ఇరాన్ సీజ్ చేసిన బ్రిటన్ నౌకలోని 18 మంది భారతీయుల పరిస్థితి ఏమిటి

ఫొటో సోర్స్, AFP PHOTO / FARS NEWS / ABED GHASEMI
గల్ఫ్‌లో తాము సీజ్ చేసిన చమురు నౌక ఫొటోలు, వీడియో దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. స్టెనా ఇంపీరియో అనే పేరున్న ఈ నౌక బ్రిటిష్ జెండాతో ప్రయాణిస్తోంది.
నౌకలో వంటవాళ్లు ఆహారం తయారు చేస్తున్న దృశ్యంతో పాటు.. నౌక సిబ్బందితో ఇరాన్ అధికారి ఒకరు మాట్లాడుతున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి.
ఫార్స్, ఇరిబ్ న్యూస్ ఏజెన్సీలు ఈ వీడియోలు, ఫొటోలను ప్రచురించాయి. శుక్రవారం నాడు ఇరాన్ సీజ్ చేసిన ఈ నౌకలో 23 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 18 మంది భారత జాతీయులతో పాటు.. రష్యా, లాత్వియా, ఫిలిప్పీన్స్ దేశాల వారూ ఉన్నారు.
భారత జాతీయులు సహా సిబ్బంది అంతా ఆరోగ్యంగా ఉన్నారని.. అందరూ చమురు నౌకలోనే ఉన్నారని భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం సోమవారం వెల్లడించింది.
అయితే.. తమ వారి క్షేమం గురించి నౌక సిబ్బంది కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని వివరాలు గోప్యంగా ఉంచాలన్న షరతుతో ఒక ఉద్యోగి బంధువు చెప్పారు. నౌకను సీజ్ చేసినప్పటి నుంచి తమ బంధువు నుంచి ఎటువంటి సందేశమూ అందలేదన్నారు.

ఫొటో సోర్స్, copyrightIRIB
ఇంతకీ ఎవరిదీ నౌక?
స్టెనా ఇంపీరియో చమురు నౌక యాజమాన్య సంస్థ స్వీడన్‌కు చెందిన స్టెనా బల్క్. ఈ నౌక సిబ్బంది కానీ, యజమానులు కానీ బ్రిటిష్ వారు కాకపోయినప్పటికీ.. ఆ నౌక బ్రిటన్ జెండాతో ప్రయాణిస్తోంది.
''చారిత్రకంగా చూస్తే.. ఈ నౌకకు భద్రత కల్పించే బాధ్యత బ్రిటన్ తీసుకున్నదని దీనర్థం'' అని సముద్ర రవాణా నిపుణుడు రిచర్డ్ మీడ్ చెప్పారు.
ప్రస్తుతం బ్రిటిష్ జెండాలతో ప్రయాణిస్తున్న ఎనిమిది చమురు ట్యాంకర్లు గల్ఫ్‌లోని హార్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయి ఉన్నాయని పరిశీలకులు చెప్తున్నారు.
ఈ నౌక ప్రస్తుతం దక్షిణ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ రేవులో ఇరాన్ ఆధీనంలో ఉంది. నౌక సిబ్బందిని కలవటానికి అనుమతివ్వాలని యాజమాన్య లాంఛనంగా విజ్ఞప్తి చేసింది.
వారందరినీ ప్రశ్నించటం కోసం నౌక నుంచి కిందికి తీసుకెళ్లారని ఇరాన్‌కు చెందిన ప్రెస్ టీవీ ఒక కథనంలో తెలిపింది.
స్వీడన్ కంపెనీ నుంచి తమకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతోందని భారతీయ సిబ్బందిలోని ఒకరి బంధువు తెలిపారు. నౌకను విడిపించటానికి జరుగుతున్న దౌత్య ప్రయత్నాల మీద విశ్వాసం వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, copyrightIRIB
ఇరాన్ ఈ నౌకను ఎందుకు సీజ్ చేసింది?
