ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినందుకు రూ. 23 వేల జరిమానా, అప్పు చేయక తప్పదంటున్న బాధితుడు

దినేశ్ మదన్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, దినేశ్ మదన్
    • రచయిత, సల్మాన్ రావి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"నేను రానూ మండల్‌లా పాపులర్ కాదు కదా. నాకు దీనివల్ల పరువు పోతోంది. ఆమెలా పాపులర్ అయ్యుంటే నాకు కూడా సల్మాన్ ఖాన్‌ను కలిసే చాన్స్ వచ్చుండేది. ఇప్పుడు కోర్టులో వకీళ్లను కలవడమే నా అదృష్టం అనుకోవాలి".

దిల్లీలోని వసుంధరాలో ఉండే దినేష్ మదన్ బాధ ఇది. గురుగ్రామ్‌ పోలీసులు అతడికి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసులో 23 వేల రూపాయల జరిమానా విధించారు.

మదన్ ఇప్పుడు మీడియాతో చాలా ఇబ్బంది పడుతున్నాడు. రాత్రింబవళ్లూ ఫోన్ చేయడంతోపాటు, మీడియా వారు ఆయన ఇంటి చుట్టూ తిరుగుతున్నారు.

నేను ఆయనతో "ఎవరైనా సెలబ్రిటీలకే ఇలా జరుగుతుంది" అంటే, దానికి మదన్ "ఇలాంటి పేరు రాకపోవడమే మంచిది" అన్నాడు.

ట్రాఫిక్ బిల్లులు
ఫొటో క్యాప్షన్, ట్రాఫిక్ చలాన్

చారాణా కోడికి...

మదన్ విషయంలో "చారాణా కోడికి బారాణా మసాలా" అన్న సామెత సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఆయన ఏ స్కూటీలో గురుగ్రామ్ వెళ్లి, ట్రాఫిక్ ఉల్లంఘన కేసులో పోలీసులకు చిక్కాడో దాని వెల ఇప్పుడు 15 వేల వరకూ ఉంటుంది. కానీ ఆయనకు పడిన ఫైన్ మాత్రం 23 వేల రూపాయలు.

బీబీసీతో మాట్లాడిన మదన్ తను నిబంధనలు ఉల్లంఘించినట్లు ఒప్పుకున్నారు. కానీ, "జరిమానా మొత్తం తగ్గించాలని కోర్టులో వేడుకుంటానని" చెప్పారు.

తను క్లాసిఫైడ్ ప్రకటనలు సేకరించే పని చేస్తుంటానని ఆయన చెప్పారు. ఆ పనిలో నెలకు 15 వేల వరకూ సంపాదిస్తానని అన్నారు.

"అంత భారీ మొత్తం చెల్లించడం కష్టమే. నేను జడ్జిగారికి నా ఆర్థిక పరిస్థితి గురించి చెబుతా. జరిమానా మొత్తం తగ్గించాలని ఆయనను కోరుతాను. లేదు, కట్టాలి అని ఆయన ఆదేశిస్తే, సూరత్‌లో ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుని దాన్ని చెల్లించాల్సి ఉంటుంది" అన్నాడు మదన్.

ట్రాఫిక్ బిల్లులు

ఫొటో సోర్స్, PTI

సోషల్ మీడియా స్పందన

దినేష్ మదన్‌కు విధించిన జరిమానా గురించి తెలుగు పాఠకులకు చెప్పిన బీబీసీ, ఫేస్‌బుక్ పేజీ ద్వారా భారీగా పెంచిన ట్రాఫిక్ జరిమానాలపై ప్రజల స్పందన తెలుసుకోడానికి ప్రయత్నించింది.

130 మందికి పైగా కొత్త ట్రాఫిక్ జరిమానాలపై తమ స్పందనను బీబీసీతో పంచుకున్నారు.

వీరిలో శేఖర్ సుంకరి అనే ఒక యూజర్ జరిమానాలు సరే రోడ్ల సంగతి ఏంటని ప్రశ్నించారు.

ట్రాఫిక్ బిల్లులు

ఫొటో సోర్స్, FACEBOOK

మొదట ట్రాఫిక్ ఫ్లోకు తగ్గట్టు మీరు రోడ్లు, మలుపులు, డ్రైనేజీ వ్యవస్థ, సిగ్నళ్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు సరిగా మెయింటైన్ చేయండి అని ప్రభుత్వాన్ని కోరాడు.

ఫేస్‌బుక్‌లో చాలా మంది ఇలాగే ప్రశ్నించారు.

ట్రాఫిక్ బిల్లులు

ఫొటో సోర్స్, FACEBOOK

కొందరు నేను జరిమానా చెల్లిస్తాను కానీ, వీటి సంగతేంటి అని పాడైన రహదారులు ఫొటోలు పెట్టారు.

ట్రాఫిక్ బిల్లులు

ఫొటో సోర్స్, FACEBOOK

ట్రాఫిక్ బిల్లులు

ఫొటో సోర్స్, FACEBOOK

ట్రాఫిక్ బిల్లులు

ఫొటో సోర్స్, FACEBOOK

రాజేంద్ర నాయుడు లాంటి వారు జరిమానా మొత్తం పెంచడంపై సానుకూలంగా స్పందించారు. కానీ ప్రజా ప్రతినిధులు, అధికారులు కూడా వీటిని పాటించాలన్నారు.

