి
- కరోనావైరస్ సోకిందన్న భయంతో ఆత్మహత్య... అసలేం జరిగింది?
- అప్పుడే పుట్టిన చిన్నారికి కరోనావైరస్
- కరోనావైరస్.. సార్స్ వైరస్‌ని మించిపోతోందా
- కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?
- కరోనావైరస్ దెబ్బకు బుధవారం ఒక్క రోజే హుబేలో 242 మంది మృతి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- రైలు ప్రయాణికులను హడలెత్తించిన 'కరోనావైరస్ బాధితుడు'
- కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ దిల్లీని దాటి ఏదైనా సాధించగలదా?
- వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ :'కొట్టుకుంటున్న ఎలుకల' ఫొటోకు 'టాప్ పీపుల్స్ పోల్' అవార్డ్
- మేరీ కోమ్: BBC Indian Sportswoman of the Year నామినీ
- ద్యుతి చంద్: BBC Indian Sportswoman of the Year నామినీ
- కరోనావైరస్ వ్యాక్సిన్ తయారీకి ఫార్మా సంస్థలు ఎందుకు ముందుకురావట్లేదు...
- పాకిస్తాన్లో చక్కెర కొరత... ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- శ్రీనివాస గౌడ: ఉసేన్ బోల్ట్‌ను మించిన వేగంతో ఈ రైతుబిడ్డ పరిగెత్తాడా?
- నెలసరిలో ఉన్నారేమో అని విద్యార్థినులను దుస్తులు విప్పించి చెక్ చేశారు
- కరోనా వైరస్: పిల్లలపై ప్రభావం చూపలేకపోతున్న వైరస్.. కారణాలు చెప్పలేకపోతున్న వైద్య నిపుణులు
- ‘ఎప్పుడూ ప్రేమలో పడం.. ప్రేమ వివాహం చేసుకోం’ అని అమ్మాయిలతో ప్రమాణం చేయించిన కాలేజీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









