నౌకను అప్పగిస్తే లక్షలాది డాలర్లు ఇస్తామన్న అమెరికా... ఆఫర్‌ను తిరస్కరించిన ఇరాన్ నౌక భారత కెప్టెన్

ఆడ్రియాన్ దార్యా 1

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, ఆడ్రియాన్ దార్యా 1 నౌక బ్రిటన్ నిర్బంధం నుంచి విడుదల చేయటంతో ఆగస్టులో జీబ్రాల్టర్ నుంచి బయలుదేరింది

ఇరాన్‌కు చెందిన ఒక చమురు నౌక కెప్టెన్‌ అయిన భారతీయుడు అఖిలేష్ కుమార్‌కు తాము లక్షలాది డాలర్లు ఇవ్వజూపామని అమెరికా వాణిజ్య విభాగం అంగీకరించింది.

ఆడ్రియాన్ దార్యా 1 అనే ఆ ఇరాన్ నౌకను.. సిరియాకు చమురు తరలిస్తోందనే అనుమానంతో గత జూలైలో జీబ్రాల్టర్‌లో బ్రిటన్ అధికారులు బంధించారు. అయితే.. ఆ నౌక ఎక్కడికి వెళుతోందనే దానిమీద ఇరాన్ హామీ ఇవ్వటంతో గత నెలలో దానిని విడుదల చేశారు.

అయితే.. నౌక విడుదలను అడ్డుకోవటానికి అమెరికా న్యాయ విభాగం ప్రయత్నించింది. బ్రిటన్ ఆ నౌకను విడుదల చేసిన తర్వాత దానిని బంధించాలంటూ వారెంట్ కూడా జారీచేసింది. ఇది ఓ దౌత్యవివాదానికి కేంద్ర బిందువుగా మారింది.

అయితే.. ఈ నౌకను అమెరికా బంధించేందుకు వీలుగా ఏదైనా ప్రాంతానికి తీసుకువచ్చినట్లయితే లక్షలాది డాలర్ల డబ్బు ఇస్తామంటూ ఆ నౌక కెప్టెన్‌కు అమెరికా అధికారులు ఆఫర్ చేశారంటూ బుధవారం ఫైనాన్షియల్ టైమ్స్‌లో తొలుత వార్తలు వచ్చాయి.

ఆడ్రియాన్ దార్యా 1

ఈ వార్తలు చెప్తున్నది నిజమేనని అమెరికా వాణిజ్య విభాగంలోని ఇరాన్ యాక్షన్ గ్రూప్ అధిపతి బ్రియాన్ హుక్ డబ్బులు ఆఫర్ చేస్తూ కెప్టెన్‌కు ఈమెయిల్ పంపించారని అమెరికా విదేశాంగ శాఖ ధృవీకరించింది.

''పలు నౌకల కెప్టెన్‌లను, షిప్పింగ్ కంపెనీలను అందుకోవటానికి అమితమైన చర్యలు చేపట్టాం'' అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒకరు ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో చెప్పారు.

ఆ ట్యాంకర్‌ను అమెరికా గత శుక్రవారం బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది.

ఇరాన్ సైన్యంలోని ఒక శాఖ అయిన రివల్యూషనరీ గార్డ్ ప్రయోజనం కోసం ఇరాన్ నుంచి 21 లక్షల బ్యారెళ్ల ముడి చమురును రవాణా చేయటానికి ఆ నౌకను ఉపయోగిస్తున్నారని అమెరికా అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ సంస్థను ఉగ్రవాద సంస్థగా అమెరికా వర్గీకరించింది.

ఆడ్రియాన్ దార్యా 1‌లో సిబ్బంది
ఫొటో క్యాప్షన్, ఇరాన్ నౌక ఆడ్రియాన్ దార్యా 1 కెప్టెన్‌తో పాటు సిబ్బంది కూడా ప్రధానంగా భారతీయులే ఉన్నారు

ఆ ఈమెయిళ్లలో ఏముంది?

ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం.. ఆడ్రియన్ దార్యా 1 కెప్టెన్ అఖిలేష్ కుమార్‌ భారత పౌరుడు. ఈ నౌక మీద అమెరికా ఆంక్షలు విధించటానికి ముందు కెప్టెన్ అఖిలేష్ కుమార్‌కు బ్రియాన్ హుక్ ఒక ఈమెయిల్ పంపించారు.

