"కాసిం సులేమానీ హత్యకు ఒబామా, బుష్ ఒప్పుకోలేదు, ట్రంప్ పర్మిషన్ ఇచ్చారు": ఇరాన్‌ విదేశాంగ మంత్రి జవాద్ జరీఫ్‌తో ఇంటర్వ్యూ

జవాద్ జరీఫ్
ఫొటో క్యాప్షన్, ఇరాన్ విదేశాంగ మంత్రి జవాద్ జరీఫ్

ఇరాన్‌కు చెందిన కీలక సైనిక నేత కాసిం సులేమానీని అమెరికా హతమార్చడంతో ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. సులేమానీ హత్యకు అమెరికా మీద 'తీవ్ర ప్రతీకారం' ఉంటుందంటూ ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు, ఇరాన్‌లోని సాంస్కృతిక కేంద్రాలపై దాడులు చేస్తామంటూ అమెరికా ప్రకటించింది.

బుధవారం నాడు ఇరాన్.. ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. ఈ దాడులు జరగడానికి ముందు, ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి జవాద్ జరీఫ్‌ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇది.

ప్రశ్న:ఈ వారంలో ఐక్యరాజ్య సమితిలో మాట్లాడటానికి వెళ్లేందుకు మీకు వీసాను నిరాకరించడం నిజమేనా? మీరు ధ్రువీకరించగలరా?

సమాధానం:సెక్రటరీ జనరల్ మాకు అదే చెప్పారు. కానీ, నేను ఆ విజ్ఞప్తిని 2019 డిసెంబర్‌లో పంపినా... దానిని పరిశీలించేందుకు సమయం దొరకలేదని అమెరికా విదేశాంగ మంత్రి పాంపెయో అన్నారు.

ప్రశ్న: దానిని మీరు ఎలా చూస్తున్నారు?

సమాధానం:ఇది అత్యున్నత ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని మీతో చెప్పేవాడిని. కానీ, మా ప్రభుత్వం వేరు, అమెరికా ప్రభుత్వం వేరు. అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం లేని ప్రభుత్వం, యుద్ధ నేరాలకు పాల్పడుతున్న ప్రభుత్వం, సాంస్కృతిక కేంద్రాలపై దాడులు చేస్తామంటూ బెదిరిస్తున్న ప్రభుత్వం... ఒప్పందాలకు కట్టుబడి ఉంటుందని నేను ఆశించడంలేదు. కానీ, నా ప్రశ్న ఒక్కటే... వాళ్లను భయపెడుతున్నదేంటి? న్యూయార్క్‌లో నేను ఏం చేసి ఉండేవాడిని?

కాసిం సులేమాని చిత్రంతో మహిళ

ఫొటో సోర్స్, APa

ప్రశ్న: మీరు అనుభవజ్ఞులైన దౌత్య వేత్త, అన్ని రకాల దౌత్యపరమైన సంబంధాల విలువ ఏంటో తెలిసినవారు. అలాంటి చర్చలకు కీలకమైన దారిని ఇది మూసివేస్తుందా?

సమాధానం: మీతో నిజాయతీగా చెబుతున్నాను, ఈ పర్యటనలో అమెరికాతో ఎలాంటి చర్చలనూ నేను ఆశించలేదు. కానీ, మేధావులతో, జర్నలిస్టులతో మాట్లాడి, అన్ని విషయాలనూ సవివరంగా పంచుకునేందుకు ఈ పర్యటనతో నాకు ఒక అవకాశం లభించేది.

ప్రశ్న: ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు మీకు అది ఉపయోగపడి ఉండేదా?

