ఆర్టికల్ 370 రద్దుకు ఏడాది: కశ్మీరీ పండిట్‌లూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిబంధనలను వ్యతిరేకిస్తున్నారా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బీబీసీ మానిటరింగ్
- హోదా, విశ్లేషణ
జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దుచేసి ఏడాది అవుతోంది. రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు(జమ్ముకశ్మీర్, లద్దాఖ్)గా విభజించి అప్పుడే సంవత్సరం గడిచింది.
కశ్మీర్‌ను భారత్‌లో కలుపుతామని ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇచ్చిన హామీని నెరవేర్చింది. తమ చర్యలతో రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని, వేర్పాటువాదానికి తెరపడుతుందని పార్టీ చెప్పింది.
ఆగస్టు 2019న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశంలోని చాలా ప్రాంతాలు ప్రశంసలు కురిపించాయి. అయితే ఏడాది గడుస్తున్నా కశ్మీర్‌కు ఒనగూరే ఆ సానుకూల ప్రభావాలేంటో ఇప్పటికీ చెప్పలేని పరిస్థితి నెలకొంది.
ముఖ్యంగా కశ్మీర్ లోయలో పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇక్కడ సాధారణ పరిస్థితులు ఎప్పుడొస్తాయో మరి..
కొత్త నిబంధనలు
ఆర్టికల్ 370ను రద్దు చేయడంతోపాటు ఈ ప్రాంతంలో అధికారులు కొత్త నిబంధనలు విధించారు.
2020 మేలో ఆమోదం పొందిన కొత్త నివాస నిబంధనల చట్టం ప్రకారం.. కొన్ని షరతులపై కశ్మీర్‌లో ఎవరైనా శ్వాశ్వత నివాస హక్కులు పొందొచ్చు. ఈ ప్రాంతంలో 15 ఏళ్లు నివాసమున్న ఎవరైనా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. భూములూ కొనుక్కోవచ్చు.
కొత్త నిబంధనల ప్రకారం దాదాపు 20,000 మందికి ఇప్పటికే నివాస హక్కులు వచ్చాయని జూన్‌లో వార్తలు వచ్చాయి.
ఇక్కడి జనాభా లెక్కలను మార్చడమే లక్ష్యంగా ఈ నిబంధనలు తీసుకొచ్చారని ముస్లింలు ఎక్కువగా ఉండే కశ్మీర్ లోయలోని స్థానికులు ఆందోళన వ్యక్తంచేశారు.
హిందువులు అధికంగా ఉండే జమ్ములోని ప్రజలు, వేరే ప్రాంతాల్లో స్థిరపడిన కశ్మీరీ హిందులు.. గతేడాది ఆర్టికల్ 370 రద్దును స్వాగతించారు. అయితే కొత్త నివాస నిబంధనలపై వారు కూడా ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వ చర్యలతో తమ ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని వారంటున్నారు.
''కశ్మీర్‌లోయలో కశ్మీరీ పండిట్‌లు స్థిరపడే వరకూ ఎవరికీ నివాస ధ్రువీకరణ ప్రతాలు ఇవ్వకూడదని మేం డిమాండ్ చేస్తున్నాం''అని కశ్మీరి హిందువుల పునరావాస సంస్థ అధిపతి సతీశ్ మహల్దార్ డిమాండ్ చేసినట్లు ఇంగ్లిష్ పత్రిక ‘ద ట్రిబ్యూన్’లో ఓ కథనం కూడా ప్రచురితమైంది.
అయితే, భూ విక్రయాల నిబంధనలు సరళించడంతో రాష్ట్రంలోకి పెట్టుబడులు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
జమ్ముకశ్మీర్‌లో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటానికి ఇది కీలకమని అధికారులు చెప్పినట్లు ‘ద ఎకనమిక్ టైమ్స్’లో ఓ వార్త ప్రచురితమైంది.
ఈ ప్రాంతంలో భూమిపై భద్రతా సంస్థలకు హక్కులు కల్పించే మరో చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సిద్ధంచేసింది. దీనిపైనా స్థానికులు ఆందోళన వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయ నేతలేరి?
