ప్రపంచానికి సౌదీ ప్రిన్స్ హెచ్చరిక: 'ఇరాన్‌ దూకుడుని ఆపకపోతే... చమురు ధరలు చెలరేగిపోతాయి'.

సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్

ఇరాన్ దూకుడు తగ్గించేలా ప్రపంచ దేశాలు చర్యలు తీసుకోకపోతే అంతర్జాయతీయంగా చమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదముందని సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ హెచ్చరించారు.

ఇరాన్‌ను అదుపులో పెట్టడంలో విఫలమైతే ఆ దేశం మరింత పేట్రేగుతుందని, అది యుద్ధానికి కూడా దారి తీయొచ్చని ఆయన అన్నారు. అదే జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదముందనీ అన్నారు.

సౌదీలోని చమురు కేంద్రాలు, క్షేత్రాలపై బాంబు దాడుల నేపథ్యంలో ఆయన ఇరాన్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు.

క్రౌన్ ప్రిన్స్ వ్యాఖ్యలపై ఇరాన్ ''ఆయన మాటలతో సౌదీ అరేబియాకు అవమానం కలగడం తప్ప వేరే ఫలితం లేదు'' అంటూ స్పందించింది.

కాగా సీబీఎస్ వార్తాసంస్థతో మాట్లాడుతూ జర్నలిస్ట్ జమాల్ ఖసోగీ హత్యకు కొంతమేర బాధ్యత వహిస్తున్నట్లు క్రౌన్ ప్రిన్స్ చెప్పారు.

సౌదీ అరేబియాలో పాలనపై విమర్శనాత్మక కథనాలు అందించిన జర్నలిస్ట్ జమాల్ ఖషోగీని సౌదీ వాస్తవ పాలకుడైన రాజే వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకున్నారన్న అనుమానాలున్నాయి.

గత ఏడాది అక్టోబరు 2న టర్కీలోని సౌదీ రాయబార కార్యాలయంలో ఖషోగ్జీ హత్యకు గురయ్యారు.

జమాల్ ఖషోగీ

ఫొటో సోర్స్, Reuters

ఆదివారం సీబీఎస్ చానల్‌లో ప్రసారమైన 60 నిమిషాల వార్తా కార్యక్రమంలో క్రౌన్ ప్రిన్స్ మాట్లాడుతూ, ''సౌదీ ప్రభుత్వం కోసం పనిచేసే కొందరు వ్యక్తులు చేసిన ఈ పని(ఖషోగ్జీ హత్య)కి సౌదీ నాయకుడిగా నేను బాధ్యత వహిస్తున్నాను'' అన్నారాయన. అయితే, తానేమీ ఖషోగీని చంపాలని తాను ఎవరినీ ఆదేశించలేదని.. అలాగే హత్య సమయంలో తనకు దానికి సంబంధించిన సమాచారమూ లేదని చెప్పారాయన.

ఖషోగ్జీ హత్య తరువాత సౌదీ ప్రభుత్వం 11 మందిపై విచారణకు ఆదేశించింది.

యెమెన్‌లో పౌర యుద్ధాన్ని ఆపే రాజకీయ పరిష్కారం వెతకడానికి చర్చలకు సిద్ధమని క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ ముందుకొచ్చారు. యెమెన్‌లో ఇరాన్ మద్దతున్న హౌతీ తిరుగుబాటుదారులకు, సౌదీ మద్దతున్న యెమెన్ ప్రభుత్వానికి మధ్య చాలాకాలంగా అంతర్యుద్ధం జరుగుతోంది.

ఇరాన్ సౌదీకి ప్రాంతీయ శత్రువే కాదు అమెరికాకూ విరోధి. ట్రంప్ అధ్యక్షుడైన తరువాత ఇరాన్ అణు కార్యక్రమాలను నియంత్రించేలా ఓ ఒప్పందం నుంచి అమెరికా బయటకు వచ్చేసింది.

ఈ ఏడాది ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. మే, జులైల్లో గల్ఫ్ మీదుగా సాగుతున్న తమ దేశానికి చెందిన ఆరు చమురు ట్యాంకర్లపై ఇరాన్ దాడి చేసిందని అమెరికా ఆరోపిస్తోంది. ఇరాన్ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తూ వస్తోంది.

Presentational grey line
ఫ్రాంక్ గార్డనర్ విశ్లేషణ

సౌదీ దుర్బలత్వాన్ని కప్పిపుచ్చే వ్యాఖ్యలవి...

సౌదీ చమురు కేంద్రాలపై సెప్టెంబరు 14న జరిగిన దాడుల విషయంలో ఆ దేశం నియంత్రిత రీతిలోనే ఎందుకు స్పందిస్తుందన్న ప్రశ్నలకు ఈ ఇంటర్వ్యూలో కొన్ని సమాధానాలు కనిపిస్తున్నాయి. ఇరాన్‌తో యుద్ధం జరిగితే అది తమ దేశానికే కాకుండా యావత్ప్రపంచానికే విపత్తు అని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుందని క్రౌన్ ప్రిన్స్ హెచ్చరించడాన్నీ ఇక్కడ గమనించాలి.

నాలుగేళ్ల కిందట క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ యెమెన్‌లో వినాశకర యుద్ధానికి దిగినప్పుడు ఆయన స్పందనలో చాలా ధైర్యం ఉండేది. కానీ, ఆ యుద్ధం సౌదీ ఆశించినట్లుగా సాగలేదు. హౌతీ తిరుగుబాటుదారులు నిత్యం డ్రోన్లు, క్షిపణులతో సరిహద్దు ఆవల నుంచి సౌదీపై దాడులకు దిగుతున్నారు.

