ప్రెస్ ఫ్రీడమ్ డే: 'జర్నలిస్ట్ అయిన మా అమ్మను చంపేశారు... ప్రభుత్వ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు'.

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, మాథ్యూ కరువానా గలీచియా
- హోదా, బీబీసీ కోసం
రెండు మూడు నెలలకోసారి నేను మా అమ్మ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న వ్యక్తితో కలిసి ఒక గదిలో కూచుంటాను.
ఆరేళ్ల క్రితం మా అమ్మను అరెస్ట్ చేయడానికి మా ఇంటికి వచ్చినపుడు, ఆయనను మా కుటుంబం మొదటిసారి చూసింది.
మాల్టాలో ఎన్నికల రోజు ప్రధానిగా పోటీ చేసిన అభ్యర్థిపై మా అమ్మ ఒక వ్యంగ్య కథనాన్ని బ్లాగులో ప్రచురించారు. ఆయన మద్దతుదారుల్లో ఒకరు ఆమె మీద పోలీసు కేసు పెట్టారు.
దాంతో, మా అమ్మను అరెస్టు చేయడానికి అర్థరాత్రి అరెస్టు వారెంటుతో ఒక పోలీసును ఇంటికి వచ్చారు. ఆమె చేసింది చట్టవిరుద్ధం అని చెప్పారు.
నేను ప్రపంచానికి ఇంకో వైపు పనిచేస్తుంటాను. రాత్రి 1.30 గంటలకు మా నాన్న చొక్కా వేసుకున్న మా అమ్మ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్న వీడియోలను కొందరు నాకు పంపించారు.
కొన్ని గంటల తర్వాత ఆమె మళ్లీ ఆన్‌లైన్లోకి వచ్చారు. ఈ వేధింపుల గురించి తన వెబ్‌సైట్‌లో రాశారు.
వాటి మధ్యలో కొత్త ప్రధాని అభద్రతాభావంపై విరుచుకుపడ్డారు. తను ఆ సమయంలో అలా కనిపించడం గురించి కూడా సరదాగా రాశారు.
"నేను అలా గందరగోళంగా కనిపించినందుకు క్షమించండి. నరహంతక దళం మనల్ని అరెస్ట్ చేయడానికి అర్థరాత్రి మన ఇంట్లో అడుగుపెట్టినప్పుడు... తల దువ్వుకోవడం, పౌడర్ అద్దుకోవడం, బట్టలు సెలక్ట్ చేసుకోవడం లాంటివి గుర్తుకురావు " అని రాశారు.
ఆరోజు మా అమ్మను అరెస్ట్ చేసిన అదే అధికారి, ఇప్పుడు ఆమె హత్య కేసు విచారణకు ఇంచార్జిగా ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కారు బాంబు పేల్చి చంపేశారు
మా అమ్మ డఫ్ని కరువానా గలీచియా ఒక మంత్రి ఫ్రీజ్ చేయించిన తన అకౌంటును మళ్లీ తెరిపించేందుకు బ్యాంకుకు వెళ్లారు. అదే రోజు ఆమె హత్య జరిగింది.
ఆమె అప్పుడే 53వ పడిలోకి అడుగు పెట్టారు. 30 ఏళ్ల జర్నలిజం కెరీర్లో మంచి ఉచ్ఛ స్థితిలో ఉన్నారు.
అరకిలో టీఎన్‌టీని ఒక డివైస్‌లో ప్యాక్ చేసి ఆమె కారు కింద పెట్టారు. దానిని రిమోట్‌తో పేల్చేశారు.
ఆమె హత్యకు గురైనపుడు ప్రభుత్వ మద్దతుదారులు బహిరంగంగా సంబరాలు చేసుకున్నారు.
నాకు అప్పుడు టర్కీ-అమెరికా వార్తాపత్రిక ఎడిటర్ హ్రంట్ డింక్‌ను కాల్పిచంపినపుడు సంబరాలు చేసుకున్నవారు గుర్తొచ్చారు.
కొందరు వ్యంగ్యంగా "నేనే ఆ హత్యకు ప్లాన్ చేశానని" అన్నారు, ఇంకొందరు "మా అమ్మ సంతోషంగా తన ప్రాణానికి ముప్పు తెచ్చుకుందని" అన్నారు.
సిరియాలో మిలిటెంట్ల చేతుల్లో బందీ అయి ప్రాణాలు పోగొట్టుకున్న అమెరికా ప్రతినిధి జేమ్స్ ఫోలీపై వచ్చినట్లు అలాంటి అపవాదులే వేశారు.