గతేడాది నిర్ణయం అనంతరం బీజేపీ మినహా రాష్ట్రంలోని ఏ ప్రధాన రాజకీయ పార్టీ క్రియాశీలంగా లేదు.
ఈ ప్రాంతంలో ఏళ్ల నుంచీ క్రియాశీలంగా పనిచేస్తున్న జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫెరెన్స్‌కు చెందిన నేతలు ఫరూఖ్ అబ్దుల్లా, ఆయన తనయుడు ఒమర్ అబ్దుల్లా నెలలపాటు గృహ నిర్బంధంలోనే ఉండిపోయారు. ఇప్పుడు బయటకు వచ్చేందుకు వారిని అనుమతించినా.. పెద్ద తేడా ఏమీ కనిపించడం లేదు.
మరోవైపు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఇప్పటికీ గృహ నిర్బంధంలోనే ఉన్నారు.
చాలా మంది సీనియర్ రాజకీయ నాయకులు గృహ నిర్బంధం నుంచి బయటకు వచ్చినప్పటికీ.. కశ్మీర్ ప్రత్యేక హోదాపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు.
370 రద్దు అనంతర పరిస్థితులకు అనుగుణంగా తమ రాజకీయ వ్యూహాల మార్పుకు ఇది సంకేతమని ‘ద ప్రింట్’ వెబ్‌సైట్‌లోని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
అయితే రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తూ తీసుకున్న చర్యలను ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తా పత్రికకు రాసిన అభిప్రాయంలో ఒమర్ అబ్దుల్లా ఖండించారు.
జమ్మకశ్మీర్‌లో రాజకీయాలు మళ్లీ ఊపందుకునేందుకు ఆయన తలుపులు తెరచినట్లు అయిందని ద హిందుస్తాన్ టైమ్స్ అభిప్రాయపడింది.
మరోవైపు హురియత్ కాన్ఫెరెన్స్‌కు సయ్యద్ అలీ షా గిలానీ రాజీనామాతో వేర్పాటువాద రాజకీయాలకూ ఎదురుదెబ్బ తగిలింది.
వేర్పాటువాద రాజకీయాలకు తాజా పరిణామంతో ముగింపు కార్డు పడిందని కొందరు చెబుతుంటే.. మరింత అతివాదంతో విరుచుకుపడేవారు పరిస్థితులను అవకాశంగా మలుచుకోవచ్చని మరికొందరు అంటున్నారు.
''ఆయన రాజీనామాతో పాకిస్తాన్ అనుకూలంగా వ్యవహరించే యువతకు అవకాశం దొరికినట్లయింది''అని డెక్కన్ హెరాల్డ్ వార్తా పత్రిక రాసుకొచ్చింది.
ఇటీవల కశ్మీర్‌లో ఓ కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ చొరవతో ఇది ఏర్పడింది. అయితే స్థానిక ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఆర్థిక వ్యవస్థ కుదేలు
గతేడాది ఆగస్టు నుంచీ లాక్‌డౌన్‌లతోపాటు కరోనావైరస్ ఆంక్షల నడుమ ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఇప్పట్లో ఇది మెరుగు పడుతుందని ఎవరూ ఆశించడంలేదు.
గతేడాది ఆగస్టు నుంచి జమ్మూకశ్మీర్ దాదాపు 5.3 బిలియన్ డాలర్లను నష్టపోయిందని పౌర హక్కుల సంస్థ ద ఫోరం ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇన్ జమ్ముకశ్మీర్ తెలిపింది.
కోవిడ్-19 కట్టడికి విధిస్తున్న లాక్‌డౌన్‌తో పరిస్థితులు మరింత దిగజారతాయని శ్రీనగర్‌కు చెందిన వార్తా పత్రిక ద కశ్మీర్ లైఫ్ వ్యాఖ్యానించింది.
మీడియాపై ప్రభావం
ఆర్టికల్ 370 రద్దు అనంతరం మీడియాపై చాలా ప్రతికూల ప్రభావం పడింది. మొదట్లో ఇక్కడి సమాచార, ప్రసార సంస్థలపై ఆంక్షలు విధించారు.
