డోనల్డ్ ట్రంప్: ‘జమాల్ ఖషోగ్జీ టేపులను వినడం నా వల్ల కాదు’

ఫొటో సోర్స్, EPA
సౌదీ జర్నలిస్టు జమాల్ ఖషోగ్జీ టేపులను తాను వినలేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ అధికారులతో అన్నారు.
ఖషోగ్జీ హత్యకు సంబంధించిన వివరాలను అధికారులు ట్రంప్‌కు వివరించినపుడు.. దానికి సంబంధించిన టేపులను వినడానికి ఆయన ఇష్టపడలేదు.
''అవి చాలా భయానకమైన టేపులు'' అని ట్రంప్ అన్నట్లు ఫ్యాక్స్ న్యూస్ తెలిపింది.
తన వివాహానికి అవసరమైన పత్రాల కోసం అక్టోబర్ 2న ఇస్తాంబుల్ లోని సౌదీ కాన్సులేట్ కు వెళ్లిన ఖషోగ్జీ.. అక్కడే మాయమయ్యారు.
ఖషోగ్జీని హత్య చేయాలని సౌదీ యువరాజే ఆదేశించారని సీఐఏ తేల్చింది. అయితే వైట్ హౌస్ దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఈ హత్య వెనుక తమ యువరాజు ఉన్నారన్న వార్తలను సౌదీ అరేబియా ఖండించింది. ఈ హత్య గురించి యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు ఏమీ తెలీదని పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ ఎందుకు ఆ టేపులను వినలేనని అన్నారు?
''ఆ టేపులను వినే అవసరం లేకుండానే వాటిలో ఏముందో నేను తెలుసుకున్నాను'' అని ట్రంప్ ఫ్యాక్స్ న్యూస్‌తో అన్నారు.
ఆ టేపులు చాలా హింసాత్మకంగా, బాధాకరంగా ఉన్నాయని ట్రంప్ తెలిపారు.
అయితే ఖషోగ్జీ హత్య గురించి తనకేమీ తెలీదని సౌదీ యువరాజు తనతో అన్నట్లు ట్రంప్ ఫ్యాక్స్ న్యూస్‌కు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఖషోగ్జీ మాయమైన వెంటనే సౌదీ కాన్సులేట్‌లో ఆయన హత్యను నిరూపించే ఆడియో, వీడియో సాక్ష్యాలు తమకు లభించాయని టర్కీ అధికారులు వెల్లడించారు. ఖషోగ్జీని హత్య చేసి, ఆయన శరీరాన్ని అక్కడి నుంచి తొలగించారని వారు ఆరోపించారు.
ఖషోగ్జీని విచారిస్తున్నప్పుడు, చిత్రహింసలు పెడుతున్నప్పుడు రికార్డయిన మాటలు, ఆర్తనాదాల ఆడియో తమకు లభించాయని, వాటిని కొన్ని దేశాలతో పంచుకున్నామనీ టర్కీ తెలిపింది.
అయితే, ఖషోగ్జీ కాన్సులేట్‌లోకి అడుగుపెట్టగానే గొంతు నులిమి హత్య చేశారని, ముందే సిద్ధం చేసిన ప్రణాళిక ప్రకారం ఆయన మృతదేహాన్ని ముక్కలు చేసి యాసిడ్‌లో వేసి కరిగించేశారని టర్కీ అధికారులు ఆ తర్వాత తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఖషోగ్జీ హత్యపై అమెరికా ఏమంటోంది?
ఈ హత్యకు సంబంధించిన వివరాలపై ట్రంప్ ఇప్పటికే సీఐఏ అధికారులతో మాట్లాడారు. అయితే సీఐఏ తన విచారణ వివరాలు వెల్లడించడానికి ముందే ట్రంప్ ఫ్యాక్స్ న్యూస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ హత్యపై తామింకా ఒక తుది నిర్ణయానికి రావాల్సి ఉందని అమెరికా విదేశాంగ శాఖ శనివారం తెలిపింది. ఇంకా అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉందని పేర్కొంది.
ఖషోగ్జీ హత్య కేసులో సౌదీ యువరాజు ప్రమేయం ఉన్నట్లు ప్రత్యక్ష సాక్ష్యాధారాలేమీ లేకున్నా, ఆయన అనుమతి లేకుండా ఈ హత్య జరిగి ఉండదని సీఐఏ అధికారులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








