వంగపండు ప్రసాదరావు: ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా’ అంటూ ఉర్రూతలూగించిన విప్లవ కవి మృతి

వంగపండు ప్రసాదరావు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, వంగపండు ప్రసాదరావు

ప్రజా గాయకుడు, విప్లవ కవి వంగపండు ప్రసాదరావు(77) మరణించారు.

పదునైన పదాలకు సొంపైన బాణీ కట్టి, తానే స్వయంగా కాలికి గజ్జె కట్టి ఆడి, పాడే వంగపండు ప్రసాదరావు శ్రీకాకుళం గిరిజన, రైతాంగ పోరాటం నుంచి ఉద్భవించిన వాగ్గేయకారుడు.

ఆ గజ్జెల శబ్దం ఇప్పుడు ఆగిపోయింది. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని తన స్వగృహంలో ఆయన మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

తన పాటలతో ఉత్తరాంధ్ర జానపద శైలిని తెలుగు నేల అంతటికీ పరిచయం చేసిన వంగపండు తన పాటలు, రచనలతో అనేక మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు.వంగపండు ప్రసాదరావు 1943లో జన్మించారు. పార్వతీపురం సమీపంలోని పెదబొండపల్లి ఆయన స్వగ్రామం. జగన్నాథం, చినతల్లి ఆయన తల్లిదండ్రులు.

విశాఖ షిప్ యార్డులో ఫిట్టర్‌గా పనిచేస్తూ ఆయన ప్రజా ఉద్యమాలవైపు నడిచారు. అనంతర కాలంలో తన ఉద్యోగానికి రాజీనామ చేసి పూర్తి సమయం ప్రజా ఉద్యమాలకే కేటాయించారు.

1969 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలో ఉవ్వెత్తున సాగిన గిరిజన, రైతాంగ పోరాట కాలంలో ఆయన తన కళా ప్రదర్శనలతో ప్రజాదరణ పొందారు.

వంగపండు ప్రసాదరావు

ఫొటో సోర్స్, Nnr

ఏం పిల్లడో ఎల్దమొస్తవా...

‘‘ఏం పిల్లడో ఎల్దమొస్తవ.. ఏం పిల్లో ఎల్దమొస్తవా’’ అంటూ ఆయన రాసి, పాడిన పాట ఉమ్మడి రాష్ట్రంలో ఒకప్పుడు మారుమోగింది.

‘‘సికాకులంలో సీమలకొండకి.. ఏం పిలడో ఎల్దమొస్తవా.. చిలకలు కత్తులు దులపరిస్తయట.. సాలూరవతల సవర్లకొండకి.. ఏం పిలడో ఎల్దమొస్తవా.. సెవల పిల్లులే శంఖమూదెనట ..తెలంగాణా కొమరయ్య కొండకి అంటూ’’ శ్రీకాకుళ పోరాటం, ఇతర విప్లవ ఉద్యమాల నేపథ్యంలో రాసిన పాట బాగా పాపులర్ అయ్యింది.

అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఈ పాటను ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేసి పాడుకున్న చరిత్ర ఉంది.

విప్లవ గేయాలతో పాటు కార్మికుల కష్టాలపైనా ఆయన ఎన్నో పాటలు రాశారు.

విశాఖ షిప్‌యార్డులో ఆయన ఫిట్టర్‌గా పనిచేస్తున్న సమయంలో రాసిన ‘ఓడా! నువ్వెల్లిపోకే’’ అనే పాట బాగా ప్రాచుర్యం పొందింది.

అనేక విభాగాల కార్మికులు నౌకను తయారుచేసిన తరువాత.. తమ చెమట ఫలితంగా తయారైన ఆ ఓడ వెళ్లిపోతుంటే పడే బాధకు పాట రూపమిచ్చారాయన.

వంగపండు ప్రసాదరావు

ఫొటో సోర్స్, NAgaraju

కమ్యూనిస్టు ఉద్యమాల దారిలో సాగిన వంగపండు తన జానపద గేయాలతో ప్రజా చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు.

