కేసీఆర్: "సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తాం.. భారత్ ప్రజల దేశం.. ఇది మత దేశం కాకూడదు"

మీడియాతో మాట్లాడుతున్న కేసీఆర్. చిత్రంలో టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావు, సీనియర్ నేత కేశవరావు

ఫొటో సోర్స్, FB/TRS Party

ఫొటో క్యాప్షన్, మీడియాతో మాట్లాడుతున్న కేసీఆర్. చిత్రంలో టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావు, సీనియర్ నేత కేశవరావు

టీఆర్‌ఎస్ స్వభావరీత్యా, విధానరీత్యా లౌకికవాద పార్టీ అని, పౌరసత్వ సవరణ బిల్లు(సీఏబీ)ను తాము వ్యతిరేకించామని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పారు. తాము ఏం చేసినా నిండుమనసుతో పూర్తి అవగాహనతో, స్పష్టతతో చేస్తామని, ఎవరికీ భయపడబోమని వ్యాఖ్యానించారు.

పౌరసత్వ చట్టం(సీఏఏ) విషయంలో కేంద్ర ప్రభుత్వానిది వంద శాతం తప్పుడు నిర్ణయమని ఆయన ఖండించారు.

దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగం సమానమైనదని, రాజ్యాంగ పీఠికలోనే ఈ మాట చెప్పుకున్నామని ఆయన ప్రస్తావించారు.

సీఏబీలో ముస్లింలను పక్కనబెట్టడం తనకు బాధ కలిగించిందని, సీఏబీకి మద్దతు కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేస్తే అందుకు నిరాకరించానని కేసీఆర్ చెప్పారు.

కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించామని, ఎందుకంటే అది దేశ సమగ్రతతో ముడిపడినదని ఆయన తెలిపారు.

సీఏఏ గురించి చాలా మంది ముఖ్యమంత్రులతో, చాలా ఇతర పార్టీల నాయకులతో ఇప్పటికే మాట్లాడానని కేసీఆర్ చెప్పారు. సీఏఏను వ్యతిరేకిస్తూ బహుశా రాబోయే నెల రోజుల్లో ప్రాంతీయ పార్టీలు, ముఖ్యమంత్రులతో హైదరాబాద్‌లో సదస్సు(కాంక్లేవ్) నిర్వహించడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. అవసరమైతే పది లక్షల మందితో సభ కూడా జరుపుతామన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఒకవైపు ఆర్థిక వ్యవస్థ పతనం లాంటి ఎన్నో సమస్యలు ఉంటే, బీజేపీ వాటిని పట్టించుకోకుండా పౌరసత్వ సవరణ చట్టంపై రాజకీయం చేస్తోందని విమర్శించారు.

అడ్డగీత
News image
అడ్డగీత, గ్రే లైన్

సీఏఏ దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయమని, 130 కోట్ల మంది ప్రజలు నివసించే, ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఈ చట్టం మంచిది కాదని కేసీఆర్ చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మారుస్తున్నారనీ, ఇది సరికాదనీ, అంతర్జాతీయ విపణిలో దీని గురించి తీవ్ర చర్చ జరుగుతోందని అమెరికాకు చెందిన ప్రముఖ దాత, పెట్టుబడిదారుడు జార్జ్ సోరోస్ హెచ్చరించారని కేసీఆర్ ప్రస్తావించారు. ఈ పరిస్థితి మంచిది కాదన్నారు.

భారత్ ప్రజల దేశంగా ఉండాలని, మత దేశంగా ఉండకూదని, అది దేశానికి ఏ విధంగానూ మంచిది కాదని కేసీఆర్ చెప్పారు.

ప్రస్తుతం భారత్‌ పట్ల ప్రపంచంలో గొప్ప గౌరవం ఉందని ఆయన చెప్పారు. "దేశం మునిగిపోయే, దేశ గౌరవప్రతిష్ఠలు అంతర్జాతీయంగా దెబ్బతినే పరిస్థితులు ఉంటే మనం మౌనం పాటిస్తే దేశానికి మంచిది కాదు, దేశ భవిష్యత్తుకు క్షేమం కాదు" అన్నారు.

మనం(భారతీయులు) విదేశాలకు వెళ్తే మనల్ని ద్రోహులుగా చూస్తారని, మన పిల్లలకు చెడ్డపేరు వస్తుందని, మత దేశం నుంచి వచ్చారని అంటారని, చిన్నచూపు చూస్తారని ఆయన వ్యాఖ్యానించారు.