ఇరాన్ నుంచి చమురును తీసుకెళుతున్న ఒక నౌకను సీజ్ చేయటానికి బ్రిటన్ సాయపడిన కొన్ని వారాలకే.. బ్రిటన్ జెండాతో ఉన్న స్టెనా ఇంపీరియో చమురు నౌకను ఇరాన్ సీజ్ చేసింది.
కీలక చమురు రవాణా జలమార్గమైన హోర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఈ నౌక.. అంతర్జాతీయ సముద్ర ప్రయాణ నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ శుక్రవారం సీజ్ చేసింది.
ఈ నౌక ఒక ఫిషింగ్ బోట్‌ను ఢీ కొట్టిందని, ఆ బోటులోని వాళ్ల పిలుపులకు స్పందించలేదని.. దీంతో నౌకను సీజ్ చేశామని ఇర్నా వార్తా సంస్థ పేర్కొంది.
నౌకను అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలను కూడా ఫార్స్ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసింది.

ఫొటో సోర్స్, IRIB
బ్రిటన్ ఏమంటోంది?
ఈ సంఘటనతో బ్రిటన్, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. తమ దేశానికి చెందిన చమురు నౌకను ఇరాన్ సీజ్ చేయటం సహించరానిదని, తీవ్రంగా రెచ్చగొట్టే చర్య అని బ్రిటన్ అభివర్ణించింది.
తమ దేశ జెంతో ఉన్న నౌకను ఒమన్ సముద్ర జలాల్లో అక్రమంగా సీజ్ చేసి.. ఇరాన్ లోని బందర్ అబ్బాస్ పోర్టుకు బలవంతంగా తీసుకెళ్లారని బ్రిటన్ విదేశాంగ మంత్రి జెరిమీ హంట్ ఆరోపించారు.
ప్రభుత్వ అత్యవసర విభాగమైన కోబ్రా కమిటీ సమావేశమైంది. ఇరాన్ ఆస్తులను స్తంభింపజేసే అంశాన్ని మంత్రులు పరిశీలిస్తున్నారన్న వార్తల మధ్య ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇరాన్ చర్య 'స్టేట్ పైరసీ' అని హంట్ ఎంపీలతో పేర్కొన్నారు. గల్ఫ్‌లో సముద్ర రక్షణ కార్యక్రమాన్ని అభివృద్ధి చేసే ప్రణాళిక గురించి ప్రకటించారు.
ఇరాన్ ఇదే రీతిలో ప్రవర్తించటం కొనసాగితే.. ఆ దేశం సముద్ర తీరంలో పశ్చిమ సైన్యం భారీ ఎత్తున మోహరించాల్సి వస్తుందని హంట్ వ్యాఖ్యానించారు.
అయితే.. ఈ రక్షణ బలగాలను యూరప్ దేశాల సైన్యాలతోనే ఏర్పాటు చేయటం జరుగుతుందని.. అందులో అమెరికాకు చోటు ఉండదని స్పష్టంచేశారు. ఎందుకంటే ఇరాన్ మీద ''అత్యధిక ఒత్తిడి'' చేయాలన్న ట్రంప్ విధానంలో బ్రిటన్ భాగస్వామి కాదని చెప్పారు.
మరోవైపు.. బ్రిటన్ తన నౌకల సంరక్షణ చూసుకోవాల్సిన బాధ్యత బ్రిటన్ మీదే పడిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, FARS NEWS AGENCY/REUTERS
ఎందుకీ గొడవ?
రెండు వారాల కిందట.. యూరోపియన్ ఆంక్షలను ఉల్లంఘిస్తూ.. ఇరాన్ చమురును సిరియాకు తీసుకెళుతోందన్న ఆధారాలతో గ్రేస్-1 అనే చమురు ట్యాంకర్‌ను సీజ్ చేయటానికి బ్రిటన్‌కు చెందిన రాయల్ మెరైన్స్ బలగాలు సాయం చేశాయి.