గద్దర్ వంటి వారితో కలిసి సుదీర్ఘ కాలం జననాట్యమండలి కోసం పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పల్లెపల్లెనా వారు ప్రదర్శనలు ఇచ్చి తమ పాటతో జన చైతన్యానికి కృషి చేశారు.

వంగపండు సుమారుగా 400 వరకు పాటలు రాశారు. అవి వివిధ భాషల్లోకి కూడా అనువాదమయ్యాయి. 'అర్ధరాత్రి స్వాతంత్ర్యం' వంటి సినిమాలకు కూడా వంగపండు పనిచేశారు.

ఆయన పాడిన పాటల్లో జజ్జనకరి జనారే, నాంపల్లి స్టేషన్ కాడ , యంత్రమెట్ట నడుస్తున్నదంటే అంటూ సాగిన పాటలు విశేష ఆదరణ పొందాయి.

అనేక మంది కళాకారులకు ఆయన తర్ఫీదునిచ్చారు. ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆయన కుమార్తె వంగపండు ఉష కూడా కళాకారిణి. ఆమె ప్రస్తుతం వైసీపీ నాయకురాలిగా ఉన్నారు.

వంగపండు ప్రసాదరావు

ఫొటో సోర్స్, NAgaraju

రాజకీయ పార్టీలతో ప్రయాణం

సుదీర్ఘ కాలం కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి నడిచిన వంగపండు ప్రసాదరావు 2000 సంవత్సరం తరువాత జననాట్య మండలికి, ఇతర ప్రజా సంఘాల నుంచి కాస్త పక్కకు జరిగారు.

ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు ఆయన్ను, ఆయన పాటను వాడుకునే ప్రయత్నం చేశాయి.

2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన పాటలు పాడారు. అనంతర కాలంలోనూ వివిధ రాజకీయ పార్టీల పక్షాన పాటలు రాయడం, పాడడం వంటివి చేశారు.

ఆ తర్వాత ‘మగధీర’ సినిమా విడుదల సమయంలో ఏం పిల్లడో వెల్దమొస్తవా అనే వంగపండు పాట ట్యూన్‌ను ఆ సినిమాలో వినియోగించడం వివాదాస్పదమైంది.

ఆ సందర్భంగా తన కుమార్తె వంగపండు ఉషతో కలిసి ఆ సినిమా నిర్మాత అల్లు అరవింద్ ఇంటి ఎదుట ఆందోళన కూడా చేశారు.

రాష్ట్ర విభజనకు ముందు కొద్దికాలం సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఆయన సమైక్యాంధ్ర ఉద్యమకారులతో కలిసి పనిచేశారు.

వంగపండు ప్రసాదరావు

ఫొటో సోర్స్, NAgaraju

తన జీవితమంతా ప్రజా ఉద్యమాలు, జానపద కళలకే వెచ్చించిన వంగపండు చనిపోయేవరకు అతి సామాన్య జీవనమే గడిపారు.

తన కళను కానీ, పేరును కానీ ఆయన డబ్బు సంపాదనకు వాడుకున్న దాఖలాలు లేవు. ఆయన జీవితం పేదరికంలోనే గడిచింది.

జగన్, కేసీఆర్, చంద్రబాబు సంతాపం

వంగపండు మృతికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.

ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు.. విప్లవ సినిమాల దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి తదితరులు వంగపండు మృతికి సంతాపం ప్రకటించారు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి, 1

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది, 1

‘‘వంగపండు ఇక లేరన్న వార్త ఎంతో బాధించింది. ఆయన వ్యక్తిగతంగా నాకు ఆప్తులు. జానపదాన్ని తన బాణీగా మార్చుకుని ''పామును పొడిచిన చీమలు''న్నాయంటూ ఉత్తరాంధ్ర ఉద్యమానికి అక్షర సేనాధిపతిగా మారారు. తెలుగువారి సాహిత్య, కళారంగాల చరిత్రలో ఓ మహాశిఖరంగా ఆయన నిలిచిపోతారు. వంగపండు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను’’ అంటూ జగన్ సంతాపం ప్రకటించారు.

