తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలను వదులుకుంటున్న యువకులు - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో కష్టపడి సాధించిన పోలీసు ఉద్యోగాలను కొందరు యువకులు శిక్షణలో ఉండగానే వదులుకొని వెళ్లిపోతున్నారని 'ఈనాడు' దినపత్రిక ఓ కథనం రాసింది.
పోలీస్ ఉద్యోగం కోసం పరుగుపందేలు దాటుకుని, పరీక్షలు రాసి తీరా ఎంపికయ్యాక, 'మాకొద్దు బాబోయ్ ఈ ఉద్యోగం' అంటూ రాష్ట్రంలో కొందరు మొహం చాటేస్తున్నారు. అసలు శిక్షణకే హాజరుకాని వారు కొందరైతే, ఇంకొందరు శిక్షణ మొదలయ్యాక అర్ధంతరంగా నిష్క్రమిస్తున్నారు.
కానిస్టేబుల్ శిక్షణ మొదలైన పది రోజుల్లోనే దాదాపు 50 మంది వరకూ ఇలా వెళ్లిపోయారు.


మొత్తం 16,295 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి గానూ గత ఏడాది తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (టీఎన్‌ఎల్‌పీఆర్‌బీ) ప్రకటన ఇవ్వగా దాదాపు ఆరులక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ రాత, దేహదారుఢ్య పరీక్షల వంటివి పూర్తిచేసి చివరకు 18,690 మందిని అర్హులుగా తేల్చారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 కేంద్రాల్లో జనవరి 17న శిక్షణ మొదలైంది. ఉద్యోగానికి ఎంపికైన వారిలో 1370 మంది శిక్షణకు గైర్హాజరయ్యారు. వీరిలో 500 మంది తమకు ఈ ఉద్యోగం ఇష్టంలేదని రాతపూర్వకంగానే చెప్పారు. మిగతా వారు ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదు.
రాష్ట్రవ్యాప్తంగా రోజుకు కనీసం ముగ్గురు, నలుగురు అభ్యర్థులు వెళ్లిపోతున్నట్లు సమాచారం.
శిక్షణ సమయంలో క్రమశిక్షణ నిబంధనలు, ఫోన్‌కు దూరంగా ఉండాల్సి రావడం, బయటకు వెళ్లేందుకు అనుమతించకపోవడం, ఎప్పుడంటే అప్పుడు సెలవులు పెట్టే వెసులుబాటు లేకపోవడం వల్ల అభ్యర్థులు ఉద్యోగాలు వద్దనుకుంటుండొచ్చని అధికారులు అంటున్నారు.

ఫొటో సోర్స్, CCDMC.CO.IN
'ఇన్‌సైడర్ ట్రేడింగ్'పై ఈడీ కేసు
రాజధాని అమరావతిలో భూ కుంభకోణం జరిగినట్లుగా వస్తున్న ఆరోపణలపై దర్యాప్తుకు ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిద్ధమైనట్లు 'సాక్షి' దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.
రాజధాని పేరుతో సాగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ఈడీ సోమవారం ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసింది.
ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు, మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు, మరికొందరు టీడీపీ నేతలపై సీఐడీ ఇచ్చిన ఆధారాల నేపథ్యంలో ఈడీ కేసు నమోదు చేసింది.
చంద్రబాబు హయాంలో రాజధాని ఏర్పాటుపై పథకం ప్రకారం ముందే లీకులు ఇచ్చి అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి లబ్ధి పొందేలా దోహదపడ్డారనే ఆరోపణలున్నాయి.
ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా 2014 జూన్ నుంచి డిసెంబర్ లోపు సీఆర్‌డీఏ పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4,069.94 ఎకరాల భూ కుంభకోణం జరిగినట్టు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉప సంఘం పేర్కొంది.

