ఆర్టికల్ 370: "కశ్మీర్‌లో అగ్ని పర్వతం బద్దలు కానుంది, కొంత కాలం గడిచాక..." - బీబీసీతో బీజేపీ స్థానిక ముస్లిం నేత వ్యాఖ్య

- రచయిత, జుబైర్ అహ్మద్
- హోదా, శ్రీనగర్ నుంచి బీబీసీ ప్రతినిధి
"నేనా వార్త వినగానే, టాయిలెట్‌కు రెండుసార్లు వెళ్లాల్సి వచ్చింది." - జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 సవరణపై భారత ప్రభుత్వ నిర్ణయం వెలువడటానికి ముందు ఉత్కంఠకు లోనైన కశ్మీర్‌లోని బీజేపీ ముస్లిం నాయకుడి మాట ఇది.
"నేను దిగ్భ్రాంతి చెందాను. ఇది ఎలా జరిగిందో అర్థం కాక కశ్మీరీలందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. కొంత కాలం గడిచాక, అగ్ని పర్వతం బద్దలు కానుందని అనిపిస్తోంది" అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అధికరణ 370 సవరణపై ఆగస్టు 5న కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రకటన చేయడానికి కొన్ని రోజుల ముందు నుంచి కశ్మీర్ లోయలో అనేక ఊహాగానాలు ఉన్నాయి.
జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని విభజిస్తారని, జమ్మూకశ్మీర్‌లో 'శాశ్వత నివాసితుల'ను నిర్వచించే ఆర్టికల్ 35ఏను రద్దు చేస్తారనే ఆందోళన కూడా కనిపించింది.
ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370లోని ప్రధాన నిబంధనలన్నీ రద్దుచేస్తారని అతికొద్ది మంది తప్ప ఎవరూ ఊహించలేదు.
బయటి నుంచి చూస్తే కశ్మీర్ లోయ ప్రశాంతంగానే కనిపిస్తోంది.
కొన్ని హింసాత్మక ఘటనలు తప్ప అంతటా శాంతి ఉందని ఒక సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.

రాజ్యాంగ నిపుణులు జాఫర్ షా బీబీసీతో మాట్లాడుతూ- కశ్మీర్‌పై భారత ప్రభుత్వ తాజా నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
"ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం. ఆర్టికల్ 35ఏ కేసు సుప్రీంకోర్టులో ఉంది. అంటే దీనిపై నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయొచ్చని అర్థం" అని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత ప్రభుత్వ నిర్ణయం దిగ్భ్రాంతికరమని, కశ్మీర్ భావి తరాలు దీనిని మరచిపోవని జాఫర్ షా చెప్పారు.
ప్రజాగ్రహం ఏ క్షణమైనా హింసాత్మక రూపం తీసుకోవచ్చని పోలీసు అధికారులు కూడా అంగీకరిస్తున్నారు.

ఔషధ దుకాణం నడిపే రషీద్ అలీ అనే స్థానికుడు బీబీసీతో మాట్లాడుతూ- "కశ్మీర్ లోయ అంతటినీ ఒక ఓపెన్ జైలుగా మార్చేశారు. నాయకులను గృహనిర్బంధంలో ఉంచారు. ప్రతి చోట పోలీసులను, భద్రతా దళాలను మోహరించారు. అంతటా కర్ఫ్యూ ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడం కష్టం. ఈ భద్రతా చర్యలన్నీ ఉపసంహరించాక జనం వీధుల్లోకి వస్తారు" అని చెప్పారు.
జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడంపై కశ్మీర్ లోయ ప్రజలు స్పందిస్తూ- "భారత్‌లో తెలంగాణ లాంటి కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేశారు. దీనికి భిన్నంగా జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను రద్దుచేశారు" అన్నారు.
మంగళవారం నేను శ్రీనగర్లో చాలా ప్రాంతాల్లో కలియ దిరిగాను. అడుగడుగునా భద్రతా దళాలను మోహరించారు. అన్ని ముఖ్యమైన భవనాల వెలుపల, రోడ్లపై బారికేడ్లు పెట్టారు.

