హాంగ్‌కాంగ్: మెట్రో స్టేషన్లో మూకదాడి.. 45 మందికి తీవ్ర గాయాలు

ఫొటో సోర్స్, Reuters
కర్రలు, కత్తులు పట్టుకున్న వందల మంది ఒక్కసారిగా ఆ మెట్రోరైల్ స్టేషన్లోకి చొరబడ్డారు. స్టేషన్లో కనిపించినవారినంతా దారుణంగా కొట్టారు.
తెల్లని టీషర్టుల్లో వచ్చిన ఆ సాయుధులు ప్లాట్‌ఫాంలపై ఉన్న ప్రయాణికులపై దారుణంగా విరుచుకుపడ్డారు. రక్తాలు కారేలా కొట్టారు.
హాంగ్‌కాంగ్‌లోని యుయెన్ లాంగ్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్న ఈ మూకదాడిలో 45 మంది తీవ్రంగా గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
పోలీసులపైనే అనుమానాలు
హాంగ్‌కాంగ్‌లో కొద్దికాలంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం ప్రజాస్వామ్య అనుకూల వర్గాలు భారీ ర్యాలీ నిర్వహించగా పోలీసులు వారిపై బాష్పవాయువు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే మెట్రో స్టేషన్‌పై ఈ మూకదాడి జరిగింది.
స్టేషన్లో ఉన్న ప్రయాణికులు.. ఆందోళనల్లో పాల్గొని వస్తున్న నిరసనకారులపైనా దాడి జరగడంతో ఈ మూకలో ఉన్నది ఎవరన్నది ఇంకా స్పష్టం కాలేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించకపోవడానికి కారణమేంటి.. ఎందుకు వారు అక్కడికి చేరుకోలేదంటూ ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారుడు ఒకరు అనుమానం వ్యక్తంచేశారు.
ప్రపంచంలోనే ప్రజలు, పోలీసుల నిష్పత్తిలో ముందున్న హాంగ్‌కాంగ్‌లో ఇలా ఒక రైల్వే స్టేషన్లో ప్రయాణికులపై దుండగులు దాడి చేస్తుంటే పోలీసులు ఏమయ్యారు అంటూ రే చాన్ అనే వ్యక్తి ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.
మూకదాడి తరువాత పోలీసులు అక్కడికి చేరుకోవడానికి గంటకు పైగా పట్టిందని.. కిరాయి మూకలు తాము ఏం చేయాలంటే అది చేసుకోగలిగే స్వేచ్ఛను హాంగ్‌కాంగ్ ప్రభుత్వం కల్పిస్తోందా అంటూ అక్కడి విపక్ష నేత లామ్‌చ్యూక్ తింగ్ ప్రశ్నించారు.
ప్రభుత్వం ఏమంటోంది?
ఈ ఘటనపై ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. హాంకాంగ్‌లో చట్టాలున్నాయని.. ఇలాంటి హింసాత్మక చర్యలను ప్రభుత్వం ఖండిస్తుందని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపై ఉన్న ప్రయాణికులపై దాడికి దిగారని పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకీ నిరసనలు?
హాంగ్ కాంగ్ నుండి 'నేరస్తుల'ను చైనాకు అప్పగించేందుకు ఉద్దేశించిన ఒక ముసాయిదా చట్టంపై హాంగ్‌కాంగ్‌లో భారీ నిరసన పెల్లుబుకుతోంది.
అయినప్పటికీ.. హాంగ్ కాంగ్ ఆ బిల్లును ఆమోదించి తీరుతానని చెప్తోంది. ప్రతిపాదిత సవరణలతో హాంగ్ కాంగ్ నగరం నేరస్తులకు సురక్షిత ఆశ్రయంగా ఉండబోదని వాదిస్తోంది.
కానీ.. ఈ ప్రతిపాదిత చట్టాన్ని చైనాలో తీవ్ర లోపభూయిష్టమైన పోలీసు, న్యాయ వ్యవస్థ దుర్వినియోగం చేసే అవకాశం ఉందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానివల్ల హాంగ్ కాంగ్ న్యాయ వ్వవస్థ స్వాతంత్ర్యం ఇంకా తరిగిపోతుందని చెప్తున్నారు.
ప్రతిపాదిత బిల్లుకు వ్యతిరేకంగా లక్షలాది మంది ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
కానీ హాంగ్ కాంగ్ నాయకురాలు క్యారీ ల్యామ్ ఆ ముసాయిదాను నిలిపివేయటానికి నిరాకరించారు. చట్టానికి సవరణలను జూలైలో ఆమోదించటానికి సంసిద్ధమయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ మార్పులు?
