CAA-NRC: జనన ధ్రువీకరణ పత్రాల కోసం క్యూ కడుతున్న మాలెగావ్ ముస్లింలు

ఫొటో సోర్స్, SHARAD BADHE/BBC
- రచయిత, మయూరేష్ కన్నూర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉదయం 10 కావొస్తున్నా, జనవరి కాబట్టి చలి ఇంకా తీవ్రంగానే ఉంది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మాలెగావ్‌లో మేం ఒక పాత కోట పక్కనున్న మాలెగావ్ కార్పొరేషన్ కార్యాలయం దగ్గర నిలబడి ఉన్నాం.
అక్కడ రోజూ కనిపించే హడావుడి ఇంకా మొదలవలేదు. కానీ జనన-మరణ ధ్రువీకరణ పత్రాల రిజిస్ట్రేషన్లు జరిగే కిటికీ దగ్గర మాత్రం పొడవాటి క్యూ ఉంది.
ఆ క్యూ పక్కనే వీధి అంతా రద్దీగా ఉంది. దరఖాస్తు ఫామ్ నింపడానికి సాయం చేసే ఏజెంట్ల టేబుళ్ల దగ్గర జనం గుమిగూడుతున్నారు. అందరూ ఆందోళనలో, ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తున్నారు.
అక్కడ దరఖాస్తు చేసుకోడానికి వచ్చిన వాళ్లంతా ముస్లింలే అన్నది స్పష్టంగా తెలుస్తోంది. మాలెగావ్‌లో ముస్లిం జనాభా ఎక్కువ. పట్టణంలో దాదాపు 80 శాతం మంది ముస్లింలే.


అందుకే, అక్కడ క్యూలో అంతా ముస్లింలే ఉండడం చూసి ఆశ్చర్యంగా అనిపించలేదు, కానీ, వారు అలా ఆ కార్యాలయం దగ్గర గత నాలుగు నెలలుగా క్యూ కడుతున్నారు అనేది, ఆశ్చర్యం కలిగించే విషయమే కాదు, షాకింగ్‌గా కూడా ఉంటుంది.
సెప్టెంబర్ నుంచి మాలెగావ్ కార్పొరేషన్ కార్యాలయానికి జనన ధ్రువీకరణ పత్రాల కోసం 50 వేలకు పైగా దరఖాస్తులు అందాయి.
కారణం సీఏఏ, ఎన్ఆర్సీ. వీటి గురించి చర్చ మొదలైనప్పటి నుంచి ముస్లిం సమాజంలో ఎప్పుడు ఏమవుతుందో అనే ఆందోళనలు పెరిగాయి.
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను డిసెంబర్ 11న లోక్‌సభ ఆమోదించింది. డిసెంబర్ 20 నుంచి ఈ చట్టం దేశవ్యాప్తంగా అమలైంది. కానీ దీని చుట్టూ జరుగుతున్న చర్చ, అంతకు ముందు నుంచే మొదలైంది.
ఈ చట్టం ముస్లిం వ్యతిరేకం అని ప్రతిపక్షాలు విమర్శించాయి. బీజేపీ ప్రభుత్వం ఆ విమర్శలను తిప్పికొట్టడం ప్రారంభించింది.

ఫొటో సోర్స్, SHARAD BADHE/BBC
అస్సాంలో జరిగిన ఘటనల వల్ల దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నుంచి మాలెగావ్ కార్పొరేషన్ కార్యాలయం ముందు జనన ధ్రువీకరణ పత్రాల కోసం పొడవాటి క్యూలు కనిపిస్తున్నాయి.
"దాదాపు గత నాలుగు నెలలుగా, కార్పొరేషన్ దగ్గర క్యూలు పెరుగుతున్నాయి. ఈ మూడు నెలల్లో మాకు 50 వేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఉండదు. కానీ, మేం గత నాలుగు నెలల నుంచీ దీన్ని చూస్తున్నాం. దీనికి కచ్చితంగా సీఏఏ, ఎన్ఆర్సీ వల్ల ఏర్పడిన పరిస్థితులే కారణం" అని మాలెగావ్ కార్పొరేషన్ కమిషనర్ చెప్పారు.
బర్త్ సర్టిఫికెట్, బర్త్ ప్లేస్, రెసిడెన్స్ సర్టిఫికెట్ లాంటివి సిద్ధంగా ఉంచుకోవాలేమో అని ఇక్కడ ఉన్న ముస్లిం సమాజం ఆందోళనకు గురవుతోంది.
అందరూ తమవి, పిల్లల ధ్రువపత్రాలతోపాటూ, తమ ముందు తరాల వారి ధ్రువపత్రాలు కూడా సేకరిస్తున్నారు. వారి జనన ధ్రువీకరణ పత్రాలు పొందే ప్రయత్నం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, SHARAD BADHE/BBC
స్కూలు చదువు పూర్తయినప్పుడు ఇచ్చే పత్రాల్లో పుట్టిన తేదీ ఉంటుంది కాబట్టి, కొందరు వాటి కోసం కూడా ప్రయత్నిస్తున్నారు.
కొందరు తమ పుట్టిన తేదీ రిజిస్టర్ అయ్యుందో లేదో చూసుకోడానికి కార్పొరేషన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటున్నారు.
బర్త్ రిజిస్ట్రేషన్ లేకపోతే, వారు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. దానిపై, ఎవరికైనా ఏవైనా అభ్యంతరాలు ఉన్నాయేమో అని తెలుసుకునేందుకు వార్తాపత్రికల్లో ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ ప్రక్రియ తర్వాత వారు కొత్త బర్త్ సర్టిఫికెట్ కోసం మళ్లీ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎన్ఆర్సీ వస్తే ఈ సర్టిఫికెట్లన్నీ చూపించాల్సి ఉంటుందేమోననే భయంతో చాలా మంది ఈ ప్రక్రియను ప్రారంభించారు.