శ్రీనగర్ యుద్ధక్షేత్రంలా ఉంది. దుకాణాలు, మార్కెట్లు మూసివేశారు. పాఠశాలలు, కళాశాలలను కూడా మూసి ఉంచారు. ప్రజలు కొన్ని రోజులకు సరిపడా నిత్యావసర సరకులను నిల్వ చేసుకొన్నారు. త్వరలో దుకాణాలు తిరిగి తెరవకపోతే, వీళ్లకు ఇబ్బందులు ఏర్పడొచ్చు.
టెలిఫోన్, మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ సేవలను నిలిపివేశారు. దిల్లీ నుంచి వచ్చిన నాలాంటి జర్నలిస్టులు ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లాలంటే చాలా కష్టంగా ఉంది.
రానున్న కొద్ది రోజుల్లో కర్ఫ్యూను సడలించడంగాని, టెలిఫోన్, మొబైల్ సేవలు పునరుద్ధరించడంగాని ఉండకపోవచ్చని ఒక సీనియర్ పోలీసు అధికారి మాతో చెప్పారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన జనం, కశ్మరీలతో బస్టాండ్లు కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఆగస్టు 6 సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి వందల మంది పర్యటకులు బస్సుల కోసం ఎదురుచూస్తూ కనిపిస్తున్నారు.
వారిని నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తగినన్ని బస్సులు లేకపోవడంపై పర్యటకులు నిరసన వ్యక్తంచేశారు.

బిహార్ వలస కూలీలు బస్సుల కోసం ఒక చోట నుంచి మరో చోటకు పరుగులు తీయడం కనిపించింది.
కశ్మీర్ లోయ నుంచి బయటకు వెళ్లిపోయేందుకు రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నామని వారు చెప్పారు.
"మేం రెండ్రోజులుగా తిండి కూడా తినలేదు. మొబైల్ సేవలు నిలిపివేయడంతో మా ఇళ్లకు ఫోన్ చేసి మాట్లాడలేకపోతున్నాం. నిస్పృహ కలుగుతోంది" అని వారిలో ఒక కూలీ ఆవేదన వ్యక్తంచేశాడు.

స్థానిక ప్రజలు మీడియాతో మాట్లాడటానికి ఇష్టపడటం లేదు.
మాట్లాడే ధైర్యం చేసిన కొందరు.. ప్రభుత్వ నిర్ణయం పట్ల వ్యతిరేకత వ్యక్తంచేశారు.
శ్రీనగర్ విమానాశ్రయం సమీపాన భద్రతా దళాల మధ్య నిలబడిన ఒక కశ్మీరీ యువకుడు- ప్రభుత్వ నిర్ణయాన్ని తాను అంగీకరించనని ధైర్యంగా చెప్పాడు.
కశ్మీర్‌లో మిలిటెన్సీ తీవ్రస్థాయిలో ఉందని, అందువల్ల కశ్మీరీయేతరులు ఇక్కడ స్థిరపడటానికిగాని, ఆస్తిని కొనడానికిగాని ధైర్యం చేయరని అతడు అభిప్రాయపడ్డాడు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీరీ పండితులు తమ నేలను వదిలి పారిపోయిన రోజు ఏం జరిగింది...
- ఆర్టికల్ 370 సవరణ: ‘కశ్మీర్‌లో అస్థిరత మరింత పెరిగే అవకాశం’
- కశ్మీర్ ప్రత్యేక హక్కును రద్దు చేయడం అక్రమం, రాజ్యాంగవిరుద్ధం: ఏజీ నూరాని
- ముంపులో 350 గ్రామాలు.. మూడు రాష్ట్రాల మధ్య ఆగిపోయిన రాకపోకలు
- కశ్మీర్: ‘40 ఏళ్ల నుంచీ ఇక్కడే ఉంటున్నా.. ఇప్పుడు సొంత భూమి కొనుక్కోవచ్చంటున్నారు’: బీబీసీతో ధాబా యజమాని
- వీజీ సిద్ధార్థ: ఆ సంభాషణే కాఫీ కింగ్‌ను 'కాఫీ డే' వ్యాపారంలోకి నడిపించింది
- ప్రభుత్వ హాస్టల్లో మూడో తరగతి విద్యార్థి హత్య... నిందితుడు పదో తరగతి బాలుడు
- సుష్మా స్వరాజ్‌తో నవాజ్ షరీఫ్ తల్లి: 'నువ్వు మన రెండు దేశాల సంబంధాల్ని బాగు చేస్తానని నాకు మాటివ్వు'
- అరటి పళ్లపై జీఎస్టీ ఎంత? రెస్టారెంట్లలో తింటే దేనికి పన్ను కట్టాలి? దేనికి అక్కర్లేదు?
- Man vs Wild: డిస్కవరీ చానల్ షోలో బియర్ గ్రిల్స్‌తో ప్రధాని మోదీ అరణ్యయాత్ర
- విమానం ఎగిరేముందు చక్రాల చాటున దాక్కున్నాడు, పైనుంచి కిందపడి మరణించాడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








