కశ్మీర్: ‘40 ఏళ్ల నుంచీ ఇక్కడే ఉంటున్నా.. ఇప్పుడు సొంత భూమి కొనుక్కోవచ్చంటున్నారు’: బీబీసీతో ధాబా యజమాని

జమ్మూ కశ్మీర్

ఫొటో సోర్స్, AFP/getty images

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని తొలగించి, ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేశాక కశ్మీర్‌కు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

అక్కడున్న అన్ని ఫోన్ లైన్లు, ఇంటర్నెట్ స్తంభించాయి. వరసగా రెండో రోజూ కశ్మీర్‌లో లాక్‌డౌన్ కొనసాగుతోంది.

కశ్మీర్‌లోని స్కూళ్లు, వ్యాపార సంస్థలు కూడా మూతబడ్డాయి. రహదారులపై వేల సంఖ్యలో సైనికులు గస్తీ కాస్తున్నారు. స్థానిక నేతలను అదుపులోకి తీసుకున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో కశ్మీర్‌లోని ఒక ప్రాంతంలో 1980 నుంచి దాబా నడుపుతున్న ఒక బిహార్‌ వ్యక్తితో బీబీసీ మాట్లాడింది.

కశ్మీర్లో కర్ఫ్యూ
ఫొటో క్యాప్షన్, శ్రీనగర్ సమీపంలో ధాబా నడిపే ఒక బిహారీ బీబీసీకి అక్కడి పరిస్థితి వివరించారు

అక్కడ పరిస్థితి అతడి మాటల్లోనే...

నేను బిహారీని, 1980వ దశకం నుంచీ కశ్మీర్‌లోని ఈ ప్రాంతంలో ధాబా నడుపుతున్నాను.

నా ధాబాలో తినడానికి సైనికులతోపాటు, సామాన్యులు కూడా వస్తుంటారు.

నేను 1990లో మిలిటెన్సీని కూడా చూశాను. కానీ ఇలాంటి పరిస్థితిని మాత్రం ఎప్పుడూ చూళ్లేదు.

శ్రీనగర్ దగ్గర నేనున్న ప్రాంతంలో పరిస్థితులు నగరంలో కంటే కాస్త మెరుగ్గా ఉన్నాయి. ఇక్కడ సైనికులను చాలా భారీగా మోహరించారు.

కానీ నగరంలో దిగువ ప్రాంతాల్లో ఉద్రిక్తంగా ఉంది. పరిస్థితి ఘోరంగా ఉంది. అన్నీ మూసేశారు. అక్కడ ఏం జరుగుతోందో ఏం తెలీడం లేదు.

ఇక్కడ కరెంటు ఉంది. కమ్యూనికేషన్ మాత్రం కట్ చేశారు. నేను న్యూస్ కూడా చూళ్లేకపోతున్నా.

కశ్మీర్లో కర్ఫ్యూ

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, జమ్ము-కశ్మీర్లో పనులకు వచ్చినవారు తిరిగి వెళ్లిపోతున్నారు

పనులకు వచ్చినవారు వెనక్కు వెళ్తున్నారు...

మొదట్లో కశ్మీర్ పరిస్థితి చాలా మెరుగ్గా ఉండేది. కానీ ఇప్పుడు అన్నీ మూతపడ్డాయి. పనులు ఆగిపోయాయి.

బయటి నుంచి పనులకు వచ్చిన వాళ్లంతా వెనక్కు వెళ్లిపోతున్నారు. వాళ్ల నుంచి ఎలాంటి రవాణా చార్జీలు కూడా తీసుకోవడం లేదని తెలిసింది.

నా ధాబాలో తినడానికి ఇప్పుడు ఎక్కువగా జవాన్లే వస్తున్నారు. సామాన్యులెవరూ రావడం లేదు.

1990వ దశకంలో పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నప్పుడు కూడా నాకు ఇక్కడ ఎలాంటి సమస్యా రాలేదు.

ఇక్కడ కశ్మీరీలు నాతో చాలా బాగా ప్రవర్తిస్తారు. అందరూ బాగా మాట్లాడుతారు. కానీ ఇప్పుడు పరిస్థితి భయంభయంగా ఉంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో ఉద్రిక్తంగా ఉంది.

370ని రద్దు చేసిన తర్వాత కొంతమంది కశ్మీరీ స్నేహితులు నాతో సరదాగా "మీరిప్పుడు ఇక్కడ మీకోసం సొంత భూమి కూడా కొనుక్కోవచ్చు" అని అంటున్నారు.

నేను 40 ఏళ్ల నుంచీ ఇక్కడే ఉంటున్నా. ముందు ముందు పరిస్థితులు ఎలా ఉన్నా, నేను ఇక్కడే ఉండాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)