బ్యాంకు ఖాతాలు: ఈ దేశాల్లో మగవారి కన్నా ఆడవారికే ఎక్కువ

ఫొటో సోర్స్, AFP
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచంలో కేవలం ఆరు దేశాల్లోనే మగవారి కన్నా ఎక్కువ మంది ఆడవారికి బ్యాంకు ఖాతాలున్నాయి.
ఈ జాబితాలో అర్జెంటీనా, జార్జియా, ఇండొనేషియా, లావోస్, మంగోలియా, ఫిలిప్పీన్స్ ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసిన 'గ్లోబల్ ఫిన్‌డెక్స్' నివేదిక ఈ విషయాన్ని వెల్లడించించింది.
బ్యాంకు ఖాతాల వినియోగం, చెల్లింపుల తీరు, పొదుపు విధానం, రుణాల స్వీకరణ తీరు, ఇతర అంశాలపై 140కి పైగా దేశాల్లో అధ్యయనం జరిపి ప్రపంచ బ్యాంకు ఈ నివేదిక రూపొందించింది.

ఫొటో సోర్స్, AFP
ఆ అంతరం అలాగే ఉంది
50 కోట్ల మందికి పైగా వయోజనులకు బ్యాంకులోనో లేదా మొబైల్ మనీ ప్రొవైడర్‌లోనో ఖాతాలు ఉన్నాయి. వయోజనుల్లో 69 శాతం మందికి ఖాతాలు ఉన్నాయి. 2011తో పోలిస్తే ఈ సంఖ్యలో 28 శాతం పెరుగుదల ఉంది.
ఖాతాల విషయంలో పురుషులతో పోలిస్తే మహిళలు వెనకబడి ఉన్నారు. మగవారిలో 72 శాతం మందికి ఖాతాలు ఉండగా, ఆడవారిలో 65 శాతం మందికే ఉన్నాయి. ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏడు శాతంగా ఉంది. 2011 నుంచి ఈ అంతరంలో మార్పే లేదు.
చాలా దేశాల్లో స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం తగ్గుతున్నప్పటికీ, ఇప్పటికీ ఇంత అంతరం ఉండటం గమనార్హం.

ఫొటో సోర్స్, Ravisankar Lingutla/BBC
భారత్‌లో అంతరం తగ్గింది. కానీ..
భారత్‌నే ఉదాహరణగా తీసుకుంటే ప్రస్తుతం పురుషుల్లో 83 శాతం మందికి, మహిళల్లో 77 శాతం మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. 2014లో 20 శాతంగా ఉన్న ఈ వ్యత్యాసం ఇప్పుడు ఆరు శాతానికి తగ్గిపోయింది.
అర్జెంటీనా, జార్జియా, ఇండొనేషియా, లావోస్, మంగోలియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో మగవారి కన్నా ఎక్కువ మంది ఆడవారికి బ్యాంకు ఖాతాలు ఉండటంపై ప్రపంచ బ్యాంకులోని ఆర్థికవేత్త లియోరా క్లాపర్ బీబీసీతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు.
ఫిలిప్పీన్స్ గురించి చెబుతూ- ''ఈ దేశంలో మహిళలు విదేశాల్లో పనిచేసే అవకాశం ఎక్కువ. వారు తాము సంపాదించిన సొమ్మును జమ చేసేందుకు, స్వదేశంలో కుటుంబ అవసరాలకు వాడుకొనేందుకు వీలుగా స్వదేశంలో బ్యాంకు ఖాతాలు తెరుచుకుంటారు'' అని క్లాపర్ వివరించారు.
ఈ ఆరు దేశాల్లో లావోస్ తప్ప అన్ని దేశాల్లో వివిధ ప్రభుత్వ కార్యక్రమాల కింద మగవారి కంటే ఆడవారే నగదు బదిలీ కింద సొమ్ము పొందే అవకాశాలు ఎక్కువ.
మంగోలియానే ఉదాహరణగా తీసుకుంటే, నగదు బదిలీ కింద పురుషుల్లో 24 శాతం మందికి, మహిళల్లో 43 శాతం మందికి డబ్బు అందుతోంది.
గత ఏడాది కాలంలో కనీసం ఒక్కసారైనా సొమ్ము జమ చేయడానికి లేదా తీసుకోవడానికి లావాదేవీలు జరిపిన ఖాతాల విషయంలో మహిళలు, పురుషుల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదు.
ఇండొనేషియాలో ఏడాది కాలంలో కనీసం ఒక్కసారైనా నగదు బదిలీ కింద మహిళల బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం సొమ్ము జమ చేసి ఉండొచ్చు. ఇతరత్రా అవసరాలకు అత్యధిక మహిళలు తమ ఖాతాలు వాడటం లేదని తెలుస్తోంది.
ఈ ఆరింటిలో ఫిలిప్పీన్స్‌ను మినహాయిస్తే అన్ని దేశాల్లోనూ ఏడాదిలో కనీసం ఒక్కసారైనా లావాదేవీ జరిగిన ఖాతాల్లో పురుషులవే ఎక్కువ.
ఖాతాలు తెరవడంలో స్త్రీ, పురుషుల మధ్య అంతరాన్ని భారత్ బాగా తగ్గించగలిగింది. అయితే మహిళల ఖాతాల్లో సగానికి పైగా వినియోగంలోనే లేవు.
మహిళలు విరివిగా ఉపయోగించేలా ఆర్థిక పథకాలను రూపొందించడం భారత్ ముందున్న సవాలు అని క్లాపర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- తెలుగు రాష్ర్టాల్లో ‘నో క్యాష్’ .. ఎందుకో తెలుసా!?
- నాకైతే అలాంటి సమస్య ఎదురుకాలేదు: దీపిక
- నగదురహిత లావాదేవీల్లో దూసుకుపోతున్న స్వీడన్
- డబ్బులు దండిగా పంచుతున్నా ఓట్లు ఎందుకు పడడం లేదు?
- వాట్సాప్: భారత మొబైల్ పేమెంట్ మార్కెట్‌ను శాసిస్తుందా?
- మనం ఖర్చు చేసే విధానాన్ని క్రెడిట్ కార్డులు ఇలా మార్చేశాయి
- పేటీఎంకు బీజేపీతో ఉన్న అనుబంధం ఏమిటి?
- పెన్షన్‌కు భరోసా లేదు.. బతుక్కి భద్రత లేదు!
- #AadhaarFacts: పేదలకు ఆధార్ వరమా? శాపమా?
- బిట్కాయిన్లతో బిలియనీర్లయిపోగలమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









