సుష్మా స్వరాజ్: తెలంగాణ, బళ్లారి ప్రజల హృదయాలను గెలిచిన నేత

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జింకా నాగరాజు, సీనియర్ పాత్రికేయులు
- హోదా, బీబీసీ కోసం
భారత రాజకీయాల్లో అనేక కీలక బాధ్యతలు నిర్వహించే అవకాశం మహిళలకు రావడం చాలా అరుదు. స్వతంత్ర భారతంలో ఈ అరుదైన అవకాశం దక్కిన మహిళల్లో మొదటగా చెప్పుకోవాల్సిన నాయకురాలు- సుష్మా స్వరాజ్.
సిద్ధాంతాలతో నిమిత్తం లేకుండా వ్యక్తిత్వంతో ఆమె అందరికీ దగ్గరయ్యారు.
ఆమె వ్యక్తిత్వం బీజేపీలో ఆమెను అత్యున్నత స్థాయికి ఎలా చేర్చిందో, పార్టీ బయట కూడా అదే వ్యక్తిత్వం ఆమెను అందరికీ చేరువ చేసింది.
సుష్మా స్వరాజ్ వ్యక్తిత్వంలో ప్రధానమైన అంశాలు వేషభాషలు.
భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా చీరెకట్టులో, నుదట పెద్దరూపాయ బిళ్లంత కుంకుమ బొట్టుతో కనిపించే సుష్మ, దేశంలో ఏ మూలకు వెళ్లినా స్థానిక మహిళలా అనిపిస్తారు.
ఆమెను చూడగానే ఎవరికీ ఈమె పరాయి మనిషనే భావన రాదు.
భాష విషయానికొస్తే ఆమె ఇంగ్లిష్, హిందీల్లో అనర్గళంగా మాట్లాడతారు. ఆమె మాటలో ధాటి మాత్రమే కాదు, స్పష్టత, సమాచారం సమృద్ధిగా ఉంటాయి.
దక్షిణ భారత మహిళల్లా చీరె ధరించడం, దక్షిణాది వాళ్లకు పెద్దగా రాని హిందీలో కాకుండా ఇంగ్లిష్‌లో ప్రసంగించడం సుష్మను బళ్లారి, తెలంగాణలకు బాగా దగ్గర చేసింది.
తెలంగాణకు ఆమె మరింత దగ్గరయ్యేందుకు ఇంకో కారణం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జోరుగా సాగుతున్నప్పుడు ఆమె లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నారు. తెలంగాణ ఏర్పాటుకు మద్దతు పలికిన ఎల్‌కే అడ్వాణీ వర్గానికి చెందిన నాయకురాలు కావడంతో ఆమె ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని లోక్‌సభలో బాగా సమర్థించారు.
తెలంగాణ నేతలు ముఖ్యంగా తెలంగాణ సంయుక్త కార్యాచరణ సమితి(తెలంగాణ జేఏసీ) నాయకులు సుష్మను తరచూ కలుసుకుని తెలంగాణ గురించి బాగా ఒత్తిడి తీసుకొచ్చేవారు. ఆమె కాకుండా మరో బీజేపీ నేత ప్రతిపక్ష నేతగా ఉండుంటే తెలంగాణ నాయకులకు అంత సాన్నిహిత్యం పెరిగేది కాదు.
తెలంగాణ యువకుల ఆత్మహత్యల విషయంలో స్పందించిన తీరులోనూ సుష్మ ముద్ర కనబడుతుంది.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక 'బంధుత్వం' కొనసాగిస్తూ, తాను తెలంగాణ ప్రజలకు 'చిన్నమ్మ' లాంటిదానినని ఆమె అన్నప్పుడు ఇక్కడి ప్రజలు గొప్పగా స్వీకరించారు. 'చిన్నమ్మ' ఆమెకు పర్యాయపదం అయిపోయింది.
2012 సంవత్సరంలో ఉప ఎన్నికల్లో సుష్మ తెలంగాణలోని అనేక నియోజకవర్గాల్లో పర్యటించినపుడు, ఆత్మహత్యల నివారణపైనే ఆమె దృష్టి కేంద్రీకరించారు. యువకుల మీదే ఎక్కువ దృష్టి పెట్టేవారు.
"తెలంగాణా వచ్చేస్తోంది, మీరు త్యాగాలు చేయొద్దు. మీ తెలంగాణను మీరు చూడాలి" అని ఆమె అనేక సభల్లో చెబుతూ వచ్చారు.
