మేరీ కోమ్: BBC Indian Sportswoman of the Year నామినీ

- రచయిత, రుజుత లుక్టుకే
- హోదా, బీబీసీ ప్రతినిధి
"మేరీ కోమ్ లాంటి బాక్సర్ మరొకరు లేరు, ఉండరు. మరో మేరీని తయారు చేయడం కష్టం"- ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన 'పద్మవిభూషణ్' మేరీ కోమ్‌తో మాట్లాడుతుంటే మీకు ఈ మాట మళ్లీ మళ్లీ వినిపిస్తుంది. మేరీయే ఈ మాట అంటారు. వెంటనే పెద్దగా నవ్వేస్తారు.
మేరీలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంటుంది. ఆమె ప్రత్యేకమైన మనిషి. సహజసిద్ధ ప్రతిభానైపుణ్యాలున్న బాక్సర్. తానంటే దేవుడికి ఎంతో ప్రేమని, దేవుడి కృప వల్లే తాను నేడీ స్థాయిలో ఉన్నానని ఆమె చెబుతారు.
37 ఏళ్ల మేరీ ఏడుసార్లు వరల్డ్ చాంపియన్‌షిప్ బంగారు పతకాలు సాధించారు. ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్నారు. ఒలింపిక్ పతకం గెలిచిన తొలి, ఏకైక భారతీయ మహిళా బాక్సర్ మేరీయే. ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లోనూ ఆమె పసిడి పతకాలు గెలుపొందారు.
ఈ పతకాల్లో అత్యధికం 2007లో సిజేరియన్ కాన్పులో కవలలకు జన్మనిచ్చిన తర్వాత సాధించినవే. అత్యున్నత స్థాయి పోటీల్లో తలపడి రాణించడానికి ఏం కావాలో, ఏం చేయాలో మేరీకి తెలుసు. తన కఠోర శ్రమే ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది.


మేరీ ఐదడుగుల రెండు అంగుళాల ఎత్తు ఉంటారు. బరువు 48 కేజీలు. బాక్సింగ్ చాంపియన్‌కు మైక్ టైసన్‌లా ప్రత్యర్థిని భయపెట్టే కళ్లు, మొహమ్మద్ అలీ లాంటి బాడీ లాంగ్వేజ్ ఉండాలని చాలా మంది అనుకుంటారు. మేరీ అలా ఉండరు. 'రింగ్' లోపల, వెలుపల చిరునవ్వుతో ఉంటారు. వేగం, చెక్కు చెదరని ఏకాగ్రతతో తనదైన శైలిలో ప్రత్యర్థితో పోరాడతారు.
"మన పోరాటం మనమే చేయాలి"
"కోచ్, సహాయ సిబ్బంది, కుటుంబ సభ్యుల అండ మనకు ఒక దశ వరకే తోడ్పడతాయి. బరిలోకి దిగాక మనం ఒంటరి. రింగ్‌లో ఆ తొమ్మిది-పది నిమిషాలే అత్యంత కీలకం. మన పోరాటం మనమే చేయాలి. ఇదే మాట నాకు నేను ఎప్పుడూ చెప్పుకొంటుంటాను. ఈ పోరాటానికి సిద్ధమయ్యేందుకు శారీరకంగా, మానసికంగా నన్ను నేను మెరుగుపరచుకొనేందుకు ప్రయత్నిస్తాను. కొత్త టెక్నిక్‌లు నేర్చుకుంటాను. నా బలాలను పెంచుకోవడానికి, బలహీనతలను అధిగమించడానికి ప్రయత్నిస్తాను. ప్రత్యర్థుల గురించి బాగా అధ్యయనం చేస్తా. చురుగ్గా పోరాడటాన్ని నేను నమ్ముతా" అని మేరీ నాతో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

ఫొటో సోర్స్, Twitter/MangteC
మేరీ పోరాటంలో చురుకుదనం ఎంత?
"రోజుకు రెండు గంటలు బాక్సింగ్ సాధన చేసినా సరిపోతుంది. కానీ క్రమశిక్షణ ముఖ్యం" అంటారు మేరీ. శారీరక ధారుఢ్యం, ఆహారం విషయంలో అతిగా షరతులు పెట్టుకోవడం కంటే సమతూకం పాటించడాన్నే తాను నమ్ముతానని ఆమె చెబుతారు.
ఇంట్లో వండిన మణిపురి వంటకాలంటే ఆమెకు చాలా ఇష్టం. ప్రొటీన్ అధికంగా ఉండే అన్నం, ఉడికించిన కూరగాయలు, చేపలను ఎక్కువగా తింటారు.
తన మనోస్థితి (మూడ్)కి తగిన విధంగా మేరీ సాధన షెడ్యూలును తయారుచేసుకుంటారు. 37 ఏళ్ల వయసులో విజయాలు సాధించాలంటే ఇలాంటి మార్పులు అవసరమని ఆమె అంటారు.
"2012కు ముందున్న మేరీ, ఇప్పుడు మీ ముందున్న మేరీ ఒకరు కాదు. యువ మేరీ ప్రత్యర్థిపై పంచ్‌ల మీద పంచ్‌లు కురిపించేది. నేటి మేరీ అలా కాదు. ప్రత్యర్థిపై దాడికి సరైన అవకాశం కోసం ఎదురుచూడటం తను నేర్చుకుంది. అలా తన శక్తిని కొంత ఆదా చేసుకొంటుంది" అంటూ తన బాక్సింగ్ శైలిలో మార్పును మేరీ వివరించారు.

