'ఇరాన్ నాలుగు అమెరికా ఎంబసీలపై దాడి చేసేందుకు కుట్ర పన్నింది' - డోనల్డ్ ట్రంప్

డోనాల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్ టాప్ జనరల్ కాసిం సులేమానీపై దాడులు చేసిన సమయంలో ఆ దేశం నాలుగు అమెరికా రాయబార కార్యాలయాలపై దాడులకు కుట్ర పన్నిందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు.

గత శుక్రవారం అమెరికా సులేమానీపై డ్రోన్ దాడులు చేయాల్సినంత ప్రమాదం ఏముందని అడిగినప్పుడు ఆయన "బహుశా నాలుగు రాయబార కార్యాలయాలపై దాడి జరుగుతుందని నాకు అనిపించింది. నేను అది చెప్పగలను" అన్నారు.

బగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం దగ్గర నిరసనలు జరిగిన తర్వాత రోజు అమెరికా డ్రోన్ దాడుల్లో కాసిం సులేమానీని చంపింది.

కానీ, క్షిపణి దాడుల గురించి మాట్లాడిన నిఘా వర్గాలు "రాయబార కార్యాలయాలపై దాడులకు కుట్ర జరుగుతున్నట్లు తమకు ఎలాంటి ఆధారాలూ కనిపించలేదని అన్నట్లు" డెమాక్రట్స్ చెబుతున్నారు.

ట్రంప్ మొదట గురువారం అమెరికా ఏంబసీలపై దాడి జరగబోతున్నట్టు చెప్పారు. అదే రోజు రాత్రి ఒహాయోలో జరిగిన ర్యాలీలో మళ్లీ అదే విషయం గురించి మాట్లాడారు.

డోనాల్డ్ ట్రంప్

ట్రంప్ వాదనను అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో కూడా సమర్థించారు.

"అమెరికా రాయబార కార్యాలయాలపై దాడులు జరగబోతున్నట్లు మా దగ్గర నిర్దిష్ట సమాచారం ఉంది" అని ఇరాన్‌పై కొత్త ఆంక్షల గురించి ప్రకటించిన పాంపేయో అన్నారు.

62 ఏళ్ల సులేమానీ పశ్చిమాసియాలో ఇరాన్ కార్యకలాపాలకు వ్యూహకర్త. సిరియా ప్రభుత్వ యుద్ధంలో తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా, ఇరాక్‌లోని ఇరాన్ అనుకూల పారామిలిటరీని పెంచడానికి వ్యూహాలు రచించారు.

"వేలాది మరణాలకు అతడే కారణం" అని డోనల్ట్ ట్రంప్, పాంపేయో చెప్పారు.

అమెరికా దళాలు జనవరి 3న యెమెన్‌లో ఉంటున్న ఇరాన్ కమాండర్, ఫైనాన్షియర్ అబ్దుల్ రజా షహ్లాయ్‌ను కూడా లక్ష్యం చేసుకున్నాయి. రహస్య ఆపరేషన్‌లో అతడిని చంపలేకపోయామని ఇద్దరు అధికారులు తమకు చెప్పినట్లు వారు తెలిపారు.

యెమెన్‌లో అమెరికా దాడులుగా చెబుతున్న వీటి గురించి ఆ దేశం ఇప్పటివరకూ బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు.

డోనాల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, EPA

ట్రంప్ ఏం చెప్పారు?

గురువారం వైట్‌హౌస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ విషయంపై మొదటిసారి మాట్లాడిన ట్రంప్ "మా ఏంబసీలను పేల్చేయాలని చూస్తుండడంతో, నేను దాడులకు అంగీకరించాను" అన్నారు.

సులేమానీని చంపడానికి కొన్నిరోజుల ముందు బగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై జరిగిన దాడి ఇరాన్ చేయించింది అనేది 'స్పష్టం'గా తెలిసిందని ఆయన చెప్పారు.

