ఇరాన్‌కు అమెరికాపై ప్రతీకారం తీర్చుకోగల సత్తా ఉందా? ఇరాన్ సైన్యం శక్తిసామర్థ్యాలు ఎంత?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రియాలిటీ చెక్ టీం
- హోదా, బీబీసీ న్యూస్
బాగ్దాద్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరిపి తమ మిలటరీ కమాండర్ కాసిం సులేమానీని హతమార్చిన అమెరికాపై బదులు తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది.
సులేమానీ హత్య వెనుక ఉన్నవారిపై తీవ్ర ప్రతీకార చర్యలు తప్పవని ఇరాన్ సుప్రీం లీడర్ అన్నారు.
మరి, అమెరికాపై ప్రతీకారం తీర్చుకునే శక్తి ఇరాన్‌కు ఉందా? ఇరాన్ సైనిక శక్తిసామర్థ్యాలు ఎలా ఉన్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
5 లక్షల మంది సైన్యం
ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్ట్రేటజిక్ స్టడీస్ లెక్కల ప్రకారం ఇరాన్ సైన్యంలో 5,23,000 మంది వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఇందులోనే 3,50,000 రెగ్యులర్ ఆర్మీ, సుమారు 1,50,000 మంది ఉన్న ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్(ఐఆర్‌జీసీ) భాగం. దీనికి అదనంగా ఐఆర్‌జీసీ నావికాబలగంలో ఓ 20 వేల మంది ఉన్నారు.
హర్మజ్ జలసంధిలో ఈ ఐఆర్‌జీసీ నావికా బలగం సాయుధ బోట్లతో గస్తీ తిరుగుతుంటుంది. ఇరాన్‌లో అంతర్గతంగా తలెత్తే అసంతృప్తులు, నిరసనలను చల్లార్చేందుకు తోడ్పడే స్వచ్ఛంద బలగం బసీజ్ యూనిట్ కూడా ఐఆర్‌జీసీ నియంత్రణలోనే ఉంటుంది.
అవసరమైనప్పుడు వేలాది మందిని మోహరించగలిగే సామర్థ్యం ఉన్న యూనిట్ ఈ బసీజ్.

ఫొటో సోర్స్, Getty Images
40 ఏళ్లలో తిరుగులేని శక్తిగా మారింది..
ఇరాన్‌లోని ఇస్లామిక్ విధానానికి మద్దతుగా నిలిచేందుకు 40 ఏళ్ల కిందట ఐఆర్‌జీసీని ఏర్పాటు చేశారు. అది కాలక్రమంలో ప్రధానమైన సైనిక, రాజకీయ, ఆర్థిక బలగంగా మారింది.
సాధారణ సైన్యంతో పోల్చితే ఐఆర్‌జీసీకి బలగం తక్కువగా ఉన్నప్పటికీ ఇరాన్‌లో దీన్నే తిరుగులేని సైనిక శక్తిగా పరిగణిస్తారు.
ఐఆర్‌జీసీ విదేశాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తోంది?
ఐఆర్‌జీసీ కోసం జనరల్ సులేమానీ నేతృత్వంలోని ఖుద్స్ ఫోర్స్ రహస్య కార్యకలాపాలు నిర్వహిస్తుంది. సులేమానీ నేతృత్వంలోని ఖుద్స్ ఫోర్స్ తన రహస్య కార్యకలాపాల నివేదికలను నేరుగా దేశ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీకే అందజేస్తుంది. ఈ ఖుద్స్ ఫోర్స్‌లో 5,000 మంది ఉన్నట్లు అంచనా.
ఈ బలగాలు సిరియాలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ అనుకూల దళాలకు, వారితో పోరాడుతున్న సాయుధ షియా మిలీషియాకు కూడా సలహాలిచ్చాయి.
ఇరాక్ విషయానికొస్తే వీరు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఓటమికి సాయపడిన షియా ఆధిపత్య పారామిలటరీ బలగాలకు మద్దతుగా పనిచేశారు.
పశ్చిమాసియాలో టెర్రరిస్ట్ గ్రూపులుగా తాము గుర్తించిన సంస్థలకు నిధులు, ఆయుధాలు సమకూర్చడం, శిక్షణ అందించడంలో ఖుద్స్ ఫోర్స్ ముఖ్య పాత్ర పోషిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. లెబనాన్‌లోని హిజ్బుల్లా మూవ్‌మెంట్, పాలస్తీనాలోని ఇస్లామిక్ జిహాద్‌కు ఖుద్స్ ఫోర్స్ సహకారం భారీగా ఉందంటోంది.