డఫ్నికరువానా గలీచియా హత్య
అక్టోబర్ 2017 ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ డఫ్ని కరువానా గలీచియాను కారు బాంబుతో హత్య చేశారు.
ప్రధాని జోసెఫ్ ముస్కట్ ఈ హత్య 'అనాగరికం' అన్నారు. విషాదంలో ఉన్న ఆమె కుటుంబం అంత్యక్రియలకు మాల్టా నేతలు రాకుండా అడ్డుకుంది.
డిసెంబర్ 2017లో ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. విచారణలో ఆమె హత్యకు కిరాయి హంతకులను ఉపయోగించినట్టు చెప్పారు.
డఫ్ని కరువానా గలీచియా చేసిన అవినీతి ఆరోపణలపై జులై 2018న మాల్టా ప్రభుత్వం మేజిస్ట్రేట్ నేతృత్వంలో ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. అది దేశ ప్రధాని, ఆయన భార్యకు క్లీన్ చిట్ ఇచ్చింది.
ఆగస్టు 2018 డఫ్నే కారున గలీచియా హత్యను ప్రభుత్వం ముందే అడ్డుకుని ఉండచ్చని ఆమె కుటుంబం ఆరోపించింది. ఈ కేసు పూర్తి స్థాయి విచారణకు డిమాండ్ చేసింది.

ఈ హత్యలకు అంత ప్రాధాన్యం ఎందుకు?
మేం ఆ విషాదం నుంచి ఇంకా కోలుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు నా సోదరుడు ఐరోపా దౌత్యవేత్తల సమావేశంలో మాట్లాడుతూ, "జర్నలిస్టులు స్వతంత్రంగా పనిచేసే వాతావరణం, వాస్తవాలు, అభిప్రాయాలు నిరాటంకంగా ప్రవహించే పరిస్థితులు న్యాయబద్ధమైన, స్వేచ్ఛతో కూడిన సమాజాలను సృష్టిస్తాయి" అని అన్నారు.
"అలాంటి వాతావరణం సంపన్నమైన, ధృఢమైన... మరీ ముఖ్యంగా జీవన యోగ్యమైన సమాజాలను సృష్టిస్తుంది."
మా అమ్మ హత్యకు గురైన తరువాత ప్రజల నుంచి వెల్లువెత్తిన మద్దతే మాకు చీకటిలో కాంతిరేఖలా కనిపించింది. అన్ని వర్గాల ప్రజల నుంచి ఆమె హత్య పట్ల బాధ, పశ్చాత్తాపం వ్యక్తం కావడం మాకు ధైర్యాన్నిచ్చింది.
అప్పుడు నాకు "మంచి వారు అన్నిచోట్లా ఉంటారు. మనం వాళ్లను గుర్తించాలి" అని ఒకసారి నా స్నేహితుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.
సమాజంలో జీవించాలనే కోరిక స్వేచ్ఛగా బహిరంగంగా ఉండాలి. అక్కడ అందరికీ న్యాయం ఒకేలా ఉండాలి, మనుషుల హక్కులను గౌరవించాలి. కానీ అలాంటి చాలా కోరికలు చల్లారిపోతున్నాయి.
కొంతమంది చెడ్డవాళ్లు ఉంటారని మనం గుర్తించేలోపే సమయం మించిపోతుంది. వాళ్లు వ్యాధిలా ఎప్పుడూ మనతోనే ఉంటారు. మనల్ని తినేస్తారు.
మా అమ్మ హత్యకు గురయ్యాక నేను, నా సోదరులు, మా నాన్న ఎన్నో లక్ష్యాలు పెట్టుకున్నాం. ఆమె పరిశోధనలకు న్యాయం జరగాలని, ఆమెకు జరిగినట్లు వేరే జర్నలిస్టులెవరికీ జరక్కూడదని అనుకున్నాం.
దేనికైనా ఇప్పుడున్న సమయం చాలా తక్కువ.

