హిమ దాస్ గోల్డ్ మెడల్స్ విలువెంత.. సోషల్ మీడియా గోరంతను కొండంత చేసిందా: అభిప్రాయం

ఫొటో సోర్స్, Facebook/HimaDas09
- రచయిత, సి.వెంకటేష్
- హోదా, క్రీడా విశ్లేషకులు, బీబీసీ కోసం
బంగారమంటే మనకు భలే ఫాసినేషన్. అందుకే అథ్లెట్ హిమ దాస్ మూడు వారాల వ్యవధిలో ఐదు స్వర్ణాలు గెలిచిందంటే తెగ మురిసిపోయాం.
సోషల్ మీడియాలోనైతే నెటిజెన్లు చెలరేగిపోయారు. అది ఇరవై నాలుగు క్యారెట్ల నిఖార్సయిన బంగారమా కాదా అన్నది ఎవరూ పట్టించుకోలేదు. హిమ దాస్ యూరప్‌లో పాల్గొన్న రేసుల వీడియోలు వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విటర్ లాంటి మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఆమె ఫొటోను సోషల్ మీడియాలో చాలామంది డిస్ప్లే పిక్, ప్రొఫైల్ పిక్స్‌గా పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా త్రివర్ణ పతాకంతో ఉన్న హిమ ఫొటోలే కనిపిస్తున్నాయి. ఆ టీనేజ్ అథ్లెట్‌ను పొగడడంతోనే నెటిజెన్లు ఆగలేదు. ఎమోషనల్‌గా కొన్ని విమర్శలకు కూడా దిగారు.

ఫొటో సోర్స్, Facebook/HimaDas09
హిమ ఇంత ఘనత సాధించినా ఒక్క పత్రిక కూడా ఆమె గురించి మొదటి పేజీలో రాయలేదు అని కొందరు.. 'క్రికెటర్లు, షట్లర్లకే ఇళ్ల స్థలాలు, కార్లు ఇస్తారా, మా గోల్డెన్ గర్ల్‌కి ఇచ్చేదేమీ లేదా’ అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ సామాజిక కోణం కూడా పొడసూపింది. ఎప్పటిలాగే ఈ సరికొత్త సెలెబ్రిటీ కులం ఏమిటో తెలుసుకోడానికి గూగుల్‌లో జనాలు తెగ వెతికేశారు.
పేరు చివర్లో 'దాస్ ' అని ఉంది కాబట్టి ఆమెది బ్రాహ్మణ కులం అని కొందరు తేల్చేస్తే.. దాస్ అన్న పేరు బెంగాల్, బీహార్ ప్రాంతాల్లోని మౌలిక్ కాయస్థులు పెట్టుకుంటారు కాబట్టి ఆమెది కాయస్థ కులమని ఇంకొందరు అంచనా వేశారు.
హిమది ధానుక్ అనే దళిత కులమని మరి కొందరి అభిప్రాయపడ్డారు. ఓ దళిత ఆడబిడ్డ ఇంత ఘనత సాధించినా అగ్రవర్ణ మీడియా ఆమెపై శీతకన్ను వేసిందన్న ఆగ్రహావేశాలు కూడా సోషల్ మీడియా వేదికగా వ్యక్తమయ్యాయి.

ఫొటో సోర్స్, Facebook/HimaDas09
మెరిసేదంతా బంగారం కాదని షేక్స్‌పియర్ ఏనాడో చెప్పాడు. హిమ సాధించిన గోల్డ్ మెడల్స్ అలాంటివే.
చెక్ రిపబ్లిక్, పోలండ్ దేశాల్లో జరిగిన రేసుల్లో హిమ ఈ స్వర్ణాలు గెలిచింది. ఈ రేసులకు అంతర్జాతీయ అథ్లెటిక్ సమాఖ్య ఇచ్చిన రేటింగ్ ఈ, ఎఫ్ మాత్రమే. అంటే అతి తక్కువ స్థాయివని అర్థం.
ఈ రేసుల్లో పాల్గొన్న హిమ దాస్ పోటీదారులెవ్వరి టైమింగ్ ఆమె టైమింగ్ కన్నా మెరుగ్గా లేదు. ఒక రేసులోనైతే ఆమె ప్రత్యర్థులందరూ భారత మహిళలే. 200,400 మీటర్ల ఈ రేసుల్లో ఇప్పుడు సాధించిన టైమింగ్స్ కన్నా ఆమె మునుపటి టైమింగ్సే మెరుగ్గా ఉన్నాయి.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ జరగనుంది. ఆ మెగా ఈవెంట్‌కు క్వాలిఫై కావడానికి అవసరమైన టైమింగ్‌ను 400 మీటర్లలో గానీ, 200 మీటర్లలో గానీ హిమ దాస్ ఈ సీజన్ రేసుల్లో సాధించనేలేదు.
తనకు లభించిన అభినందనల వెల్లువకు స్పందిస్తూ హిమ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇవి వామప్ (ప్రాక్టీసు) రేసులు మాత్రమేనని అందులో స్పష్టం చేసింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్ లాంటి ప్రధాన పోటీల్లో నెగ్గాలని ఆశీర్వదించమని కోరింది.
అదీ సంగతి. ఇలాంటి మామూలు విజయాలను మన సోషల్ మీడియా మోతాదుకు పదింతలు మించి సెలెబ్రేట్ చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
హిమ దాస్‌ను, ఆమె సాధించిన విజయాలను తక్కువ చేసి మాట్లాడడం ఈ వ్యాసం ఉద్దేశం కాదు. లెజెండరీ పి.టి. ఉష తర్వాత ట్రాక్ ఈవెంట్లలో మనకు దొరికిన ఆణిముత్యం ఆమె.

