వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ :'కొట్టుకుంటున్న ఎలుకల' ఫొటోకు 'టాప్ పీపుల్స్ పోల్' అవార్డ్

ఫొటో సోర్స్, SAM ROWLEY/WPY
- రచయిత, జొనాథన్ ఆమోస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
లండన్ అండర్‌గ్రౌండ్ నెట్‌వర్క్‌లో ప్రయాణించిన ఎవరికైనా అక్కడ ఫ్లాట్‌ఫాంలపై, పట్టాల కింద తిరిగే చిన్న నల్లటి చుంచెలుకల గురించి తెలిసే ఉంటుంది.
ఆ ఎలుకలపై ఫొటోగ్రాఫర్ శామ్ రోలీకి చాలా ఆసక్తి కలిగింది. దాంతో, వాటిని తన కెమెరాలో బంధించేందుకు ఆయన ఐదు రోజులు భూగర్భంలో ఆ ఫ్లాట్‌ఫాంలపైనే గడిపారు.
ఒకరోజు రాత్రి ఎవరో ప్రయాణికుడు తింటున్న ఆహారం నుంచి ఒక ముక్క కింద పడడంతో రెండు చుంచెలుకలు దానికోసం కొట్టుకున్నంత పని చేశాయి. వెంటనే కెమెరా తీసిన శామ్ వాటిని క్లిక్ చేశాడు.
వాటిని ఎలాగైనా ఫొటో తీయాలనే పట్టుదల ఇప్పుడు ఆయనకు వైల్ట్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 'లూమిక్స్ పీపుల్స్ చాయిస్' అవార్డు వచ్చేలా చేసింది.



ఫొటో సోర్స్, MICHEL ZOGHZOGHI/WPY
అంతర్జాతీయంగా ప్రముఖమైన 'వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్' పోటీ కోసం గత ఏడాది అక్టోబర్‌లో అద్భుతంగా ఉన్నప్పటికీ, టాప్ ప్రైజులు గెలుచుకోలేయిన కొన్ని ఫొటోలకు ర్యాంకులు ఇవ్వమని అభిమానులను కోరారు.
ఫొటోల్లో 'బెస్ట్ ఆఫ్ ద రెస్ట్' కేటగిరీలో శామ్ తీసిన 'ఎలుకల గొడవ' ఫొటోకు 28 వేల ఓట్లు వచ్చాయి.
ఆయన ఆ ఫొటో కోసం అర్థరాత్రులు సెంట్రల్ లండన్‌లోని ట్యూబ్ స్టేషన్లోనే గడిపేవారు. చక్కటి లో-యాంగిల్ షాట్ తీయాలని కింద నేలపైనే బోర్లా పడుకుని చూస్తుండేవారు.
ఆ ఆహారం ముక్క అక్కడ పడేవరకూ ఆ రెండు ఎలుకలూ విడివిడిగా ఆహారం వెతుకుతున్నాయి. తర్వాత అర క్షణంలో దానికోసం కొట్టుకుని, మళ్లీ వాటి దారిన వెళ్లిపోయాయి.

ఫొటో సోర్స్, AARON GEKOSKI/WPY
"నేను సాధారణంగా వేల ఫొటోలు తీస్తుంటాను. ఈ షాట్ నాకు అదృష్టం తెచ్చిపెట్టింది. కానీ, అప్పుడు నేను ఐదు రోజులు ఫ్లాట్‌ఫాం మీదే పడుకున్నాను. ఎప్పుడో ఒకప్పుడు మంచి ఫొటో దొరుకుందిలే అనుకున్నాను" అని శామ్ చెప్పాడు.
లండన్‌లో ఉంటున్న శామ్ ప్రస్తుతం బీబీసీ నేచురల్ హిస్టరీ ఫిల్మ్ మేకింగ్ యూనిట్ కోసం బ్రిస్టల్‌లో రీసెర్చర్‌గా పనిచేస్తున్నాడు.
మనలో ఒకటిగా జీవిస్తుంటాయి కాబట్టి నగరాలు, పట్టణాల్లో ఉన్న జంతువులతో ప్రజలకు ఒక బంధం ఉంటుంది అని ఆయన భావిస్తున్నారు.
"ఉదాహరణకు ఈ ట్యూబ్‌లో చుంచెలుకనే చూడండి.. ఇది ఇక్కడే పుట్టింది. అది తన జీవితంలో ఎప్పుడూ సూర్యుడిని, గడ్డిపరకను చూసుండదు" అన్నారు.

