టీడీపీ ఎమ్మెల్సీ కుమారుడు ఎస్‌ఐపై దాడి చేశాడన్న వీడియోలో నిజమెంత? :FactCheck

ఫొటో సోర్స్, Hirdesh Kumar
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ టీం
- హోదా, బీబీసీ
ఆరోపణ: టీడీపీ ఎమ్మెల్సీ కుమారుడు ఎస్‌ఐపై దాడి చేశాడన్న వీడియోలో నిజమెంత?
బీబీసీ అధ్యయనం: అవాస్తవం
కొందరు మగవాళ్లు.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక పోలీసుపై దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ కుమారుడిని తనిఖీ చేసినందుకు ఆ ఎస్ఐపై దాడి చేశారంటూ ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నారు.
''ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్సీ కుమారుడి కారును తనిఖీ చేసినందుకు, ఒక ఎస్ఐని ఇలా శిక్షించారు. పోలీస్ యూనిఫారంలో ఉన్న ఈ పోలీసును ఎమ్మెల్సీ కుమారుడి కాళ్లు పట్టుకునేలా చేశారు. ఈ మెసేజ్‌ను ప్రచారం చేయకపోతే, మనకు సిగ్గు చేటు. వీలయినంత ఎక్కువగా ఈ వీడియోను షేర్ చేయండి'' అన్న క్యాప్షన్ కూడా వీడియోతోపాటు పోస్ట్ చేశారు.
1:30నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో, కొందరు వ్యక్తులు ఒక పోలీసును దుర్భాషలాడుతూ, చేయిచేసుకుంటూ కనిపిస్తారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో వేల వ్యూస్, షేర్లు వచ్చాయి.

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో సోర్స్, FACEBOOK
కానీ ఈ ఆరోపణలు తప్పుదారి పట్టించేవి అని మా అధ్యయనంలో తేలింది.
వీడియో వెనుక అసలు కథ
రివర్స్ ఇమెజ్ సెర్చ్ ద్వారా, ఈ వీడియో 2018 ఆగస్టులోనిది అని తేలింది. కర్నూలు జిల్లాలోని నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్టు ప్రాంతంలోని సున్నిపెంటలో జరిగిన సంఘటనకు చెందిన వీడియో ఇది.
మీడియా కథనాల ప్రకారం, వీడియోలో దెబ్బలు తింటున్న వ్యక్తి, పోలీసు కాదు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. అతని పేరు జ్యోతి స్వరూప్. ఆరోజు రాత్రి జ్యోతి స్వరూప్ ప్యాట్రోలింగ్‌లో ఉన్నారు.
విధి నిర్వహణలో భాగంగా, మద్యం మత్తులో గొడవ చేస్తున్న కొందరు వ్యక్తులను అక్కడినుంచి వెళ్లిపోవలసిందిగా జ్యోతి స్వరూప్ పదేపదే చెప్పారు. మాటా మాటా పెరిగి గొడవకు దారితీసింది.
http://www.newindianexpress.com/states/andhra-pradesh/2018/aug/16/andhra-pradesh-drunk-men-beat-up-forest-official-for-ruining-party-1858526.html
రాజకీయ పార్టీతో సంబంధం ఏమిటి?
మొదట్లో ఈ వీడియో.. ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కుమారుడు ఒక ఎస్ఐపై దాడి చేశాడంటూ వైరల్ అయ్యింది. చౌకీదార్ మహేష్ విక్రమ్ హెగ్డే ఈ వీడియోను ట్వీట్ చేసి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కుమారుడిపై ఈ ఆరోపణలు చేశారు.

ఫొటో సోర్స్, TWITTER
కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులకు ఇటు టీడీపీకి, అటు కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదు. భారత అటవీ అధికారి దీపక్ బాజ్‌పాయ్ ఈ సంఘటనపై తన అధికారిక ట్విటర్ హ్యాండిల్‌లో స్పష్టత ఇచ్చారు.
''అతను అటవీ శాఖ సిబ్బంది. కొందరు వ్యక్తులు, తమ కారు ఒక ఎమ్మెల్సీ కుమారుడిదని మోసం చేయడానికి ప్రయత్నించారు. వారందరినీ అరెస్టు చేశాం'' అని ఆమె పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, TWITTER
(ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.)
ఇవి కూడా చదవండి
- ప్రెస్ ఫ్రీడమ్ డే: 'జర్నలిస్ట్ అయిన మా అమ్మను చంపేశారు...'
- సుబ్బయ్య హోటల్: "34 రకాల పదార్థాలు.. కొసరి కొసరి వడ్డించి, తినే వరకూ వదిలిపెట్టరు"
- దళితుడు ఖరీదైన కారులో వెళ్లినందుకు బీజేపీ ఎమ్మెల్యే మనుషులు దాడి చేశారా...
- బీరు తాగితే చల్లదనం వస్తుందా?
- సోషల్ మీడియాపై శ్రీలంక నిషేధం: మంచిదేనా? ప్రజలు ఏమనుకొంటున్నారు?
- మసూద్ అజర్ విషయంలో చైనా ఎందుకు పట్టు సడలించింది
- ప్రెస్ ఫ్రీడమ్ డే: 'జర్నలిస్ట్ అయిన మా అమ్మను చంపేశారు...'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









