చంద్రయాన్-2: మధ్యాహ్నం 2.43 గంటలకు చందమామపైకి ప్రయాణం

ఫొటో సోర్స్, EPA
భారత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్-2 మిషన్ ప్రయోగం ఈ రోజు మధ్యాహ్నం 2:43 గంటలకు జరగనుంది. దీనికి కౌంట్ డౌన్ కొనసాగుతోంది.
ఆదివారం సాయంత్రం 6:43 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభించామని శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) తెలిపింది.
జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3-ఎం1 ప్రయోగ రిహార్సల్ పూర్తయిందని, అంతా సాధారణంగా ఉందని ఇస్రో శనివారం స్పష్టం చేసింది. ఈ అంతరిక్ష నౌక భారత జాతీయ పతాకాన్ని చంద్రుడి మీదకు తీసుకెళ్తోంది.

ఫొటో సోర్స్, Twitter/ISRO
జులై 15న తెల్లవారుజామున 2:30 గంటలకు చేపట్టాల్సిన ఈ మిషన్‌ను సాంకేతిక సమస్యతో ప్రయోగానికి 56 నిమిషాల ముందు ఇస్రో నిలిపివేసింది.
ప్రయోగాన్ని ఈ నెల 22న చేపడతామని ఈ నెల 18న ఇస్రో ప్రకటించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సోమవారం మధ్యాహ్నం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లే ఈ వాహక నౌక సెప్టెంబరులో చంద్రుడిని చేరుతుంది. ఈ వాహకనౌక బరువు 2,379 కేజీలు.
చంద్రుడు భూమికి 3.84 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు.
సాఫ్ట్ ల్యాండింగ్
చంద్రుడి మీద సురక్షితంగా దిగటం (సాఫ్ట్‌ల్యాండింగ్) లక్ష్యంగా ప్రయోగిస్తున్న అంతరిక్ష మిషన్ చంద్రయాన్-2.
చంద్రయాన్-2 విజయవంతమైతే చంద్రుడి ఉపరితలం మీద అంతరిక్ష వాహనాన్ని సాఫ్ట్‌ల్యాండ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది.
ఇప్పటివరకు అమెరికా, చైనా, ఒకప్పటి సోవియట్ యూనియన్ మాత్రమే ఈ ఘనతను సాధించాయి.
చంద్రుడి మీద గురుత్వాకర్షణ లేదు. వాతావరణమూ లేదు.
భారత్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం చేస్తున్న మొట్టమొదటి ప్రయత్నమిది. ఉపరితలం మీద దిగటానికి ప్యారాచూట్ ఉపయోగించటానికి వీలులేదు.
గతంలో సాఫ్ట్ ల్యాండింగ్ కోసం చేసిన ప్రయోగాల్లో సగం విఫలమయ్యాయి.
తాజా ప్రయోగం విజయవంతమైతే అంగారక గ్రహం మీద, ఆస్టరాయిడ్ల మీద సాఫ్ట్ ల్యాండింగ్ ప్రయోగానికి, చంద్రుడి మీదకు మనిషిని పంపించటానికి అవకాశాలు పెరుగుతాయి.

ఫొటో సోర్స్, PIB
విక్రమ్, ప్రజ్ఞాన్
చంద్రయాన్-2లో మూడు ముఖ్యమైన పరికరాలు ఉన్నాయి.
మొదటిది ఆర్బిటర్. ఇది చంద్రుడి కక్ష్యలో చంద్రుడి చుట్టూ తిరుగుతుంది.
మరొకటి ల్యాండర్. ఇస్రో వ్యవస్థాపకుడు విక్రమ్ సారాభాయ్ గౌరవార్థం ల్యాండర్‌కు ‘విక్రమ్’ అని పేరు పెట్టారు.
ఇది చంద్రుడి ఉపరితలం మీద దిగుతుంది.
ల్యాండర్ దిగిన తర్వాత రోవర్ అనే మూడో పరికరాన్ని బయటకు పంపుతుంది.
రోవర్ బరువు 27 కేజీలు ఉంటుంది. రోవర్‌కు ‘ప్రజ్ఞాన్’ అని పేరు పెట్టారు.
ఆర్బిటర్ నుంచి ల్యాండర్, రోవర్ విడిపోయిన తర్వాత 15 నిమిషాలు అత్యంత కీలకం.

