భారత ప్రధాన మంత్రి: లౌకికవాది నెహ్రూ నుంచి తీర్థ యాత్రికుడు మోదీ వరకు

ఫొటో సోర్స్, KEYSTONE-FRANCE
- రచయిత, రేహన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
"వయసు పెరిగేకొద్దీ మతంతో నా సాన్నిహిత్యం తగ్గిపోతోంది'' అని 1933లో గాంధీకి రాసిన లేఖలో జవహర్‌లాల్ నెహ్రూ అన్నారు.
"వ్యవస్థీకృత మతానికి నేను ఎప్పుడూ భయపడతాను. అదంటే నాకు మూఢత్వం, ప్రాచీనత, సంప్రదాయవాదం, దోపిడీ గుర్తుకు వస్తాయి. అందులో తర్కం, సమర్థనలకు చోటులేదు" అని 1936లో నెహ్రూ తన ఆత్మకథలో రాశారు.
నెహ్రూ లౌకికత్వం 1950లో తొలిసారి పరీక్షను ఎదుర్కొంది. 10వ శతాబ్దంలో మహమ్మద్ గజినీ చేతిలో దోపిడికి గురైన సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ కార్యక్రమానికి, నెహ్రూ సూచనలకు విరుద్ధంగా అప్పటి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు.
సెక్యులర్ దేశానికి నాయకత్వం వహిస్తున్న నేతలు ఓ మతపరమైన కార్యక్రమానికి హాజరు కావడం మంచి సంకేతం కాదని సోమనాథ్ పర్యటనపై అప్పట్లో నెహ్రూ రాజేంద్ర ప్రసాద్‌కు సూచించారు. కానీ నెహ్రూ వాదనను పట్టించుకోని రాజేంద్రప్రసాద్ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.
"నేను నా మతాన్ని నమ్ముతున్నాను. దాన్నుంచి నన్ను వేరు చేయవద్దు. నేను సర్దార్ పటేల్, నవ్‌నగర్ జామ్‌సాహెబ్ (యువరాజు) సమక్షంలో సోమనాథ్ ఆలయాన్ని పరిశీలించాను" అని నెహ్రూ అభ్యంతరాలకు సమాధానమిస్తూ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నట్లు ప్రముఖ జర్నలిస్టు దుర్గాదాస్ తన "ఇండియా-ఫ్రమ్ కర్జన్ టు నెహ్రూ అండ్ ఆఫ్టర్'' అనే పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, SOPA IMAGES
కుంభమేళాలో స్నానానికి నిరాకరించిన నెహ్రూ
1952లో రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ కాశీకి వెళ్లి కొంతమంది పండితుల పాదాలను కడిగిన సందర్భంగా మతం విషయంలో నెహ్రూ-రాజేంద్రప్రసాద్‌ల మధ్య అభిప్రాయభేదాలు మరోసారి కనిపించాయి. రాజేంద్రప్రసాద్ చర్యలకు నెహ్రూ తన లేఖలతో నిరసన తెలపగా "దేశంలో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి కూడా ఒక పండితుడి ముందు చిన్నవాడే" అని ఆయన సమాధానమిచ్చారు.
ఈ వివాదం తర్వాతే నెహ్రూ అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌వైపు మొగ్గడం ప్రారంభించారు. "ఒకసారి శాస్త్రీజీ కుంభమేళాలో స్నానం చేయాల్సిందిగా నెహ్రూజీని అభ్యర్థించారు. అయితే నేను గంగను ప్రేమిస్తాను. ఎన్నోసార్లు అందులో మునిగాను కూడా. కానీ కుంభమేళా సందర్భంగా మాత్రం నేను ఆ పని చేయను అని నెహ్రూ సమాధానమిచ్చారు'' అని లాల్‌బహదూర్ శాస్త్రికి కార్యదర్శిగా పని చేసి సీపీ శ్రీవాస్తవ తన జీవిత చరిత్రలో రాశారు.

గురు గోల్వాల్కర్‌ను సంప్రదించిన లాల్‌బహదూర్
నెహ్రూలాగా లాల్‌బహదూర్ శాస్త్రి ఎప్పుడూ తన హిందుత్వ గుర్తింపును దాచుకునే ప్రయత్నం చేయలేదు. కానీ దేశం లౌకిక రాజ్యంగా ఉండాలన్న విషయంలో ఆయనకు మరో అభిప్రాయం ఉండేది కాదు.
1965 యుద్ధం సందర్భంగా పార్టీ నేతలను కాదని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ గురు గోల్వాల్కర్ సలహా తీసుకోడానికి కూడా లాల్‌బహదూర్ శాస్త్రి వెనకాడలేదు.
అంతేకాదు, శాస్త్రి చొరవతోనే ఆర్‌ఎస్‌ఎస్ కార్యర్తలకు దిల్లీలో ట్రాఫిక్ వ్యవస్థను సరిదిద్దే బాధ్యతలు అప్పగించారు.
"నెహ్రూలాగా జనసంఘ్, ఆర్‌ఎస్‌ఎస్‌లతో లాల్‌బహదూర్ శాస్త్రి ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోలేదు" అని తన జీవిత చరిత్ర "మై కంట్రీ, మై లైఫ్" పుస్తకంలో ఎల్‌కే అడ్వాణీ రాశారు.