సమాధానం: ఉద్రిక్తలను తగ్గించే మార్గాన్ని అమెరికా ఎంచుకుందని నేను అనుకోవట్లేదు. ఉద్రిక్తతల గురించి మాట్లాడటం.. ఎంచుకున్న మార్గానికి భిన్నంగా ఉంది. అమెరికా అనేక మందిని, కీలక వ్యక్తులను, ఇరాక్, ఇరాన్ అధికారులను చంపేసింది. అది యుద్ధ నేర చర్యే అవుతుంది. బహిరంగంగా, ప్రైవేటుగా అమెరికా పంపిన సందేశాలు చాలా క్రూరంగా, అజ్ఞానంగా, దురహంకారంతో ఉన్నాయి. ఇరానీ ప్రజలను బెదిరించింది. అధ్యక్షుడు ట్రంప్‌ను పాంపెయో తప్పుదారి పట్టిస్తున్నారేమో అని నాకు అనిపిస్తోంది. టెహ్రాన్, బాగ్దాద్ వీధుల్లో ప్రజలు డాన్సులు చేస్తున్నారని ఆయన భావిస్తున్నారు. ప్రజలు డాన్స్ చేస్తున్నారంటూ ఆయన ఒక వీడియోను కూడా తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. నిన్న ఇరాక్, ఇరాన్‌లలో సముద్రంలా కనిపించిన మానవత్వాన్ని ఆయన చూసి ఉంటారని అనుకుంటున్నాను. అమెరికా విదేశాంగ విధానాన్ని ఆయన పక్కదారి పట్టించడంలేదా?

ప్రశ్న: ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందా? ఉద్రిక్తతలను మరింత పెంచుతారా?

సమాధానం: అమెరికా ఒక చర్యకు దిగింది, దానికదే గుణపాఠం నేర్చుకుంటుంది. అది ఇరాక్‌ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించింది. దానికి సమాధానం చెప్పాలని ఇరాక్ పార్లమెంటు నిర్ణయించింది. ఈ ప్రాంతంలో అనేక మంది మనోభావాలనూ అమెరికా దెబ్బతీసింది. పలువురు ఇరాన్ పౌరులను, అధికారులను చంపింది. అది యుద్ధ నేర చర్యే. అందుకు ఇరాన్ సరైన విధంగా స్పందిస్తుంది. ఉద్రిక్తతలను తగ్గించడం అంటే... అమెరికా మరిన్ని చర్యలకు దిగకుండా, ఇరాన్‌కు బెదిరింపులను ఆపేసి, ఇరాన్ సమాజానికి క్షమాపణలు చెప్పడం. కానీ, అమెరికా చర్యలకు బదులుగా పరిణామాలు ఉంటాయి. ఇప్పటికే అవి ప్రారంభమయ్యాయని అనుకుంటున్నాను. మా ప్రాంతంలో అమెరికా ఉనికికి ముగింపు ఇప్పటికే మొదలైంది.

కాసిం సులేమాని చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ప్రశ్న: ఇరాన్ బలగాల ప్రతిచర్య సరైన విధంగా, నేరుగా ఉండాలని ఇరాన్ భద్రతా మండలికి సుప్రీం నాయకుడు సూచించారని మంగళవారం ఉదయం కొన్ని కథనాలు వచ్చాయి. వాటిని మీరు ధ్రువీకరించగలరా?

సమాధానం: మాది చట్టానికి కట్టుబడి ఉండే దేశం. మేము ఏదైనా చర్య చేపట్టామంటే అది సహేతుకమైన లక్ష్యాల మీదే ఉంటుంది.

ప్రశ్న: దాని అర్థం సైన్యమా?

సమాధానం: సహేతుకమైన లక్ష్యాల మీద ఉంటుంది.

ప్రశ్న: దాని అర్థం ఏంటి?

సమాధానం: సహేతుక లక్ష్యాల గురించి అంతర్జాతీయ యుద్ధాల చట్టం స్పష్టంగా చెబుతోంది.

ప్రశ్న: కాస్త వివరంగా చెప్పగలరా?

సమాధానం: వాళ్లు వెళ్లి ఆ చట్టానికి సంబంధించిన నిఘంటువులో వెతుక్కోవచ్చు.

ప్రశ్న: అయితే, మీరు హెజ్‌బొల్లా లాంటి ఇరానీ సంస్థలు చేపడుతున్న ప్రతీకార చర్యలను తోసిపుచ్చుతున్నారా?

సమాధానం: మాకు అలాంటి సంస్థలు లేవు. ఇరాక్ వీధుల్లో ప్రజలను మీరు చూసి ఉంటారు. వాళ్లను మేము నియంత్రించడంలేదు. ఎందుకంటే వాళ్లు మా గుమస్తాలు కాదు. భావోద్వేగంతో ఉన్న ప్రజలు వాళ్లు. సొంతంగా ఆలోచిస్తున్నారు. అందుకే నేను అన్నాను, వాళ్లు ఏం చేసినా అది ఇరాన్ నియంత్రణలో ఉండదు.

