ఇరాన్: ఉక్రెయిన్ విమానం కూల్చివేతపై 'అబద్ధాలు' చెబుతారా అంటూ ఆగ్రహించిన ప్రజలు

ఫొటో సోర్స్, AFP
ఇరాన్ రాజధాని టెహరాన్‌లో వందలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. యుక్రెయిన్ విమానం కూల్చివేత తరువాత తాము బాధ్యులం కాదని తొలుత ఖండించడాన్ని తప్పుపడుతూ అబద్ధాలకోరు ప్రభుత్వమంటూ ఆగ్రహించారు.
పలు యూనివర్సిటీల ఎదుట నిరసనకారులు ప్రదర్శనలు జరపగా వారిని చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ ప్రయోగించారు.
కాగా సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నవారికి మద్దతుగా అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.
నాలుగు రోజుల కిందట ఇరాన్‌లో యుక్రెయిన్ విమానం కూలి 176 మంది మరణించిన సంగతి తెలిసిందే. పొరపాటున దాన్ని తామే కూల్చివేశామని ఇరాన్ శనివారం అంగీకరించింది.
బుధవారం టెహరాన్‌లోని ఇమామ్ ఖొమేనీ విమానాశ్రయం నుంచి యుక్రెయిన్‌లోని కీవ్‌కు బయలుదేరిన యుక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పీఎస్753 ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూల్చివేశారు.
కాసిం సులేమానీని అమెరికా హతమార్చిన తరువాత ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించిన కొద్దిసేపటికే ఇది జరిగింది.
కూలిపోయిన విమానంలో ఉన్న ఇరాన్, కెనడా, యుక్రెయిన్, యూకే, అఫ్గానిస్తాన్, జర్మనీకి చెందిన ప్రయాణికులు మరణించారు.

ఫొటో సోర్స్, AFP
సులేమానీ చిత్రాలను చించేస్తూ..
విమానం కూల్చివేత కారణంగా మరణించినవారికి నివాళులర్పించడానికి వందల సంఖ్యలో విద్యార్థులు షరీఫ్, ఆమిర్ కబీర్ యూనివర్సిటీలతో పాటు మరికొన్ని యూనివర్సిటీల ఎదుట చేరారని.. అయితే, సాయంత్రం సరికి ఈ నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి.
సుమారు 1000 మంది నిరసనకారులు గుమిగూడి అమెరికా దాడుల్లో హతమైన సులేమానీ చిత్రాలను చించుతూ నేతలకు వ్యతిరేకంగా నినదించారని ఇరాన్‌లోని ఫార్స్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
విమానం కూల్చివేతకు నాయకులే కారణమని, దాన్ని కప్పిపుచ్చాలని ప్రయత్నించారని, వారిని విచారించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
కమాండర్ ఇన్ చీఫ్, సుప్రీం లీడర్ రాజీనామా చేయాలని నినదిస్తూ అబద్ధాలుకోరు నేతలకు మరణశిక్ష విధించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
రోడ్లు దిగ్బంధించేందుకు ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారని ఫార్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించినట్లు సోషల్ మీడియాలో వీడియోలు కనిపించాయి.
ప్రభుత్వ చర్యలు, తీరుపై సోషల్ మీడియాలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. ట్విటర్‌లో ఓ యూజర్.. ''విమానం కూల్చివేత విషయంలో అబద్ధాలు చెప్పిన మా దేశ నాయకులను నేనెన్నటికీ క్షమించను'' అంటూ ట్వీట్ చేశారు.