హాంగ్ కాంగ్‌లో హత్య, అత్యాచారం వంటి నేరాల్లో అనుమానితులను తమకు అప్పగించాల్సిందిగా చైనా, తైవాన్, మకావు అధికారులు కోరటానికి ప్రతిపాదిత మార్పులు అవకాశం కల్పిస్తాయి.
ఈ విజ్ఞప్తులను హాంగ్ కాంగ్ అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఇలా నిందితులు, అనుమానితులను అప్పగించాలన్న విజ్ఙాపనలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం హాంగ్ కాంగ్ కోర్టులకే ఉంటుందని చెప్తున్నారు.
అలాగే.. రాజకీయ నేరాలు, మతపరమైన నేరాలలో నిందితులను అప్పగించబోమని కూడా హాంగ్ కాంగ్ అధికారులు పేర్కొన్నారు.
వ్యాపారవేత్తల నుంచి వ్యక్తమైన ఆందోళనల నేపథ్యంలో.. పన్ను ఎగవేత వంటి పలు వాణిజ్య నేరాలను ఈ అప్పగింత నేరాల జాబితా నుంచి తొలగించారు.
ఈ ప్రతిపాదిత చట్టం మీద ప్రజల ఆందోళనల నేపథ్యంలో వారికి భరోసా కల్పించటానికి హాంగ్ కాంగ్ ప్రభుత్వం ప్రయత్నించింది.
కనీసం ఏడేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం గల నేరాల్లో పరారీలో ఉన్న నిందితులను మాత్రమే చైనాకు అప్పగిస్తామని హామీ ఇవ్వటం వంటి మినహాయింపులు చేరుస్తామని హామీ ఇస్తోంది.

ఫొటో సోర్స్, AFP
ఈ చట్టం ఎందుకు వివాదాస్పదం?
కొత్త చట్టం ఫలితంగా.. చైనా చట్ట వ్యవస్థ కింద అనుమానితుల పేరుతో ప్రజలను ఏకపక్షంగా నిర్బంధించటం, అన్యాయంగా విచారించటం, హింసకు గురిచేయటం జరుగుతుందని విమర్శకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
''మెయిన్‌ల్యాండ్ చైనాకు సంబంధించి హాంగ్ కాంగ్‌లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరినీ ఈ ప్రతిపాదన ప్రమాదంలోకి నెడుతుంది. ఉద్యమకారులు, మానవ హక్కుల న్యాయవాదులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు.. ఏ ఒక్కరికీ భద్రత ఉండదు'' అని హ్యూమన్ రైట్స్ వాచ్ ప్రతినిధి సోఫీ రిచర్డ్సన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
చైనా నాయకులను విమర్శించే పుస్తకాలను విక్రయించినందుకు 2015లో తనను అపహరించి చైనాలో నిర్బంధించారని.. 'చట్టవ్యతిరేకంగా బుక్‌స్టోర్ నిర్వహిస్తున్నా'నని తనపై అభియోగం మోపారని.. హాంగ్ కాంగ్ పుస్తక విక్రేత లామ్ వింగ్ కీ చెప్పారు.
''నేను చైనా వెళ్లకపోతే.. హాంగ్ కాంగ్ అధికారులే నన్ను అప్పగిస్తారు. ఈ ప్రభుత్వం నా భద్రతకు కానీ.. హాంగ్ కాంగ్ నివాసి అయిన ఏ ఒక్కరి భద్రతకు కానీ భరోసా ఇస్తుందన్న నమ్మకం నాకు లేదు'' అని ఆయన పేర్కొన్నారు.
ల్యామ్ గత ఏప్రిల్ చివర్లో హాంగ్ కాంగ్ నుంచి పారిపోయి తైవాన్‌లో తలదాచుకుంటున్నారు. అక్కడ ఆయనకు తాత్కాలిక నివాస వీసా ఇచ్చారు.

ఫొటో సోర్స్, Reuters
హాంగ్ కాంగ్‌లో ప్రతిపాదిత అప్పగింత చట్టాన్ని వ్యతిరేకిస్తున్నది ఎవరు?
ఈ చట్టానికి ప్రజల్లో చాలా విస్తృతంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సమాజంలోని అన్ని వర్గాలు, బృందాల వారు - న్యాయవాదులు మొదలుకుని స్కూళ్లు, ఇళ్లలో ఉండే మహిళల వరకూ - తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. మార్పులను వ్యతిరేకిస్తూ దరఖాస్తులు సమర్పించారు.
