ఇరాన్-బ్రిటన్ ఉద్రిక్తతలు: ఒక దేశం ఓడల మీద మరో దేశం జెండాలు ఎందుకు?

ఫొటో సోర్స్, ERWIN WILLEMSE
స్టెనా ఇంపెరో అనే కార్గో షిప్‌ను గతవారం ఇరాన్ స్వాధీనం చేసుకుంది. బ్రిటిష్ జెండాతో వెళ్తున్న ఈ షిప్ వాస్తవానికి స్వీడిష్ కంపెనీకి చెందినది. ఇందులో ఒక్క బ్రిటన్ పౌరుడు కూడా లేడు.
యజమానులు తమ షిప్‌లపై వేరే దేశాల జెండాలు ఎగరవేయడం సర్వ సాధారణం. కానీ, ఇలా ఎందుకు చేస్తారు? దీని వల్ల ఎవరికి ఉపయోగం?
లైబీరియా, పనామా, మార్షల్ దీవుల్లో ఉమ్మడిగా కనిపించేది ఏమిటి?
ఈ దేశాల్లో ప్రతి వ్యాపారీ తన షిప్‌ను ఏదో ఒక దేశంలో నమోదు చేయాలి. అప్పుడు షిప్‌పై ఆ దేశం జెండాను ఎగరవేయొచ్చు.
అదే ఓపెన్ రిజిస్ట్రీ విధానంలో అయితే, యజమానులు తమ జాతీయతతో సంబంధం లేకుండా, సౌలభ్యం మేరకు ఏ జెండానైనా ఎగరవేయవచ్చు.
కానీ, వేరే వ్యవస్థలో నౌకపై జెండా ఎగరవేయడంపై కఠినమైన నిబంధనలున్నాయి. ప్రస్తుతం సుమారు 1,300 ఓడలు యూకే పేరుతో నమోదై ఉన్నాయి.
రెడ్ ఎన్సైన్ గ్రూప్ ప్రపంచంలోని అతిపెద్ద నౌకాదళాల్లో తొమ్మిదవది. దీనికి యూకే, దాని కింద ఉన్న దేశాలైన అంగుయిలా, బెర్ముడా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, కేమాన్ ఐలాండ్స్, ఫాక్లాండ్ ఐలాండ్స్, జిబ్రాల్టర్, మోంట్సెరాట్, సెయింట్ హెలెనా, టర్క్స్, కైకోస్ దీవులలో అనుమతి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
మీది కాకుండా వేరే జెండాను ఎందుకు ఎంచుకోవాలి?
వ్యాపార కారణాలతోనే షిప్ యజమానులు ఫ్లాగ్ స్టేట్ (షిప్‌పై ఎగరేసే జెండా దేశం)ను ఎంచుకుంటారు.
ఫ్లాగ్ స్టేట్‌ను ఎన్నుకోవడం అంటే వారు పెట్టే నిబంధనలు, వేసే పన్నులు, నాణ్యతను కూడా పాటించాలని సముద్ర భద్రతా నిపుణుడు ఐయోనిస్ చాప్సోస్ చెప్పారు.
అత్యధిక మంది షిప్ యజమానులున్న గ్రీస్‌ను ఒక ఉదాహరణగా ఆయన చూపెడుతున్నారు.
ఈ దేశంలోని చాలా నౌకలు గ్రీకు జెండాను వాడటం లేదు. దీనికి కారణం ఆ దేశంలో పన్నులు అత్యధికంగా ఉండటమే.
అందుకే గ్రీస్ నౌకా యజమానులు పేద దేశాల్లో తమ నౌకలను రిజిస్టర్ చేయించి ఆ దేశం జెండాను వాడుతుంటారు. ఇలా పేద దేశాలు కొంత డబ్బును సంపాదిస్తుంటాయి.
పనామా షిప్ రిజిస్ట్రీ ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు కోట్ల డాలర్లను అందిస్తోంది.
ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సిబ్బందిని నియమించుకోడానికి ఈ వ్యవస్థ అనుమతిస్తుంది. దీని వల్ల నౌక యజమానులకు ఖర్చులు బాగా తగ్గుతాయి.