ఇలా పార్లమెంటు లోపల, వెలుపల సుష్మ బలంగా తెలంగాణ వాణిని వినిపిస్తూ వచ్చారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించకపోతే, 2014లో తాము అధికారంలోకి వస్తూనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ఎలాంటి శషభిషలూ లేకుండా చెబుతూ, యూపీఏ మీద ఒత్తిడి తెస్తూ బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వచ్చారు.
తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఆమెకు తెలంగాణతో అనుబంధం తెగిపోలేదు.

ఫొటో సోర్స్, Getty Images
2017లో హైదరాబాద్‌లో 'గ్లోబల్ ఎకనమిక్ సమిట్' జరిగినపుడు ఆమె ప్రసంగిస్తూ- తాను తెలంగాణకు 'చిన్నమ్మ' అని ప్రకటించారు. తెలంగాణ సంప్రదాయం, ఆధునికతల సమ్మేళనమని వ్యాఖ్యానించారు.
తెలంగాణ వచ్చాక ఆమె అనుబంధం కొత్త రూపం తీసుకుంది.
గల్ఫ్‌లో కష్టాల్లో ఉన్న తెలంగాణ కార్మికుల కోసం ప్రత్యేక ఎన్నారై పాలసీని తీసుకొస్తామని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించినా, అది కార్యరూపం దాల్చలేదు. కష్టాల్లో ఉన్న గల్ఫ్ కార్మికులను సుష్మ 'చిన్నమ్మ'లాగే ఆదుకోవడం మొదలుపెట్టారు.
ట్విటర్‌లో ఒక అభ్యర్థన చేస్తే చాలు ఆమె స్పదించేవారు. గల్ఫ్ కార్మికులు సహాయం కోసం ట్విటర్ ద్వారా ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలకు ఉత్తర్వులు వెళ్లేవి. అంతా బహింరంగంగా, అందరూ చూస్తుండగానే ఈ ట్విటర్ సంభాషణ జరిగేది కాబట్టి అధికారుల నుంచి స్పందన చాలా బాగా ఉండేది.
సాధారణ ప్రజలకు అందుబాటులో లేని విదేశీ వ్యవహారాల శాఖ సౌత్ బ్లాక్ (దిల్లీ) కార్యాలయాన్ని ఆమె ట్విటర్‌కు మార్చారా అన్నట్లు ఉండేది వ్యవహారమంతా!
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
తెలంగాణ ఎన్నారై శాఖ అప్పటి మంత్రి కేటీ రామారావు నుంచి, గల్ఫ్ కార్మికుల కోసం కృషిచేసే రాజకీయ పార్టీ మజ్లిస్ బచావో తెహ్రీక్(ఎంబీటీ) నుంచి గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలని ఆమెకు ట్వీట్లు ధారాపాతంగా వచ్చేవి.
ఆమె ప్రతి ట్వీట్‌కు స్పందించి, సాయం చేసేందుకు ముందుకొచ్చేవారు. అక్కడ చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎల్లవేళలా సంసిద్ధంగా ఉండేవారు.
తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా గల్ఫ్ కార్మికులకు సుష్మ ఎప్పుడూ గుర్తుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
బళ్లారితో సుష్మ అనుబంధం
సుష్మ వేషభాషలు ఏప్రాంతంలోనైనా సులభంగా అక్కడి ప్రజలతో కలసిపోయేలా చేస్తాయి. బళ్లారిలో ఇది చాలా స్ఫష్టంగా కనిపిస్తుంది.
రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాక కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మొదటిసారి 1999లో లోక్‌సభకు పోటీ చేయాలనుకున్నపుడు ఆ పార్టీ నేతలు కర్నాటకలోని బళ్ళారి నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు. అపుడు సోనియా మీద పోటీచేసేందుకు సుష్మ సమ ఉజ్జీ అని బీజేపీ నిర్ణయించింది.
ఆ ఎన్నికలో సుష్మ 56,100 ఓట్ల తేడాతో సోనియా చేతిలో ఓడిపోయినా బళ్లారితో ఆమె అనుబంధం చాలా కాలం కొనసాగింది. ఈ అనుబంధం బీజేపీకి కన్నడ రాష్ట్రంలో బలమైన పునాదులు వేసింది. ఇది వర మహాలక్ష్మి వ్రతం రూపంలో జరగడం విశేషం.
ఎన్నికల కోసం వచ్చిన సుష్మ ప్రచారానికే పరిమితం కాకుండా అక్కడ ప్రజలతో కలసిపోయేందుకు ప్రయత్నం చేశారు.