ఫొటో సోర్స్, Getty Images
కొత్త గౌరవం నేర్పించాలి..
ఇతరులు, ముఖ్యంగా ప్రభుత్వ అధికారుల అసమర్థత, ఉదాసీనతపై మనం ఎంత ఓర్పుతో ఉన్నామనే విషయంపై మా కుటుంబంలో మాట్లాడుకుంటూ ఉంటాం.
వారి ద్వేషం, సోమరితనంపై దాడి చేయకుండా ఉండాలంటే చాలా కష్టం అని మాకు తెలిసింది.
టర్కీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఉగుర్ ముంకును కారు బాంబు పేల్చి హత్య చేసిన తర్వాత ఆయన పిల్లలు మాతో మాట్లాడారు.
ఆ కేసు దర్యాప్తును నీరుగార్చిన పోలీస్ చీఫ్ "మేం ఏం చేయలేం, మా ముందు ఒక అడ్డుగోడ ఉంది" అని వారితో అన్నారు.
దానికి ఆయన భార్య "అయితే, ఒక ఇటుక తొలగించండి, తర్వాత ఇంకొకటి తీయండి. మొత్తం గోడ పడిపోయేవరకూ వాటిని తీస్తూనే ఉండండి" అని అధికారికి సమాధానం ఇచ్చారు.
మా అమ్మ హత్యకు గురైనప్పటి నుంచి మేం కూడా అదే చేస్తున్నాం.
మొదట్లో నన్ను నడిపించిన సూత్రం ఒక్కటే, మేం వీలైనంతవరకూ పోరాడాలి. దాదాపు మా లక్ష్యాల్లాగే ఈ ప్రక్రియ కూడా ముఖ్యం అని నాకు ఇప్పుడు అనిపిస్తోంది.
ప్రభుత్వంను తన పని తాను చేసేలా, న్యాయం అందించేలా చేయడం ద్వారా మేం సాంస్కృతిక మార్పు, భావ వ్యక్తీకరణకు మరింత గౌరవం దక్కేలా చేస్తున్నాం.
'బానిసత్వం' అనే వ్యాధిని నిర్మూలిస్తూ, ఆ ప్రక్రియలో మానవ హక్కుల కోసం ప్రపంచానికి ఒక కొత్త గౌరవం బోధిస్తున్న మిగతావారితో మేం కలిశాం.

ఫొటో సోర్స్, Getty Images
అంతరాత్మ విముక్తితోనే స్వేచ్ఛ
2017లో మాల్దీవుల్లో తన ఇంటి బయట కత్తిపోట్లకు గురై చనిపోయే ముందు రచయిత యమీన్ రషీద్ మాతో "అంతరాత్మ విముక్తితోనే స్వేచ్ఛ మొదలవుతుంది. అని చెప్పారు.
"మనసులో ఆ ప్రధానమైన ఆ స్వేచ్ఛ లేకుండా మిగతా స్వేచ్ఛలతో మనం ఏం చేయగలం"
మా అమ్మలాగే, ఆయన హత్య కూడా మన ప్రపంచంలో అలాంటి స్వేచ్ఛకు ఎలాంటి గౌరవం లేదనే విషయం చూపించింది.
ఇది మనకు మాత్రమే కాదు, స్వేచ్ఛ కోసం పోరాటం చేసేవారిపై ఆధారపడినవారు, హత్యకు గురైన, జైలు పాలైన జర్నలిస్టుల కుటుంబ సభ్యులు, వారి స్నేహితులు, సన్నిహితులు అందరికీ వర్తిస్తుంది.
మన భుజాలపై ఒక పెద్ద బాధ్యత ఉంది. కానీ, దాన్ని మనం ఒంటరిగా మోయడం సాధ్యం కాదు. ప్రపంచమంతటా ఉన్న మంచి వాళ్లు మనతో చేయి కలపాల్సి ఉంటుంది.