ప్రశ్న: అంటే.. ఎటువంటి ప్రతీకారమైనా అధికారిక ఇరాన్ బలగాలు, ఏకీకృత బలగాలు చేపడతాయని మీరు నిర్ధారిస్తున్నారా?

సమాధానం: నేను మూడు ఉల్లంఘనలు జరిగాయని చెప్పాను. ఇరాక్ సార్వభౌమత్వం ఉల్లంఘన.. ఇరాక్ ప్రభుత్వం, ఇరాక్ పార్లమెంటు దాని మీద స్పందించాయి. ఈ ప్రాంతంలో కోట్లాది మంది ప్రజల మనోభావాల ఉల్లంఘన.. అది మా నియంత్రణలో లేదు. పలువురు ఇరానీ పౌరులను, కొందరు ఉన్నతస్థాయి ఇరాన్ సైనికాధికారులను హత్య చేశారు. ఈ విషయంలో మేం స్పందిస్తాం. మేం పరికిపందలాగా దొంగచాటుగా కాకుండా విస్పష్టంగా సమతూకంతో చేస్తాం.

ప్రశ్న: ఎప్పుడు?

సమాధానం: మేం కావాలనుకున్నపుడు.

ప్రశ్న: త్వరలోనా?

సమాధానం: మేం కావాలనుకున్నపుడు.

అణు ఒప్పందం పరిమితులు వేటినీ తాము పాటించేది లేదని ఇరాన్ ప్రకటించింది.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, అణు ఒప్పందం పరిమితులు వేటినీ తాము పాటించేది లేదని ఇరాన్ ప్రకటించింది.

ప్రశ్న: కాసిం సులేమానీ ఒక ప్రముఖ, శక్తిమంతమైన కమాండర్. ఆయన మీద చాలా కాలంగా పశ్చిమ దేశాల నిఘా ఉంది. ఆయనను హత్య చేయటానికి అమెరికా అధ్యక్షులు ఒబామా, బుష్ ఇద్దరూ అనుమతి నిరాకరించారని.. అలా చేయటం వల్ల పశ్చిమ దేశాల భద్రతకు, ముఖ్యంగా అమెరికా భద్రతకు ప్రమాదమని వారు భావించటం దానికి కారణమని మనకు తెలుసు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తన ముందు ఇద్దరు అధ్యక్షులు అనుమతి నిరాకరించిన హత్యకు అనుమతించారు. ఇది.. ఆయన గురించి మీకు ఏం చెప్తోంది? బహుశా ఆయన ప్రమాదాన్ని ఎక్కువగా సహించగలరనా?

సమాధానం: టెహ్రాన్, బాగ్దాద్ వీధుల్లో జనం సంతోషంగా నృత్యం చేస్తారని నమ్మిన కొందరు ఆయనకు తప్పుడు సలహా ఇచ్చారని నేను భావిస్తున్నా. ఆయన తన సలహాదారుల గురించి ఆలోచించుకోవాలి.

ప్రశ్న: అధ్యక్షుడు ట్రంప్ అనూహ్యంగా, అస్థిరంగా వ్యవహరిస్తారు కాబట్టి.. ఆయనను చదవటం కష్టమా?

సమాధానం: అనూహ్యంగా, అస్థిరంగా వ్యవహరించే వాళ్లు.. చట్ట పరిధిలో పనులు చేయగలరు. నేటి అమెరికా ప్రభుత్వం అరాచక ప్రభుత్వం. అది ముఖ్యమైన విషయం. అమెరికన్లు తాము ఎన్నకున్న వ్యక్తి అరాచకంగా వ్యవహరించటం ఇష్టపడతారని నేను అనుకోను. అమెరికా తనది చట్టాలకు అనుగుణంగా నడచుకునే దేశమని.. చట్టాలను గౌరవించని ప్రజల దేశం కాదని గర్విస్తుంది. ఇది చట్టం లేని అడవి కాదు. సాంస్కృతిక ప్రాంతాలకు వ్యతిరేకంగా అసాధారణ చర్యలు.. నేను కేవలం ఉటంకిస్తున్నా. ఇరాన్ తన ప్రజలు తిండి తినాలంటే.. అమెరికా చెప్పినట్లు ఆ దేశం వినాలి. ఇవి అమెరికా అధికారులు చేసిన ప్రకటనలు. ఈ ప్రకటనలు యుద్ధ నేరాలు. మానవాళి మీద నేరాలు. తమ ప్రతినిధులు ఇటువంటి నేరపూరిత, అరాచక విధానంలో అమెరికాకు ప్రాతినిధ్యం వహించాలని అమెరికా ప్రజలు కోరుకుంటారా?