ఫొటో సోర్స్, SHARAD BADHE/BBC
క్యూలో నిలబడిన రెహనబి మున్సబ్ ఖాన్‌తో బీబీసీ మాట్లాడింది. ఆమె మాలెగావ్‌లోని గాంధీనగర్ కాలనీలో కూలీగా పనిచేస్తున్నారు. ఆమె తనతోపాటు, తన మామగారి జనన ధ్రువీకరణ పత్రం కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు.
"చాలా ఏళ్లుగా మీకు ఆ అవసరం రానప్పుడు, ఇప్పుడు వాటి కోసం ఎందుకు దరఖాస్తు చేస్తున్నారు?" అని అడిగినప్పుడు..
"మేం ఎన్ఆర్సీ కోసం దీన్ని చేస్తున్నాం. అందరూ ఏం చెబుతున్నారో, ఏం చేస్తున్నారో, మేం కూడా చేస్తున్నాం. ఎన్ఆర్సీ రాకుంటే మేం ఇక్కడకు వచ్చేవాళ్లమే కాదు. కోర్టుల చుట్టూ తిరిగేవాళ్లమే కాదు" అని ఆమె చెప్పారు.
కానీ, ప్రభుత్వం ఎన్ఆర్సీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతోంది. అలాంటప్పుడు, ఈ పత్రాల కోసం మీరు ఇంత కష్టపడడం ఎందుకు? అంటే,
ఆమె "ప్రభుత్వం అలా చెబుతుంటే, అందరూ ఎందుకు భయపడుతున్నారు. రేపు ఎన్ఆర్సీ వస్తే ఏం చేయాలి. వాళ్లు ఈరోజు అది రాదు అని చెప్పచ్చు. కానీ, రేపు వాళ్లు దాన్ని తీసుకొస్తే, అప్పుడు మీరేం చెబుతారు? అని ఎదురు ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, SHARAD BADHE/BBC
అన్వర్ హుస్సేన్ కార్పొరేషన్ కార్యాలయం దగ్గర గత 15 ఏళ్లుగా సర్టిఫికెట్ కోసం ఫాంలు నింపి ఇచ్చే పని చేస్తున్నారు.
"జనం ఎన్ఆర్సీ గురించి భయపడుతున్నారు. వాళ్లు టీవీల్లో, వాట్సాప్‌లో చూస్తున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా మాటలకు పొంతన లేకపోవడం గమనిస్తున్నారు. వార్తలు చూసి జనం భయపడుతున్నారు. అందుకే ఇక్కడికి వస్తున్నారు. ఎన్నో ఏళ్లు ఇక్కడ ఉన్నా, ఇంత జనాన్ని నేను ఎప్పుడూ చూళ్లేదు. గత మూడు నాలుగు నెలలుగా జనం ఇక్కడికి భారీగా వస్తున్నారు" అని అన్వర్ చెప్పారు.
"అందరూ టీవీలో వార్తలు చూస్తున్నారు, వార్తా పత్రికలు చదువుతున్నారు. వాట్సాప్ మెసేజులు చూస్తున్నారు. ఈ అంశంపై జరిగే వాదనలను వింటున్నారు. అవి వారిలో మరింత గందరగోళాన్ని పెంచాయి. భవిష్యత్తు గురించి వారికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. కానీ, ఎవరూ వాటికి ఏ సమాధానాలూ ఇవ్వడం లేదు. అది వారి భయాన్ని మరింత పెంచింది" అన్నారు.
సీఏఏ, ఎన్ఆర్సీ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు కారణమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చింది. సీఏఏకు భారత్‌లోని ప్రస్తుత పౌరులకు ఎలాంటి సంబంధం లేదని కేంద్రం పదే పదే చెబుతోంది. కొత్తగా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేవారికి మాత్రమే అది వర్తిస్తుందని అంటోంది.

