ప్రభుత్వ హాస్టల్‌లో మూడో తరగతి విద్యార్థి హత్య... నిందితుడు పదో తరగతి బాలుడు

ప్రభుత్వ సంక్షేమ వసతిగృహంలో విద్యార్థుల మధ్య చోటుచేసుకున్న చిన్న వివాదం చివరకు ఎనిమిదేళ్ల బాలుడి హత్యకు దారితీసింది.
ఈ ఘటనలో నిందితుడు అదే హాస్టల్‌లో ఉండే పదో తరగతి విద్యార్థి.
పెన్సిల్ చెక్కుకోవడానికి ఉపయోగించే చిన్న చాకుతో గొంతు కోసి హత్య చేయడం అందరినీ కలవరపరుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా చల్లపల్లి బీసీ సంక్షేమ వసతిగృహంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
హత్యకు గురైన బాలుడి ఇల్లు హాస్టల్‌కు సమీపంలోనే ఉంటుంది. మృతుడికి ఓ అన్నయ్య, ఇద్దరు అక్కచెల్లెళ్లు ఉన్నారు.
నలుగురు సంతానం కావడంతో అతడి తల్లిదండ్రులు ఇద్దరు కుమారులను ఇంటికి సమీపంలోనే ఉన్న హాస్టల్‌లో ఉంచి చదివిస్తున్నారు.
మృతిచెందిన బాలుడు మూడో తరగతి చదువుతున్నాడు. అతడి అన్నయ్య కూడా ఇదే హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
దుస్తులు ఉతికే సమయంలో వివాదం
వారం కిందట దుస్తులు ఉతికే సమయంలో పదో తరగతి చదివే ఓ విద్యార్థితో వివాదం జరిగినట్టు హాస్టల్ సిబ్బంది చెబుతున్నారు.
ఆ సమయంలో మాటామాటా పెరగడంతో వారి తగాదా ముదిరిందని.. ఆ కోపంతోనే పదో తరగతి విద్యార్థి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని చెబుతున్నారు.
ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అవనిగడ్డ డీఎస్పీ రమేష్ రెడ్డి బీబీసీతో మాట్లాడారు. ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగినప్పుడు ఇద్దరూ బూతులు తిట్టుకున్నారని.. తనకంటే చిన్నవాడైన విద్యార్థి తనను దూషించడంతో తట్టుకోలేక పదో తరగతి విద్యార్థి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెప్పారు.
సోమవారం అర్థరాత్రి సమయంలో హాస్టల్‌లో ఉన్న బాత్ రూమ్ వద్దకు తీసుకెళ్లి హత్య చేసినట్టు అంగీకరించాడని చెప్పారు.
హత్య చేయడానికి ఉపయోగించిన చాకు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా హత్యకు పాల్పడిన బాలుడి తండ్రి గతంలో పలు నేరాల్లో జైలుకి వెళ్లాడు. ఆ ప్రభావం బాలుడిపై ఉండొచ్చని డీఎస్పీ తెలిపారు.
పోలీస్ జాగిలాలు పట్టిచ్చాయి..
మంగళవారం ఉదయం బాలుడు కనిపించకపోవడంతో తొలుత హాస్టల్‌లో కలకలం రేగింది. ఆ తరువాత కొద్దిసేపటికే తోటి విద్యార్థులకు అతడి బాత్‌రూమ్‌లో రక్తపు మడుగులో బాలుడి మృతదేహం కనిపించింది.
దీంతో వాచ్‌మన్ నాగబాబు ఈ విషయాన్ని పైఅధికారులకు, పోలీసులకు తెలియజేశారు. దాంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పోలీస్ జాగిలాలు పూర్తిగా హాస్టల్ గదుల వద్దే తిరుగుతూ నిందితుడి గది వద్దకు వెళ్లాయి. ఆ గదిలోని విద్యార్థుల సామగ్రిని పరిశీలించగా ఓ సూట్‌కేసులో రక్తపు మరకలతో ఉన్న చొక్కా దొరకడంతో.. ఆ బాలుడిని విచారించగా వాస్తవం బయటపడింది. పదో తరగతి చదివే ఆ బాలుడు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు.

'కొత్త బట్టలు ఇచ్చి పంపించాను.. ఇంతలోనే ఈ దారుణం'
ఆదివారం తన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు కొత్త బట్టలు కొనిచ్చానని హతుడి తల్లి కుమారుడిని గుర్తుచేసుకుని కన్నీరుమున్నీరవుతోంది.
సంక్షేమ శాఖ హాస్టళ్లలో పరిస్థితులు సరిగా లేవని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వసతి గృహాల్లో పర్యవేక్షణ కరవైందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పవన్ కుమార్ బీబీసీతో అన్నారు.
''ఒక్క కృష్ణా జిల్లాలోనే 30 హాస్టళ్లు మూసివేశారు. ఆ సిబ్బందికి ఇతర విధులు అప్పగించారు. హత్య జరిగిన చల్లపల్లి బీసీ హాస్టల్‌లో వార్డెన్ లేరు. మూడు నాలుగు హాస్టళ్లకు కలిపి ఇంచార్జిని నియమించడంతో ఏ హాస్టల్‌లోనూ పూర్తిగా పనిచేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. దాంతో విద్యార్థులపై నియంత్రణ ఉండడం లేదు. మొబైల్ ఫోన్లు వాడుతూ చాలామంది పెడదారి పడుతున్నారు. ఒక్క చల్లపల్లిలోనే మూడు ఎస్సీ హాస్టళ్లు మూసివేశారు. ఇక్కడున్న ఏకైక బీసీ హాస్టల్‌లో ఏడుగురు సిబ్బంది ఉండాలి కానీ, ముగ్గురే పనిచేస్తున్నారు. సిబ్బంది తగినంతమంది లేకుంటే పర్యవేక్షణ ఎలా సాధ్యం' అని ఆయన ప్రశ్నించారు.
తాత్కాలికంగా విద్యార్థుల తరలింపు
వసతిగృహంలో సహ విద్యార్థి హత్యకు గురికావడంతో మిగతావారంతా భయభ్రాంతులకు లోనయ్యారు.
59 మంది విద్యార్థులున్న ఆ హాస్టల్‌లోని మిగతా విద్యార్థులను సమీపంలోని మొవ్వ హాస్టల్ కి తరలించారు.
ఇవి కూడా చదవండి:
- జమ్మూకశ్మీర్ LIVE: జమ్ము-కశ్మీర్ పునర్విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- ఆర్టికల్ 370 సవరణ: ‘ఇక భారతీయులంతా కశ్మీర్లో భూమి కొనుక్కోవచ్చు’
- చైనా ఆట కట్టించాలంటే భారత్ ఏం చేయాలి
- కశ్మీరీ పండిట్లు: 'ఎన్నో మరణాలు, రక్తపాతాలు చూశాం. కానీ, ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు'
- ఆర్టికల్ 370 సవరణ: ‘కశ్మీర్లో అస్థిరత మరింత పెరిగే అవకాశం’
- కశ్మీర్ ప్రత్యేక హక్కును రద్దు చేయడం అక్రమం, రాజ్యాంగవిరుద్ధం: ఏజీ నూరాని
- 'ఆర్టికల్ 370 సవరణ': 'ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