ఫొటో సోర్స్, TIM GRAHAM
ఇందిర లౌకిక ముద్ర
అధికారంలోకి వచ్చిన కొత్తలో సోషలిజం, లౌకికవాదం ఇందిరాగాంధీకి అతిపెద్ద అజెండాగా ఉండేవి. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధానమంత్రిగా దేవుని పేరిట కాకుండా దేశ సమగ్రత పేరుతో ప్రమాణ స్వీకారం చేశారు ఇందిర. 1967లో 'గో రక్షా' ఉద్యమకారులైన సాధువులు పార్లమెంటును చుట్టుముట్టినప్పుడు ఆమె లౌకికవాదానికి తొలి పరీక్ష ఎదురైంది.
ఈ సంఘటనలో పోలీసు కాల్పులకు ఆరుగురు మరణించారు. ఇందిరాగాంధీ సాధువుల మాటను వినలేదు. గో రక్షా ఆందోళన్‌కు మద్దతిస్తున్న గుల్జారీలాల్ నందాను వదిలించుకోవడానికి ఆమె ఈ అవకాశాన్ని వాడుకున్నారు. తన మంత్రివర్గం నుంచి గుల్జారీలాల్‌కు ఉద్వాసన పలికారు.

ఫొటో సోర్స్, FRANCOIS LOCHON
ఆలయాలు, అర్చకుల చుట్టూ తిరిగిన ఇందిర
1980లకు వచ్చేసరికి ఇందిరా గాంధీ ఆధ్యాత్మికత వైపు మళ్లారు. 1977 ఎన్నికల్లో ఓటమి, 1980లో చిన్న కొడుకు సంజయ్‌గాంధీ మరణం ఆమెలో ఆధ్యాత్మిక ఆలోచనలు పెంచినట్లు చెబుతారు.
ఆమె ఆలోచనలను మార్చడంలో అప్పటి రైల్వే మంత్రి కమలాపతి త్రిపాఠి ప్రముఖ పాత్ర పోషించారని అంటారు. కమలాపతి త్రిపాఠీ ఆమెకు మత గురువుగా మారిపోయారు. "నవరాత్రుల తర్వాత ఒక కన్య కాళ్లు కడిగి ఆ నీళ్లను తాగాలని కమలాపతి త్రిపాఠి ఇందిరకు సూచించారు. కానీ ఆమె మొదట సంశయించారు. నాకు ఏదైనా జబ్బు రాదు కదా అని అడిగారు. కానీ విదేశాల్లో చదువుకుని, ఫ్రెంచ్ మాట్లాడగల ఇందిర తర్వాత ఆ క్రతువును పూర్తి చేశారు" అని ప్రముఖ జర్నలిస్టు కుంకుమ్ చద్ధా "ది మేరీ గోల్డ్ స్టోరీ-ఇందిరాగాంధీ అండ్ అదర్స్'' అనే పుస్తకంలో రాశారు.
దాదాపు అదే సమయంలో ఇందిర దాతియాలోని బాగ్లాముఖీ శక్తిపీఠాన్ని సందర్శించారు. ఆలయ ప్రాంగణంలో ధూమావతి దేవి ఆలయం ఉంది. అక్కడ వితంతువులు మాత్రమే పూజలు చేస్తారు. ఇందిరాగాంధీ మొదటిసారి అక్కడికి వెళ్లినపుడు శక్తిపీఠం పూజారులు ఆమెను ఆలయంలోనికి రానివ్వలేదు. ఫిరోజ్‌గాంధీని వివాహం చేసుకున్నందున ఆమె హైందవేతరులు అవుతారని, హైందవేతరులకు ప్రవేశంలేదని తేల్చిచెప్పారు పూజారులు.
"ఆమె కమలాపతి త్రిపాఠీకి కాల్ చేశారు. వెంటనే దాతియాకు రావాలని ఆదేశించారు. పూజారులను ఒప్పించడానికి త్రిపాఠీ నానా తంటాలు పడ్డారు. చివరకు ఒక ముఖ్య విషయం బయటపెట్టాల్సి వచ్చింది. అది పనిచేసింది. ఆమెను నేను తీసుకువచ్చాను. నేను బ్రాహ్మణుడిని. ఆమెను బ్రాహ్మణుని కుమార్తెగా పరిగణించండి అని చెప్పడంతో పూజారులు అందుకు ఒప్పుకున్నారు'' అని చద్ధా తన పుస్తకంలో రాశారు.
ప్రస్తుతం ఛాతర్‌పూర్‌గా పిలిచే దిల్లీలోని శ్రీ ఆది కాత్యాయని శక్తిపీఠాన్ని ఇందిర తరచూ సందర్శించేవారు. ఈ ఆలయం మెహ్రౌలిలోని ఆమె ఫామ్‌హౌస్ దగ్గర ఉంది. 1983లో ఇందిరా గాంధీ విశ్వహిందూ పరిషత్ సహకారంతో నిర్మించిన భారత్‌మాత మందిరాన్ని హరిద్వార్‌లో ప్రారంభించారు.