ఆర్థిక సమస్యలు, ఆంక్షలు వంటివి ఇరాన్ ఆయుధ దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపాయి. పశ్చిమాసియాలోని అనేక ఇతర దేశాలతో పోల్చితే ఇరాన్ ఆయుధ దిగుమతులు తక్కువే.
స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ గణాంకాల ప్రకారం.. 2009-18 మధ్య సౌదీ అరేబియా ఆయుధ దిగుమతులతో పోల్చితే ఇరాన్ ఆయుధ దిగుమతులు చాలా తక్కువ. ఆ కాల వ్యవధిలో సౌదీ అరేబియా దిగుమతి చేసుకున్న ఆయుధాలలో 3.5 శాతం మాత్రమే ఇరాన్ దిగుమతి చేసుకోగలిగింది. ఇరాన్ ఆయుధ దిగుమతుల్లో అత్యధికం రష్యా నుంచి వస్తుండగా, ఆ తరువాత స్థానంలో చైనా ఉంది.

ఇరాన్ వద్ద క్షిపణులున్నాయా?
ఇరాన్ సైనిక పాటవంలో క్షిపణి సామర్థ్యాన్ని కీలకంగా చెప్పుకోవాలి. పశ్చిమాసియాలో బలమైన క్షిపణి సామర్థ్యం గల దేశం ఇరానేనని అమెరికా రక్షణ శాఖ నివేదిక ఒకటి వెల్లడించింది.
ఇరాన్ క్షిపణుల పొదిలో ప్రధానంగా మధ్య, స్వల్ప శ్రేణివి ఎక్కువగా ఉన్నాయి. ఖండాంతర క్షిపణుల కోసం ఇరాన్ స్పేస్ టెక్నాలజీనీ పరీక్షిస్తోందని ఆ నివేదిక పేర్కొంది.
అయితే, 2015లో ఇతర దేశాలతో చేసుకున్న అణ్వస్త్ర నిరోధక ఒప్పందాన్ని అనుసరించి ఇరాన్ తన లాంగ్ రేంజ్ మిసైల్ ప్రోగ్రాం నిలిపివేసినట్లు రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇనిస్టిట్యూట్ తెలిపింది.
ప్రస్తుతం ఆ దేశానికున్న క్షిపణి సామర్థ్యం ప్రకారం సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలు, ఇజ్రాయెల్‌లోని కొన్ని ప్రాంతాలను లక్ష్యం చేసుకోగలదు.
పశ్చిమాసియాలో ఇరాన్‌తో సఖ్యత ఉన్న దేశాలు కొన్ని ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లను లక్ష్యంగా చేసుకునేందుకు ఇరాన్ సరఫరా చేసిన క్షిపణులు, క్షిపణి నిర్దేశ వ్యవస్థలను వాడుకున్నట్లు ఆధారాలున్నాయి.
గత ఏడాది మేలో అమెరికా ఒక పేట్రియాట్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను పశ్చిమాసియాలో మోహరించింది. బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, అడ్వాన్స్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ధ్వంసం చేయగల ఈ వ్యవస్థను ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలోనే అక్కడ మోహరించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్ దగ్గరున్న సంప్రదాయేతర ఆయుధాలేమిటి?
అనేక ఏళ్లుగా ఆంక్షలున్నప్పటికీ ఇరాన్ డ్రోన్ ఆయుధాలను అభివృద్ధి చేసుకోగలిగింది. ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌తో పోరాటంలో ఇరాన్ 2016 నుంచి ఇలాంటి డ్రోన్లను వినియోగిస్తోంది.
సిరియాలోని స్థావరాల నుంచి ఇరాన్ తన సాయుధ డ్రోన్లను ఇజ్రాయెల్ గగనతలంలోకి పంపించిందని రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇనిస్టిట్యూట్ తెలిపింది.
ఇరాన్ 2019 జూన్‌లో అమెరికా సర్వేలెన్స్ డ్రోన్‌ను కూల్చేసింది. హర్మజ్ జల సంధి వద్ద తమ గగనతలంలోకి అది అక్రమంగా ప్రవేశించిందని ఆరోపిస్తూ ఇరాన్ ఈ పనిచేసింది.