గ్రేస్-1ను చట్టబద్ధంగా అదుపులోకి తీసుకోవటం జరిగిందని.. కానీ అది 'సముద్ర దోపిడీ' అని అభివర్ణించిన ఇరాన్.. దానికి ప్రతిగా బ్రిటిష్ చమురు నౌకను సీజ్ చేస్తామని బెదిరించిందని హంట్ పేర్కొన్నారు.
మరోవైపు.. ప్రభుత్వ హెచ్చరిక నేపథ్యంలో బ్రిటిష్ నౌకలు గల్ఫ్ నుంచి ఇప్పుడు చమురు రవాణా చేయటం లేదు. వాటిని వేరే ప్రాంతాలకు మళ్లించారు.
'అమెరికా ఆర్థిక ఉగ్రవాదం'లో బ్రిటన్ సహనేరస్తురాలిగా ఉండటం మానుకోవాల'టూ ఇరాన్ విదేశాంగ మంత్ర జావేద్ జారిఫ్ శనివారం ట్వీట్ చేశారు.
ఈ ప్రాంతంలో పరిస్థితి చాలా సున్నితంగా ఉన్నందున ఉద్రిక్తతలను పెంచటం ప్రమాదకరం, తెలివితక్కువ తనం అవుతుందని బ్రిటన్‌ను హెచ్చరిస్తూ లండన్‌లోని ఇరాన్ రాయబారి ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలు నేపథ్యం ఏమిటి?
ఇరాన్‌కు - బ్రిటన్, అమెరికాలకు మధ్య సంబంధాలు వేగంగా క్షీణిస్తూ వస్తున్నాయి.
ఇరాన్‌తో చేసుకున్న 2015 అణు ఒప్పందం నుంచి ఏప్రిల్‌లో వైదొలగిన అమెరికా.. ఇరాన్ మీద విధించిన తన ఆంక్షలను మరింత కఠినం చేసింది.
మే నెల నుంచి హోర్ముజ్ జల సంధిలో చమురు నౌకలపై జరిగిన దాడులు ఇరాన్ పనేనని అమెరికా ఆరోపించింది. దీనిని ఇరాన్ తిరస్కరించింది. ఇదిలావుంటే.. గల్ఫ్‌లో ఇరాన్‌కు చెందిన ఒక డ్రోన్‌ను కూల్చివేశామని అమెరికా ప్రకటించింది.
మరోవైపు.. ఇరాన్‌తో ఒప్పందానికి బ్రిటన్ ప్రభుత్వం కట్టుబడే ఉంది. ఆంక్షలను ఎత్తివేయటానికి బదులుగా ఇరాన్ తన అణు కార్యక్రమాలను రద్దు చేయటం ఆ ఒప్పందం లక్ష్యం.
అయితే.. గ్రేస్-1 చమురు ట్యాంకర్‌ను సీజ్ చేయటానికి బ్రిటన్ సాయం చేయటం ఇరాన్‌కు ఆగ్రహం తెప్పించింది.
ఇవి కూడా చదవండి:
- చంద్రశేఖర్ ఆజాద్ తనను తాను కాల్చుకొని చనిపోయాడనేది నిజమేనా?
- కశ్మీర్ వివాదంపై ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని మోదీ కోరలేదు: భారత్
- విమానం ఎగిరేముందు చక్రాల చాటున దాక్కున్నాడు, పైనుంచి కిందపడి మరణించాడు
- వయసులో ఉన్న స్త్రీలు గర్భసంచులను ఎందుకు తీయించుకుంటున్నారు
- అక్కడ గ్రహాంతర జీవులున్నాయా? అందుకే ఎవరూ రావద్దని అమెరికా హెచ్చరించిందా...
- మెట్రో స్టేషన్లో మూకదాడి.. 45 మందికి తీవ్ర గాయాలు
- అంబటి రాయుడు, అతడి '3డీ' ట్వీట్‌పై ఎమ్మెస్కే ప్రసాద్ ఏమన్నారంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








