కశ్మీర్‌లో ఇళ్లకు భారత సైన్యం నిప్పు పెట్టిందనే సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత...- Fact Check

ఫొటో సోర్స్, SM Viral Post
- రచయిత, ఫ్యాక్ట్‌చెక్ బృందం
- హోదా, బీబీసీ న్యూస్
కశ్మీర్‌లోని బందీపోరా ప్రాంతంలో కొన్ని ఇళ్లను భారత సైన్యం తగలబెట్టిందన్న క్యాప్షన్‌తో ఓ వీడియోను సోషల్ మీడియాలో పెద్దఎత్తున షేర్ చేస్తున్నారు.
75 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోకు ఫేస్‌బుక్‌లో మూడు లక్షలకు పైగా వ్యూస్, 10 వేలకు పైగా షేర్లు వచ్చాయి.
అయితే, అది బూటకమని మా పరిశీలనలో వెల్లడైంది. ఆ వీడియో ఇప్పటిది కాదు, ఏడాదిన్నర క్రితం తీసినట్లుగా తేలింది.
కశ్మీర్ కేంద్రంగా పనిచేసే 'రైజింగ్ కశ్మీర్', 'కశ్మీర్ అబ్జర్వర్' అనే వెబ్‌సైట్లు ప్రచురించిన కథనాల ప్రకారం, ఆ వీడియో 2018 మార్చి 27న జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా లాచిపోరా గ్రామంలో జరిగిన ఘటనకు సంబంధించింది.
అప్పట్లో ఆ గ్రామంలోని నాలుగు ఇళ్లలో మంటలు చెలరేగాయి. ఆ ప్రమాదంతో ఏడు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 20 పశువులు మంటల్లో కాలి చనిపోయాయి.

ఫొటో సోర్స్, Rising Kashmir
మరిన్ని నకిలీ వార్తలు
ఆర్టికల్ 370ని సవరిస్తున్నట్లు రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటన చేయకముందు నుంచే ముందు జాగ్రత్తగా జమ్మూకశ్మీర్‌లో ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూసేందుకు వేలాది మంది భద్రతా బలగాలను మోహరించింది.
అమర్‌నాథ్ యాత్రికులను, పర్యాటకులను తక్షణమే జమ్మూకశ్మీర్ వదిలి వెనక్కి వెళ్లిపోవాలంటూ సూచించింది. దాంతో, ఏం జరగబోతోందన్న ఉత్కంఠ అందరిలోనూ ఏర్పడింది.
ఈ సమయంలోనే జమ్మూకశ్మీర్ గురించి అనేకరకాల పుకార్లు, వదంతులు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వ్యాప్తిచెందాయి.

ఫొటో సోర్స్, Twitter
కశ్మీరీ జెండాను తొలగించారా?
శ్రీనగర్‌లోని జమ్మూకశ్మీర్ ప్రభుత్వ సచివాలయ భవనం మీది నుంచి కశ్మీరీ జెండాను తొలగించారంటూ ఒక ఫొటోను మితవాద అనుకూల ఫేస్‌బుక్ గ్రూపుల్లో పెద్దఎత్తున షేర్ చేస్తున్నారు.
అయితే, ఆ ఫొటో 2016లో తీసినదిగా మా పరిశీలనలో వెల్లడైంది.
పాత ఫొటోను ఎడిట్ చేసి కశ్మీరీ జెండాను తొలగించారు. ఆ భవనం మీద త్రివర్ణ పతాకం మాత్రమే ఎగురుగుతున్నట్లుగా చేశారు.
ఈ ఫొటోను చూస్తే మార్ఫింగ్ చేసిందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడి రెండు చిత్రాలను చూస్తే జెండాలు తప్పించి అంతా ఒకేలా ఉన్నాయి.

ఫొటో సోర్స్, ANI
సచివాలయం భవనం మీద ఇంతకుముందటి లాగే ఇప్పుడు కూడా రెండు జెండాలు ఎగురుతున్నాయని ఏఎన్‌ఐ వార్తా సంస్థతో పాటు మాజీ ఐఏఎస్ అధికారి షా ఫైజల్, కశ్మీర్ బీజేపీ అధికార ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్ ఇద్దరూ ధ్రువీకరించారు.