సౌలభ్యం కోసం నౌకపై జెండా ఎగరేసే విధానం విమర్శలపాలవుతోంది. దీనికి కారణం సరైన నియంత్రణ లేకపోవడం, అంతర్జాతీయ సముద్ర నిబంధనల ఉల్లంఘనకు అవకాశం ఉండటం. అయితే, షిప్పింగ్ పద్ధతులు గత మూడు దశాబ్దాల్లో గణనీయంగా మెరుగుపడినట్లు కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, EPA
ఎవరు బాధ్యులు ?
ఓడ యజమానులు ఫ్లాగ్ కంట్రీలో రిజిస్టర్ చేయించుకుంటే, ఆ దేశంలోని చట్టాలు ఓడకూ వర్తిస్తాయి. తమ జెండాతో ఎగురుతున్న ఓడల బాధ్యత ఆ దేశానిదే అవుతుంది.
అంతర్జాతీయ ప్రమాణాలను పాటించడం, ఓడల పరిశీలన, సర్టిఫికేషన్ చేయడం ఇవన్నీ దీనికిందకే వస్తాయని ఐఎంఓ చెబుతోంది.
ఫ్లాగ్ కంట్రీస్ అంతర్జాతీయ సముద్ర ఒప్పందాలపై సంతకాలు చేయడమే కాకుండా ఓడల నిర్మాణం, రూపకల్పన, వాటి పరిశీలన, సిబ్బంది నియామకాలకు సంబంధించి ఐఎంవో నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా వాటిని అమలు చేయడానికి బాధ్యత వహిస్తాయి.
ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం ఫ్లాగ్ కంట్రీస్ సముద్రంలో భద్రతకు చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.
నమోదు ప్రక్రియను ఎవరు చేపడతారు?
సాధారణంగా ఫ్లాగ్ రిజిస్ట్రీని యజమాని తన దేశంలో కాకుండా వేరే నిర్వహిస్తుంటారు.
లైబీరియాను ఉదాహరణగా తీసుకుంటే, ఈ దేశానికి సంబంధించిన ఫ్లాగ్ రిజిస్ట్రీ ఒక అమెరికా సంస్థ వాషింగ్టన్ డీసీ నుంచి చేస్తోంది.
సముద్రతీరం లేని మంగోలియా తన దేశానికి సంబంధించిన ఓడల రిజిస్ట్రేషన్‌ను సింగపూర్‌లో నిర్వహిస్తుంది. వనౌతు తన వ్యవహారాలను న్యూయార్క్ నుంచి నిర్వహిస్తోంది. మరికొన్ని దేశాలు కూడా ఇలానే చేస్తున్నాయి.
భౌగోళిక ప్రాంతంతో సంబంధం లేకుండా ఇలా నమోదు ప్రక్రియ చేపట్టడం భద్రతకు సవాలుగా మారుతోంది.
తమ దేశం పేరుతో జెండా రిజిస్ట్రేషన్ చేయించుకున్న నౌకలన్నింటికీ ఆ దేశం భద్రత కల్పించడం సాధ్యమయ్యేపనికాదని, తక్కువ వనరులు ఉన్న దేశాలకు ఇది మరింత కష్టమని చాప్సోస్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- నిస్సహాయ తల్లులను వ్యభిచారంలోకి నెడుతున్న సార్వత్రిక నగదు బదిలీ పథకం
- ప్రపంచబ్యాంకు బాటలోనే ఏఐఐబీ.. రాజధాని ప్రాజెక్టు నుంచి వెనక్కు
- టిక్‌టాక్ యాప్‌ను ప్రభుత్వం ఎందుకు నిషేధించాలనుకుంటోంది?
- బిహార్, అస్సాం వరదలపై రాహుల్ గాంధీ ట్వీట్లోని ఫొటోల్లో నిజమెంత
- ఆపరేషన్ కమల్: కర్ణాటకలో ముగిసింది, తర్వాత టార్గెట్ మధ్యప్రదేశ్, రాజస్థాన్?
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