''నేను శుభవార్త చెప్తున్నాను. ఈ నౌకను అమెరికా అధికారులు బంధించటానికి వీలుగా ఏదైనా ప్రాంతానికి తీసుకెళితే కెప్టెన్‌కు లక్షలాది డాలర్లు చెల్లించటానికి ట్రంప్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది'' అనే సందేశం ఆ మెయల్‌లో ఉంది.

బ్రిటన్ నిర్బంధం తర్వాత నౌక బాధ్యత తీసుకున్న కెప్టెన్.. అది బూటకపు ఈమెయిల్ అని భావించకుండా నిజమైనదేనని నమ్మటం కోసం అందులో అమెరికా విదేశాంగ శాఖ ఫోన్ నంబర్ కూడా చేర్చారు.

''అక్రమ చమురు ఎగుమతులను నిరోధించటానికి, విచ్ఛిన్నం చేయటానికి సముద్ర రవాణా సమాజంతో విదేశాంగ శాఖ సమన్వయంతో పనిచేస్తోంది'' అని బ్రియాన్ హుక్ సదరు వార్తాపత్రికతో చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

కెప్టెన్ అఖిలేష్ కుమార్ ఈ ఈమెయిళ్లను పట్టించుకోలేదు. దీంతో అమెరికా ఈ నౌకను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. నౌక కెప్టెన్ అఖిలేష్ మీద కూడా వ్యక్తిగత ఆంక్షలు విధించింది.

ఈ ఉదంతంపై ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జారిఫ్ ట్విటర్‌లో స్పందిస్తూ అమెరికా 'బాహాటంగా లంచం ఇవ్వజూపింద'ని ఆరోపించారు.

చమురు విక్రయించటానికి ఉపయోగించే ఓ ఇరాన్ షిప్పింగ్ వ్యవస్థ మీద ట్రంప్ ప్రభుత్వం బుధవారం కొత్త ఆంక్షలు విధించింది. ఈ వ్యవస్థను అడ్డుకోవటానికి సహాయం చేసిన వారు ఎవరికైనా 1.5 కోట్ల డాలర్లు నగదు బహుమతి ఇస్తామనీ ప్రకటించింది.

ఆడ్రియాన్ దార్యా 1

ఈ చమురు నౌక వివాదం ఏమిటి?

ఆడ్రియాన్ దార్యా 1 నౌక పాత పేరు గ్రేస్ 1. ఇది ఈయూ ఆంక్షలను ఉల్లంఘిస్తూ సిరియాకు చమురు తరలిస్తోందనే అనుమానంతో జూలై 4వ తేదీన బ్రిటన్ అధికారులు ఈ నౌకను జీబ్రాల్టర్‌లో బంధించారు.

అయితే.. నౌకలోని సరకులను సిరియాలో దింపబోమని ఇరాన్ హామీలు ఇవ్వటంతో ఆగస్టు 15న బ్రిటన్ దీనిని విడుదల చేసింది. ఆ విడుదలను ఆపటానికి అమెరికా చివరి నిమిషంలో ప్రయత్నం చేసినా ఫలించలేదు.

ఈ నౌక తన సిగ్నలింగ్ పరికరాన్ని ఆపివేసిందని కొందరు చెప్తున్నప్పటికీ.. ఇది ప్రస్తుతం తూర్పు మధ్యధరాసముద్రంలో ఉన్నట్లు నౌకల ప్రయాణాన్ని ట్రాక్ చేసే వెబ్‌సైట్లు చెప్తున్నాయి.

తొలుత ఈ నౌకను బంధించటం బ్రిటన్, ఇరాన్‌ల మధ్య దౌత్యవివాదానికి దారితీసింది. ఇరాన్.. గల్ఫ్‌లో బ్రిటిష్ జెండాతో ఉన్న స్వీడన్ యాజమాన్యంలోని చమురు నౌక స్టెనా ఇంపెరోను బంధించింది.

ఆ నౌకలో ఉన్న 23 మంది అంతర్జాతీయ సిబ్బందిలో ఏడుగురిని ఇరాన్ బుధవారం విడుదల చేసింది. మిగతా 16 మంది సిబ్బంది.. ఇరాన్ దక్షిణాన గల బందర్ అబ్బాస్ రేవులో ఓడలోనే ఉన్నట్లు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)