ఆమె వేషభాషలు ఒక ఆయుధమయితే, స్థానిక ప్రజల భాష కూడా నాలుగు ముక్కలు నేర్చుకున్నారు. వచ్చీరాని ముచ్చటగా కన్నడం మాట్లాడుతూ అక్కడి మహిళల్లో బాగా ఆదరణ పొందారు.
అక్కడ బాగా ప్రాచుర్యంలో ఉన్న వరమహాలక్ష్మి వ్రతంలో కూడా ఆమె పాలుపంచుకున్నారు. ఇలాంటి వ్రతాలు ఉత్తరభారతంలోలేవు.
బీజేపీ సానుభూతిపరుడైన ఒక డాక్టర్ ఇంట్లో జరిగే ఈ వ్రతానికి సుష్మ రావడం ఇటీవలి దాకా కొనసాగింది. ఆ ఎన్నికల్లో ఆమె విజయం సాధించాలని డాక్టర్ ఇంట్లో నిర్వహించిన వరమహాలక్ష్మి వ్రతం ఆమెకు బాగా నచ్చింది.
ఆమె సంప్రదాయ ధోరణి కూడా అక్కడి మహిళలను ఆకట్టుకుంది.
బళ్లారితో ఆమె వరలక్ష్మి వ్రతం అనుబంధం పదేళ్లకు పైగా కొనసాగింది.
గాలి జనార్దన్ రెడ్డి సోదరులు ఇనుప ఖనిజం అక్రమాల కేసుల్లో ఇరక్కుని అరెస్టయ్యాక ఆమె వ్రతానికి రావడం మానేశారని కొందరంటారు, మరికొందరేమో ఆరోగ్య సమస్యలు, విదేశీ వ్యవహారాల శాఖ బాధ్యతల వల్ల ఆమె బళ్లారి రావడం మానేశారని చెబుతారు.
ఏటా ఆమె బళ్లారి వచ్చి ఈ వ్రతంలో పాల్గొనడం అక్కడి ప్రజల్లో బాగా గౌరవం పెంచాయి. ఈ అంశం సోనియా మీద దాడికి బాగా పదును పెట్టింది.
1999 ఎన్నికల్లో సుష్మ ఓడిపోయినా ఆమె ప్రభావం బీజేపీ వేళ్లూనుకొనేందుకు బాగా దోహదపడింది. ఈ పోటిని ఆమె చాలా తెలివిగా 'కోడలు వర్సెస్ ఆడబిడ్డ' గా మలిచేసి రక్తి కట్టించారు.
ఈ పోటీనే ఆమెను బళ్లారి గాలి సోదరులకు సన్నిహితం చేసింది. రాష్ట్రంలో బీజేపీ జాతకం మార్చేసింది.
సుష్మ బళ్లారి ఎన్నికలను గాలి సోదరులు నడిపిస్తే, వాళ్లని ఆమె నడిపించారని చెబుతారు.
ఆమె ద్వారా గాలి సోదరులు దిల్లీలో పట్టు సంపాదించారు. బీజేపీలో వాళ్ల పాత్ర ఎక్కువయింది. ఈ అంశమే 2008లో కర్నాటకలో బీఎస్ యడ్యూరప్ప నాయకత్వంలో తొలి బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు బాట వేసిందని చెబుతారు.
సుష్మ తెలంగాణకు చిన్నమ్మనని ప్రకటించుకున్నట్లు, బళ్లారికి ఆడబిడ్డనని ప్రకటించుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- 'ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి దమ్ము, ధైర్యమే కాదు, కృతనిశ్చయం కావాలి'
- జమ్మూకశ్మీర్ LIVE: జమ్ము-కశ్మీర్ పునర్విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- ఆర్టికల్ 370 సవరణ: ‘ఇక భారతీయులంతా కశ్మీర్లో భూమి కొనుక్కోవచ్చు’
- చైనా ఆట కట్టించాలంటే భారత్ ఏం చేయాలి
- కశ్మీరీ పండిట్లు: 'ఎన్నో మరణాలు, రక్తపాతాలు చూశాం. కానీ, ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు'
- ఆర్టికల్ 370 సవరణ: ‘కశ్మీర్లో అస్థిరత మరింత పెరిగే అవకాశం’
- కశ్మీర్ ప్రత్యేక హక్కును రద్దు చేయడం అక్రమం, రాజ్యాంగవిరుద్ధం: ఏజీ నూరాని
- 'ఆర్టికల్ 370 సవరణ': 'ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