ఫొటో సోర్స్, SHARAD BADHE/BBC
ప్రధాని నరేంద్ర మోదీ ఒక ర్యాలీలో ఎన్ఆర్సీ గురించి కేబినెట్‌లో ఇంకా ఏ చర్చా జరగలేదని చెప్పారు. కానీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాత్రం పార్లమెంటులో జరిగిన చర్చలో ఎన్ఆర్సీని దేశమంతటా అమలు చేస్తామన్నారు. అంటే, ఈ అంశంపై ఒక గందరగోళం ఏర్పడింది. జనం తమ భవిష్యత్తు గురించి అనిశ్చితిలో ఉన్నారు. ప్రజల మనసులో ఉన్న ఈ సందేహాలను తీర్చడానికి ఎలాంటి ప్రయత్నాలూ జరగడం లేదు.
కొంతమంది తమ పేర్లు సరిదిద్దుకోడానికి కూడా దరఖాస్తులు ఇస్తున్నారు. పత్రాల్లో ఉన్న తమ పేరులో ఏదైనా తేడా ఉంటే, ఎన్ఆర్సీలో తమ పేర్లు ఉండవేమో అని భయపడుతున్నారు.
దీనిపై మాట్లాడిన మాజీ కార్పొరేటర్ షకీల్ అహ్మద్ జానీ బేగ్ "మేం ఇక్కడ ఎన్నో తరాల నుంచీ ఉంటున్నాం. కానీ అస్సాంలో ఎన్ఆర్సీ వార్తలు జనాల్లో ఆందోళన పెంచాయి. పేరులో చిన్న తప్పున్నా వారిని ఎన్ఆర్సీ నుంచి తప్పించడాన్ని మేం వార్తల్లో చూశాం. అందుకే జనం అలాంటివి తమకు జరక్కుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ పేపర్లన్నీ చెక్ చేసుకుంటున్నారు. తమ పేరులో ఏవైనా తప్పులుంటే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు" అన్నారు.

ఫొటో సోర్స్, SHARAD BADHE/BBC
మాలెగావ్ వస్త్ర పరిశ్రమకు కేంద్రంగా ఉంది. పట్టణంలో మగ్గాలు, బట్టల తయారీ మిల్లులు భారీగా ఉన్నాయి. ఇక్కడ చాలా ముస్లిం కుటుంబాలు తరాల నుంచీ ఇదే వ్యాపారంలో ఉన్నాయి. ఎంతోమంది కూలీలు, నిపుణులు ఉత్తరాది నుంచి ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. వారు కూడా ఈ సమస్య గురించి తీవ్ర ఆందోళనలో ఉన్నారు. చాలా మంది ముందుకు వచ్చి మాట్లాడేందుకు కూడా సిద్ధంగా లేరు.
మాలెగావ్‌లో కూడా సీఏఏకు వ్యతిరేకంగా భారీ ర్యాలీలు జరిగాయి. ఒక ర్యాలీలో అయితే మహిళలు మాత్రమే పాల్గొన్నారు.
మాలెగావ్‌లో 1969లో భారీ వరదలు వచ్చినపుడు తమ పూర్వీకులకు సంబంధించిన పత్రాలు పోగొట్టుకున్నామని కొందరు చెబుతున్నారు.
మాలెగావ్ రాజకీయంగా, సామాజికంగా చాలా సున్నితమైన ప్రాంతం. అల్లర్లు, బాంబు పేలుళ్లతో అది ఎప్పుడూ వార్తల్లో నిలిచింది. కానీ సీఏఏ, ఎన్ఆర్సీ గురించి సరైన సమాచారం లేక గందరగోళం, భవిష్యత్తుపై అనిశ్చితి ఏర్పడడంతో ఇప్పుడు ఇక్కడ పొడవాటి క్యూలు కనిపిస్తున్నాయి. ఈ అనిశ్చితికి తెరపడితే తప్ప, ఈ క్యూల దగ్గర రద్దీ ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు.

ఇవి కూడా చదవండి:
- అసోం ఎన్ఆర్సీ జాబితా: త్రిశంకు స్వర్గంలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వలసదారులు
- తమిళనాడులో ముగ్గులతో నిరసనలు.. స్టాలిన్ నివాసం నుంచి కనిమోళి నివాసం వరకు
- పౌరసత్వ సవరణ చట్టం: CAA, NRCలపై ఇస్లాం మత గురువులు ఏమంటున్నారు?
- భారతదేశంలో విద్యార్థి ఉద్యమాల చరిత్ర ఏమిటి... వాటి ప్రభావం ఎలాంటిది?
- "జేఎన్‌యూ వీసీని వెంటనే తొలగించాలి": బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి
- JNUలో దాడి జరిగినప్పుడు వీసీ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? :వైస్ చాన్స్‌లర్‌తో ఇంటర్వ్యూ
- జేఎన్‌యూలో దాడి నిందితుల్లో విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్
- ఇరాన్: ఉక్రెయిన్ విమానం కూల్చివేతపై 'అబద్ధాలు' చెబుతారా అంటూ ఆగ్రహించిన ప్రజలు
- ‘రోజుకు 4 గంటలే చదువు.. మిగతా సమయంలో వ్యవసాయం, ఆటలు, కమ్యూనిటీ పనులు’
- కేరళలో రెండు ఎత్తయిన భవనాలు క్షణాల్లో నేలమట్టం
- గూగుల్ కన్నా వందేళ్ల ముందే డేటాతో సంపన్నుడైన ఘనుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