ఫొటో సోర్స్, Facebook/HimaDas09
నిరుడు జులైలో ఫిన్లాండ్‌లో జరిగిన అండర్-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో హిమ 400 మీటర్ల పరుగులో స్వర్ణ పతకం గెలిచింది. ఆమెకు ముందు ఏ స్థాయిలో కూడా ఒక ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోని ట్రాక్ ఈవెంట్(పరుగు పందాలు)లో భారత్‌కు చెందిన మరే పురుష లేదా మహిళా అథ్లెట్ కూడా గోల్డ్ మెడల్ సాధించింది లేదు. అంతటి చారిత్రాత్మక విజయం అది.
పోయిన ఏడాదే ఆసియా క్రీడల్లోని రిలే రేసుల్లో కూడా అమె రెండు గోల్డ్ మెడల్స్ గెలవగలిగింది. అయితే సీనియర్ స్థాయిలో ఆమె ఇంకా చాలా ఎదగాల్సి ఉంది. 400 మీటర్లలో హిమ ప్రపంచ ర్యాంకింగ్ 87 కాగా, 200 మీటర్లలో ర్యాంక్ 122 మాత్రమే. అంటే ఈ 19ఏళ్ల అథ్లెట్ ప్రపంచ స్థాయి అందుకోడానికి ఇంకా చాలా సమయం పడుతుందన్నది స్పష్టం.
బంగారు భవిష్యత్తున్న ఈ సరికొత్త పరుగుల రాణిని ఇప్పటినుంచే ఆకాశానికెత్తేయడం వల్ల ఆమెకు కలిగే మేలు కన్నా నష్టమే ఎక్కువ. ఆమెకు తన ఈవెంట్స్‌పై ఫోకస్ తప్పే ప్రమాదముంది.

ఫొటో సోర్స్, Facebook/HimaDas09
మొత్తం మీద సోషల్ మీడియా హడావుడి వల్ల హిమ దాస్ బ్రాండ్ వేల్యూ దాదాపు రెట్టింపయ్యింది. ఇప్పటివరకు ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షల వరకూ ఆమెకు లభిస్తుంటే, ఇప్పుడది రూ.60 లక్షలకు పెరిగింది.
ఇదంతా చూస్తుంటే, రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను వాడుకున్నట్టుగానే హిమ దాస్ తాలూకు ఏజెంట్లు ఎవరైనా పనిగట్టుకుని ఇలాంటి హైప్ సృష్టించారా అన్న సందేహం కూడా కలుగుతోంది.
కథలో నీతి ఏంటంటే సోషల్ మీడియాలో కొంతమంది ఉద్దేశ పూర్వకంగానో, లేక సరైన విషయ పరిజ్ఞానం లేకో తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తుంటారు. గోరంతలు కొండంతలుగా చూపుతుంటారు. తెలిసో, తెలియకో అనవసరంగా భావోద్వేగాలు రెచ్చగొడుతుంటారు.

ఫొటో సోర్స్, Facebook/HimaDas09
కరదీపికలాంటి ఫోను ద్వారా ఈ సమాచారం అందుబాటులోకి వస్తోంది కాబట్టి మిగతా ప్రసార మాధ్యమాలకంటే త్వరగా ఈ తప్పుడు వార్తలు వ్యాపిస్తున్నాయి.
క్రికెట్ వరల్డ్ కప్ తర్వాత, విరాట్, రోహిత్ మధ్య గొడవల గురించి బీసీసీఐ సంజాయిషీ కోరిందన్న అసత్య ప్రచారం కూడా సోషల్ మీడియా ద్వారానే సాగింది.
సెలెబ్రిటీల కులాలు తెలుసుకోడానికి వాడుతున్నట్లే, సోషల్ మీడియాలో వచ్చిన వార్తల నిజానిజాలు తెలుసుకోడానికి కూడా జనాలు గూగుల్ వాడి నిజానిజాలు తేల్చుకుంటే మంచిది.
ఇవి కూడా చదవండి:
- ఇంగ్లండ్: ప్రపంచకప్ గెలిచిన పిచ్‌పై 85 పరుగులకు ఆలౌట్
- నిస్సహాయ తల్లులను వ్యభిచారంలోకి నెడుతున్న సార్వత్రిక నగదు బదిలీ పథకం
- కార్గిల్ యుద్ధం: జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'
- అక్కడ గ్రహాంతర జీవులున్నాయా? అందుకే ఎవరూ రావద్దని అమెరికా హెచ్చరించిందా...
- ఏపీలో బీజేపీ ‘ఆపరేషన్’ సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్లకు తలనొప్పి కాకూడదు - అభిప్రాయం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