ఫొటో సోర్స్, PIB
సమాచార సేకరణ ఇలా
రోవర్ చంద్రుడి మీద అన్వేషణ చేస్తుంది. తను గుర్తించిన సమాచారాన్ని ల్యాండర్‌కు పంపిస్తుంది. ల్యాండర్ దానిని ఆర్బిటర్‌కు చేరవేస్తుంది. ఆర్బిటర్ దానిని భూమికి పంపిస్తుంది.
ఈ వాహక నౌకలో భారత్ 13 పరిశోధన పరికరాలు అమర్చింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) పంపించిన మరో పరికరాన్ని ఇది ఉచితంగా మోసుకెళ్తుంది.
ఈ పరికరాలు చంద్రుడి దక్షిణ ధృవానికి అతి సమీపంగా వెళ్లనున్నాయి. ఇంతకుముందు చంద్రుడి మీద దిగిన మిషన్లన్నీ చంద్రుడి మధ్య రేఖ మీద దిగాయి. చంద్రయాన్-2తో కొత్త సమాచారం లభిస్తుందని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.
ఆర్బిటర్‌లో హై క్వాలిటీ కెమెరా ఒకటి ఉంది. చంద్రుడి మీది పలుచటి వాతావరణాన్ని విశ్లేషించే ఒక పరికరం కూడా ఉంది.
భూకంపాల మాదిరిగానే చంద్రుడి మీద కూడా చంద్రకంపాలు వస్తుంటాయి. కాబట్టి వాటి విశ్లేషణా ఉంటుంది.
ప్రోబ్ తరహా పరికరం కూడా ఒకటి ఉంది. దానిని చంద్రుడి ఉపరితలం కిందికి పంపిస్తారు. దానితో చంద్రుడి మీద ఉష్ణోగ్రతల గురించి తెలుసుకోవచ్చు.
చంద్రుడి మీద మట్టి గురించి చెప్పే మరొక పరికరం కూడా ఉంది.
చంద్రయాన్-1కు కొనసాగింపు
భారత్ 2008లో చేపట్టిన చంద్రయాన్-1 ప్రయోగానికి కొనసాగింపుగా చంద్రయాన్-2ను చేపడుతోంది.
అతి తక్కువ వ్యయంతో చంద్రయాన్-1 మిషన్‌ను ఇస్రో విజయవంతం చేయటం అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది.
నాటి కార్యక్రమానికి భారత్ సారథ్యం వహించగా, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, బ్రిటన్‌లు కూడా అందులో పాలుపంచుకున్నాయి.
చంద్రయాన్-1ను రెండేళ్లు పనిచేసేలా రూపొందించినప్పటికీ 10 నెలల తర్వాత అందులో పరికరాలు విఫలమయ్యాయి.
అప్పటికే చంద్రుడి మీద నీటి అణువుల జాడను పసిగట్టటం ద్వారా చంద్రయాన్-1 చరిత్ర సృష్టించింది.
ఇవి కూడా చదవండి:
- రూ.500 ఇంధనంతో 160 కి.మీ. ప్రయాణించే విమానం
- అమర్నాథ్ యాత్ర: ఈ హిందూ తీర్థయాత్రకు ముస్లింలే వెన్నెముక
- క్రికెట్ స్పోర్ట్ కాదు.. క్రీడగా గుర్తించేందుకు నిరాకరించిన ప్రభుత్వం
- అమెరికాతో వాణిజ్య యుద్ధం ప్రభావం.. చైనా వృద్ధిరేటు పతనం.. మూడు దశాబ్దాల్లో ఇదే అత్యల్పం
- ఫేస్ యాప్ ఉపయోగిస్తున్నారా... తస్మాత్ జాగ్రత్త
- ఫిమేల్ వయాగ్రా ‘విలీజి’పై వివాదం.. ఎందుకు?
- కార్గిల్ యుద్ధం: "శరీరంలో 15 బుల్లెట్లు దిగాయి, శక్తిని కూడదీసుకుని పాక్ సైన్యంపై గ్రెనేడ్ విసిరా"
- గడ్డి వంతెన ఇది... దీన్ని ఎలా కడతారో చూడండి
- అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్య గ్రహణం ఇలా ఉంటుంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