వంగపండు ప్రజల బాధలు- సమస్యలు, ప్రజా ఉద్యమాలే ఇతి వృత్తంగా పాటలు రాసి, పాడి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జీవితాంతం పాటుపడ్డారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి, 2

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది, 2

వంగపండు ప్రసాద రావు మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ‘‘వంగపండు తన సాహిత్యం ద్వారా తెలుగు ప్రజలను జాగృతం చేశారు. తన గొంతుతో, తన పదాలతో అశేష ప్రజానీకాన్ని ఉర్రూతలూగించారు. ప్రజా చైతన్యానికి ఎనలేని కృషి చేశారు. వంగపండు సాహిత్యం అనేక భాషల్లోకి అనువదించడం తెలుగు జాతికే గర్వకారణం. పీడిత తాడిత ప్రజల హక్కుల సాధన కోసం తన గొంతును, తన సాహిత్యాన్ని అంకితం చేసిన చరితార్ధుడు వంగపండుగా కొనియాడారు. ఆయన మృతి తెలుగు జానపద సాహిత్య లోకానికి తీరని లోటు. వంగపండు అభిమానులకు, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి’’ అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

‘ఏం పిల్లో ఎళ్దాం వస్తవా..' అని కార్మికులను విప్లవ తోవల్లో నడిపించిన వంగపండు గారి మరణం ఉత్తరాంధ్ర ప్రాంతానికి పూడ్చలేని లోటు. తన ఆటపాటతో ఉత్తరాంధ్ర యాసకి గుర్తింపు తెచ్చిన కళాకారుడికి జోహార్లు అంటూ విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ నివాళులర్పించారు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి, 3

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది, 3

‘‘దశాబ్దాలుగా వందలాది జానపద గీతాలకి గజ్జెకట్టి తెలుగు వారందరికీ తన కంఠంతో విప్లవ రచనలను వినిపించిన వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు. చైతన్య గీతాల ఈ భూమి నుంచి ఆయన వీడుకోలు తీసుకోవడం మన ఉత్తరాంధ్ర సంస్కృతికి తీరని లోటు.

ఆయన కుటుంబీకులకు నా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఎంతో మంది కవులు, రచయితలు, పౌరులు ఆయన మాటలు, పాటలు, రచనలతో ఉత్తేజితులయ్యారు. ఆయన పేరు, ఆయన ప్రస్థానం మరువకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల’’ని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.

మట్టికవిచదువుకోకపోయినా చైతన్యంతో సుదీర్ఘకాలం ప్రజా జీవనంలో సాగిన వాగ్గేయకారుడు మృతి జానపద కళలకు తీరని లోటని ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫోరం ప్రధాన కార్యదర్శి నాగనబోయిన నాగేశ్వర రావు అభిప్రాయపడ్డారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ ‘‘వంగపండు చివరివరకు కడు పేదరికం అనుభవించినా, కష్టాలలో కూడా విలువలను వదులుకోలేదు. ఆయనకు విద్యార్ధిగా ఉన్నాను. దశాబ్దకాలం నుంచి ఆయనకు తోడుగా వేదికలపై ప్రదర్శనలిచ్చాను. అత్యంత చేరువగా ఆయన నిబద్ధత గమనించాను. మొక్కవోని పట్టుదల గల మట్టికవి ఆయన. 1980వ దశకంలో ఆయన రచనలో భూభాగోతం వంటి వాటి ఫలితంగా కరణాల వ్యవస్థ రద్దుకి దోహదం చేసింది.

సుద్దాల అశోక్ తేజ జాతీయ అవార్డ్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నందీ అవార్డ్, తానా నుంచి రంగస్థల రత్న అవార్డ్ కూడా ఆయనకు వచ్చాయి.

జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో ఆయన గుర్తింపు పొందారు. రంగస్థల విభాగంలో ఆంధ్రా యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీగా కూడా ఉన్నారు.

ఇలాంటి వారి మరణం గిరిజనులు, మత్స్యకారులు సహా పీడత ప్రజలందరికీ లోటు’’ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)