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని 1993లో ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసింది. దీనిని ప్రతి ఏటా మే 3న జరుపుకుంటారు.
- తప్పుడు సమాచారం కాలంలో జర్నలిజం, ఎన్నికలు అనేది 2019లో థీమ్‌గా ఉంది.
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న పత్రికా స్వేచ్ఛను అంచనా వేయడం, దానిని రక్షించడం. విధుల్లో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు నివాళి అర్పించడం అనేవి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం లక్ష్యాలు.
- అంతర్జాతీయ జర్నలిస్టుల సమాఖ్య వివరాల ప్రకారం లక్ష్యంగా చేసుకుని జరిగిన హత్యల్లో, బాంబు దాడుల్లో, ఎదురు కాల్పుల ఘటనల్లో గత ఏడాది 95 మంది జర్నలిస్టులు, మీడియా నిపుణులు మృతి చెందారు.

మనలాంటి వాళ్లు ఇంకా ఎంతోమంది ఉన్నారని నాకు తెలుసు. సౌదీ కాలమిస్టు జమాల్ ఖషోగ్జీ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకట్టుకున్నారు.
కానీ, కేవలం ఒక్కరు ఆయన్ను ద్వేషించడం వల్ల ఆ రచయిత హత్యకు గురయ్యారు.
మా అమ్మతోపాటు ఈ హత్యలన్నిటికీ కారణమైనవారిని నేరస్థులుగా రుజువు చేయడానికి ప్రభుత్వాలు ఏవైనా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎక్కడా చిన్న సంకేతం కూడా కనిపించడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
మొదటి ఇటుక తొలగించాం
అందుకే మేం మొదటి ఇటుకను తొలగించడం మొదలెట్టాం.
దేశంలో అత్యంత ముఖ్యమైన జర్నలిస్టు హత్యను అడ్డుకోవడంలో ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోడానికి, బహిరంగ విచారణ ప్రారంభించాలని మాల్టా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
తర్వాత, మేం రెండో ఇటుక దగ్గరకు వెళ్తాం.
మా అమ్మ తన దేశం కోసం ఈ బలిదానం చేసుండకపోతే, ఆమె ఇప్పటికీ సజీవంగా ఉండేవారని నేను ప్రతిరోజూ అనుకుంటూ ఉంటాను.
కానీ అజర్‌బైజాన్ జర్నలిస్ట్, ఖదీజా ఇస్మాయిలోవా మాత్రం "మనం ఎవర్నైనా బాగా ప్రేమిస్తే, వారు వారిలాగే ఉండాలని కోరుకుంటాం. డఫ్నే అలాంటి వారే. ఆమె ఫైటర్, హీరో కూడా" అన్నారు.
ఖదీజా ఇస్మాయిలోవాకు జైలు శిక్ష వేయడం 'దారుణం' అని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
మా అమ్మకు తెలీనిది ఒకటుంది, ఆమె మరణం మాల్టాలో, ఎన్నో దేశాల్లో వేలాది జర్నలిస్టుల్లో స్ఫూర్తి నింపింది. నిజాలను నిర్భయంగా బయటపెట్టేలా చేసింది.
మా ఈ ప్రతి చర్య.. మా అమ్మకు జరిగినట్లు కాకుండా, ధైర్యవంతులైన ఈ జర్నలిస్టులను ఏదో ఒక విధంగా కాపాడుతుందని నేను అనుకుంటున్నాను.
వ్యాసకర్త: మాథ్యూ కరువా గలీచియా, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ (2017లో కారు బాంబు పేలుడులో చనిపోయిన జర్నలిస్ట్ డఫ్ని కరువానా గలీచియా కుమారుడు)
ఇవి కూడా చదవండి:
- మసూద్ అజర్ విషయంలో చైనా ఎందుకు పట్టు సడలించింది
- జాన్సన్ అండ్ జాన్సన్ షాంపూతో పిల్లలకు క్యాన్సర్ వస్తుందా...
- సుబ్బయ్య హోటల్: 34 రకాల పదార్థాలు.. కొసరి కొసరి వడ్డించి, తినే వరకూ వదిలిపెట్టరు
- నవీన్ పట్నాయక్ మ్యాజిక్ అయిదోసారీ ఫలించనుందా?
- లోక్‌సభ ఎన్నికలు 2019: 24 సార్లు ఓటమి.. ‘ఇవే నా చివరి ఎన్నికలు కావొచ్చు’
- అంతరిక్షంలో అత్యధికంగా చెత్త నింపే దేశం ఏదో తెలుసా...
- ఉత్తర, దక్షిణ కొరియాల్లాగా భారత్-పాకిస్తాన్ దగ్గరవడం సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