ఫొటో సోర్స్, SM Viral Post
పోలీసులు లాఠీఛార్జ్ చేశారా?
ఓ ముస్లిం వ్యక్తిని పోలీసులు కొడుతున్నట్లుగా ఉన్న వీడియోను సోషల్ మీడియాలో అనేక మంది షేర్ చేశారు. నిరసనకారుల మీద, రాళ్లు రువ్వుతున్న వారి మీద జమ్మూకశ్మీర్ పోలీసులు లాఠీఛార్జ్ ప్రారంభించారని ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టారు.
"ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఎ రద్దు తర్వాత కశ్మీర్‌లో ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది" అంటూ క్యాప్షన్ పెట్టి ఫేస్‌బుక్ గ్రూపుల్లో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
కానీ, అందులో నిజం లేదు. అది ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ టూల్ ద్వారా పరిశోధించినప్పుడు ఈ వీడియో 2015లో బిహార్ రాజధాని పట్నాలో గార్దానిబాఘ్ మైదానం దగ్గర జరిగిన ఘటనకు సంబంధించిందిగా తేలింది.
అప్పటి మీడియా కథనాల ప్రకారం, బిహార్‌లోని 2,400 మదర్సాలలో సౌకర్యాలను మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. వారంతా నినాదాలు చేస్తూ మైదానం నుంచి బయటకు రాగానే పోలీసులు లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు.
ముఖ్యమంత్రి నివాసం వద్దకు వెళ్లేందుకు నిసనకారులు ప్రయత్నించడంతో తాము లాఠీఛార్జ్ చేయాల్సివచ్చిందని పోలీసులు వివరణ ఇచ్చారు.

ఫొటో సోర్స్, Viral Video Grab
పాకిస్తాన్‌లో ఫేక్ న్యూస్
కశ్మీర్ వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీకి సంబంధించిన ఒక వీడియోను పాకిస్తాన్‌లో పెద్దఎత్తున షేర్ చేస్తున్నారు. "ఆర్టికల్ 370 రద్దుకు ముందు భారత ప్రభుత్వం గిలానీని ఎలా జైలులో పెట్టిందో చూడండి" అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ పెడుతున్నారు.
ఈ వీడియోలో "తలుపు తెరవండి. భారత ప్రజాస్వామ్య అంత్యక్రియల్లో నేను పాల్గొనాలి" అని గిలానీ అంటున్నట్లుగా ఉంది.
అయితే, ఈ వీడియోకు ప్రస్తుత పరిణామాలకు ఎలాంటి సంబంధం లేదని మా పరిశీలనలో తేలింది. ఇది 2018 ఏప్రిల్‌లో తీసినది.

ఫొటో సోర్స్, Twitter
స్థానిక మీడియా కథనాల ప్రకారం, జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో 2018 ఏప్రిల్‌లో మూడు భారీ ఎన్‌కౌంటర్లు జరిగిన తర్వాత నిరసన ర్యాలీ తీయాలంటూ గిలానీ ఇతర వేర్పాటువాద నాయకులకు పిలుపునిచ్చారు.
అయితే, ర్యాలీ ప్రారంభానికి ముందు గిలానీని భారత సైన్యం గృహనిర్బంధం చేసింది. ఆయన ఇంట్లో ఉండగా తీసిన వీడియో అది.
(ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.)
ఇవి కూడా చదవండి:
- కేంద్ర పాలిత ప్రాంతం అంటే ఏమిటి.. యూటీలు ఎన్ని రకాలు.. వాటి అధికారాలేమిటి?
- 'కశ్మీర్‌లో యథాతథ స్థితిని కొనసాగించాలి... లద్దాఖ్‌ను యూటీ చేయడాన్ని మేం ఆమోదించం' - చైనా
- Fact Check: ముస్లింలు ఓటు వేయకుండా పోలీసులు లాఠీచార్జి చేశారనే ప్రచారంలో నిజమెంత...
- BBC Fact Check: ఇందిరా గాంధీని వాజ్‌పేయీ 'దుర్గా' అని పిలిచేవారా...
- 1967 యుద్ధం: అరబ్ నేలను నాశనం చేసిన ఆ ఆరు రోజుల్లో ఏం జరిగింది?
- భారత్‌తో యుద్ధానికి ముందే ప్లాన్ వేసిన మావో?
- బ్యాంకు ఖాతాలు: ఈ దేశాల్లో మగవారి కన్నా ఆడవారికే ఎక్కువ
- వాజ్‌పేయి మాటల్ని నెహ్రూ ఎందుకంత శ్రద్ధగా వినేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