విదేశాల్లో భారతీయులు పది కోట్ల మంది ఉన్నారని, ఆ దేశాలు కూడా బీజేపీ ప్రభుత్వంలాగే ఆలోచిస్తే అక్కడున్న భారతీయుల పరిస్థితి ఏమిటని కేసీఆర్ ప్రశ్నించారు. ఒక్క గల్ఫ్ దేశాల్లోనే పాతిక లక్షల మంది భారతీయులు ఉన్నారన్నారు.

సీఏఏ తప్పుడు చట్టమని, కేంద్ర ప్రభుత్వం విజ్ఞతతో దీనిని విరమించుకోవాలని ఆయన కోరారు. ఈ చట్టంపై పునరాలోచన చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి పిలుపునిచ్చారు. సీఏఏ ముస్లింల సమస్య మాత్రమే కాదన్నారు.

సీఏఏకు వ్యతిరేకంగా రానున్న అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని కేసీఆర్ చెప్పారు. సీఏబీకి వ్యతిరేకంగా తాము పార్లమెంటులో ఓటేశామని చెప్పారు.

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గడ్డం కొరిగించి తనకు పెడతామని, ముఖ్యమంత్రి ముక్కు కోస్తామని బీజేపీ అంటోందని, ఇవేనా జాతీయపార్టీ అయిన బీజేపీ విలువలు అని కేసీఆర్ ప్రశ్నించారు. తాము కోయడం మొదలుపెడితే మీరు అసలు ఉంటారా అని బీజేపీని ప్రశ్నించారు.

పార్లమెంటులో సీఏబీని టీఆర్‌ఎస్ వ్యతిరేకించిందని కేసీఆర్ చెప్పారు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, పార్లమెంటులో సీఏబీని టీఆర్‌ఎస్ వ్యతిరేకించిందని కేసీఆర్ చెప్పారు.

"దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమవుతోంది"

సీఏఏ ఒక సంకుచిత ఆలోచన అని, సామాజిక నిర్మాణానికి ఇది ఉపయోగపడదని ముఖ్యమంత్రి చెప్పారు. ఆర్థిక వ్యవస్థ, నీటి సమస్య మొదలుకొని దేశంలో ఎన్నో సమస్యలు ఉండగా, వాటిని పక్కనబెట్టి సీఏఏ పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమవుతోందన్నారు. ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణంగా ఉందని, ఇది తాను చెబుతున్న మాట కాదని, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్), రఘురాం రాజన్, ఇతర ఆర్థికవేత్తలు సహా ప్రపంచమంతా చెబుతోందని వ్యాఖ్యానించారు.

బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీ వరుసగా ఓడిపోతోందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఇటీవల ఝార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ పోయిందని, దిల్లీలోనూ ఓడిపోతుందని అభిప్రాయపడ్డారు. ఎవరిని అడిగినా దిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మళ్లీ గెలుస్తుందంటున్నారని ఆయన చెప్పారు. దేశం నిరసిస్తున్నప్పుడు బీజేపీ గమనించి, పంతానికి పోకుండా తప్పులు సరిచేసుకోవాలని సూచించారు. సీఏఏను వంద శాతం వ్యతిరేకిస్తామని, అవసరమైతే తానే నాయకత్వం వహిస్తానని తెలిపారు. ఈ విషయంలో భావసారూప్యమున్న అన్ని పక్షాలతో కలసి పనిచేస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

సీఏబీలో ముస్లింలను పక్కనబెట్టడం తనకు బాధ కలిగించిందని కేసీఆర్ చెప్పారు.
ఫొటో క్యాప్షన్, సీఏబీలో ముస్లింలను పక్కనబెట్టడం తనకు బాధ కలిగించిందని కేసీఆర్ చెప్పారు.

"వచ్చేది ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వమే"

ఈ దేశానికి ఏనాటికైనా సమాఖ్య వ్యవస్థే శ్రీరామరక్ష అని, కర్రపెత్తనాలు పనికి రావని చెప్పారు. భారత్ 'యూనియన్ ఆఫ్ స్టేట్స్(రాష్ట్రాల కూటమి)' అని, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఎగ్జిక్యూటివ్ అథారిటీలు కావని, రాజ్యాంగ వ్యవస్థలని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

సమాఖ్య స్ఫూర్తి ఉన్న జాతీయ పార్టీలు లేదా సమాఖ్య కూటములే విజయవంతమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత కచ్చితంగా ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వమే ఏర్పడుతుందని చెప్పారు. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ రెండూ విఫలయ్యాయని విమర్శించారు.

స్పోర్ట్స్ ఉమెన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)