ముస్లింలు ఓటు వేయకుండా పోలీసులు లాఠీచార్జి చేశారనే ప్రచారంలో నిజమెంత? - Fact Check

పోలీసుల లాఠీచార్జ్

ఫొటో సోర్స్, Screen Grab

    • రచయిత, ఫ్యాక్ట్‌చెక్ బృందం
    • హోదా, బీబీసీ న్యూస్

ఎన్నికల వేళ పోలీసులు లాఠీచార్జి చేసి ముస్లింలను ఓటు వేయకుండా అడ్డుకున్నారని ఓ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.

ఆ వీడియోపై ''ముస్లింలు ఓటు వేయకుండా మోదీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్, శివసేన అడ్డుకుంటున్నాయి. మీడియా దీన్ని ప్రసారం చేయడం లేదు. అందువల్ల దయచేసి ఈ వీడియో షేర్ చేయండి. మోదీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ మీద కచ్చితంగా చర్యలు తీసుకోవాలి'' అని ఉంది.

ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో ఈ వీడియో వేలసంఖ్యలో షేర్ అయింది.

"OSIX MEDIA" పేరుతో ఉన్న ఫేస్‌బుక్ పేజీలో ''ఓడిపోతామనే నిరాశతో ఎన్డీయే కూటమి ఇలాంటి ఉపాయాలు పన్నుతోంది. ముస్లింలను ఓటు వేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. మోదీ ప్రభుత్వం, ఆర్‌ఎస్ఎస్, శివసేన కార్యకర్తలు... మహిళలు, పిల్లలను కొడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మీ బాధ్యత నిర్వహించండి'' అంటూ ఈ వీడియోను షేర్ చేశారు.

మా ప్రేక్షకులు కూడా ఈ వీడియో విశ్వసనీయత తెలుసుకునేందుకు మాకు వాట్సాప్ చేశారు.

వాట్సాప్

ఈ వీడియోలో చూపించినట్లు ముస్లింలను ఓటువేయకుండా పోలీసులు అడ్డుకున్నారనేది వాస్తవం కాదని మా పరిశీలనలో గుర్తించాం.

ఈ వీడియోలోని వాస్తవం ఏమిటి?

రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ప్రయత్నిస్తే ఈ వీడియోకు సంబంధించిన అనేక వార్తా కథనాలు కనిపించాయి.

1 ఏప్రిల్, 2019న ప్రచురితమైన వార్త ప్రకారం ఈ వీడియో గుజరాత్‌లోని వీర్గామ్ ప్రాంతానికి చెందినదని తేలింది.

అక్కడ ముస్లింల స్మశాన వాటిక గోడపై ఓ మహిళ ఉతికిన బట్టలు ఆరేయడానికి ప్రయత్నించగా కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు.

స్క్రీన్ షాట్

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు అహ్మదాబాద్ రూరల్ ఎస్పీ ఆర్పీ అసారీతో బీబీసీ మాట్లాడింది.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ, '' ఈ వీడియో పాతది. 31 మార్చి 2019లో వీర్గామ్ పట్టణంలో ఠాకూర్లు, ముస్లింల మధ్య గొడవ జరిగింది. స్మశానవాటిక గోడ మీద ఒక మతానికి చెందిన మహిళ బట్టలు ఆరేయడానికి ప్రయత్నించడంతో మరో మతానికి చెందినవారు అభ్యంతరం చెప్పారు. దీంతో రెండు వర్గాల మధ్య గొడవ మొదలై హింసకు దారితీసింది'' అని తెలిపారు.

''పోలీసులు అక్కడికి చేరుకోగానే ఒక వర్గానికి చెందిన వారు రాళ్లురువ్వడం మొదలుపెట్టారు. నేరస్థులను పోలీసులు పట్టుకున్నారు. ఈ వీడియోను వక్రీకరిస్తూ షేర్ చేస్తున్నవారిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు ఈ వీడియోకు ఎలాంటి సంబంధం లేదు'' అని పేర్కొన్నారు.

(ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)