ఫొటో సోర్స్, Twitter/MangteC
అంతర్జాతీయ ప్రస్థానం 2001లో మొదలు
బాక్సింగ్‌లో మేరీ అంతర్జాతీయ ప్రస్థానం 2001లో మొదలైంది. ఆమె మొదట్లో అపారమైన తన శక్తి, సామర్థ్యం (స్టామినా)పై ఎక్కువగా ఆధారపడేవారు. ఇప్పుడు నైపుణ్యాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు.
మేరీ ఆరుసార్లు 'వరల్డ్ అమెచ్యూర్ బాక్సింగ్ చాంపియన్' అయిన ఏకైక మహిళ. తొలి ఏడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో ప్రతి చాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన ఒకే ఒక్క మహిళా బాక్సర్. ఎనిమిది ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాలు సాధించిన ఏకైక బాక్సర్ (మహిళలు, పురుషుల్లో) కూడా.
ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (ఏఐబీఏ) 'వరల్డ్ విమెన్స్ ర్యాంకింగ్ లైట్ ఫ్లైవెయిట్' విభాగంలో ఆమె గతంలో నంబర్ 1 ర్యాంకు దక్కించుకున్నారు.
2014లో దక్షిణ కొరియాలోని ఇన్‌చియాన్ నగరంలో ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలుపొంది, ఈ క్రీడాపోటీల చరిత్రలోనే తొలిసారి పసిడి పతకం సాధించిన భారత మహిళా బాక్సర్‌గా ఆమె రికార్డు నెలకొల్పారు. 2018 కామన్‌వెల్త్ క్రీడాపోటీల్లో బంగారు పతకం గెలిచి, ఈ పోటీల చరిత్రలో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న తొలి భారత మహిళా బాక్సర్‌గా మరో రికార్డు సృష్టించారు.
ఐదుసార్లు 'ఏసియన్ అమెచ్యూర్ బాక్సింగ్ చాంపియన్' అయిన ఏకైక బాక్సర్ మేరీ.

ఫొటో సోర్స్, Twitter/MangteC
కొత్త జీవితాన్ని ఇచ్చిన బాక్సింగ్
మేరీ ఎన్నో కష్టాలను అధిగమిస్తూ వచ్చారు. చిన్ననాటి నుంచే ఆమె జీవితం సవాళ్లతో కూడుకొని ఉంది. పేద కుటుంబం కావడంతో మూడు పూటలా తగినంత తిండి కూడా ఉండేది కాదు.
ఇంటిపనులను ఆమె ఎప్పుడూ నిర్లక్ష్యం చేసేవారు కాదు. మెరుగైన జీవితం కోసం తపన పడేవారు. తన పరిస్థితులను ఎలా మార్చుకోగలనా అని ఎప్పుడూ ఆలోచించేవారు.
మేరీ చదువులో రాణించలేదు. కానీ తను పాల్గొన్న ప్రతి క్రీడలో అసాధారణ ప్రతిభను చాటారు.
మణిపూర్‌కు చెందిన బాక్సర్ డింకో సింగ్ 1998లో బ్యాంకాక్ ఆసియా క్రీడాపోటీల్లో పసిడి పతకం సాధించడం మేరీలో ప్రేరణ కలిగించింది. ఆమెను బాక్సింగ్ వైపు నడిపించింది.
"బాక్సింగ్ నాకు కొత్త జీవితాన్నిచ్చింది. మెరుగ్గా ఎలా జీవించాలో నేర్పింది. జీవితంలోగాని, బాక్సింగ్ రింగ్‌లోగాని నేనో పరాజితురాలిగా మిగిలిపోవాలనుకోలేదు" అని మేరీ ఉద్వేగంగా చెబుతారు.