పశ్చిమాసియాలోని మిత్ర దేశాలకు డ్లోన్లను విక్రయించడానికి, తన డ్రోన్ సాంకేతికతలను బదిలీ చేయడానికి కూడా ఇరాన్ సానుకూలంగా ఉందని బీబీసీ డిఫెన్స్, డిప్లొమేటిక్ కరస్పాండెంట్ జొనాథన్ మార్కస్ తెలిపారు.
2019లో సౌదీ అరేబియాలోని చమురు నిల్వ క్షేత్రాలపై డ్రోన్ దాడులు జరిగాయి. ఈ దాడులు ఇరాన్ పనేనని అమెరికా, సౌదీ అరేబియాలు ఆరోపించాయి. అయితే, ఇరాన్ ఈ ఆరోపణలను ఖండించింది.
సైబర్ దాడుల సామర్థ్యమూ ఉందా?
2010లో తన అణ్వస్త్ర వ్యవస్థలపై భారీ సైబర్ దాడి జరిగిన తరువాత ఇరాన్ సైబర్ సామర్థ్యాలలో భారీ మార్పులు తీసుకొచ్చింది.
ఐఆర్‌జీసీకి సొంత సైబర్ కమాండ్ ఉందని చెబుతారు. వాణిజ్య, సైనిక నిఘా, గూఢచర్యం కోసం దీన్ని వినియోగిస్తున్నట్లు భావిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏరోస్పేస్ కంపెనీలు, డిఫెన్స్ కాంట్రాక్టర్లు, ఎనర్జీ నేచురల్ రిసోర్స్ కంపెనీలు, టెలికమ్యూనికేషన్స్ సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ సైబర్ నిఘా పెట్టిందని 2019లో అమెరికా మిలటరీ రిపోర్ట్ ఒకటి పేర్కొంది.
2019లో మైక్రోసాఫ్ట్ కూడా ఇరాన్‌పై ఇలాంటి ఆరోపణలే చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని లక్ష్యంగా చేసుకుంటూ, అమెరికా ప్రభుత్వాధికారుల ఖాతాలను లక్ష్యంగా చేసుకుంటూ ఇరాన్ ప్రభుత్వంతో సంబంధాలున్న హ్యాకర్స్ గ్రూప్ ఒకటి ఇరాన్ నుంచే సైబర్ దాడులకు యత్నించిందని ఆరోపించింది.
ఇవి కూడా చదవండి:
- కాసిం సులేమానీని అమెరికా ఇప్పుడే ఎందుకు చంపింది? ఇరాన్ యుద్ధానికి దిగుతుందా?
- ఇరాక్‌లోని అమెరికా ఏంబసీపై దాడి.. ‘భారీ మూల్యం చెల్లిస్తారు’ - ఇరాన్‌కు డోనల్డ్ ట్రంప్ హెచ్చరిక
- యెమెన్ యుద్ధం: వేలాది సౌదీ సైనికులను పట్టుకున్నామన్న హౌతీ తిరుగుబాటుదారులు
- 'సౌదీ చమురు క్షేత్రాలపై ఇరానే దాడులు చేసిందనడానికి ఈ శకలాలే నిదర్శనం'
- ఇరాన్ నౌకను అప్పగిస్తే లక్షలాది డాలర్లు ఇస్తామన్న అమెరికా... ఆఫర్‌ను తిరస్కరించిన భారత కెప్టెన్
- ఒక దేశం ఓడల మీద మరో దేశం జెండాలు ఎందుకు...
- ఇరాన్ సీజ్ చేసిన బ్రిటన్ నౌకలోని 18 మంది భారతీయుల పరిస్థితి ఏమిటి
- 'ఇరాన్ అణు ఒప్పంద పరిమితులను ఉల్లంఘించింది'
- 'బ్రిటన్ ఆయిల్ ట్యాంకర్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇరానీ బోట్లు'
- అరబ్ దేశాల్లో మతాన్ని వదిలేసేవారు పెరుగుతున్నారు :బీబీసీ సమగ్ర సర్వే
- వైట్ హౌస్‌కు మతి చలించింది: అమెరికా ఆంక్షలపై ఇరాన్ విమర్శ
- ఇరాన్ సుప్రీం లీడరే లక్ష్యంగా ట్రంప్ కొత్త ఆంక్షలు
- పది నిమిషాలు ఉందనగా దాడులను ఆపించా: ట్రంప్
- సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై డ్రోన్ దాడులతో పెరిగిన ఆయిల్ ధరలు.. మీపై ప్రభావం పడుతుందా?
- ‘అంతర్జాతీయ క్రీడా పోటీల్లో మా దేశాన్ని నిషేధించండి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