అయితే, సులేమానీ హత్యను ఖండిస్త నిరసన తెలిపిన ప్రజల సంఖ్యతో పోల్చితే విమానం కూల్చివేతకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన ప్రజల సంఖ్య చాలా తక్కువే.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ ట్వీట్
ఈ నిరసనలకు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇంగ్లిష్, ఫార్సీలో ట్వీట్ చేశారు. ''ధైర్యంగల, బాధాతప్త ఇరాన్ ప్రజలారా నేను అధ్యక్షుడైనప్పటి నుంచి మీకు అండగా ఉన్నాను, ఇకపైనా నా ప్రభుత్వం మీ తరఫునే ఉంటుంది'' అంటూ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ నిరసనలకు సంబంధించిన వీడియోను అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ట్వీట్ చేశారు. ''ఇరాన్ ప్రజల గళం స్పష్టంగా ఉంది. ఈ ప్రభుత్వ అబద్ధాలు, అవినీతి, అసమర్థత, దోపిడీ పాలన.. రివల్యూషనరీ గార్డ్స్ కర్కశంతో ప్రజలు విసిగి వేశారిపోయారు. మంచి భవిష్యత్తు అందుకోవాల్సిన వారికి మేం అండగా నిలుస్తాం'' అని ఆయన పేర్కొన్నారు.
టెహరాన్‌లో జరిగిన ఓ నిరసన తరువాత బ్రిటన్ రాయబారి రాబ్ మెకైర్‌ను అరెస్ట్ చేసిన తరువాత యూకే ఫారిన్ సెక్రటరీ డొమినిక్ రాబ్ తీవ్ర ఆగ్రహంతో ఒక ప్రకటన విడుదల చేశారు.
అమిర్ కబీర్ ఎదుట జరుగుతున్న ప్రదర్శన వద్ద మెకైర్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను విడుదల చేశారు.
ప్రపంచ దేశాల్లో ఏకాకిగా మారతుందా... లేదంటే ఉద్రిక్తతలు తగ్గించే దిశగా చర్యలు చేపడుతుందో ఇరాన్ నిర్ణయించుకోవాలని రాబ్ అన్నారు.
విమానం కూల్చివేత తరువాత ఇరాన్ మూడు రోజుల పాటు తామేం చేయలేదని ఖండిస్తూ వచ్చింది. అంతేకాదు, పాశ్చాత్య దేశాలే అబద్ధాలు చెబుతూ మానసిక యుద్ధానికి దిగుతున్నాయని ఇరాన్న అధికార ప్రతినిధి ఒకరు ఆరోపించారు కూడా.
అయితే, తమ పొరపాటు వల్లే విమానం కూలిందని ఇరాన్ ప్రభుత్వం చేసిన ప్రకటన శనివారం అక్కడి జాతీయ టీవీ చానల్‌లో వచ్చింది.
రివల్యూషనరీ గార్డ్స్ ఏరో స్పేస్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ ఆమిర్ అలీ హజిజాదే ఈ ఘటన ఎలా జరిగిందో వివరించారు.
ఇవి కూడా చదవండి
- ఇరాన్: సులేమానీ హత్య... బిన్ లాడెన్ మృతి కన్నా ఎందుకు ముఖ్యమైనది
- కాసిం సులేమానీ హత్య... ట్రంప్ మళ్లీ గెలిచేందుకు ఉపయోగపడుతుందా?
- "కాసిం సులేమానీ హత్యకు ఒబామా, బుష్ ఒప్పుకోలేదు, ట్రంప్ పర్మిషన్ ఇచ్చారు": ఇరాన్ విదేశాంగ మంత్రి జవాద్ జరీఫ్‌తో ఇంటర్వ్యూ
- ఆ రెండు అమెరికా స్థావరాలపైనే ఇరాన్ క్షిపణి దాడులు ఎందుకు చేసింది?
- అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు: ఒక్కసారిగా పెరిగిన ముడి చమురు ధరలు
- ఇరాన్ అణు ఒప్పందంలోని కీలకాంశాలేమిటి... వాటిని ఆ దేశం ఉల్లంఘించిందా?
- కూలిన ఉక్రెయిన్ బోయింగ్ 737, విమానంలోని 170 మందికి పైగా మృతి
- ఇరాన్ ప్రతిదాడి: ఇరాక్‌లో అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు... మరిన్ని తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్
- కాసిం సులేమానీ: ఇరాన్‌లో అంత్యక్రియల్లో తొక్కిసలాట.. 50 మంది మృతి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