ఇటీవల తన చమురు కేంద్రాలపై జరిగిన దాడులతో సౌదీ తీవ్రం చవిచూసింది. దీంతో తమ కీలక మౌలిక వ్యవస్థలు ఎంత దుర్బలంగా ఉన్నాయో.. ఇరాన్ దాడి చేస్తే ఏమవుతుందో సౌదీకి అర్థమైంది.

ఖషోగీ హత్య విషయంలో దాదాపు ఏడాది తరువాత ఇప్పుడు సల్మాన్ బాధ్యత తీసుకోవడమూ అలాంటి పరిణామమే. పాశ్చాత్య ప్రపంచంతో ఈ విషయంలో సౌదీకి ఇబ్బందికరమైన పరిస్థితులున్నాయి. ఆ క్రమంలోనే ఒక పాలకుడిగా తాను బాధ్యత వహిస్తున్నానని చెబుతూనే తనకు దీంతో ఎలాంటి సంబంధమూ లేదని చెప్పుకొచ్చారు.

Presentational grey line

చమురు హెచ్చరికల సంగతేమిటి?

ఇటీవల సౌదీ అరేబియాలోని చమురు కేంద్రాలపై జరిగిన డ్రోన్ దాడులలో తమ ప్రమేయం లేదని ఇరాన్ చెబుతోంది. ఈ దాడులతో ప్రపంచంలో 5 శాతం చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడి ఇప్పటికే ధరలు పెరిగాయి.

ప్రపంచ దేశాలు ఇరాన్‌ను అదుపులో పెట్టకపోతే మున్ముందు చమురు విషయంలో మరిన్ని కష్టాలు తప్పవని సల్మాన్ హెచ్చరిస్తున్నారు.

''చమురు సరఫరా పూర్తిగా దెబ్బతింటుంది. జీవితంలో ఎన్నడూ చూడని స్థాయికి చమురు ధరలు పెరిగిపోతాయి'' అని ఆయన హెచ్చరించారు.

సౌదీ చమురు కేంద్రాలపై దాడులు

ఫొటో సోర్స్, Reuters

ప్రపంచ ఇంధన అవసరాల్లో 30 శాతాన్ని మధ్యప్రాచ్యమే తీరుస్తోందని.. ప్రపంచ వాణిజ్యంలో 20 శాతం మధ్యప్రాచ్యం మీదుగానే జరుగుతోందని.. ప్రపంచ జీడీపీలో 4 శాతం వాటా ఈ ప్రాంతం నుంచే ఉందని ఆయన అన్నారు.

''ఊహించుకోండి. ఈ మూడు అంశాలకూ ఇబ్బంది కలిగితే కేవలం సౌదీకో, లేదంటే మధ్య ప్రాచ్య దేశాలకో నష్టం కలగదు. ఏకంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థే కుప్పకూలుతుంద''న్నారాయన.

వ్యూహాత్మక లక్ష్యమేమీ లేకుండా ఇరాన్ మూర్ఖంగా దాడులు చేసిందని ఆయన ఆరోపించారు.

తమ దేశంలోని రెండు చమురు కేంద్రాలపై సెప్టెంబరు 14న 18 డ్రోన్లు, 7 క్రూయిజ్ మిసైళ్లతో దాడులు చేశారని సౌదీ ఆరోపిస్తోంది.

యెమెన్‌లోని ఇరాన్ మద్దతున్న హౌతీ తిరుగుబాటుదారులు ఈ దాడులకు తామే కారణమని ప్రకటించుకున్నారు.

ఎవరి మద్దతు ఎవరికి

యెమెన్ విషయంలో ప్రిన్స్ ఏమంటున్నారు?

హౌతీ తిరుగుబాటుదారులకు సహాయం చేయడం మానుకోవాలని ఇరాన్‌ను ఆయన కోరారు. ఆ పనిచేస్తే యుద్ధం ముగిసిపోతుందన్నారు.

''యెమెన్‌లో రాజకీయ పరిష్కారం కోసం అన్ని మార్గాలూ తెరిచే ఉంచాం. ఆలస్యం లేకుండా పరిష్కారానికి సహకరిస్తారని కోరుకుంటున్నాం'' అన్నారు.

చాలాకాలం కిందట ప్రకటించిన కాల్పుల విరమణను ఆయన స్వాగతించారు. చర్చల దిశగా ఇది సానుకూల అడుగని పేర్కొన్నారు.

ప్రపంచంలోని అత్యంత దారుణ మానవీయ సంక్షోభంగా యెమెన్ యుద్ధాన్ని చెబుతారు. అక్కడి 80 శాతం జనాభాకు మానవతా సహాయం అవసరమైంది.

జైలులో ఉన్న మహిళా హక్కుల కార్యకర్తల మాటేమిటి?

మహిళా హక్కుల కార్యకర్త లౌజైన్ అల్ హత్లౌల్‌ను జైలులో చిత్ర హింసలకు గురిచేశారన్న ఆరోపణలపై తాను వ్యక్తిగతంగా వివరాలు తెలుసుకుంటానన్నారు.

హత్లౌల్, మరికొందరు మహిళా హక్కుల కార్యకర్తలు ఏడాదిగా జైలులో ఉన్నారు.

వారిని విడుదల చేయాలా వద్దా అన్నది తన పరిధిలోని నిర్ణయం కాదని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)