టీచర్స్ డే- సర్వేపల్లి రాధాకృష్ణన్: ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి స్థాయికి..

ఫొటో సోర్స్, Getty Images
‘భారతరత్న’ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి నేడు.
ఆయన పుట్టిన రోజును ఆయన గౌరవార్థం 1962వ సంవత్సరం నుంచి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకొంటున్నాం.
ఉపాధ్యాయ వృత్తి నుంచి భారత ప్రథమ పౌరుడి స్థాయికి ఎదిగిన అరుదైన ఘనత ఆయన సొంతం.
అయితే, రాష్ట్రపతిగా కంటే తత్వవేత్తగానే ఆయన ప్రపంచానికి ఎక్కువగా పరిచయం. భారతీయ తాత్విక దృక్పథాన్ని ప్రపంచ దేశాలకు అందించిన గొప్ప వ్యక్తుల్లో ఒకరిగా ఆయన నిలిచారు.
ఉపాధ్యాయుడిగా, తత్వవేత్తగా, రచయితగా, రాజనీతిజ్ఞుడిగా సర్వేపల్లి ప్రయాణం బహుముఖాలుగా సాగింది.

ఫొటో సోర్స్, tsird.gov.in
తమిళనాడులోని తిరుత్తణిలో 1888లో ఒక తెలుగు కుటుంబంలో జన్మించిన రాధాకృష్ణన్ 21 ఏళ్లకే మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ప్రొఫసర్ అయ్యారు.
ఉపాధ్యాయుడిగా అక్కడి నుంచే విద్యార్థులపై చెరగని ముద్ర వేశారు. ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనవర్సిటీలోనూ ఆయన పాఠాలు చెప్పారు.
భారతీయ తత్వాన్ని ప్రపంచానికి అందించేందుకు అనేక పుస్తకాలు రాశారు.
The Hindu View of Life, The Ethics of the Vedanta and Its Material Presupposition ఇందులో ప్రధానమైనవి. My Search for Truth పేరుతో ఆత్మకథను రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
గుర్రాలకు బదులుగా విద్యార్థులు
విద్యార్థులకు ఆయన అంటే ఎంత అభిమానమో తెలిపే సంఘటన ఇది.
రాధాకృష్ణన్ మైసూర్‌లోని మహారాజా కళాశాల నుంచి బదిలీ అయినప్పుడు ఆయనకు విద్యార్థులు మరిచిపోలేనిరీతిలో వీడ్కోలు పలికారు.
అందంగా ముస్తాబు చేసిన గుర్రంపై ఆయనను ఊరింగించాలని విద్యార్థులు భావించారు. సర్వేపల్లిని కూడా ఒప్పించారు.
తీరా సమయానికి గుర్రం కనిపించకుండా పోయింది. అప్పుడు విద్యార్థులు తమ భుజాలపై రాధాకృష్ణన్‌ను ఊరేగింపుగా రైల్వే స్టేషన్ వరకు తీసుకెళ్లి వీడ్కోలు పలికారు.

ఫొటో సోర్స్, Bujjai/Sai Bhagavatula/WikiPedia
రాయబారిగా తనదైన ముద్ర
1949లో రష్యా రాయబారిగా వెళ్లినప్పుడు రాధాకృష్ణన్ అక్కడ తదైన ముద్రవేశారు. కశ్మీర్ విషయంలో రష్యా మద్దతు భారత్‌కు లభించేలా కృషిచేశారు.
తన వాక్చాతుర్యంతో ఒక సందర్భంలో స్టాలిన్‌ను సైతం మెప్పించారు.
1950లో ఆయన స్టాలిన్‌ను కలిసినప్పుడు ప్రచ్చన్న యుద్ధాన్ని ఆపేందుకు కృషిచేయాలని కోరారు. అప్పుడు స్టాలిన్ ‘‘చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు కావాలి. ప్రచ్చన్న యుద్ధం ముగించే బాధ్యత అవతలి పక్షం తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.
అప్పుడు రాధాకృష్ణన్ స్పందిస్తూ ‘‘మిస్టర్ స్టాలిన్, శాంతికాముక దేశంగా రష్యా తన చేతిని వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు కావాలి కదా’’ అని పేర్కొన్నారు.
ఆయన సమాధానానికి స్టాలిన్‌కు నోట మాటరాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
‘కంగారు పడకండి మావో’
భారత ఉపరాష్ట్రపతిగా ఆయన 1957లో చైనాలో పర్యటించారు. అప్పుడు చైనా అధినేతగా ఉన్న మావో జెడాంగ్‌ను కలవాలనుకున్నారు. ఒక రోజు అర్ధరాత్రి 12 గంటలకు మావోను కలిసే అవకాశం ఆయనకు వచ్చింది.
మావోనే స్వయంగా ఆయనను ఆహ్వానించారు. ఆ సమయంలో రాధాకృష్ణన్ మావోతో కరచాలనం చేయడంతో పాటు, ఆయన గడ్డాన్ని చేతితో తాకారు. ఊహించని ఈ పరిణామానికి మావో ఉలిక్కిపడ్డారు.
ఆయన తేరుకునేలోపు ’మిస్టర్ మావో, నేను మీతోనే కాదు స్టాలిన్, పోప్‌లతో కూడా ఇలానే చేశాను. మీ మీదున్న వాత్సల్యంతోనే అలా చేశాను. కంగారుపడకండి’ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఏ.కోడూరు: ఒకే పాఠశాలకు తండ్రి, కొడుకు, మనవడు.. మూడు తరాల ప్రభుత్వ స్కూల్ ఇదీ
- తెలంగాణ: సెప్టెంబరు 17న అధికారికంగా భారీ ఉత్సవాలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి కారణాలేంటి?
- తెలుగు: భాష ఒకటే.. మాండలికాల సొగసులు అనేకం
- మనుస్మృతి ఏం చెబుతోంది... 2,000 ఏళ్ల నాటి ఈ హిందూ నియమావళిని నేటి భారత మహిళలు పాటించాలా?
- ఆంధ్రప్రదేశ్ - బూరుగు: ఆ గిరిజన గ్రామాల్లో రోజంటే 12 గంటలే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