ఫొటో సోర్స్, Twitter/MangteC
"వెనకడుగు నాకో ప్రత్యామ్నాయం కాదు"
మేరీ విద్యార్థి దశలో 15 ఏళ్ల వయసులో బాక్సింగ్‌లోకి వచ్చారు. ఎత్తు తక్కువగా ఉండటం, పలుచగా ఉండటం వల్ల ఆమెను తోటి విద్యార్థులు తేలిగ్గా ఓడించగలిగేవారు. ఆమెకు ముఖంపై చాలాసార్లు గాయాలయ్యేవి. అయినా వెనక్కు తగ్గేదికాదు.
"నాడు వెనకడుగు వేయడం నాకో ప్రత్యామ్నాయమే కాదు" అని మేరీ చెబుతారు.
2000లో రాష్ట్ర బాక్సింగ్ చాంపియన్‌షిప్ గెలిచిన తర్వాత ఆమెకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితులు రాలేదు.
ఈ క్రమంలో అంతర్జాతీయ సవాళ్లకు ఆమె సిద్ధమయ్యారు.

ఫొటో సోర్స్, Twitter/MangteC
అర్థం చేసుకొనే జీవిత భాగస్వామి
ఓంఖ్లర్ కోమ్ రూపంలో మేరీకి అర్థం చేసుకొనే జీవిత భాగస్వామి దొరికారు. 2005లో ఆయన్ను పెళ్లాడారు. తర్వాత రెండేళ్లకు 2007లో కవలలకు జన్మనిచ్చారు.
పిల్లల బాగోగుల పూర్తి బాధ్యతలు ఓంఖ్లర్ తీసుకున్నారు. మేరీ తిరిగి బాక్సింగ్ సాధన ప్రారంభించారు.
మేరీ తిరిగి పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టాక, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వరుసగా నాలుగో స్వర్ణాన్ని 2008లో సాధించారు.
ఆ సమయంలో ప్రైవేటు వార్తా చానళ్లు రావడం, ప్రసారాలు విస్తరించడం వల్ల భారత్‌లో క్రీడా సంస్కృతి నెమ్మదిగా అభివృద్ధి చెందింది.
అంతర్జాతీయ వేదికల్లో మేరీ అసాధారణ విజయాలు మీడియా దృష్టిని ఆకర్షించాయి. ఆమె బాగా ప్రాచుర్యం పొందారు.

ఫొటో సోర్స్, Twitter/MangteC
ఇటీవల మేరీ ప్రతిష్ఠాత్మక పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు.
ఇది దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం. దీనికి ఒక మహిళా అథ్లెట్ పేరును క్రీడాశాఖ ప్రతిపాదించడం ఇదే తొలిసారి.
2016 ఏప్రిల్ 25న మేరీని రాష్ట్రపతి రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ చేశారు. ఎంపీగా ఆమె క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. సొంత రాష్ట్రం మణిపూర్ అంశాల గురించి ఆమె సభలో మాట్లాడుతుంటారు.
పేదరికం, ఇతర కష్టాలన్నీ అధిగమించి మేరీ చాంపియన్ అయ్యారు. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఆమె, తన కలలను సాకారం చేసుకొనేందుకు ఇప్పటికీ పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు.
ఏడో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌పై మేరీ గురిపెట్టారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌పైనా ఆమె దృష్టి సారించారు.

ఇవి కూడా చదవండి:
- మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వివాదం - ‘మా’లో ఏం జరుగుతోంది? సమస్య ఎక్కడ మొదలైంది?
- నంబి నారాయణన్: ఒక నకిలీ ‘గూఢచార కుంభకోణం’ ఈ సైంటిస్టు జీవితాన్ని ఎలా నాశనం చేసిందంటే..
- అడవిలో తప్పిపోయి, 34 రోజులపాటు బెర్రీలు తింటూ ప్రాణాలు నిలబెట్టుకున్న తల్లీ పిల్లలు
- కరోనా వైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో...
- ఆసిఫాబాద్ అత్యాచారం, హత్య: ‘అది ఆడమనిషి శరీరంలానే లేదు... నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’
- అంతర్జాతీయ పోటీల్లో భారత్ పెట్టుకున్న ఆశల భారాన్ని మహిళా క్రీడాకారులు ఎలా మోస్తున్నారు?
- కరోనా వైరస్: చైనాలో 106కు చేరిన మరణాలు... ఇతర దేశాల్లో పెరుగుతున్న బాధితులు
- బంగారం ధరలకు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఏమిటి సంబంధం...
- భారత్‌లో ప్రతి 20 మంది చిన్నారుల్లో ఒకరు అయిదేళ్లలోపే చనిపోతున్నారు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










