CAA: వివాహ వేదికల నుంచి ఉచిత న్యాయ సేవల వరకు... పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా యువత ఎలా ఉద్యమిస్తున్నారు?

ఫొటో సోర్స్, Farhan Khan
భారత ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని వారాలుగా దేశవ్యాప్తంగా వేలాది మంది నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
ఈ నిరసనలలో ఇప్పటివరకు 20 మందికి పైగా మరణించారు. వివిధ ప్రాంతాలలో పోలీసుల దమనకాండను చూపించే వీడియోలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.
కొన్ని ప్రాంతాల్లో పోలీసులు నిరసనలపై ఆంక్షలు విధించినా, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినా పెద్దఎత్తున జనాలు రోడ్ల మీదికొచ్చారు.
అలాంటి పరిస్థితుల్లోనూ అంతమంది ఏకమవ్వడానికి కొన్ని స్వచ్ఛంద కార్యకర్తల బృందాలు కొంతమేర సాయపడ్డాయి. ఆ బృందాలలో న్యాయవాదులు, వైద్యులు, మానసిక నిపుణులు, ఆన్‌లైన్ కార్యకర్తలు ఉన్నారు.
"అందరం రోడ్ల మీదికి రాలేము కదా. అందుకే వీలైన రీతిలో ఉద్యమకారులకు సాయం చేస్తాం" అని దిల్లీకి చెందిన యువ వైద్యురాలు నేహా త్రిపాఠి చెప్పారు.
"ఇబ్బందుల్లో ఉన్న ఉద్యమకారులు ఎవరైనా నన్ను సంప్రదించవచ్చు. వారికి నేను చేయగలిగిన సాయం చేయగలను" అంటూ ఆమె ఈమెయిల్ ఐడీని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు.
"వీధుల్లో నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని ప్రయత్నించాను. కానీ, నిజం చెప్పాలంటే చాలా భయమేసింది. దాంతో ఆందోళన, భయంతో ఉన్నవారికి సాయం చేయాలని అనుకున్నాను" అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Pearl D'Souza
మానసిక, శారీరక ఆరోగ్య సూచనలు
రోడ్ల మీదికి రాకుండానే తమదైన రీతిలో నిరసనకారులకు సాయం అందిస్తున్న వారు ఇంకా చాలా మందే ఉన్నారు.
"నేను ఇటీవలే దూర ప్రయాణాలు చేశాను. కాబట్టి, నిరసనల్లో పాల్గొనలేకపోయాను. కానీ, వారికి ధైర్యం చెప్పేందుకు, మానసికంగా దృఢంగా ఎలా ఉండాలో చెప్పేందుకు చాలామంది నిరసనకారులతో ఫోన్‌లో మాట్లాడుతున్నాను" అని దిల్లీలో పనిచేస్తున్న మానసిక నిపుణురాలు అంజలి సింగ్లా చెప్పారు.

ఫొటో సోర్స్, Sangeetha Alwar
నిరసనకారుల స్వీయ రక్షణకు సంబంధించిన పలు గ్రాఫిక్ చిత్రాలు ఇన్‌గ్రామ్‌లో షేర్ అవుతున్నాయి. అలాంటి చిత్రాలు వేసేవారిలో సంగీత అల్వార్ ఒకరు. ఉద్యమకారులు ఆందోళన, భయం నుంచి ఎలా బయటపడాలి? అన్న చిట్కాలను గ్రాఫిక్ చిత్రాల ద్వారా ఆమె వివరిస్తున్నారు.
"నేను చేస్తున్న పని కొందరికి పక్షపాతంగా అనిపించవచ్చు. కానీ, ఎదుటి వ్యక్తి ఆరోగ్యం గురించి పట్టించుకోవడం చాలా ముఖ్యం" అని ఆమె అంటున్నారు.
నిరసన ప్రదేశాల దగ్గర, తమ క్లినిక్‌లలో ఉచిత వైద్య సహాయం అందిస్తూ కొంతమంది వైద్యులు తమదైన రీతిలో ఉద్యమంలో పాల్గొన్నారు.
"నిరసనల సమయంలో కొంతమందికి తక్షణ వైద్య సహాయం అవసరమవుతుంది. సమాజంలో ఒకరిగా అలాంటి వారికి ప్రాథమిక చికిత్స అందించే బాధ్యత తీసుకున్నాను" అని దిల్లీకి చెందిన డాక్టర్ అహ్మద్ బీబీసీకి చెప్పారు.
అత్యవసర పరిస్థితుల్లో వైద్యం సేవలు అందించే వైద్యుల జాబితాలో అహ్మద్ పేరు కూడా ఉంది.
వైద్యుల మాదిరిగానే... పోలీసుల అదుపులో ఉన్నవారికి ఉచిత న్యాయ సలహాలు ఇచ్చేందుకు న్యాయవాదుల బృందం కూడా ఉంది. చట్టాల గురించి, వాటిలోని చిక్కుముడుల గురించి నిరసనకారులకు అవగాహన కల్పించేందుకు ఆన్‌లైన్‌లో వారు సూచనలు చేస్తుంటారు.