ఫొటో సోర్స్, CHANDRABABU/FB
పతనం దిశగా ఏపీ: చంద్రబాబు
తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో కనీవినీ ఎరుగని ఆర్థిక పతనం చోటు చేసుకుందని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినట్లు ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.
''రాష్ట్రం నుంచి బయటకు పారిపోయేవారే తప్ప రాష్ట్రానికి వచ్చేవారు లేరు. కొత్త పరిశ్రమలు లేవు. పెట్టుబడులు లేవు. ఉద్యోగాలు లేవు. ఒక్క అభివృద్ధి కార్యక్రమమూ లేదు'' అని చంద్రబాబు అన్నారు.
''విశాఖకు డేటా సెంటర్ తేవాలని అనుకొన్నాను. దాంతో వేలాది ఉద్యోగాలు వచ్చేవి. కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు కోసం లులూ కంపెనీని ఒప్పించడానికి కొచ్చిన్ వెళ్లి... అక్కడ కట్టిన మెగా కాంప్లెక్స్ కూడా చూసి వచ్చాను. ఇంత శ్రమను ఈ ముఖ్యమంత్రి కాలరాశారు'' అని చెప్పారు.
''ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై తొమ్మిది నెలల నుంచి దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. ఏం కనుక్కొన్నారు? తెల్లకార్డుల వాళ్లు భూములు కొన్నారని అంటారు. రాష్ట్రంలో తొంభై శాతం మంది వద్ద తెల్ల రేషన్ కార్డులే ఉన్నాయి. ఎవరైనా అక్రమంగా కొంటే కేసు పెట్టండి. అధికారం మీదే కదా? ఎవరు ఆపారు?'' అని చంద్రబాబు అన్నారు.

ఫొటో సోర్స్, ISTOCK
ఆడపిల్లలకు సర్కారు బడి.. మగపిల్లలకు కాన్వెంట్ చదువు
తెలంగాణలో విద్య విషయంలో ఆడపిల్లలు వివక్షను ఎదుర్కొంటున్నారని, చాలా కుటుంబాలు తమ ఇళ్లలోని ఆడపిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు, మగపిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నాయని ‘వెలుగు’ దినపత్రిక ఓ వార్త రాసింది.
రాష్ట్రంలో స్కూళ్లు, ఇంటర్ వరకు కాలేజీలు కలిపి మొత్తం 11,621 ప్రైవేటు విద్యా సంస్థలుంటే.. వాటిల్లో 16,53,352 మంది అమ్మాయిలు, 19,73,352 మంది అబ్బాయిలు చదువుతున్నారు. అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు 9 శాతం ఎక్కువ.
ఇందుకు భిన్నంగా 29,822 సర్కారీ విద్యాసంస్థల్లో అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంది. సర్కారీ స్కూళ్లు, కాలేజీల్లో 14,80,127 మంది అమ్మాయిలుంటే.. అబ్బాయిల సంఖ్య 13,42,308 మంది మాత్రమే. అంటే అమ్మాయిలే 5.5 శాతం ఎక్కువగా ఉన్నారు.
ప్రైవేటుతో పోలిస్తే తక్కువ ఫీజులు ఉండే ఎయిడెడ్ విద్యా సంస్థల్లో 61 శాతం అమ్మాయిలు చదువుతుంటే, అబ్బాయిలు 39 శాతం మందే ఉన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా, పట్టణ ప్రాంతాల్లో కొంత వరకూ ఈ పరిస్థితి ఉంది. అన్ని కులాలు, వర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. అమ్మాయిల కంటే అబ్బాయిల చదువుకే తల్లిదండ్రులు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి.
- సాయిబాబా ఎక్కడ జన్మించారు... షిర్డీలోనా... పత్రిలోనా?
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి
- విశాఖపట్నం: సముద్రంలో ‘స్వచ్ఛ భారత్’ చేస్తూ ప్రధాని మోదీ మెప్పు పొందిన స్కూబా డైవర్లు
- భారత్‌లో యువత క్యాన్సర్ బారిన ఎందుకు పడుతోంది
- రాజధాని రగడ-రాజకీయ క్రీడ!: ఎడిటర్స్ కామెంట్
- కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?
- తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారి ఫేషియల్ రికగ్నిషన్.. ఇది ఎలా పనిచేస్తుంది
- విశాఖపట్నంలో రాజధాని: సెక్రటేరియట్, సీఎం నివాసం ఉండేది ఎక్కడంటే..
- సొమాలియాలో మిడతల దండయాత్ర.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం
- ఆంధ్రా, తెలంగాణల్లో ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ అమలు చేస్తారా? ముస్లింలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