ఇప్పుడు ఇక్కడి నుంచి పని చేయడం చాలా కష్టమైందని స్థానిక జర్నలిస్టులు చెబుతున్నారు.
కఠిన నిబంధనల కింద కొందరు జర్నలిస్టులపై కేసులు మోపడంపై మానవ హక్కుల సంస్థలు కూడా ప్రశ్నలు సంధిస్తున్నాయి.
భావ ప్రకటన స్వేచ్ఛపై తాజా మీడియా నియంత్రణ విధానం మరిన్ని ఆంక్షలు విధిస్తోందని ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
''గత ఏడాది కాలంలో అదుపులోకి తీసుకుంటున్న, విచారణకు పిలుపు అందుకుంటున్న, భయపడుతున్న జర్నలిస్టుల సంఖ్య పెరుగుతోందనే మనం గుర్తించాలి''అని కశ్మీర్ టైమ్స్ ఎడిటర్ అనురాధా భాసిన్ జమ్వాల్ చెప్పినట్లు ద వైర్ న్యూస్ వెబ్‌సైట్ పేర్కొంది.
మరోవైపు కశ్మీర్‌లో ఎన్ని డిమాండ్లు వినిపిస్తున్న ఇప్పటికీ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను ఇప్పటికీ పునరుద్ధరించలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టేందుకు ఈ ఇంటర్నెట్‌ను వాడుకొనే ముప్పుందని అధికారులు తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Rajya Sabha TV
కొనసాగుతున్న హింస
కశ్మీర్‌లో శాంతి, భద్రతలు ఇప్పటికీ మెరుగు పడలేదు. ఇటీవల కాలంలో మిలిటెంట్లపై భద్రతా బలగాల ఆపరేషన్లు ఎక్కువయ్యాయి.
2020లో 136 మంది మిలిటెంట్లు మరణించినట్ల ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, కొత్త మిలిటెంట్ల నియామకాలు ఏమీ తగ్గట్లేదని స్క్రోల్ ఓ వార్త ప్రచురించింది.
ఇక్కడ శాంతి, భద్రతలు మెరుగు పడ్డాయని, హింస కూడా తగ్గిందని కశ్మీర్ పోలీస్ విభాగం అధిపతి దిల్‌బాగ్ సింగ్ వ్యాఖ్యానించారు.
''సమీప భవిష్యత్‌లో కశ్మీర్‌కు ఏం దొరకబోతోంది? అయోమం? వచ్చే శీతాకాలంతో ఇక్కడ అతివాదానికి తెరపడుతుందని భద్రతా నిపుణులు భావిస్తున్నారు. అయితే వరుస హత్యలు.. కశ్మీర్‌లో అతివాదాన్ని ఆపలేవని గత చరిత్ర చెబుతోంది''అని శ్రీనగర్‌కు చెందిన పత్రిక కశ్మీరీ అబ్జర్వెర్ వ్యాఖ్యానించింది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: కోవిడ్-19తో మరణించిన ముస్లిం శవాన్ని దహనం చేయడంపై శ్రీలంకలో వివాదం
- కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా?
- కరోనావైరస్: యూరప్‌లోని వృద్ధాశ్రమాల్లో మృత్యు ఘోష, వందలాది మంది వృద్ధులు మృతి
- కరోనా వైరస్: ఒక డాక్టర్ భార్యగా నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే..
- కరోనావైరస్: తీవ్ర సంక్షోభం దిశగా పాకిస్తాన్.. ఈ కల్లోలాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తట్టుకోగలదా?
- ఆరోగ్య సేతు: ప్రభుత్వాలు అందిస్తున్న యాప్‌లు సురక్షితమేనా, రాబోయే రోజుల్లో వాటితో ప్రమాదం ఉందా?
- కరోనావైరస్ మహమ్మారిని తెచ్చింది పేదలు కాదు... సంపన్నులే - అభిప్రాయం
- కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు
- కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