ఫొటో సోర్స్, FRANCIS DE ANDRES/WPY
"మరో విధంగా చూస్తే అదొక దయనీయ పరిస్థితి. చీకటిగా ఉన్న దారుల్లో కొన్ని నెలలపాటు నడిచాక అవి చనిపోతుంటాయి. ఎందుకంటే లోపల చాలా ఎక్కువ ఎలుకలు ఉంటే, వనరులు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే, అవి పొట్టకోసం గొడవపడుతుంటాయి" అంటారు శామ్.
లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రతి ఏటా వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పోటీ నిర్వహిస్తుంది.
"మనిషి ఆధిపత్యం ఉన్న ప్రపంచంలో వన్యప్రాణుల జీవితం ఎలా ఉంది అనడానికి శామ్ ఫొటో ఒక మంచి ఉదాహరణ" అని సంస్థ డైరెక్టర్ సర్ మైకేల్ డిక్సన్ అన్నారు.
'లూమిక్స్ పోల్'లో నాలుగు ఫొటోలు రన్నరప్‌గా నిలిచాయి.
వాటిలో ఒక ప్రదర్శన కోసం సిద్ధమై దిగులుగా కూర్చున్న ఒక ఒరంగుటాన్ కూడా ఉంది. దీనిని ఆరాన్ గెకోస్కీ తీశారు.

ఫొటో సోర్స్, MARTIN BUZORA/WPY
ఒక ఫొటోలో అంతా తెల్లగా కనిపిస్తుంది. పరీక్షగా చూస్తే మంచులో ఉన్న అర్కిటిక్ రెయిన్ డీర్స్ కనిపిస్తాయి. ఈ అద్భుతమైన ఫొటోను ఫ్రాన్సిస్ డీ ఆండ్రీస్ క్లిక్ చేశారు.
మరో ఫొటోలో తల్లీ బిడ్డలైన జాగ్వార్ పులులు ఒక అనకొండను పట్టుకుని ఉండడం కనిపిస్తోంది. దీనిని మైకేల్ జోఘ్‌జోంగీ తన కెమెరాలో బంధించారు.
ఒక ఫొటోలో అభయారణ్యంలోని ఒక రేంజర్, తను కంటికి రెప్పలా కాపాడుతున్న నల్ల ఖడ్గమృగం పిల్లను ముద్దాడుతుంటాడు. ఇది కూడా వన్యప్రాణి ప్రేమికులను ఆకట్టుకుంది. దీనిని మార్టిన్ బుజోరా తీశారు.
56వ డబ్ల్యుపీవై పోటీకి వచ్చిన ఫొటోలను ప్రస్తుతం ఒక నిపుణల ప్యానెల్ పరిశీలిస్తోంది. గ్రాండ్ ప్రైజ్ విజేత ఎవరో అక్టోబర్లో ప్రకటిస్తారు.

ఇవి కూడా చదవండి:
- జింకల వేటకు పెంపుడు చిరుతలు... క్రూర మృగాలనే మచ్చిక చేసుకున్న కొల్హాపూర్ వాసులు
- పెర్ఫ్యూమ్తో పెద్దపులి వేట: మనిషి రక్తం రుచిమరిగిన పులిని పట్టుకునేందుకు చివరి అస్త్రం
- రాజధాని రగడ-రాజకీయ క్రీడ!: ఎడిటర్స్ కామెంట్
- సొమాలియాలో మిడతల దండయాత్ర.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం
- షహీన్‌బాగ్: ‘దిల్లీ కాలుష్యంలో ఆశల గాలి పీల్చాలంటే ఇక్కడకు రావాల్సిందే’ - అభిప్రాయం
- కోనసీమలో కలకలం రేపిన బ్లో అవుట్, మూడోరోజు అదుపు చేసిన ఓఎన్జీసీ
- భారత్‌లో యువత క్యాన్సర్ బారిన ఎందుకు పడుతోంది
- తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలను వదులుకుంటున్న యువకులు
- బడ్జెట్ 2020 :ఆదాయ పన్ను కొత్త శ్లాబ్స్‌తో యువత భవిష్యత్తుతో ఎందుకీ చెలగాటం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