ఫొటో సోర్స్, Shilo Shiv Suleman
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా
పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకించేవారికి ఇన్‌స్టాగ్రామ్ ఒక ముఖ్యమైన వేదికగా మారింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాల షెడ్యూళ్లకు సంబంధించిన సమాచారాన్ని కొందరు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటున్నారు.
నిరసన ప్రదర్శనల్లో పాల్గొనేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంటర్నెట్ పనిచేయకపోతే ఎలా సమన్వయం చేసుకోవాలన్న సూచనలు కూడా చేస్తున్నారు.
మరికొందరు వివిధ ప్రాంతాల్లో జరిగిన పోలీసుల దమనకాండపై విమర్శలు చేస్తున్నారు.
కొందరు డిజైనర్లు నిరసనలకు సంబంధించి కాపీరైట్స్ లేని పోస్టర్లను పంపినీ చేస్తున్నారు.
"ముస్లింలు ఇక్కడివారే. హిందువులు ఇక్కడివారే" అంటూ షిలో శివ అనే విజువల్ డిజైనర్ ఒక పోస్టర్‌ను షేర్ చేశారు. దానిని వేలాది మంది షేర్ చేశారు. దానిని ప్లకార్డుల రూపంలోనూ పలువురు నిరసన కార్యక్రమాల్లో ప్రదర్శించారు.
వాట్సాప్‌లో షేర్ చేసుకునేందుకు కూడా అనేక పోస్టర్లు, చిత్రాలు బయటకు వచ్చాయి.

ఫొటో సోర్స్, Instagram/@sodonechilling
పోస్టర్లు, చిత్రాలే కాదు... వివాహ వేడుకల నుంచి, కళాశాల స్నాతకోత్సవాలు, సంగీత కచేరీల నుంచి కూడా పలువురు తమ నిరసన తెలియజేశారు.
దిల్లీకి చెందిన నదీం అక్తర్, అమీనా జాకియాల వివాహం ఇటీవల జరిగింది. పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు వారు తమ వివాహ వేడుకనే వేదికగా ఎంచుకున్నారు.
"మా వివాహానికి కొద్ది రోజుల ముందు పోలీసులకు, జామియా విశ్వవిద్యాలయం విద్యార్థుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. అది మమ్మల్ని తీవ్రంగా కదిలించింది. అందుకే మావాళ్లు అలా నిరసన వ్యక్తం చేశారు" అని వధువు సోదరి మారియం జాకియా బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Roumya Chandra
జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో గోల్డ్ మెడల్ విజేత డెబ్‌స్మితా చౌదరి, తమ కళాశాల స్నాతకోత్సవం వేదిక మీదే పౌరసత్వ చట్టం ప్రతులను చింపివేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
అలా చేయాలని ముందు రోజు రాత్రి నిర్ణయించుకున్నానని, కానీ ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని ఆమె తెలిపారు.
"ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధం, అత్యంత వివక్షతో కూడినది. ఆ తర్వాత జరిగిన హింస నన్ను కలవరపెట్టింది. నిజానికి నాకు సిగ్గు ఎక్కువ. అయినప్పటికీ, మూగబోయిన వారికి గొంతుక అవ్వాలని అనిపించి అలా చేశాను" అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Grace Banu
చెన్నైలో కొందరు ప్రజలు ఇళ్ల ముందు ముగ్గులు వేసి తమ నిరసను తెలిపేందుకు ప్రయత్నించారు.
బీసెంట్ నగర్‌లోని ఎలిటోస్ బీచ్ ప్రాంతంలో వాళ్లు ముగ్గులు వేశారు. 'సీఏఏ వద్దు.. ఎన్ఆర్‌సీ వద్దు' అంటూ వాటిలో నినాదాలు రాశారు. దాంతో పోలీసులు నలుగురు మహిళలతో పాటు వారికి సాయం చేసిన ఇద్దరు లాయర్లను, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని గంటన్నర తర్వాత విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి:
- యోగీ ప్రభుత్వం పీఎఫ్ఐను నిషేధించాలని ఎందుకు కోరుతోంది
- బీజేపీ పాలిత రాష్ట్రాలు సరే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలు ఎందుకు జరగలేదు: అమిత్ షా
- పాకిస్తాన్‌లోని నాన్కానా సాహెబ్ గురుద్వారాపై దాడి.. సిక్కు ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాలన్న భారత్
- దిశ చట్టం అమలు కోసం ఏపీ ప్రభుత్వం నియమించిన ఈ అధికారులు ఎవరు?
- కాసిం సులేమానీని అమెరికా ఇప్పుడే ఎందుకు చంపింది? ఇరాన్ యుద్ధానికి దిగుతుందా?
- అత్తల పెత్తనం కోడళ్లకు ‘శాపం’గా మారుతోందా.. అత్తలతో కలిసి ఉండటంపై కోడళ్లు ఏమన్నారు
- గుజరాత్ పంట పొలాలపై పాకిస్తాన్ మిడతల ‘సర్జికల్ స్ట్రైక్’... 8 వేల హెక్టార్లలో పంట నష్టం
- తొలిసారి విమానం ఎక్కాడు.. ఇంజిన్లోకి లక్కీ కాయిన్లు విసిరాడు
- ఏడు దశాబ్దాల కిందట సముద్రంలో అణుబాంబు పేలుడు.. ఇంకా మానని గాయం
- చరిత్రలో అత్యంత ఘోరమైన సంవత్సరం
- బార్కోడ్: బీచ్‌లోని ఇసుకలో పుట్టిన ఆలోచన... ప్రపంచ వాణిజ్య రూపురేఖలను ఎలా మార్చేసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