ట్రాఫిక్ బిల్లులు

ఫొటో సోర్స్, FACEBOOK

ట్రాఫిక్ బిల్లులు

ఫొటో సోర్స్, FACEBOOK

మరికొందరు తమ కామెంట్స్‌లో కూడా బ్యాలెన్స్ చూపించారు.

ట్రాఫిక్ బిల్లులు

ఫొటో సోర్స్, FACEBOOK

సెప్టెంబర్ 1 నుంచి దేశవ్యాప్త అమలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మోటార్ వెహికల్స్(అమెండ్‌మెంట్) యాక్ట్ పాస్ చేశారు. దీనిని సెప్టంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేశారు. ఇందులో ట్రాఫిక్ ఉల్లంఘనలను ఎన్నో రెట్లు పెంచేశారు.

లైసెన్స్ లేకుండా వాహనం నడపడం నుంచి సీటు బెల్టు పెట్టుకోకుండా ఉండడం వరకూ జరిమానాలను చాలా పెంచారు.

చాలా రాష్ట్రాల్లో ఇంకా అమలు చేయలేదు

కానీ చాలా రాష్ట్రాల్లో ఈ కొత్త సవరణను ఇంకా అమలు చేయలేదు. ఇందులో రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్ లాంటివి ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పాలన లేదని మనకు తెలుసు.

ట్రా

ఫొటో సోర్స్, TWITTER

రాష్ట్రాలకు నిర్ణయాధికారం

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఒక ట్వీట్‌లో "సెంట్రల్ మోటార్ వెహికల్ సవరణ చట్టం-2019ని మేం పూర్తిగా అధ్యయనం చేస్తాం. మాకు ప్రజా ప్రయోజనాలే ముఖ్యం. పొరుగు రాష్ట్రాల్లో అధ్యయనం చేసి, దానిపై ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించాం. 'సెటిల్‌మెంట్ మొత్తం' విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు మాకుంది. అవసరమైతే మేం ప్రజా ప్రయోజనాలను బట్టి నిర్ణయం తీసుకుంటాం" అన్నారు.

రాజస్థాన్ రవాణా మంత్రి ప్రతాప్ సింగ్ కాచారియావాస్ తమ రాష్ట్రంలో కొత్త చట్టం అమలు చేస్తామని, కానీ అంతకు ముందు జరిమానా మొత్తంపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తుందని చెప్పారు.

అలాగే, సవరించిన రవాణా చట్టంలోని సెక్షన్ 200లో రాష్ట్ర ప్రభుత్వాలు 'కంపౌండింగ్ ఫైన్' అంటే 'సెటిల్‌మెంట్ రుసుము' నిర్ణయించవచ్చనే నిబంధన ఉందని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చెబుతోంది.

బీబీసీతో మాట్లాడిన ఒక రవాణా శాఖ అధికారి పేరు బయటపెట్టద్దనే షరతుతో "ఒకవేళ వాహనం ధర కంటే జరిమానా ఎక్కువగా ఉంటే జనం వాటిని వదిలి వెళ్లిపోతారు. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో అలాంటి వాహనాలు ఉంచడానికి తగినంత చోటే లేదు. ఇలాంటి వాహనాలను ఎప్పటివరకూ తమ దగ్గర ఉంచుకోవచ్చు అనేదానిపై ట్రాఫిక్ పోలీస్, రవాణా శాఖకు కూడా స్పష్టత లేదు" అన్నారు.

ట్రాఫిక్ బిల్లులు

ఛత్తీస్‌గడ్ రవాణా కమిషనర్ మనోజ్ పింగ్వా బీబీసీతో మాట్లాడుతూ "ప్రభుత్వం ఇప్పుడు దీనిని అమలు చేయడం గురించి ఆలోచిస్తోంది, న్యాయపరమైన సలహాలు కూడా తీసుకుంటున్నాం. ఆ తర్వాత జరిమానాగా 'సెటిల్‌మెంట్ రుసుము' ఎంత ఉండాలనేది నిర్ణయిస్తాం" అన్నారు.

పంజాబ్ రవాణా మంత్రి రజియా సుల్తానా కూడా "సవరించిన రవాణా చట్టంలో జరిమానా మొత్తంపై మా ప్రభుత్వం కూడా న్యాయ సలహాలు తీసుకుంటోంది" అని చెప్పారు.

అలాగే పశ్చిమ బెంగాల్ రవాణా మంత్రి సువేందు అధికారి "కొత్త చట్టంలో జరిమానా నిబంధన చాలా అవసరం. వాటిని ప్రభుత్వం అమలు చేస్తుంది. కానీ మిగతా ఉల్లంఘనలకు నిర్ణయించిన జరిమానా మొత్తంపై రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అభిప్రాయం కూడా తెలుసుకుంటున్నాం" అన్నారు.

ఆయన కూడా ఈ చట్టంలోని సెక్షన్ 200 గురించి ప్రస్తావించారు. ఆ నిబంధన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అలా చేసే హక్కు ఉంటుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)