"దాన్ని ఎవరు చేయించారో మీకు తెలుసు. ఆ వ్యక్తి ప్రస్తుతం లేడు. ఆ ఏంబసీనే కాకుండా ఆయన మనసులో మరిన్ని ఏంబసీలు ఉన్నాయి" అన్నారు.

తర్వాత ఒహాయోలో ఒక సభలో మాట్లాడిన ట్రంప్ "సులేమానీ నిజానికి కొత్త దాడులకు ప్లాన్ చేస్తున్నారు. ఆయన మా ఏంబసీల వైపు చాలా సీరియస్‌గా చూస్తున్నారు. అది బగ్దాద్‌లో ఏంబసీ మాత్రమే కాదు".

ఏంపీలకు వైట్‌హౌస్ నుంచి తగిన సమాచారం అందడం లేదంటున్న డెమాక్రట్లను ట్రంప్ ఎద్దేవా చేశారు. డెమాక్రట్లకు అది తెలిసుంటే, అమెరికా సైన్యం ప్రణాళికను మీడియాకు లీక్ చేసుండేవారని అన్నారు.

డోనాల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఆధారాలు ఏమున్నాయి?

"అమెరికా ఏంబసీ దగ్గర జరిగిన నిరసనలు ఇరాన్ కుట్రకు సాక్ష్యం. బగ్దాద్ విమానాశ్రయంలో సులేమానీ కాన్వాయ్‌పై అమెరికా డ్రోన్ దాడులు చేయగానే ఆ నిరసనలు ముగిశాయి" అని ట్రంప్ చెప్పారు.

ఇటు మీడియాతో మాట్లాడిన బుధవారం మాట్లాడిన డెమాక్రట్ నేత ఆడం స్మిత్ "అమెరికా ఏంబసీలపై ఇరాన్ దాడులు చేస్తుందని ఎలాంటి ఆధారాలూ లేవు, నేను కొంతమందితో మాట్లాడా, వారెవరూ నాకు వాటి గురించి చెప్పలేదు" అన్నారు.

"అధ్యక్షుడికి ఒక నిర్దేశిత లక్ష్యం కోసం ఆధారాలు ఉన్నప్పుడు వారు దాని గురించి మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు" అని చెప్పారు.

డోనాల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ట్రంప్ అబద్ధాలకోరు: బెర్నీ శాండర్స్

నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌తో పోటీపడబోతున్న వెర్మంట్ సెనేటర్ బెర్నీ శాండర్స్ అమెరికా అధ్యక్షుడిపై భరోసా ఉంచలేమని అన్నారు.

"మాకున్న కష్టం ఏంటంటే.. నేనిక్కడ కఠినంగా మాట్లాడాలని అనుకోవడం లేదు. మా అధ్యక్షుడు ఒక అబద్ధాలకోరు" అని ఆయన ఎన్‌బీసీ న్యూస్‌తో అన్నారు.

ఇరాన్‌పై కొత్త ఆంక్షలు

శుక్రవారం ఇరాన్ మీద కొత్త ఆంక్షలను వైట్ హౌస్ ఆమోదించింది. "ఇరాన్ పాలకుల అంతర్జాతీయ తీవ్రవాద కార్యకలాపాలను అడ్డుకునేందుకు వీటిని విధిస్తున్నామని, ఆదేశంలోని నిర్మాణ, తయారీ, తవ్వక రంగాలపై కొత్త ఆంక్షల ప్రభావం ఉంటుందని అమెరికా మంత్రి స్టీవెన్ మనూచెన్ అన్నారు.

ఇరాన్ అంతర్గత భద్రతా సామగ్రే తమ లక్ష్యమని విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో చెప్పారు.

"ప్రపంచంలో తీవ్రవాదాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తోంది ఇరానే. అక్కడి పాలకులు తమ ప్రవర్తన మార్చుకునేవరకూ ఆ దేశం బెదిరింపులను ఎదుర్కుంటాం అని ట్రంప్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)