ఫొటో సోర్స్, THE INDIA TODAY GROUP
అయోధ్య శిలాన్యాస్‌లో రాజీవ్ పాత్ర
ఇందిర కుమారుడు రాజీవ్ మతాసక్తులు ఉన్న వ్యక్తి కాదు. అయితే 1989లో రాజకీయ సలహాదారుల సూచన ప్రకారం ఆయన అయోధ్య నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రామరాజ్యం తీసుకొస్తానని వాగ్దానం చేశారు. షాబానో కేసులో తనకు ఎదురైన ప్రతికూలత నుంచి బయటపడటానికి రాజీవ్ రామాలయ పునాది రాళ్లను కదిలించారు. కానీ రాజీవ్ గాంధీ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. షాబానో కేసులో ముస్లిం మత పెద్దల మద్దతు పొందగలిగినప్పటికీ తాను ఓ మంచి హిందువుగా ప్రజలకు కనిపించాలని రాజీవ్ కోరుకున్నారు.
"రామమందిరం అంశాన్ని అందుకోవడం వల్ల ముస్లిం మతవాదులకు మద్దతిస్తున్నారన్న వాదన బలహీనపడుతుందని రాజీవ్‌గాంధీ సలహాదారు అరుణ్ నెహ్రూ భావించి ఉంటారు'' అని రచయిత జోయా హసన్ తన పుస్తకం "కాంగ్రెస్ ఆఫ్టర్ ఇందిర''లో పేర్కొన్నారు.
మసీదు కూల్చివేతకు ఈ పరిణామమే తొలిమెట్టుగా విశ్వహిందూ పరిషత్ భావిస్తుందని కాంగ్రెస్ ఆనాడు ఊహించలేదు. చివరకు అదే జరిగింది.

ఫొటో సోర్స్, RAVEENDRAN
పీవీ నరసింహారావు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. హైదరాబాద్ నిజాంకు వ్యతిరేక పోరాటంతో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. హిందూ మహాసభ, ఆర్యసమాజ్‌లతో చేయిచేయి కలిపి పనిచేశారు. ఆయన జీవితమంతా ఉదయం లేస్తే పూజలు, తీర్థయాత్రల చుట్టూ తిరిగింది.
శృంగేరి శంకరాచార్యుల నుంచి పెజావర్ మఠం స్వామి వరకు, పీవీకి చాలామంది మత పెద్దలతో సాన్నిహిత్యం ఉండేది. ఎన్.కె.శర్మవంటి జ్యోతిష్యులు, చంద్రస్వామివంటి తాంత్రికులు కూడా ఆయనకు చాలా సన్నిహితులు.
బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఆయనే ప్రధాని. ముస్లింలు కాంగ్రెస్‌కు దూరం అవుతారని ఆయన ఆందోళన చెందారు. కానీ హిందువుల్లో ఉన్నత, మధ్యతరగతి, వెనకబడిన వర్గాలు బీజేపీకి దగ్గరవుతున్నాయన్న ఆందోళన కూడా ఆయనలో ఉంది. భారతదేశం హిందూ దేశం అన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి అని ఆయన ఓసారి మణిశంకర్ అయ్యర్‌తో అన్నారని చెబుతారు.
"నరసింహారావుది ఒక అభిప్రాయాన్ని ఏర్పరచడానికి ప్రయత్నించి విఫలమైన విషాద వ్యక్తిత్వం" అని పీవీ జీవిత చరిత్ర రాసిన వినయ్ సీతాపతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించారు. ఆయన హిందూ, ముస్లిం ఓటు బ్యాంకులు రెండింటినీ సంతోషపెట్టాలనుకున్నారు. హిందువుల మనోభావాలను, మసీదును కాపాడాలనుకున్నారు. తద్వారా తనను తాను రక్షించుకోవాలని భావించారు. కానీ మసీదు కూలిపోయింది, హిందువులు కాంగ్రెస్ వైపు రాలేదు. ఆయనకున్న గుర్తింపు కూడా పోయింది'' అని ఖుర్షీద్ అన్నారు.
ఇవి కూడా చదవండి.
- కశ్మీర్: 'ప్రజాస్వామ్యం కొనఊపిరితో ఉంది. రాజకీయ ప్రక్రియ పూర్తిగా స్తంభించింది'
- కశ్మీరీ పండిట్లు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిబంధనలను వ్యతిరేకిస్తున్నారా
- రాముడు అందరివాడు: ప్రధాని మోదీ
- లౌకికత్వంపై హిందూత్వ గెలిచిన రోజు ఇది: అసదుద్దీన్ ఒవైసీ
- రాత్రికి రాత్రి కుబేరుడైన వ్యాపారికి మరో అరుదైన రత్నం దొరికింది...
- బలూచిస్తాన్‌లో గల్లంతైన ఈ విద్యార్థి ప్రాణాలతో తిరిగి వస్తారా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