ఆదివారం జరిగిన నిరసన ప్రదర్శనలో పది లక్షల మంది పాల్గొన్నారని నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే.. అత్యధికంగా 2.40 లక్షల మంది మాత్రమే నిరసనలో పాల్గొన్నారని పోలీసులు చెప్తున్నారు.
నిరసన ప్రదర్శన నిర్వాహకుల అంచనా వాస్తవమైతే.. ఒకప్పుడు బ్రిటిష్ వలస ప్రాంతంగా ఉన్న హాంగ్ కాంగ్‌ను 1997లో చైనాకు అప్పగించినపుడు జరిగిన ప్రదర్శన తర్వాత.. ఇదే అత్యంత భారీ ప్రదర్శన అవుతుంది.
ప్రతిపాదిత చట్టాన్ని పక్కనపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల మొదట్లో 3,000 మంది న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, విద్యావేత్తలు మౌన ప్రదర్శన నిర్వహించారు.
ఇప్పుడు ఈ మార్పులు ఎందుకు చేస్తోంది?
గత ఏడాది ఫిబ్రవరిలో తైవాన్‌లో విహారానికి వెళ్లిన హాంగ్ కాంగ్‌కు చెందిన ఒక 19 ఏళ్ల వ్యక్తి.. గర్భిణి అయిన తన 20 ఏళ్ల గర్ల్ ప్రెండ్‌ను హత్య చేశాడని ఆరోపణలు ఉన్నాయి.
ఆ వ్యక్తి గత ఏడాది హాంగ్ కాంగ్ తిరిగి వచ్చాడు. అతడిని తమకు అప్పగించటానికి సాయం చేయాలని హాంగ్ కాంగ్ అధికారులను తైవాన్ అధికారులు కోరారు. కానీ.. తైవాన్‌తో అప్పగింత ఒప్పందం లేనందున తాము సాయం చేయలేమని హాంగ్ కాంగ్ అధికారులు బదులిచ్చారు.
ఈ నేపథ్యంలో 'నిందితుల అప్పగింత' ప్రతిపాదనను హాంగ్ కాంగ్ ప్రభుత్వం తీసుకువచ్చింది. కానీ.. కొత్తగా చేయబోయే మార్పుల కింద సదరు అనుమానితుడిని అప్పగించాలని తాము కోరబోమని తైవాన్ చెప్తోంది. ఆ హత్య కేసును వేరుగా పరిగణించాలని అంటోంది.

ఫొటో సోర్స్, EPA
హాంగ్ కాంగ్.. చైనాలో భాగం కాదా?
హాంగ్ కాంగ్ ఒకప్పుడు బ్రిటిష్ వలస ప్రాంతంగా ఉండేది. 1997లో చైనా పాలన కిందకు వచ్చింది. కానీ.. 'ఒక దేశం - రెండు వ్యవస్థ'ల సూత్రం కింద హాంగ్ కాంగ్ పాక్షిక స్వయం ప్రతిపత్తి గల ప్రాంతంగా కొనసాగుతోంది.
ఈ నగరానికి తన సొంత చట్టాలు ఉన్నాయి. చైనా పౌరులకు లేని పౌర స్వాతంత్ర్యాలు హాంగ్ కాంగ్ వాసులకు ఉన్నాయి.
బ్రిటన్, అమెరికా సహా 20 దేశాలతో 'నిందితుల అప్పగింత' ఒప్పందాలు కుదుర్చుకుంది హాంగ్ కాంగ్. కానీ.. ప్రధాన చైనాతో అటువంటి ఒప్పందం ఏదీ ఖరారు కాలేదు. దీని కోసం రెండు దశాబ్దాలుగా సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి.
చైనా చట్టం కింద నిందితులకు సరైన న్యాయ రక్షణ లేకపోవటమే దీనికి కారణమని విమర్శకులు చెప్తారు.
ఇవి కూడా చదవండి:
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...
- గడ్డి వంతెన ఇది... దీన్ని ఎలా కడతారో చూడండి
- కీటోడైట్ వివాదం: అసలేంటీ డైట్? అదెంత వరకు సురక్షితం?
- ఆహార వృథాయే ఆకలి కేకలకు అసలు కారణమా?
- ఇవి తింటే.. మీ జుట్టు భద్రం!
- కార్గిల్ యుద్ధాన్ని బీబీసీ ప్రపంచానికి ఎలా అందించింది?
- తొడ కొడుతున్న కబడ్డీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