సులేమానీ భౌతిక కాయం వద్ద

ఫొటో సోర్స్, AFP

ప్రశ్న: చివరి ప్రశ్న అణు కార్యక్రమం గురించి. జేసీపీఓఏలో నిర్దేశించిన పరిమితులను ఇక గౌరవించబోమని మీరు చెప్పారు. మీ (యురేనియం) శుద్ధి కార్యక్రమాన్ని ఎంత త్వరగా పెంచబోతున్నారు?

సమాధానం: అదికూడా.. మా అవసరాల మేరకు మేం నిర్ణయించుకుంటాం. కానీ.. మేం పరిమితులను గౌరవించబోమని మేం చెప్పలేదు. మేం చర్యలు చేపట్టామని.. మౌలిక పరిమితులు మిగలలేదని చెప్పాం. ఈ చర్యలను వెనుకకు మళ్లించవచ్చు. ఎందుకంటే జేసీపీఓఏ ఒప్పందాన్ని అన్ని పక్షాలూ విస్పష్టంగా చర్చించాయి. దాని నుంచి అమెరికా ఉపసంహరించుకుంది. యూరోపియన్లు జేసీపీఓఏ లోనూ, జేసీపీఓఏకి వెలుపలా ఇచ్చిన హామీలను అమలు చేయటంలో విఫలమయ్యారు. మేం ప్రకటనలతో కాదు.. రాతపూర్వకంగా.. ఐదుసార్లు వారికి సమాచారం ఇచ్చాం.. మాకు అందించిన వ్యవస్థను మేం ప్రారంభిస్తున్నామని. కాబట్టి మేం చాలా చట్టబద్ధమైన రీతిలో, చట్టానికి పూర్తిగా కట్టుబడ్డ విధంగా.. ఒప్పందానికి అనుగుణంగానే.. ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లయితే చేపట్టగల చర్యలుగా ఆ ఒప్పందంలో ఉన్న చర్యలనే మేం చేపడుతున్నాం. ఒకవేళ వారు ఒప్పందం కింద అంగీకరించిన హామీలను అమలు చేయటం ప్రారంభిస్తే.. ఆ వెంటనే ఈ చర్యలను వెనక్కు మళ్లించవచ్చు. కాబట్టి జేసీపీఓఏ సజీవంగా ఉంది. ఎందుకంటే అది చాలా వాస్తవిక ఒప్పందం. మరి మరణించింది ఏమిటో మీకు తెలుసా? గరిష్ట ఒత్తిడి. ఎందుకంటే అది పదే పదే విఫలమైంది. అలాగే మరొకటి కూడా మరణించింది: మా ప్రాంతంలో అమెరికా ఉనికి. అమెరికా ఈ ప్రాంతంలో కొనసాగటం ఇక సులభంగా ఉంటుందని నేను భావించటం లేదు.

ప్రశ్న: కాసిం సులేమానీని హత్య చేయటం.. ఇరాన్ అధికార వ్యవస్థలో అతివాదులకు సాయపడుతుందని.. ఎందుకంటే ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్ ప్రజల్లో ఉన్న తీవ్ర ఆగ్రహం మీద నుంచి ఇది దృష్టి మళ్లిస్తుందని చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు.

సమాధానం: ఇప్పుడు ఇరాన్ జనమంతా ఒక్కటే. మేమందరం ఇరానీయులమే. ఇందులో అతివాదులు లేరు, మితవాదులు లేరు.

ప్రశ్న: కానీ.. అది మీ మీద ఒత్తిడిని తొలగిస్తుంది.

సమాధానం: మేమందరం.. మా దేశాన్ని కాపాడుకోవాలని, మా గౌరవాన్ని కాపాడుకోవాలని కోరుకునే ఇరానీయులం. మేమందరం.. శాంతి కోసం పోరాడిన ఒక మనిషిని కోల్పోయిన విషాదంలో ఉన్నాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)